ఆదివారం రాత్రి అనకాపల్లిలో క్వారీ లారీ సృష్టించిన బీభత్సం పలు రైళ్లు రాకపోకలను తీవ్ర ప్రభావితం చేసింది. విజయరామరాజు పేట అండర్ పాస్ దగ్గర లారీ అదుపు తప్పి ఐరన్ గడ్డర్‌ను ఢీ కొట్టింది. ప్రమాద ధాటికి రైల్వే ట్రాక్ అలైన్మెంట్ మారిపోయింది. దీంతో అదే సమయంలో బ్రిడ్జి దాటుతున్న గూడ్స్ రైలును చాకచక్యంగా లోకో పైలెట్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్ దెబ్బతినడం, గూడ్స్ రైలు నిలిచిపోవడంతో విశాఖ-విజయవాడ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
విజయవాడ నుంచి విశాఖకు వెళ్లాల్సిన ప్యాసింజర్ రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. మరమ్మత్తులు పూర్తయి క్లియరెన్స్ వస్తే తప్ప ముందుకు కదిలే పరిస్థితి లేదు. దీంతో ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊహించని ఘటన రైల్వే వర్గాలను టెన్షన్ పెట్టాయి. హుటాహుటిన మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో అనకాపల్లి చుట్టూ పక్కల నుంచి పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతోంది. వివిధ ప్రాజెక్టుల కోసం వందల సంఖ్యలో క్వారీ లారీలు పని చేస్తున్నాయి. తరచూ వీటి వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.