Site icon NTV Telugu

Vem Narender Reddy: రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోంది!

Vem Narender Reddy

Vem Narender Reddy

తెలంగాణ రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ‘తెలంగాణలో సంక్షేమ పనులు అభివృద్ధిని చూడలేని గత పాలకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. పేదలు తినే ప్రతి బుక్కలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనబడుతుంది. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 14వ తేదీన 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి పని చేస్తుంది. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త గర్వంగా గల్లా ఎగిరేసుకోవచ్చు’ అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ‘ప్రజాపాలన ప్రగతిబాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ… ‘డ్వాక్రా మహిళలకు 25 వేల కోట్ల రూపాయలు వడ్డీలేని రుణాలు అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. మహబూబాబాద్ నగరంలో మహిళ శక్తి భవనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మహిళల కోసం 500 రూపాయలకు గ్యాస్ ఇస్తున్నాం. మహిళల సంక్షేమం ఇందిరమ్మ రాజ్య లక్ష్యం. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఆ ఇళ్ళు, ఊరు బాగుంటుంది. పేదలు కరెంట్ బిల్లులు కట్టలేదని విద్యుత్ సరఫరా నిలిపివేసిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మా ప్రభుత్వం అదే పేదలకు ఉచిత విద్యుత్ ఇస్తుంది’ అని పేర్కొన్నారు.

Also Read: Jagga Reddy: నెలలో 20 రోజులు, విదేశాల్లో కేటీఆర్ ఏం చేస్తున్నాడు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

‘ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నాయి. గత పాలకుల కుటుంబాలు కోటీశ్వరులు అయ్యారు తప్ప.. పేదల బతుకులు బాగుపడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి’ అని మంత్రి కొండా సురేఖ అన్నారు.

Exit mobile version