NTV Telugu Site icon

Varanasi Gangrape Case: 19 ఏళ్ల బాలికపై 23 మంది గ్యాంగ్ రేప్.. తొమ్మిది మంది అరెస్ట్!

Varanasi

Varanasi

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసి నగరంలో 19 ఏళ్ల బాలికపై 23 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి, వారందరినీ రిమాండ్‌కు పంపారు. బుధవారం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ విదుష్ సక్సేనా ఈ మేరకు సమాచారం అందించారు. మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. లాల్‌పూర్ పాండేపూర్ ప్రాంతంలో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.

అసలు ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 19ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసిన దుండగులు ఆమెపై వారం రోజుల పాటు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కిరాతక ఘటనలో మొత్తం 23 మంది నిందితులు కాగా.. తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర వారణాసికి చెందిన బాలిక మార్చి 29న ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లేందుకు తన ఇంటి నుంచి బయల్దేరింది. గతంలో పలుమార్లు ఇలాగే వెళ్లినా.. సురక్షితంగా ఇంటికి చేరుకొనేది.

కానీ, ఆరోజు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏప్రిల్‌ 4న కిడ్నాపర్లు ఆమెను ఓ రోడ్డులోని కూడలిలో మత్తు మందు ఇచ్చి వదిలి పెట్టగా.. సమీపంలోని తన ఫ్రెండ్‌ ఇంటికి ఎలాగో చేరుకుంది. దీంతో వారు ఆమెను ఇంటికి చేర్చారు. దీంతో తనపై జరిగిన దారుణాన్ని బాలిక తన తండ్రికి చెప్పడంతో కుటుంబ సభ్యులు ఏప్రిల్‌ 4న పోలీసులను ఆశ్రయించారు. పలుచోట్లకు తీసుకెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక చెప్పినట్లు తెలుస్తోంది.