Gyanvapi Mosque Case: జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలోని శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలంటూ హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్‌పై వారణాసిలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది. సంబంధిత న్యాయమూర్తి నేడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు హాజరుకానందున తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేశారు.జ్ఞానవాపి కాంప్లెక్స్ ప్రాంగణంలో స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వరుని ప్రార్థనను వెంటనే ప్రారంభించేందుకు అనుమతి, జ్ఞానవాపి సముదాయం మొత్తాన్ని హిందువులకు అప్పగించడం, ముస్లింల ప్రవేశాన్ని నిషేధించడం వంటి మూడు ప్రధాన డిమాండ్లపై న్యాయస్థానం తన తీర్పును వెలువరించాల్సి ఉంది. ప్రస్తుతం ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు అనుమతించడం గమనార్హం.
అక్టోబరులో జరిగిన మునుపటి విచారణలో, వారణాసి కోర్టు ‘శివలింగం’పై ‘శాస్త్రీయ దర్యాప్తు’ని అనుమతించడానికి నిరాకరించింది. జ్ఞానవాపి మసీదు వాజుఖానాలో దొరికిన శివలింగం అని వారు చెప్పుకునే నిర్మాణానికి కార్బన్ డేటింగ్ ఇవ్వాలని హిందూ పక్షం డిమాండ్ చేసింది. అయితే దొరికిన నిర్మాణం ‘ఫౌంటెన్’ అని ముస్లిం పక్షం పేర్కొంది. హిందూ పక్షం వారణాసి జిల్లా కోర్టులో సెప్టెంబర్ 22న ‘శివలింగం’ అని చెప్పుకునే వస్తువు కార్బన్ డేటింగ్‌ను కోరుతూ ఒక దరఖాస్తును సమర్పించింది.
జ్ఞానవాపి మసీదు ఆవరణలో దొరికిన శివలింగంపై ‘శాస్త్రీయ పరిశోధన’కు అనుమతి నిరాకరించిన వారణాసి కోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హిందూ పక్షం పేర్కొంది.
Polish Leader: యువతుల అతి మద్యపానమే సంక్షోభానికి కారణం.. పోలిష్ నేత సంచలన వ్యాఖ్యలు
సెప్టెంబరు 29 విచారణలో హిందూ పక్షం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేత శివలింగాన్ని కార్బన్ డేటింగ్‌తో శాస్త్రీయ పరిశోధన చేయాలని డిమాండ్ చేసింది. మే 17న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ.. శాంపిల్స్ తీసుకోవడం ద్వారా ఆరోపించిన శివలింగం దెబ్బతిన్నట్లయితే, అది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుందని వారణాసి కోర్టు పేర్కొంది. శివలింగం దెబ్బతింటే సాధారణ ప్రజల మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని వారణాసి కోర్టు పేర్కొంది. కార్బన్ డేటింగ్ అనేది పురావస్తు వస్తువు, పురావస్తు పరిశోధనల వయస్సును నిర్ధారించే ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జ్ఞాన్‌వాపి మసీదు-శృంగర్ గౌరీ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. జ్ఞానవాపి మసీదులో పూజలకు సంబంధించిన కేసును సివిల్ జడ్జి నుంచి వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ మే 20న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 14న వారణాసిలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.