Vande Bharat Express: ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్‌లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయాన్ని రైల్వే అధికారులు కల్పించారు. ఏలూరులో నేడు తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ , సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే సమయంలో నేటి నుంచి వందే భారత్ రైలుకు ఏలూరులో హాల్ట్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వందే భారత్ రైలుకు ఏలూరులో హాల్టు ఇవ్వడంపై మంత్రి పార్థసారధి, ఎంపీ పుట్టా మహేష్, జిల్లా ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు స్టేషన్ నుంచి విజయవాడ వరకు వందేమాత ట్రైన్‌లో మంత్రి పార్థ సారథి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యేలు ప్రయాణించారు.
Read Also: World Richest Women: ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ.. సంపద రూ.8 లక్షల కోట్లు
తెలుగు రాష్ట్రాలలో నడిచే వందేభారత్ రైళ్లల్లో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే సికింద్రాబాద్- విశాఖపట్నం, కాచిగూడ- బెంగళూరు, సికింద్రాబాద్- తిరుపతి మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి రైల్వే ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్యన నడిచే వందేభారత్ రైలుకు విజయవాడ- రాజమండ్రి మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేదు. దీంతో ఈ ప్రాంత వాసులు ఇబ్బందులు పడేవారు. త్వరగా వెళ్తామని వందేభారత్ రైలు ఎక్కినప్పటికీ స్టాపింగ్ లేకపోవటంతో దూరపు స్టేషన్‌లలో దిగాల్సి వచ్చేది. ప్రయాణికుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే.. ఏలూరులోనూ రైలును ఆపాలని నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఏలూరు స్టేషన్‌లో వందేభారత్ ఆగుతుందని తెలియడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 20707 నంబర్‌తో గురువారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు సికింద్రాబాద్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట 50 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యలో ఈ రైలు ఆరుచోట్ల ఆగుతుంది. ఇంతకు ముందు ఐదు స్టేషన్లు ఉండగా.. ఇప్పుడు ఏలూరు వచ్చి చేరడంతో ఆరుగా మారింది. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది. ఈ వందేభారత్ ఉదయం 9.49 గంటలకు ఏలూరు స్టేషన్ చేరుకుని, 9.50 గంటలకు బయలుదేరుతుంది.
అదే విధంగా విశాఖపట్నం నుంచి 20708 నంబర్‌తో మధ్యాహ్నం 2.35 గంటలకు తిరిగి బయలుదేరనున్న వందేభారత్ రైలు.. సాయంత్రం 5.54 గంటలకు ఏలూరు స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరిగి 5.55 గంటలకు ఏలూరు నుంచి బయలుదేరుతుంది.