ప్రేమికుల రోజు (Valentine’s Day) వస్తోందంటే చాలు, వెండితెరపై ప్రేమకథల సందడి మొదలవుతుంది. అయితే ఈ ఏడాది కొత్త సినిమాల కంటే పాత క్లాసిక్ లవ్ స్టోరీస్ రీ-రిలీజ్ అవుతుండటం విశేషం. ముఖ్యంగా ఈ వాలెంటైన్స్ వీక్‌ను ‘మ్యూజికల్ కన్సర్ట్’లా మార్చేందుకు టాలీవుడ్ సిద్ధమైంది. ఫిబ్రవరి 6వ తేదీన ధనుష్ నటించిన ‘3’ సినిమాతో ఈ రీ-రిలీజ్ జాతర మొదలుకానుంది. అనిరుధ్ అందించిన అద్భుతమైన సంగీతం ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో చూసేలా చేస్తోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కల్ట్ క్లాసిక్ ‘ఆరెంజ్ (Orange)’ 4K వెర్షన్లో ప్రేక్షకులను పలకరించనుంది. హారిస్ జయరాజ్ సంగీతం, ఆరెంజ్ గ్లోబల్ విజువల్స్ మళ్లీ థియేటర్లలో మ్యాజిక్ చేయడం ఖాయం.
ఇక వాలెంటైన్స్ డే రోజైన ఫిబ్రవరి 14న ఏకంగా మూడు ప్రేమ కథలు విడుదలవుతున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఎమోషనల్ జర్నీ ‘లవ్ స్టోరీ’, అప్పట్లో యూత్‌ను ఉర్రూతలూగించిన ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’, మరియు తెలుగు సినిమా గతిని మార్చిన క్లాసిక్ ‘ఏ మాయ చేసావే’ ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. జెస్సీ-కార్తీక్ ల ప్రేమాయణాన్ని మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఐదు సినిమాలు తమ మ్యూజిక్ మరియు ఎమోషన్స్‌తో థియేటర్లను మ్యూజికల్ కన్సర్ట్స్లా మార్చేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వాలెంటైన్స్ వీక్‌లో మీరు ఏ సినిమాకు వెళ్తున్నారో ప్లాన్ చేసుకున్నారా?