Vaibhav Suryavanshi Record for India: చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య అండర్-19 టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టులో భారత ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన యూత్ టెస్టు సెంచరీని సూర్యవంశీ నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 58 బంతుల్లో సెంచరీ బాదాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అగ్ర స్థానంలో ఉన్నాడు. అలీ 2005లో 56 బంతుల్లో వేగవంతమైన సెంచరీ చేశాడు. ప్రస్తుతం సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
బిహార్‌లోని సమస్తిపుర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ.. చిన్నప్పటి నుంచి క్రికెట్ వాతావరణంలోనే పెరిగాడు. అతడి తండ్రి సంజీవ్‌కు క్రికెట్ అంటే పిచ్చి. తండ్రి కలను నెరవేర్చేందుకు సూర్యవంశీ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో 12 ఏళ్ల 284 రోజుల వయసులో బిహార్ తరఫున రంజీల్లో అరంగేట్రం చేశాడు. యువరాజ్ సింగ్ (15 ఏళ్ల 57 రోజులు), సచిన్ టెండూల్కర్ (15 ఏళ్ల 230 రోజులు)ల కంటే చిన్న వయసులోనే రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన వైభవ్.. వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారాను ఆరాధిస్తాడు.
Also Read: IND vs BAN: రేసులో రోహిత్, సిరాజ్, జైస్వాల్.. ఇద్దరిని వరించిన అవార్డు!
వినూ మన్కడ్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ అడగొట్టాడు. ఒక శతకం, మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. 2023లో ఇండియా ‘బి’ తరఫున క్వాడ్రాంగ్యులర్ సిరీస్‌లోనూ మెరిశాడు. దాంతో సూర్యవంశీ ఎన్‌సీఏ దృష్టిలో పడ్డాడు. ఎన్‌సీఏ శిక్షణ పొందుతూ.. రోజురోజుకు రాటుదేలుతున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకూంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాపై ఇరగదీశాడు. ఇదే ప్రదర్శన చేస్తే.. త్వరలోనే ఇండియా ఏ తరపున ఆడే అవకాశం రానుంది.