Job Scam: ఒక వ్యక్తికి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడమే సాధ్యం కాదు. అలాంటిది ఒకరు ఏకంగా ఒకే సమయంలో వేరువేరు జిల్లాల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు చేశాడు. యూపీ ఆరోగ్య శాఖలో ఒకే పేరు, ఒకే చిరునామా ఉన్న వ్యక్తి ఒకే సమయంలో 6 వేర్వేరు జిల్లాల్లో 9 ఏళ్లుగా పనిచేసి రూ.3 కోట్లకు పైగా జీతం తీసుకున్నాడు. తొమ్మిదేళ్లుగా ఇంత జరుగుతున్న పట్టించుకున్న వాళ్లు లేరంటే ఎంత నిర్లక్ష్యం ఉందో చూడండి. అర్పిత్ అనే యువకుడు 6 జిల్లాల్లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అన్ని జిల్లాల్లో మనోడి పేరు అర్పిత్ సింగ్ అని, తండ్రి పేరు అనిల్ కుమార్ సింగ్, వాళ్లు ఉండేది ప్రతాప్ నగర్ షాగంజ్, ఆగ్రా అని ఉంటుంది. మనోడు పుట్టిన తేదీ కూడా అన్నింట్లో ఒకటే. కానీ ఆధార్ కార్డులు మాత్రమే భిన్నంగా ఉంటాయి. దీంతోనే అర్పిత్ ఏకంగా తొమ్మిదేళ్ల పాటు ఎవరికి దొరకకుండా కోట్లు సంపాదించాడు.
READ ALSO: Building Collapse : గురుకుల పాఠశాలలో కూలిన భవనం.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
బయటికి ఎలా వచ్చిందంటే..
2016లో 403 మంది ఎక్స్-రే టెక్నీషియన్లను ప్రభుత్వం నియమించింది. తొమ్మిది ఏళ్లుగా అంతా సాధారణంగానే ఉంది. కానీ ఇటీవల ఆ విభాగం మానవ్ సంపద పోర్టల్‌ను చెక్ చేస్తే ఒక షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఒకే వ్యక్తి వేర్వేరు ప్రదేశాలలో పనిచేస్తున్నట్లు బయటపడింది. హత్రాస్: ముర్సాన్, బలరాంపూర్: తులసీపూర్, రాంపూర్: బిలాస్పూర్ సిహెచ్సి, బండా CHCలో, షామ్లి, అమ్రోహలో ఎక్స్-రే టెక్నీషియన్ అర్పిత్ సింగ్ అనే వ్యక్తి తొమ్మిదేళ్లుగా పని చేస్తున్నాడు. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే మనోడు పరార్ అయ్యాడు. అర్పిత్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే మనోడిది ప్రతిచోటా ఒకే పేరు, తండ్రి పేరు, చిరునామా కూడా ఒక్కటే. కానీ ఆధార్ నంబర్లు భిన్నంగా ఉన్నాయి. నకిలీ ఆధార్ కార్డు సహాయంతో ఈ మోసం జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది.
తొమ్మిదేళ్లుగా కోట్లు సంపాదించాడు..
సగటున ఒక ఎక్స్-రే టెక్నీషియన్ నెలకు దాదాపు రూ.50 వేల జీతం వస్తుంది. ఈ విధంగా ఆయన సంవత్సరంలో మొత్తం రూ.6 లక్షలు, తొమ్మిదేళ్లుగా రూ.54 లక్షలు సంపాదించాడు. మనోడు ఒకే టైంలో ఆరు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి మొత్తం రూ.3.24 కోట్ల సంపాదించాడు. ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయాలు మోసం చేస్తున్న ఆ శాఖకు కనీసం క్లూ కూడా రాకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది.
మరికొన్ని పేర్లు కూడా..
ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి డిజి హెల్త్ రతన్ పాల్ సుమన్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కథ కేవలం ఒక అర్పిత్ సింగ్ కే పరిమితం కాలేదు. మానవ్ సంపద పోర్టల్లో రెండు చోట్ల అంకుర్ (మెయిన్పురి నివాసి) వంటి అనేక పేర్లను వెలుగుచూసినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది.. అంకిత్ సింగ్ (హర్డోయ్ నివాసి) – లలిత్పూర్, లఖింపూర్, గోండా, బదౌన్, హర్డోయ్ అనే ఐదు జిల్లాల్లో ఎక్స్-రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులపై దర్యాప్తు జరుగుతోందని త్వరలో పూర్తి స్థాయి దర్యాప్తు నివేదిక బయటికి రానుంది. అర్పిత్ సింగ్‌ను తర్వలో పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
READ ALSO: Akashteer India: భారతదేశానికి రక్షణగా ఆకాష్టీర్.. శత్రుదేశాలకు వణుకే..