Heart Attack: సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌లో లఖింపూర్ ఖేరీలోని ఫన్ మాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లిన 35 ఏళ్ల వ్యక్తి శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన అంతా సినిమా హాలులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఇటీవల విడుదలైన ‘గదర్-2’ సినిమా అర్థరాత్రి షోను తిలకించేందుకు ఆయన శనివారం సిటీ మాల్‌లోని సినిమా హాలుకు చేరుకున్నారు.
మహేవగంజ్‌లో మెడికల్ స్టోర్ నడుపుతున్న అక్షత్ తివారీ తన ఫోన్‌లో మాట్లాడుతూ మెట్లు ఎక్కుతుండగా హఠాత్తుగా గుండెపోటు సంభవించింది. ఆయన ముందు ఇద్దరు యువకులు కూడా నడుచుకుంటూ వస్తున్నారు. వారి వెనుకే నడుచుకుంటూ వస్తున్న అక్షత్ తివారీ కుప్పకూలి నేలపై పడిపోయాడు. అతను కుప్పకూలిపోవడం చూసి చుట్టుపక్కల ప్రజలు అతని కాపాడడానికి గుమిగూడారు. అక్కడ ఉన్న గార్డులు, బౌన్సర్లు అతని ముఖం మీద నీరు చల్లారు, కానీ అతని నుంచి ఎటువంటి స్పందన లేదు.
Read Also: Vistara: రెండేళ్ల చిన్నారికి విమానంలో ఆగిన శ్వాస.. పునర్జన్మ ఇచ్చిన ఎయిమ్స్ వైద్యులు
వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరణానికి గుండెపోటు కారణమని ప్రాథమికంగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం విచారణ జరుపుతున్నారు. యువకులు అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, కొన్ని సందర్భాల్లో చనిపోవడం వంటి అనేక కథనాలు సోషల్ మీడియాలో వెలువడిన సంగతి తెలిసిందే. ఇటువంటి సంఘటనలు నిపుణులను కూడా ఆందోళనకు గురిచేశాయి. వారు ఆకస్మిక గుండె మరణాల సంఘటనలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. యువతలో గుండె సమస్యలకు సాధారణ కారణాలు గుండె జబ్బుల కుటుంబ చరిత్ర, మధుమేహం, రక్తపోటు వంటి వైద్య పరిస్థితులు, జీవనశైలి సమస్యలు, ఊబకాయం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.