NTV Telugu Site icon

Rammohan Naidu: విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు.. ప్రారంభించిన కేంద్ర మంత్రి

Rammohan Naidu

Rammohan Naidu

Rammohan Naidu: విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండిగో విమాన ప్రయాణికులకు కేంద్ర మంత్రి బోర్డింగ్ పోసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 500 ఎకరాలలో ఏవియేషన్ సర్వీసులు, సౌకర్యాల కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ నుంచి ఎయిర్ కనెక్టివిటీ విస్తరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం బ్రైట్ స్పాట్‌గా మారుతుందన్నారు. వారణాసి, అయోధ్యకు విమాన సర్వీసుల ఇవ్వాలని ప్రతిపాదన ఉందన్నారు. విశాఖ నుంచి వీలైనన్ని కొత్త సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. విజయవాడ – విశాఖ మధ్య రెండు నూతన సర్వీసులు అందుబాటులోకి రావడంతో టిక్కెట్ ధరలు తగ్గుతాయన్నారు.

Read Also: Minister Nara Lokesh: ఏపీలో పరిశ్రమల స్థాపనకు మెరుగైన ఎకోసిస్టమ్ కల్పించాం..

ఎయిర్ బస్‌తో కనెక్ట్ చేయడంతో ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. అయ్యప్ప భక్తులు ఇరుముడితో వెళ్లే సౌకర్యం కల్పించామన్నారు. జనవరి 20 వరకు దీక్ష దారులు ఇరుముడితో వెళ్లేందుకు సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిబంధనలలో మార్పులు చేసి సర్క్యులర్ ఇచ్చామని చెప్పారు. నవంబర్ 9న సీ ప్లేన్ డెమో సర్వీస్.. ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామన్నారు. జూన్ 2026కు భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కడప – హైదారాబాద్.., రాజమండ్రి – ఢిల్లీకి సర్వీసులు ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. డిమాండ్ ఆధారంగా ప్రతీ నెల ఏపీ నుంచి రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. కొవిడ్ ముందు ప్రభావితం అయిన ఎయిర్ సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందన్నారు.

ఏవియేషన్‌కు వస్తున్న బెదిరింపు హెచ్చరికలపై లోతైన దర్యాప్తు జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నివేదిక వచ్చిన తర్వాత ఈ ఫేక్ థ్రెట్ వెనుక బాధ్యులు, ఉద్దేశాలు వెలుగు చూస్తాయన్నారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని ప్రధాని ఆదేశించారని చెప్పారు. లా& ఆర్డర్ ,ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు దర్యాప్తులో వున్నాయన్నారు. సోషల్ మీడియా నుంచి ఈ తరహా బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించి చర్యలు చేపట్టామన్నారు. సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి సంబంధించి రెండు కీలక చట్టసవరణలు చేసి మరింత కఠిన వైఖరి తీసుకుని వస్తామన్నారు. ఫేక్ థ్రెట్‌లు ఇచ్చే వాళ్ళను విమాన ప్రయాణాలు చేయకుండా నిషేధం విధించాలని యోచిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు.

 

Show comments