తెలంగాణలో భారీవర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని అమిత్‌షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అమిత్ షా కు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. అయితే.. రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్ల తో నేరుగా మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి… బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.