Loan App Harassment: ప్రైవేట్ యాప్‌లో తీసుకున్న రుణం తీర్చలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం, మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (28) అనే వ్యక్తి మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గంగాధర్ గతంలో ఆన్‌లైన్ ద్వారా రూ. 1.20 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ డబ్బులు చెల్లించారు. అయితే, ఇటీవల మరోసారి రూ. 3 లక్షలు ఒక ప్రైవేట్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. EMI లు సక్రమంగా కట్టకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధించారు. ఆ రుణాన్ని తీర్చలేక అతను చాలా కాలంగా మానసిక ఆందోళనకు గురవుతూ జీవనం సాగించాడు.
Also Read: Drugs Seized: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారం పట్టివేత
దాంతో అక్కన్నపేట అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని వెంటనే చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గంగాధర్ మరణించాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
Also Read: AUS vs IND: 260 పరుగులకు భారత్ ఆలౌట్.. టీమిండియాను కాపాడిన వరణుడు!