Udaipur Floods: దేశంలోని తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్‌లో సైతం వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాల ధాటికి ఇటీవల ఉదయ్‌పుర్‌కు భారీగా వరదలు వచ్చాయి. అక్కడ ఉన్న అయాద్ నది సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో ఇద్దరు స్నేహితులు కొట్టుకుపోతుండగా.. రెస్క్యూ బృందాలు ఒకరిని కాపాడాయి. మరో మిత్రుడు గల్లంతయ్యాడు. ప్రవాహం నిరంతరం పెరుగుతుండటంతో ఆ యువకుడి జాడ కానరాలేదు. దీంతో ఆ యువకుడి తండ్రి దాదాపు ఇరవై కిలోమీటర్ల పాటు తన కొడుకుని వెతుక్కుంటూ వెళ్లాడు.
READ MORE: ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఎన్నికల్లో చూసుకుందాం సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
స్థానికుల కథనం ప్రకారం.. ఉదయ్‌పుర్‌లోని సుఖాదియా నగర్‌కు చెందిన రవి ఖోఖర్ (33), సంజయ్ (23)లు సెప్టెంబర్ 6న ఇంటి సమీపంలోని ఓ ఆలయానికి వెళ్లారు. నది దాటుతున్న సయమంలో ఎగువన ఫతేసాగర్ గేట్లు ఒక్కసారిగా తెరిచారు. దీంతో వరద ఉద్ధృతి పెరిగింది. మధ్యలో ఉన్న బండరాయి మీద ఇద్దరు మిత్రులు నిలబడే ప్రయత్నం చేశారు. రవి పట్టుతప్పి ప్రవాహంలో పడిపోయాడు. సంజయ్ మాత్రం అలాగే నిలబడ్డాడు. సంజయ్‌ని కాపాడేందుకు దాదాపు 8గంటలపాటు శ్రమించాయి రెస్క్యూ బృందాలు. డ్రోన్లు, తాళ్లు, లైఫ్ జాకెట్ల సాయంతో రక్షించాయి. ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచి పోయింది. ఇంత వరకూ రవి ఆచూకీపై ఎలాంటి సమాచారం అందలేదు. తన ముందే కొట్టుకుపోయిన మిత్రుడిని తలచుకుని సంజయ్ కన్నీంటి పర్యంతమవుతున్నాడు. మరోవైపు రవి తండ్రి రమేష్ నిత్యం దాదాపు 20 కిలోమీటర్లు ప్రవాహం వెంట నడుచుకుంటూ వెతుకుతున్నాడు. వెతికి వెతికీ అలసిపోయిన ఆ తండ్రి తన కుమారుడి మృతదేహం దొరికినా చాలాంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు..