Site icon NTV Telugu

Hydra: హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరిపై కేసు.. నంబర్ షేర్ చేసిన హైడ్రా..

Hydraa

Hydraa

హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇరువురిపై గ‌చ్చిబౌలి పోలీసు స్టేష‌న్లో కేసు న‌మోదైంది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభ‌న్ బాబు గండిపేట మండ‌లం, నెక్నాంపూర్ విలేజ్‌లోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఓ ఇంటికి వెళ్లి బెదిరించిన‌ట్టు పోలీసు స్టేష‌న్‌కు ఫిర్యాదు అందింది. ఈ నెల 23న మ‌ధ్యాహ్నం 3.20 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. న‌లుపు రంగు కారులో వ‌చ్చిన‌ ఈ ఇద్దరు ఇంటి ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చి ప‌రిశీలిస్తుండ‌గా.. ఎవ‌ర‌ని అడిగితే తాము హైడ్రా నుంచి వ‌చ్చామ‌ని బ‌దులిచ్చార‌ని ఆ ఇంటి వ‌ద్ద ప‌ని చేస్తున్న గుంత‌క‌ల్ మ‌ల్లికార్జున్ తెలిపారు.

READ MORE: CM Chandrababu: గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే..

ఎందుకు వ‌చ్చార‌ని అడిగితే ఈ ఇంటిని కూల్చేస్తామ‌ని.. ఇందుకు సంబంధించిన స‌మాచారం సేక‌రిస్తున్నామ‌ని చెప్పార‌న్నారు. ఇంటి య‌జ‌మానితో మాట్లాడాల‌ని సూచించ‌గా.. చ‌ల్లగా జార‌కున్నార‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో మ‌ల్లికార్జున్ పేర్కొన్నారు. నిందితులు మిరియాల వేదాంతం(22) కారు డ్రైవ‌ర్ కాగా.. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అల్కాపురి టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్నాడు. మ‌రో వ్యక్తి యెలిసెట్టి శోభ‌న్‌బాబు ఆర్టీసీలో ప‌ని చేసి రిటైర్ అయ్యారు. ఈయ‌న మ‌ణికొండ‌లోని పుప్పాల‌గూడ‌, ఎస్టీమ్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాడు. ఆ ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

READ MORE: Revanth Reddy: రామ్‌చరణ్ చిన్నప్పటి నుంచే తెలుసు.. విజయ్ దేవరకొండది మా పక్క ఊరే..

హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలు శిక్ష ఖాయం
హైడ్రా పేరు చెప్పి ఎవ‌రైనా మోసాల‌కు, బెదిరింపుల‌కు పాల్పడితే వెంట‌నే వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని హైడ్రా గురువారం ఒక ప్రక‌ట‌న‌లో కోరింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉపేక్షించ‌వ‌ద్దని.. నేరుగా త‌మ‌కు ఆ స‌మాచారం ఇచ్చినా వారిపై చ‌ర్యలు తీసుకుంటామ‌ని తెలిపింది. హైడ్రా ఉద్యోగులు విచార‌ణ చేప‌డితే.. పూర్తి వివ‌రాలు అంద‌జేస్తార‌ని.. ఒక వేళ హైడ్రా ఉద్యోగులు కూడా మోసాల‌కు పాల్పడి.. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తే వారిపైన కూడా క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హైడ్రా స్పష్టం చేసింది. ఎవ‌రైనా మోసాల‌కు పాల్పడితే.. 8712406899 నంబ‌రుకు ఫోను చేసి స‌మాచారాన్ని వాట్సాప్‌లో అంద‌జేయడంతో పాటు.. వారి ఫొటోలు కూడా పంపించాల‌ని కోరింది.

Exit mobile version