AP Fake Liquor Case: అన్నమయ్య జిల్లాలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన ఐదుగురు నిందితుల మూడు రోజుల పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. అయితే, విచారణ అనంతరం ఎక్సైజ్ అధికారులు సిద్ధం చేసిన కస్టడీ రిపోర్టుపై సంతకం చేసేందుకు ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు నిరాకరించడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. మూడు రోజుల పాటు నిందితులను ప్రశ్నించిన ఎక్సైజ్ శాఖ, మద్యం కల్తీ తయారీ, సరఫరా నెట్‌వర్క్, కీలక పాత్రధారుల వివరాలపై కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. కానీ, కస్టడీ రిపోర్టుపై జనార్ధన్ రావు సంతకం పెట్టకపోవడంతో.. విచారణ వివరాలకు అధికారిక ధ్రువీకరణ ఎలా పొందాలన్న దానిపై ఎక్సైజ్ శాఖ తలలు పట్టుకుంటోంది.
Read Also: Sharwanand : శర్వానంద్ కు పొంగల్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
కస్టడీ సమయం ముగిసిపోవడంతో నిందితులను ఇంకా మదనపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లోనే ఉంచి తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు. సంతకం నిరాకరణ వల్ల కేసు ప్రక్రియ ఆలస్యం కావచ్చని, కోర్టులో రిపోర్టు సమర్పణకు ఇది సాంకేతిక అడ్డంకిగా మారే అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని.. నిందితుడి సంతకం లేకపోయినా చట్టపరమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రిపోర్టును కోర్టుకు సమర్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే, కల్తీ మద్యం కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేపట్టి, మిగతా నిందితుల పాత్రను స్పష్టంగా నిర్ధారించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారీ, విక్రయాలు సాగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికారిక రిపోర్టుపై సంతకం నిరాకరణ ఘటనతో కేసు విచారణ కొత్త మలుపు తీసుకున్నప్పటికీ, త్వరలోనే పూర్తి నివేదికతో స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖతో పాటు, జిల్లా పోలీసులు, RPF, FSL విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ.. కల్తీ మద్యం మూలాలను ఛేదించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్టు చెబుతున్నారు..