Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేందు అధికారి ఈ రోజు కేంద్రానికి వ్యతిరేకంగా రెండు రోజుల నిరసన దీక్షను ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మండిపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ పార్టీ కాదని.. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటూ ఆయన ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఎన్నికలు వంశపారంపర్యత, జాతి, బుజ్జగింపు ప్రాతిపదికన జరిగాయని ఆయన ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణలో ఇవి పాతుకుపోయాయన్నారు.
కేంద్ర ప్రాయోజిత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల డబ్బు తీసుకుందని సువేందు అధికారి ఆరోపించారు.రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించిన సమయంలో సుమారు రూ.3.60 కోట్ల జాబ్ కార్డ్ హోల్డర్లు నమోదు చేసుకున్నారని ఆయన చెప్పారు. జాబ్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినప్పుడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాదాపు కోటి జాబ్ కార్డ్ డేటాను తొలగించిందన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 1 కోటి జాబ్ కార్డుల తరపున గణనీయమైన మొత్తంలో డబ్బు తీసుకుందని, అవి నకిలీవని తేలిందని సువేందు అధికారి ఆరోపించారు. ఇది పెద్ద కుంభకోణం అని బీజేపీ నేత అన్నారు.
Read Also: Private Doctors: రోడ్డెక్కిన ప్రైవేట్ డాక్టర్లు.. ఆరోగ్య హక్కు బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
సాంఘిక సంక్షేమ నిధుల కేటాయింపులో ‘రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్చి 29, 30 తేదీల్లో రెండు రోజులపాటు నిరసన దీక్షను ప్రకటించారు. కోల్‌కతాలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సువేందు అధికారి స్పందించారు.