Tragedy: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంటకాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో అరకు విహారయాత్రకు వెళ్ళి తిరిగి స్వగ్రామం పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో విజయ్ కుమార్ భార్య, ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో భార్య ఉమ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో గల్లంతైన భార్య ఉమ, పెద్ద కుమారుడు మనోజ్, చిన్న కుమారుడు రోహిత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.
Read Also: Kadapa: 13 సార్లు యువతిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది అరెస్ట్..
విహారయాత్ర విషాదంగా మారిన ఘటన కోనసీమ వాసులను కలసివేసింది. పోతవరానికి చెందిన విజయ్ కుమార్ భార్య ఇద్దరు కుమారులతో కలిసి అరకు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపి తిరిగి గత రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. కారు రావులపాలెం మండలం ఈతకోట వద్దకు వచ్చేసరికి విజయ్ కుమార్‌కు నిద్రమత్తుతో కళ్ళు మూతలు పడుతున్నాయని రోడ్డు పక్కన ఆపారు. భార్య ఉమ నాకు డ్రైవింగ్ వచ్చు కదా ఇంకా పది కిలోమీటర్ల దూరంలో ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పింది. దీనికి భర్త అంగీకరించడంతో భార్య ఉమ కార్ డ్రైవింగ్ చేస్తూ పోతవరం బయలుదేరారు. కారు ఊడిముడి వచ్చిన తర్వాత అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు కుమారులు మృతి చెందగా, భర్త విజయ్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదకర ఘటన కోనసీమ వాసులను కలిసి వేసింది. మరో ఐదు కిలోమీటర్ల దూరంలో స్వగ్రామం చేరుకుంటారనే సమయంలో ఈ ప్రమాదం జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు బంధువులు ఘటన స్థలానికి చేరుకుని కంటతడి పెడుతున్నారు. ఘటనా స్థలం అరణ్య రోదనగా మారింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పి.గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.