Tragedy: నూతన సంవత్సర వేడుకలు ముగ్గురు యువకుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఏలూరు జిల్లాలో న్యూఇయర్ రోజున విషాదం చోటుచేసుకుంది. అగిరిపల్లి మండలం కనసానపల్లిలో మద్యం మత్తులో బుల్లెట్ బండి నడుపుతూ బావిలోకి దూసుకెళ్లాడు ఓ యువకుడు. బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతదేహాలను బయటకు తీశారు గ్రామస్థులు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు నున్న, విజయవాడ సమీపంలోని రామవరప్పాడు గ్రామస్థులుగా గుర్తించారు. బతికి బయటపడ్డ వ్యక్తిది కనసానపల్లి గ్రామం అని తెలిసింది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కొత్త సంవత్సరం రోజున ఈ ఘటన జరగడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: Andhrapradesh: న్యూఇయర్ వేడుకల్లో టీడీపీ శ్రేణుల మధ్య గొడవ
పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు వారి వివరాలను కూడా వెల్లడించారు. ఆ ముగ్గురు శెట్టి సాయికుమార్, తలసిల కృష్ణ చైతన్య, రామకృష్ణలుగా గుర్తించారు. ఈ ముగ్గురు మితిమీరిన వేగంతో బుల్లెట్‌పై వెళ్తూ మద్యం మత్తులో బావిలో పడినట్లు పోలీసులు తెలిపారు.