NTV Telugu Site icon

Addanki Dayakar: రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉంది: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

Addanki Dayakar

Addanki Dayakar

Addanki Dayakar: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వివిధ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా తీసుకుంటుందని, ఈ విషయంలో రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన బీజేపీ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు. 2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడానికి బీజేపీ నార్త్, సౌత్‌లో రాజకీయ కుట్రలు పన్నుతోందని దయాకర్ ఆరోపించారు. జెమిలి ఎన్నికలతో ప్రయోగాలు చేయడం కూడా బీజేపీ రాజకీయ ప్రేరేపిత కుట్రలలో భాగమని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను శత్రుత్వంగా చూడడం బీజేపీకి ఆనవాయితీగా మారిందని, ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యల వైపు అడుగులే అని వ్యాఖ్యానించారు.

Also Read: Robbery Case: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో కీలక పురోగతి

భారతదేశానికి శత్రువులుగా ఉన్న ఇతర దేశాలతో బీజేపీ ప్రేమగా ఉంటుందని, ఇది ఆ పార్టీ సామ్రాజ్యవాద దృక్పథానికి నిదర్శనమని దయాకర్ విమర్శించారు. బీజేపీ తన రాజకీయ మిత్రులతో సంబంధాలను కొనసాగిస్తూ, తన స్వలాభం కోసం మిత్రపక్షాలను ఎదురుదాడికి గురిచేయడం ఆ పార్టీ నైజమని స్పష్టమయ్యిందన్నారు. ఆపై ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ వ్యూహాలను ఆయన విశ్లేషించారు. చంద్రబాబుతో కయ్యం బీజేపీకి ప్రమాదకరమని తెలుసు కానీ, పవన్ కళ్యాణ్‌ను ముందు పెట్టి తన ఆధిపత్యాన్ని చెలాయించాలని ప్రయత్నిస్తోందని అన్నారు. తన రాజకీయ మిత్రులను ఉపయోగించి, అదే పార్టీని అంతమొందించడమే బీజేపీ అసలు లక్ష్యమని దయాకర్ వ్యాఖ్యానించారు. మొత్తానికి భారత రాజ్యాంగ పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యతను దయాకర్ ప్రస్తావించారు. రాహుల్ గాంధీని దేశ ప్రజలు రాజ్యాంగ పరిరక్షకుడిగా చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటుందని హామీ ఇచ్చారు.