నేడు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన:
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఈరోజు పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని లింగాల మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను జగన్ పరిశీలించనున్నారు. అనంతరం అరటి రైతులను పరామర్శించనున్నారు. శనివారం తీవ్ర ఈదురుగాలులతో లింగాల మండలంలో వేల ఎకరాలలో పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. అరటి రైతులతో మాట్లాడిన అనంతరం జగన్ వేంపల్లికి చేరుకుంటారు. అక్కడ జెడ్పీటీసీ రవి కుమార్ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అటు తర్వాత ఇడుపులపాయ చేరుకొని.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికపై జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం వైఎస్ జగన్ తాడేపల్లికి బయలుదేరి వెళతారు.
జనసేన తమిళనాడులో ఆడుగుపెడుతుంది:
తాను ఏదీ ప్లాన్ చేసుకోలేదని, ప్రజల అభీష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన కచ్చితంగా తమిళనాడులో ఆడుగుపెడుతుందని ఆ ఆపార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గుడ్ లీడర్ అని, పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని ఆయన ఉదార వైఖరిని అభినందించాల్సింద అన్నారు. పార్టీ పెట్టడం ముఖ్యం కాదని, నిలబెట్టుకోవడమే ముఖ్యం అని పేర్కొన్నారు. సినీ నటులు రాజకీయాల్లో వచ్చి గెలవడం అంతా ఈజీ కాదని, అది కేవలం ఎన్ఠీఆర్‌కు మాత్రమే సాధ్యమైందన్నారు. రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఓ తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పలు విషయాలపై స్పందించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్పై సీఎం సమీక్ష:
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు (మార్చ్ 24) సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే సమీక్షకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్‌జీఆర్‌ఐ, సింగరేణితో పాటు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సరిగ్గా నెల క్రితం ప్రమాదం జరిగి.. 8 మంది చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.. కేవలం, గురుప్రీత్‌సింగ్ (పంజాబ్) మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. ఇప్పటి వరకు మరో ఏడుగురి మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. అయితే, నేటి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం రేవంత్ దిశానిర్దేశనం చేసే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యల కోసం రూ.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం:
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్న ఘటన కలకలం రేపుతుంది. రైలు బోగిలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ప్రయత్నించడంతో అతని నుంచి తప్పించుకునే క్రమంలో రైలు నుంచి దూకిన యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.
ముస్లిం అమ్మాయితో మాట్లాడిన హిందూ యువకుడిపై దాడి:
హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హిందూ యువకుడిపై దాడికి పాల్పడ్డారు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు. వివరాల్లోకి వెళితే.. ముస్లిం అమ్మాయితో మాట్లాడాడు అనే సాకుతో న్యూ శాంపేట్ ప్రాంతానికి చెందిన సాయి చరణ్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు కొందరు మైనార్టీ యువకులు. అయితే, నిన్న (ఆదివారం) మధ్యాహ్నం హనుమకొండ చౌరస్తా ఐస్ మ్యాజిక్ ఎదురుగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర యువకుడిని బలవంతంగా బైక్ పై ఎక్కించుకొని పలు ప్రాంతాలలో తిప్పుతూ సదరు యువకుడి పైనా దాడికి దిగారు మైనార్టీ యువకులు.
ఏక్‌నాథ్‌షిండేపై కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు:
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి దారి తీశాయి. షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు హాస్య నటుడుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఇక కునాల్‌కు సంబంధించిన కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. కునాల్‌ను అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిసననలు చేపట్టారు. ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని.. అందుకే ఏక్‌నాథ్ షిండేను టార్గెట్ చేస్తున్నారని లోక్‌సభ ఎంపీ నరేష్ మ్హాస్కే ఆరోపించారు. కునాల్ ఒక కాంట్రాక్ట్ కమెడియన్ మండిపడ్డారు. డబ్బుల కోసం తమ నాయకుడిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని నరేష్ మ్హాస్కే ధ్వజమెత్తారు. మహారాష్ట్రలోనే కాదు.. కునాల్ దేశంలో ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేడని హెచ్చరించారు. శివసేన సైనికులు అతన్ని వెంటాడుతూనే ఉంటారని వార్నింగ్ ఇచ్చారు.
ఇబ్బందుల్లో మహ్మద్ యూనస్:
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజధాని ఢాకాలో విస్తృతంగా సైన్యం మోహరించింది. ఇది తిరుగుబాటు ఊహాగానాలను లేవనెత్తుతోంది. ఢాకాలో ఎప్పుడూ లేని విధంగా సైన్యం మోహరించడం చూస్తే ఏదో జరగబోతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా సైన్యం, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్, పారామిలిటరీ బలగాలు మోహరించబడ్డాయి. వీటికి అదనంగా రాజధాని ఢాకాలో భద్రతను పటిష్టం చేయడానికి సమీప జిల్లాల నుంచి పోలీసు సిబ్బందిని సమీకరించారు. అయితే, ఇలా ఈ బలగాల మోహరింపు హిజ్బుత్-తహ్రీర్, ఇతర ప్రతిపక్ష గ్రూపులు పిలుపునిచ్చిన నిరసనల్లో ఎలాంటి హింస జరగకుండా నిరోధించడానికి అని పైకి చెబుతున్నారు.
హమాస్ లక్ష్యంగా ఐడీఎఫ్ దాడి:
హమాస్ అంతమే లక్ష్యంగా మరోసారి ఇజ్రాయెల్ భీకరదాడులకు తెగబడింది. గత వారం జరిపిన దాడుల్లో వందలాది మంది చనిపోగా.. మరోసారి ఆదివారం కూడా ఐడీఎఫ్ దళాలు భీకరదాడులకు తెగబడ్డాయి. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సీనియర్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ సహా ఐదుగురు హతమయ్యారు. మరోవైపు నాజర్ ఆస్పత్రి మృతులు, క్షతగాత్రులతో నిండిపోయింది. దక్షిణ గాజాలో నాజర్ ఆసుపత్రి అతిపెద్దది. ఇందులో ఉగ్రవాదులు తిట్టవేస్తారన్న పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. వైమానిక దాడుల నేపథ్యంలో అత్యవసర విభాగంలో మంటలు చెలరేగాయి. హమాస్ అగ్ర నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ మరణాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. వైమానిక దాడులతో ఖాన్ యూనిస్‌లోని ఆసుపత్రి సర్జికల్ భవనంలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించిందని, అనేక మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడులను హమాస్ కూడా ధృవీకరించింది. ఇక ఈ దాడులను ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది. ఆస్పత్రి నుంచి పని చేస్తున్న హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా ఈ దాడులను చేసినట్లు తెలిపింది.
ముందస్తు ఎన్నికలకు కెనడా ప్రధాని పిలుపు:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధం, విలీన బెదిరింపుల నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలమైన ఆధిక్యాన్ని సంపాదించడం కోసం ముందస్తు ఎన్నికలకు మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారి లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా… ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ కెనడాతో తలపడనుంది. కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో వైదొలిగిన తర్వాత.. ప్రధానమంత్రి బాధ్యతలను ఆర్థిక నిపుణుడైన మార్క్ కార్నీ (60) మార్చి 14న బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ట్రంప్ విధానాన్ని ఎదుర్కొనేందుకు ముందుగా మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో ఏప్రిల్ 28న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కెనడాలో లిబరల్ పార్టీకి మెజార్టీ ఉన్నా.. బలమైన ప్రభుత్వం ఏర్పాటు దిశగా కార్నీ ఈ నిర్ణయం తీసుకున్నారు. పొరుగున ఉన్న కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మారుస్తానని ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ బెదిరింపులను దృష్టిలో పెట్టుకుని మార్క్ కార్నీ ఈ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.
యూట్యూబ్ ఛానల్స్ థంబ్‌నెయిల్‌పై మండిపడిన నటి భార్గవి:
లైక్స్,వ్యూస్ కోసం యూట్యూబ్, సోషల్ మీడియా ఇప్పుడు ఎంతకైనా దిగజారిపోతుంది. వీడియో వ్యూస్ కోసం తప్పుదోవ పట్టించేలా, నీచమైన థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. అలాగే క్లిక్ బైట్స్ లాంటి థంబ్ నెయిల్స్ చూసి ప్రేక్షకులు కూడా మోసపోతున్నారు. తాజాగా యాంకర్, తెలుగు నటి గాయత్రి భార్గవి ఈ ఫేక్ థంబ్ నెయిల్స్‌పై ఫైర్ అయింది. ఆమె రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకి సదరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన నీచమైన థంబ్ నెయిల్స్ గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘యూట్యూబ్‌లో రాంగ్ థంబ్‌నెయిల్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని ఎలా చూపిస్తారు అనేది చెప్పడానికి మీ ముందుకు వచ్చా.. నేను ఐడ్రీమ్ మీడియాకి ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చాను. యాంకర్ స్వప్న అక్క పిలిచారని చాలా ప్రేమగా వెళ్లి చేసి వచ్చాను.. ఇంటర్వ్యూ కూడా చాలా బాగా జరిగింది అయితే అది టెలికాస్ట్ అయిన తర్వాత చూసి షాకయ్యా. మా ఆయన ఆర్మీ ఆఫీసర్.. ఆయనకు ఉన్న వేదన.. ఓ సైనికుడి విషయంలో మాకు జరిగిన ఓ సెన్సిటివ్ ఇష్యూ చెప్పి ఆ ఇంటర్వ్యూలో నేను చాలా బాధపడ్డాను. కానీ దాని వాళ్ళు ఏం చేశారు అంటే.. నేను కంటతడి పెట్టుకున్న ఫోటోలు పెట్టేసి.. ‘‘తన భర్త మంచులో కూరుకుపోయి అక్కడే చనిపోయారు, బాడీ మొత్తం ముక్కలు ముక్కలు చేసి చిన్న డబ్బాలో ఇంటికి పంపించారు.. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టెది కాదు’’ అంటూ నా ఫ్యామిలీ ఫోటోలు పెట్టి ఇలా థంబ్ నెయిల్స్ పెట్టారు. ఒక ఆర్మీ ఆఫీసర్ గురించి, ఆయన భార్య గురించి అందరినీ తప్పుదోవ పట్టించేలా ఇక్కడ రాశారు. దీని పైన నువ్వు ఏమనుకుంటున్నావ్ విక్రమ్.. ఈయన మా ఆయన ఇదిగో నా పక్కనే ఉన్నారు..’ అంటూ వీడియో పోస్ట్ చేసింది. అలాగే పక్కనే ఉన్న తన భర్తని చూపిస్తూ..
హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై అత్యాచారయత్నం:
హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. బాలీవుడ్ నటిపై హైదరాబాద్ కు చెందిన కొందరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. కానీ నటి ప్రతిఘటించడంతో పారిపోయారు. వివరాలలో కెళితే బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ నటిని హైదరాబాద్ లో షాప్ ఓపెనింగ్ కు గెస్ట్ గా అహ్వాహించారు. అందుకు తగిన రెమ్యునరేషన్ కూడా ఇస్తామనడంతో నటి అందుకు అంగీకరించి నగరానికి వచ్చింది. ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన సదరు నటి మాసబ్‌ట్యాంక్ శ్యామ్‌నగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బస చేసింది. అపార్ట్‌మెంట్ లో రాత్రి నిద్రిస్తున్న వేళలో ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు యువకులు నటి ఉన్న గదిలోకి వచ్చారు. తమతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో మాతో వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ బెదిరించారు యువకులు. బెదిరిపోయిన నటి అరిచి గోల పెట్టడంతో ఆమె నోట్లో గుడ్డలు అదిమి పెట్టి ఆమెను కాళ్ళు, చేతులు కట్టేసి బంధించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. కానీ వీలుపడకపోవడంతో ఆమె బ్యాగ్ లోని రూ.50 వేలు డబ్బులు, కొంత నగలు తీసుకుని పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత కట్లు విడిపించుకుని అపార్ట్ మెంట్ నుండి బయటపడిన నటి డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలు మాసబ్‌ట్యాంక్ పోలీసులకు పిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
చెన్నై శుభారంభం:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై 4 వికెట్ల తేడాతో తొలి మ్యాచ్‌లో విజయ కేతనం ఎగుర వేసింది. 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గత 12 సంవత్సరాలుగా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు.. ఈ ఏడాది కూడా అదే పరంపరను కొనసాగించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. గైక్వాడ్ (53) ఓట్ అవ్వగా.. రచిన్ రవీంద్ర(65) చివరి బంతి వరకు క్రీజ్‌లో కొనసాగాడు. చివరి క్షణంలో జడేజా(17) ఔట్ అవ్వడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బరిలోకి దిగాడు.