2009లో వచ్చిన ఫలితాలే.. 2024లో రిపీట్ అవుతాయి:
పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు తప్పు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద మహాకూటమి పోరాటం చేస్తే.. ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగిందన్నారు. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని మంత్రి అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
జూన్ 4వ తేదీ మిగిలే ఉంది:
13వ తేదీ అయిపోయిందని, జూన్ 4వ తేదీ మిగిలే ఉందని వైసీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ వేశారు. జూన్ 4వ తేదీన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడండన్నారు. ఏపీలో తాము అధికారంలోకి రాబోతున్నామని, కడపలో మెజార్టీ సీట్లు టీడీపీకి రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కంట్రోల్లో ఉండాలని, ఓ చెంప మీద కొడితే.. రెండో చెంప చూపడానికి తామేం గాంధీ మహాత్ములం కాదని సోమిరెడ్డి హెచ్చరించారు.
ఎస్పీకి ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదు:
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, జిల్లా ఎస్పీ, ఎన్నికల అధికారులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బు, మద్యంతో టీడీపీ ప్రలోభాలకు తెర లేపినా.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారంటూ మండిపడ్డారు. సుమారు 300 మంది బౌన్సర్లతో టీడీపీ అభ్యర్థి బూత్‌లలో హల్చల్ చేసినా, రౌడీయిజం చేసినా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమంగా తరలిస్తున్న 1600 తాబేళ్ల పట్టివేత:
ఏపీలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అల్లూరిజిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్‌పేట అటవీ చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1589 తాబేళ్లను కోనసీమ జిల్లా రామచంద్రపురం నుండి ఏజెన్సీ మీదుగా ఒడిశాకు అక్రమంగా మినీ వ్యాన్‌లో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సిరిసిల్లలో నకిలీ మందుల కలకలం:
సిరిసిల్లలో నకిలీ మందులు అమ్ముతున్న మెడికల్ షాపులో డ్రగ్ కంట్రోల్ సోదాలు నిర్వహించారు. కిడ్నీలో రాళ్ల బరువును తగ్గిస్తామంటూ మెడికల్ షాపులు మందులు విక్రయిస్తున్నారని పక్కా సమాచారంతో సోదాలు చేపట్టారు. తప్పుడు ప్రచారాలతో నకిలీ మందులు విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో కొరడా జులిపిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు, అధిక బరువుని తగ్గిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న సంస్థలపై పక్కా సమాచారంతో డ్రగ్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. పలువురిని అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి వెనుక ఇంకా ఎంత మంది వున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు.
తనిఖీల పేరుతో వేధింపులు:
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌సింగ్, సూపరింటెండెంట్ శ్రీనునాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పీహెచ్‌సీలకు చెందిన మరికొందరు మహిళా వైద్యాధికారులు కూడా లక్ష్మణ్‌సింగ్, శ్రీనునాయక్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికారులపై 354, 354డి, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల పేరుతో డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌సింగ్, సూపరింటెండెంట్ శ్రీనునాయక్ లైగింక వేధింపులకు పాల్పడుతున్నారని జిల్లాలోని వివిధ పీహెచ్‌సీలకు చెందిన 21 మంది మహిళా వైద్యాధికారులు 10 రోజుల్లోనే వైద్యారోగ్యశాఖకు ఫిర్యాదు చేశారు. పీహెచ్‌సీకి వస్తే డీఎంహెచ్‌ఓ పక్కనే కూర్చునేవారు. జీవితం ఎలా సాగిపోతుందో ఫోన్ చేసి అవమానకరంగా మాట్లాడేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పెంపుడు కుక్క విసిగిస్తోందని దంపతులపై దాడి:
పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదంతో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఓ కుటుంబానికి చెందిన వారు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. కుక్కకు కూడా బలంగా దెబ్బలు తగిలాయి. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్లో జరిగింది. రహ్మత్ నగర్ నివాసి మధు వ్యక్తి కుటుంబం హస్కీ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. ఈనెల 8న పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు మధు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయలుదేరారు. ఆ సమయంలో పెంపుడు కుక్క కూడా వీరితో పాటు బయటకు వచ్చి.. నిర్మాణంలో ఉన్న ఎదురింటి ధనుంజయ్ ఇంటి ఆవరణలోకి వెళ్లింది. కుక్కను తమపై ఉసిగొల్పారంటూ ధనుంజయ్ కుటుంబ సభ్యులుగొడవకు దిగారు. ఈ గొడవపై రెండు కుటుంబాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటనతో కోపం పెంచుకున్న ధనుంజయ్ ప్రతికారంతో రగిలిపోయాడు. మంగళవారం సాయంత్రం మధు సోదరుడైన శ్రీనాథ్ కుక్కను తీసుకుని వాకింగ్ కు బయలుదేరాడు. ఇది చూసిన ధనుంజయ్ మరో నలుగురితో కలిసి వచ్చి ఇంటి గేటు వద్ద ఉన్న కుక్కను ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ప్రాణంలా చూసుకునే కుక్కను ధనుంజయ్ కొడుతుంటే.. శ్రీనాథ్, అతడి కుటుంబ సభ్యులు కుక్కను కాపాడే ప్రయత్నంలో అడ్డుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన ధనుంజయ్ తో సహా ఐదుగురు వ్యక్తులు మూకుమ్మడిగా మధు కుటుంబీకులపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మధు సోదరుడు శ్రీనాథ్ తో పాటు అతడి తల్లి రాజేశ్వరి, అతడి మరదలు స్వప్నను కూడా ఇనుప రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చారు.
వ్యాయామం చేస్తూ 17ఏళ్ల బాలుడు మృతి:
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని భాన్‌పురిలోని స్పేస్ జిమ్‌లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ మరణించాడు. రోజు మాదిరిగానే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అనంతరం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
టెన్షన్ పెడుతున్న కోవిషీల్డ్, కోవాక్సిన్:
కరోనా వైరస్ వ్యాక్సిన్ యొక్క దుష్ప్రభావాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న వేళ.. ఇప్పుడు మరో కొత్త టెన్షన్ నెలకొంది. వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్పరిణామాలకు భయపడేలా చేసి అమాయకుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఎవరికీ ఆర్థిక నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
జబర్దస్త్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం:
బుల్లితెర నటుడు కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కార్తీక్ తల్లి మరణించారు. గత కొంత కాలంగా కార్తీక్ తల్లి క్యాన్సర్‌తో పొరాడుతున్నారు. బుధవారం రాత్రి ఆమె కన్నుమూశారు. ఈ సందర్భంగా కార్తీక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లిని గుర్తు చేసుకుంటూ.. ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
ఐశ్వర్యకు ఏమైంది.. ఆ కట్టు ఏంటి?:
కేన్స్ 2024 వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో అలరిస్తూ ఉంటుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రెడ్ కార్పెట్‌పై అలా నడుచుకూంటూ వెళ్తుంటే అందరి చూపు ఆమె మీదనే ఉంటుంది. అయితే ఈ సారి ఫ్రాన్స్‌లో జరగబోయే కేన్స్ ఫెస్టివెల్ వేడుకలో ఐశ్వర్య గాయంతో పాల్గొనబోతోంది. గాయం కారణంగా చేతికి కట్టుతోనే కుమార్తెతో కలిసి ఐశ్వర్య ఫ్రాన్స్‌కు బయలుదేరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.