రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే 2 నుంచి 9వ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మే 3న తెలుగు, మే 4న ఇంగ్లిష్ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఇక మే 5 నుంచి 9వ వరకు మెయిన్స్‌లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. మొత్తం 89 పోస్టులకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 4496 అభ్యర్ధులు పరీక్షలు రాయనున్నారు.
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం:
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం ఎస్ఎన్ తండా వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో 16 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి.. బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
ఏపీకి మళ్లీ వస్తాను:
విశాఖలో జూన్ 21న జరగనున్న యోగా డేలో తాను పాల్గొంటానని, తనను ఆహ్వానించినందుకు సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే 50 రోజులు ఏపీలో యోగాకు సంబంధించిన విస్తృత కార్యక్రమాలు జరగాలన్నారు. ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేం కాదని, ఆ కలల్ని నిజం చేసే వారి సంఖ్యా తక్కువ కాదన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారని, ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో తాను ఊహించగలను అని ప్రధాని పేర్కొన్నారు. అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టి తెలుగు ప్రజలను ఆశ్చర్యపరిచారు.
చంద్రబాబును చూసి నేర్చుకొన్నా:
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అమరావతి ఒక నగరం కాదని, ఒక శక్తి అని పేర్కొన్నారు. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని, ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించానని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టారు. మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు.
హైదారాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ భద్రత ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీప మాట్లాడుతూ…. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత చేపట్టాలని తెలిపారన్నారు. దాదాపు 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు రానున్నారని ఇప్పటివరకు 116 దేశాల కంటెస్టెంట్లు సమాచారం వచ్చిందన్నారు. దాదాపు నెలరోజుల పాటు వారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూపుల వారీగా పర్యటిస్తారని డీజీపీ అన్నారు. అతిథులు రాక శుక్రవారం నుంచి మొదలైందని మిస్ వరల్డ్ ప్రారంభ కార్యక్రమం ఈనెల 10వ తేదీన జరగనుందని తెలిపారు.
అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీరియస్:
ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రాధాన్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూమి సేకరణలో ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లక్షలాది ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడే ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ కోసం భూమి సేకరణ ప్రక్రియలో జాప్యం అవుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయ్యేలా వెంటనే భూమి సేకరణ పూర్తిచేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమారు రూ. 400 కోట్ల వ్యయంతో నిర్మితమైన అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను మే 5న కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ కింద రోడ్డుపై ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదు:
కుల గణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్ రెడ్డికి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటి ఇంటికి అధికారులు వెళ్లి సర్వే చేశారన్నారు. కుల గణనపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రేవంత్ సక్సెస్ అయ్యాడు కాబట్టి డైవర్ట్ చేసి బురద జల్లే ప్రయత్నం చేయకండన్నారు. 100 శాతం సర్వే సక్సెస్ ఫుల్ గా జరిగిందని.. గవర్నర్ కూడా ఆమోదముద్ర వేశారన్నారు. అంటే సర్వే సరిగా జరిగింది అనే కదా..? అని అడిగారు. సర్వే జరిగిన నెల రోజుకు కిషన్ రెడ్డి తెలంగాణలో లేర అనుకుంటా అన్నారు.
ఉద్రిక్తతల మధ్య ప్రజలకు పీఓకే ప్రధాని పిలుపు:
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పరిస్థితి తీవ్రతను మరింత పెంచారు. భారత్ తమపై దాడికి సిద్ధమవుతుందని సాక్ష్యాత్తు ఆ దేశ మంత్రులే వ్యాఖ్యానించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యం భారత సరిహద్దుల్లో మోహరించింది. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పై భారత్ దాడి చేస్తుందేమో అని పాక్ తెగ భయపడుతోంది. ఈ మేరకు ఇప్పటికే పీఓకేలోని మదర్సాలను, మతపరమైన కార్యకలాపాలను ఖాళీ చేయించింది. ఇదిలా ఉంటే, తాజాగా జమ్మూ కాశ్మీర్ ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. అఖిలపక్ష సమావేశం తర్వాత నియంత్రణ రేఖ (LOC) సమీపంలో నివసిస్తున్న నివాసితులు ఆహారం, అవసరమైన వస్తువులను నిల్వ చేసుకోవాలని కోరారు. నీలం లోయ, ఎల్ఓసీ పక్కనే ఉన్న ప్రాంతాల్లోకి పర్యాటకులను నిలిపేశారు.
అమిత్ షాకు టీఎంసీ ఎంపీ లేఖ:
ఒడిశా రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ కి చెందిన వలస కార్మికులపై జరిగిన దాడిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బెర్హంపూర్ ఎంపీ, భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా బీజేపీ పాలిన రాష్ట్రం ఒడిశాలో భయంకరమైన పరిస్థితులతో బెంగాల్ రాష్ట్రంలోని తన నియోజకవర్గమైన బెర్హంపూర్, ముర్షిదాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా కార్మికులు పారిపోయి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇక, వలసదారులపై జరిగిన హింసపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ డిమాండ్ చేశారు.
అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం:
దక్షిణ అమెరికా దేశం అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. చిలీ, అర్జెంటీనా దక్షిన తీరాలను బలమైన భూకంపం శుక్రవారం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భూకంపం నమోదైట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మరో రెండు భూ ప్రకంపనలు రికార్డ్ అయినట్లు తెలిపింది.
హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ బిగ్ షాక్:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసిద్ధ ‘‘హార్వర్డ్ యూనివర్సిటీ’’కి బిగ్ షాక్ ఇచ్చాడు. హార్వర్డ్‌కి ‘‘పన్ను మినహాయింపు’’ హోదాని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ‘‘క్యాంపస్ యాక్టివిజం’’పై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఆగ్రహంతో ఉంది. గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా ఈ క్యాంపస్ యాక్టవిజం, లెఫ్టిస్ట్ భావజాలంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో హమాస్‌కి మద్దతుగా, ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఉత్తమ కథా చిత్రంగా వరలక్ష్మి ‘శబరి’:
తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి ప్రయోగాత్మక చిత్రానికి గౌరవం దక్కింది. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి చిత్రం, దాసరి ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఉత్తమ కథా చిత్రంగా పురస్కారాన్ని సాధించి, కథాబలం ఉన్న సినిమాలకు మరోసారి ప్రతిష్టను తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని ఎన్‌ఆర్‌ఐ మహేంద్ర నాథ్ కూండ్ల తన తొలి నిర్మాణంగా రూపొందించడం విశేషం. తొలి చిత్రంతోనే బలమైన కథను ఎంచుకొని, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో కూడిన కథనాన్ని అత్యుత్తమ నిర్మాణ విలువలతో తెరపైకి తీసుకురావడం ద్వారా, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్పష్టంగా చాటారు. ఈ చిత్రానికి అనిల్ క్యాట్జ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు.
ఆహా’లో దూసుకుపోతున్న గరుడ 2.౦:
హనుమాన్ మీడియా బ్యానర్‌పై గతంలో సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజర్స్, కథ కంచికి మనం ఇంటికి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన విజయవంతమైన నిర్మాత బాలు చరణ్, ఇటీవల తమిళ నటుడు అరుళ్‌నీతి తమిళరాజు మరియు సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన గరుడ 2.0 చిత్రాన్ని ఆహా ఓటీటీలో విడుదల చేశారు. ఈ సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గరుడ 2.0, ఆహా ఓటీటీలో టాప్-1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉందని నిర్మాత వెల్లడించారు. ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటన అద్భుతం అని, ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. తమిళంలో ఆరత్తు సీనం (Aarathu Sinam) పేరుతో విడుదలై, అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్‌గా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఈ చిత్రం, తెలుగులో గరుడ 2.0గా ప్రేక్షకులను అలరిస్తోంది.
ముంబై ఇండియన్స్ కి నేనున్నాను:
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ రాజస్థాన్ రాయల్స్ పై 25 పరుగులు చేసి అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో వరుసగా 25 కంటే ఎక్కువ పరుగులు చేసి రాబిన్ ఉతప్ప రికార్డును బద్దలు కొట్టాడు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రాబిన్ ఉతప్ప 10 ఇన్నింగ్స్‌లలో 25 కంటే ఎక్కువ పరుగులు చేసి ఈ ఘనత సాదించాడు. తాజాగా సూర్య ఆ రికార్డును అధిగమించాడు. ఈ ఐపీఎల్ లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లలో 29, 48, 27, 67, 28, 40, 26, 68, 40, 54, 48 పరుగులు చేశాడు. సూర్య ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ల కారణంగానే ముంబై ఈ రోజు టేబుల్ టాప్ లో కొనసాగుతుంది.