తాడిపత్రిలో పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపుపై వివాదం:
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపు వివాదం చెలరేగుతుంది. పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చు పెద్దారెడ్డి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని తాడిపత్రి పట్టణ పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి చలనా రూపంలో ఎటువంటి డబ్బులు కట్టించుకోలేదన్నారు. ఇంకా, పోలీసులు మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో బందోబస్తును కేతిరెడ్డికి కల్పిస్తూ.. అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని జేసీ ఆరోపించారు. కాగా, పెద్దారెడ్డికి బందోబస్తు కావాలని కోరుకుంటే ఆయనకి బందోబస్తుకు తగిన నగదు కట్టించుకొని బందోబస్తు ఇవ్వండి లేకుంటే బందోబస్తు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ లేఖలో రాసుకొచ్చారు.
విజయవాడలో రోజు రోజుకు పెరుగుతున్న డయేరియా కేసులు:
విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గత కొన్ని రోజులు నుంచి ఈ వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతునే ఉన్నాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 350 దాటింది. అయితే, గత రాత్రి మరో 15 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో డయేరియాతో బాధపడుతున్న రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. న్యూరాజారాజేశ్వరిపేటలో కొత్తగా డయేరియా కేసులు నమోదు అయ్యాయి. డయేరియా బాధితులు నివాసం ఉండే ప్రాంతంలో తీసుకున్న నీటి శాంపిల్స్ కు సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రాలేదు. దీంతో న్యూ రాజరాజేశ్వరి పేట నివాసులు ఆందోళనలో భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే రెండు కిలోమీటర్ల పరిధిలో షాపులను ఫుడ్ కంట్రోల్ అధికారులు మూయించారు. ఇంటింటికి మంచి నీటి క్యాన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటికి శానిటైజేషన్ కిట్లను అధికారులు అందజేస్తున్నారు.
గుండ్ల పోచంపల్లిలో విషాదం:
గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని వీ కన్వెన్షన్ హాల్ పహారి గోడ సోమవారం ఉదయం తెల్లవారుజామున కూలింది. దీంతో గోడకు అనుకొని అపర్ణ ఆర్ఎంసి కంపెనీ లో పనిచేస్తున్న కార్మికులు షెడ్ల వేసుకొని నివాసం ఉంటున్నారు. ఒక్కసారి గా షెడ్లపై గోడ కూలడంతో అందులో నిద్రిస్తున్న కార్మికులపై పడడంతో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుడు ఒరిస్సాకు చెందిన గగన్ (50) గా పేట్ బషీరాబాద్ పోలీసులు గుర్తించారు. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ ను వణికించిన వాన:
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షం నగర వాసులను వణికించింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కుండపోత వర్షం పడింది. భారీగా కురిసిన వానతో రోడ్లు కాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపించాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని నాలాలు పొంగిపొర్లాయి. నాలాల్లో పడి పలువురు కొట్టుకుపోయారు. ఆసిఫ్ నగర్ అఫ్జల్ సాగర్ మంగారు బస్తిలో విషాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇద్దరు గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ నాలాను దాటే సమయంలో అదుపుతప్పి అందులో పడిపోయి మామ అల్లుడు కొట్టుకుపోయారు.
కొత్త చిక్కుల్లో మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్:
పూజా ఖేద్కర్.. భారతీయులకు సుపరిచితమైన పేరు. పూణె మాజీ ఐఏఎస్ అధికారిణి. ట్రైనింగ్ సమయంలో లేనిపోని గొంతెమ్మ కోర్కెలు కోరి.. సిబ్బందిపై ఇష్టానురీతిగా ప్రవర్తించడంతో వార్తల్లోకి ఎక్కింది. ఆమె తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి, యూపీఎస్సీకి ఫిర్యాదులు వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. దీంతో ఆమె బండారం బయటపడింది. నకిలీ దివ్యాంగ సర్టిఫికెట్‌తో పాటు విద్యకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు కూడా నకిలీవిగా తేలడంతో ఐఏఎస్ సర్వీస్ నుంచి యూపీఎస్సీ తొలగించింది. జీవితంలో ఎప్పుడూ యూపీఎస్సీ పరీక్షలు రాకుండా నిషేధం విధించింది. ఇక అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు కూడా బుక్ చేశారు. ఆమెపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ కూడా జారీ అయింది. అయితే అప్పటి నుంచి ఆమె అడ్రస్ లేదు. దుబాయ్‌కు పారిపోయినట్లు వార్తలు వినిపించాయి.
15 రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టారు:
మానవత్వం మచ్చుకు కూడా లేనట్లు ప్రవర్తించిన సంఘటన ఇది.. నిజంగా ఇది దారుణంగా ఉంటారా మనుషులు అనిపించేలా చేశారు. 15 రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టిన సంచలన ఘటన యూపీలో వెలుగుచూసింది. నవమాసాలు మోసి, కన్న ఆ కన్నతల్లి మనసు ఎలా అంగీకరించిది దీనికి.. సొంత బిడ్డను బతికి ఉండగానే పాతి పెట్టడానికి ఆ తండ్రి ఎలా ఒప్పుకున్నాడు. షాజహాన్‌పూర్ పరిధిలోని గోడాపూర్ గ్రామంలో ఆదివారం 15 రోజుల ఆడ శిశువును సజీవంగా పాతిపెట్టగా పోలీసులు సకాలంలో శిశివును రక్షించారు. ఈసందర్భంగా ఎస్పీ రాజేష్ ద్వివేది మాట్లాడుతూ.. గ్రామంలోని కొన్ని చిన్న చెట్ల మధ్యలో సజీవంగా శిశువును పాటిపెట్టగా చిన్నారి చేయ్యి భూమి నుంచి పొడుచుకు రావడాన్ని ఒక గ్రామస్థుడు గమనించాడు. వెంటనే ఆయన అక్కడికి వెళ్లగా.. ఆ స్థలంలో శిశివు ఏడుపులు వినిపించాయని, తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసు బృందం సకాలంలో చేరుకుని శిశువును రక్షించారని చెప్పారు. వాళ్లు అక్కడి వెళ్లి చిన్నారిని చూడగా ఊపిరి పీల్చుకుంటుండటంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం వైద్య కళాశాలకు పంపించారని పేర్కొన్నారు.
న్యూయార్క్ గవర్నర్ సంచలన ప్రకటన:
న్యూయార్క్ డెమొక్రాటిక్ మేయర్ అభ్యర్థిగా జోహ్రాన్ మమ్దానీని ఎన్నికయ్యారు. ఈ నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లిం వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా ఎలా ఎంపిక చేస్తారంటూ డెమొక్రాటిక్ పార్టీపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా డెమొక్రాటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీకి న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ మద్దతు తెలిపారు. ఆర్థిక విధానంలో మమ్దానీ తీరును ప్రసంశించారు. మమ్దానీ(33) ఉగాండాలో జన్మించారు. మాన్‌హట్టన్‌లో పెరిగారు. జూన్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా మమ్దానీ గెలిచి అందరినీ ఆశ్చర్య పరిచారు. అయితే తొలిసారి ఒక ముస్లిం వ్యక్తి మేయర్ అభ్యర్థిగా ఎన్నిక కావడం ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఎంపికను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. డెమోక్రటిక్ పార్టీపై మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో మమ్దానీని గెలవనివ్వం అన్నారు. తాజాగా బఫెలోకు చెందిన 67 ఏళ్ల న్యూయార్క్ గవర్నర్ హోచుల్ కూడా మమ్దానీకి మద్దతుగా నిలిచారు.
మా దగ్గర ఒక్క మొక్కజొన్న బస్తా కూడా కొనదు:
భారత్ పై అమెరికా 50 శాతం భారీ సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు, భారతదేశ వాణిజ్య విధానాలను విమర్శిస్తూ, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్, న్యూఢిల్లీ ప్రపంచ వాణిజ్యాన్ని సద్వినియోగం చేసుకుంటోందని, మార్కెట్ ప్రాప్యతను పరిమితం చేస్తోందని ఆరోపించారు. ఆక్సియోస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, లుట్నిక్ మాట్లాడుతూ.. భారతదేశం తన జనాభా 1.4 బిలియన్లు అని గొప్పలు చెప్పుకుంటుందని, మరి మన నుండి ఒక బుషెల్ (25.40 కిలోలు) మొక్కజొన్నను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఈ క్షణం నా జీవితకాల జ్ఞాపకం – రాశీఖన్నా:
టాలీవుడ్‌లో సినిమా అప్‌డేట్‌లు సాధారణంగా దర్శకులు లేదా నిర్మాతల ద్వారా బయటకు వస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో హీరోయిన్లు మాత్రం సోషల్ మీడియాలో ముందుండి అప్డేట్స్ ఇచ్చేస్తూ అభిమానుల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా నటి రాశీఖన్నా కూడా అలాంటి అప్డేట్‌తో చర్చలోకి వచ్చారు. రాశీఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన తాజా ఫొటో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమె పవర్ స్టార్ పవన్ తో సెల్ఫి దిగి పెట్టింది. ఇది ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ లొకేషన్‌లో తీసిన సెల్ఫీ. రాశీఖన్నా ఆనందంగా నవ్వుతుండగా, పవన్ సాధారణంగా కనిపించగా, వెనుక చిత్రబృందం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోకు రాశీఖన్నా జత చేసిన క్యాప్షన్ మాత్రం అభిమానుల హృదయాలను తాకింది –“ఈ క్షణాలను నా జీవితకాల జ్ఞాపకంగా గుర్తుంచుకుంటా” అని ఆమె రాసింది.
సూర్య-వెంకీ అట్లూరి సినిమాకు భారీ ఓటీటీ డీల్:
సూర్య తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్యూర్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గా వస్తున్న ఈ సినిమాకు ‘ విశ్వనాధం అండ్ సన్స్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ సినిమాకు ఓటీటీ నుండి జాక్ పాట్ తగిలింది. సూర్య గత సినిమా రెట్రో ప్లాప్ అయినా కూడా ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి గత సినిమాలు సార్, లక్కీ భాస్కర్ లు ఓటీటీలో సెన్సేషన్ చేసాయి. లక్కీ భాస్కర్ అయితే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయినపుడు వరల్డ్ వైడ్ గా నెల రోజుల పాటు టాప్ లో ట్రేండింగ్ లో నిలిచింది. దాంతో ఇప్పడు సూర్యతో చేస్తున్న ఈ సినిమాను రూ. 80 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. సూర్య సినిమాతో నిర్మాత నాగవంశీకి జాక్ పాట్ తగిలిందనే చెప్పాలి. మినిమం బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాగవంశీ ఓటీటీ రూపంలో భారీ లాభాలు చూసారని చెప్పొచ్చు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా G.V ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు పాక్ కెప్టెన్ డుమ్మా:
భారత్‌తో మ్యాచ్‌కు ముందు తాము ఎవరినైనా ఓడిస్తామని గొప్పలు చెప్పుకున్న సల్మాన్ అఘా.. ఓటమి తర్వాత కనీసం ప్రెజెంటేషన్‌లో మాట్లాడేందుకు కూడా రాలేదు. ఓటమి బాధలో ఉన్న అతడు నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్స్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పాల్గొనడం సంప్రదాయం. కానీ పాక్ కెప్టెన్ దారుణ ఓటమిని జీర్ణించుకోలేక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు డుమ్మా కొట్టాడు. ‘ప్రెజెంటేషన్‌కు డుమ్మా కొట్టి డ్రెస్సింగ్ రూమ్‌లో దాక్కొన్నాడు’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ కోచ్ మైక్ హెసెన్ స్పదించాడు. అనుకోకుండా అలా జరిగిపోయిందని కవర్ చేశాడు.
పాకిస్థాన్ మ్యాచ్‌లో ప్రత్యేకమైన నిరసన:
ఆసియా కప్ 2025 ఆరంభానికి ముందు ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ పీసీబీ ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీతో కరచాలనం చేశాడు. దాంతో సూర్యపై నెట్టింట ట్రోల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో టాస్ సమయంలో ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘాతో సూర్యకుమార్ కరచాలనం చేయలేదు. అలీ కూడా ఈ ఘటనను పట్టించుకోలేదు. మ్యాచ్ అనంతరం కూడా ఇద్దరు హ్యాండ్‌షేక్ ఇచ్చుకోలేదు. దాంతో సూర్యపై టీమిండియా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘శభాష్ సూర్యకుమార్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.