సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్ భేటీ.. ఏ నిర్ణయం తీసుకున్నారంటే..!
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శనివారం ఆమె… సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈడీ విచారణ, కేజ్రీవాల్ జైలు కెళ్లిన పరిణామాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవలే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కల్పనా సోరెన్-సునీతా కేజ్రీవాల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జరిగిస్తున్న తీరుపై కలిసి పోరాడాలని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కల్పనా సోరన్ మీడియాకు తెలియజేశారు. అలాగే సోనియాగాంధీని కూడా కలిసి జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్‌కు షాక్.. వారాహి సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో వారాహి వాహనానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పిఠాపురంలో పవన్ వారాహి సభకు పోలీసులు అనుమతి నిరాకరించగా.. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శక్తి పీఠంలో వారాహికి పూజ వాయిదా పడింది. తాత్కాలికంగా చేబ్రోలులో మొదటి రోజు పవన్ సభ జరిపేందుకు డీసీఎంపై నుంచి మాట్లాడనున్నట్లు తెలిసింది. నిర్ణీత సమయంలో వారాహికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోలేదని పోలీసులు చెప్తున్నారు. వారాహి వాహనంపై మాట్లాడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. చిన్నపాటి వాహనానికి అనుమతిచ్చారు. కాగా పోలీసుల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిద్ధాంతం, నైతిక విలువలు లేని పార్టీ టీడీపీ.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లా కందుకూరులో ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ2 అయితే చంద్రబాబు పలు కేసుల్లో ఏ1 అని..తాను 22 కేసుల్లో ఏ2 కావచ్చు.. కానీ ఎక్కడా కూడా ఆర్థిక నేరాలకు పాల్పడలేదన్నారు. ఆ సెక్షన్స్ కూడా తన మీద లేవన్నారు. చంద్రబాబు ఏ1గా మూడు, నాలుగు కేసులు నమోదయ్యాయని.. ఎన్నికల అనంతరం చంద్రబాబుపై మరో 10 కేసులు నమోదవుతాయన్నారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడి, ఆ డబ్బుతో విదేశాల్లో ఆస్తులు కొన్నారని విమర్శించారు. అవినీతి సొమ్ము అయినా ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏపీ అయినా బాగుపడేదన్నారు. ఏ1 గా ఉన్న వ్యక్తి ఏ2 మీద ఆరోపణలు చేయటం అసంబద్ధమని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
కరెంటు కోత ఉండొద్దు.. వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలి
రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. డిమాండ్ కు సరిపడేంత విద్యుత్తు అందుబాటులో ఉందని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. రోజురోజుకు ఎండలు మండుతుండటం విద్యుత్తు డిమాండ్ పెరుగుతుండటంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్తు లభ్యత, తక్షణ అవసరాలపై ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్తును సరఫరా చేయటం కొత్త రికార్డును నమోదు చేసిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోత లేకుండా విద్యుత్తును అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్కని అభినందించారు.
వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆంక్షలు విధించింది. పెన్షన్లు సహా లబ్దిదారులకు నగదు పంపిణీ వంటి కార్యక్రమాల అమలుకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని సీఈసీ సూచించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ట్యాబులు, ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. డీబీటీ స్కీంల అమల్లో వాలంటీర్లకు ప్రత్యామ్నాయాలు చూడాలని ఏపీ సీఈఓకు ఈసీ స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి ఏపీ సీఈఓ సూచించిన సంగతి తెలిసిందే.
వింజమూరు మండలంలో వైసీపీ ఖాళీ కాబోతోంది..
వింజమూరు మండల కేంద్రంలో శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగళం దద్దరిల్లింది. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో.. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుండి తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాగళం సభకు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలని జనం చంద్రబాబు ప్రసంగానికి జేజేలు పలికారు. చంద్రబాబు నాయుడు మాటలు ఆసక్తిగా విన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. పెద్ద ఎత్తున టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో వింజమూరు మండలానికి చెందిన ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన వారిలో సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, వనిపెంట హైమావతి, బసిరెడ్డి సుమలత, యాకసిరి భవాని, సాదం మౌనిక, కాటం ప్రసన్న, వింజమూరు మండలం ఎంపీపీ ఇనగనూరి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాదం మౌనిక జనసేన పార్టీ తరఫున గెలిచినప్పటికీ వైసీపీ అనుబంధంగా వ్యవహరిస్తుంది. ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంది.
ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీ వాయిదా.. సీఈసీ క్లారిటీ
ఏపీ డీఎస్సీ పరీక్షలు, టెట్ పరీక్ష ఫలితాలకు ఎన్నికలు అడ్డుపడ్డాయి. ఓ వైపు టెట్ పరీక్ష 2024 ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. మరో వైపు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ డీఎస్సీ 2024 పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. మార్చి 20 నుంచి పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్లు, 25 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ వాయిదా పడింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీని వాయిదా వేయాలని సీఈసీ అధికారికంగా స్పష్టం చేసేంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ పరీక్షా ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది.
7 కిలోమీటర్ల మేర సీఎంతో పాటు కదిలిన జనప్రభంజనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారిపొడవునా జై జగన్ నినాదాలతో యాత్ర మార్మోగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలోకి ఈ బస్సు యాత్ర ప్రవేశించగానే సీఎం జగన్‌కు జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉదయం పత్తికొండ నుంచి ప్రారంభమైన యాత్ర గుంతకల్లు నియోజకవర్గం బసినేపల్లి మీదుగా అనంతపురం జిల్లాలోకి ఎంటర్ అయింది. గుత్తిలో జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మార్గం మధ్యలో అక్కడక్కడా బస్సును నిలుపుతూ అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలతో ఆప్యాయంగా మాట్లాడుతూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. తమ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారు.
ఐటీ నోటీసులపై చిదంబరం కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు వస్తోన్న ఐటీ నోటీసులు దేశ వ్యాప్తంగా మిగిలిన రాజకీయ పార్టీలకు ఓ హెచ్చరిక అని స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్న వేళ ఐటీ శాఖ నోటీసుల పేరుతో కాంగ్రెస్‌కు నోటీసుల మీద నోటీసులు ఇస్తోంది. శుక్రవారం 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలు పేరిట రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ ఐటీ శాఖ డిమాండ్ నోటీసులు ఇచ్చింది. అనంతరం మరో రెండు నోటీసులు ఇచ్చినట్లు జైరాం రమేష్ తెలిపారు. ఈ నోటీసుల సందర్భంగా ఇతర రాజకీయ పార్టీలన్నింటినీ చిదంబరం హెచ్చరించారు.
దేశంలో ఇతరు పార్టీలను నిర్వీర్యం చేయడమే బీజేపీ లక్ష్యమని చిదంబరం ఆరోపించారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ కూడా ఇదే ఉద్దేశంలో భాగమని ఆయన చెప్పుకొచ్చారు. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇతరు పార్టీలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ..
తప్పు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడిని చిత్తూరు ఎమ్మెల్యేగా పెట్టారని.. రాష్ట్రాన్ని స్మగ్లింగ్‌కు అడ్డాగా మార్చారని విమర్శలు గుప్పించారు. మన బ్రాండ్ కియా, సెల్‌కాన్ కంపెనీలను తీసుకుని రావడం అయితే.. జగన్ భూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్ మద్యం బ్రాండ్‌లు తెచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ గోలీలు ఆడేటప్పుడే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానన్నారు. నాణ్యత లేని మద్యం అమ్మడం, కరెంటు చార్జీలు పెంచడం జగన్ మార్క్ పరిపాలనా అంటూ విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 8 డీఎస్సీలు పెట్టానని.. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ వేయలేని పాలన జగన్‌ది అంటూ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
సోనియాను కలిసిన కల్పనా సోరెన్.. తాజా పరిణామాలపై చర్చ
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కలిశారు. ఈ సందర్భంగా తన భర్త హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విధానాన్ని సోనియాకు వివరించారు. జనవరిలో మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు నెలల నుంచి హేమంత్ సోరెన్ జైల్లోనే ఉన్నారు.
కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆదివారం ఇండియా కూటమి ఢిల్లీలో తలపెట్టిన మహా ర్యాలీ కోసం కల్పనా సోరెన్ శనివారం దేశ రాజధానికి వచ్చారు. ఈ మధ్యాహ్నం సునీతా కేజ్రీవాల్‌ను ఆమె నివాసంలో కలుసుకుని సంఘీభావం తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్, హేమంత్ సోరెన్ అరెస్ట్ అంశాలపై ఇరువురు చర్చించారు. కలిసి పోరాటం చేయాలని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఇక శనివారం సాయంత్రం సోనియాను కలిసి తాజా పరిణామాలను కల్పనా సోరెన్ వివరించారు.
ముత్యంపేట చక్కర కర్మగారం మూసేసింది బీఆర్ఎస్, బీజేపీలే
జగిత్యాల జిల్లా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మెట్‌పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నిజామాబాద్ ఎంపీగా ఒకసారి కవితకు , ఒకసారి ధర్మపురి అరవింద్ కు అవకాశం కల్పిస్తే ముత్యపేట చక్కర కర్మగారాన్ని తెరిపించలేకపోయారన్నారు. ముత్యంపేట చక్కర కర్మగారం మూతపడటంలో బీఆర్ఎస్, బిజెపి రెండు పార్టీల పాత్ర ఉందన్నారు. 2014 – 18 మధ్యకాలంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది.కానీ చక్కెర కర్మాగారం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.