చెల్లిని “వాడుకుని”, అక్కతో సహజీవనం.. లైంగిక దోపిడి, రూ. 20 లక్షలు కాజేసిన వివాహితుడు..
లివ్-ఇన్ రిలేషన్లలో అమ్మాయిలు మోసపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా బెంగళూర్‌లో ఓ వ్యక్తి అక్కాచెల్లెళ్లను లైంగిక దోపిడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 29 ఏళ్ల శుభం శుక్లా అనే వ్యక్తి ఇద్దరు అక్కాచెల్లెళ్లను మోసం చేసిన కేసులో బెంగళూర్ బాగల్‌గుంటే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రేమ ముసుగులో ఒక మహిళ నుంచి దాదాపుగా రూ. 20 లక్షలు, 200 గ్రాముల బంగారాన్ని కాజేశాడు. అయితే, శుభం శుక్లాకు అప్పటికే పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టి ఈ తతంగం నడిపించాడు. ఇతడిపై లైంగిక దోపిడి, దొంగతనం ఆరోపణలు నమోదు చేశారు.
“అవును, నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి చేసింది”.. అంగీకరించిన పాకిస్తాన్..
‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ఏ విధంగా పాకిస్తాన్‌ను దెబ్బతీసిందనే వివరాలను ఇప్పుడిప్పుడే అక్కడి నేతలు ఒప్పుకుంటున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత దాడులు తమ నూర్ఖాన్ ఎయిర్ బేస్‌కు నష్టాన్ని కలిగించాయని ఒప్పుకున్నారు. దీంతో పాకిస్తాన్ తొలిసారిగా అధికారంగా అంగీకరించినట్లైంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పాక్ సైన్యం హెడ్‌క్వార్టర్స్ ఉండే రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌ను భారత్ క్షిపణులతో ధ్వంసం చేసింది. ఎయిర్‌బేస్‌ను భారత దాడులు తీవ్రంగా నష్టపరిచాయని, అక్కడ సిబ్బందిని గాయపరిచాయని ఆయన అంగీకరించాడు. భారత సైనిక చర్యల్ని ఇన్నాళ్లు తక్కువ చేసి మాట్లాడిన పాకిస్తాన్, ఇప్పుడు నిజాలను నెమ్మదిగా ఒప్పుకుంటోంది. అంతకుముందు, ఆపరేషన్ సిందూర్ దాడుల సమయంలో తనను బంకర్లోకి వెళ్లాలని అధికారులు సూచించారని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చెప్పిన వీడియో వైరల్‌గా మారింది.
ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు.. బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలి
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్లతో దర్శకుడు అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఈ సినిమా జనవరి 1న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘వేద’ తరువాత మళ్లీ ‘45’ మూవీ కోసం హైదరాబాద్‌కు వచ్చానని అన్నారు. తెలుగులో ఈ సినిమాను మైత్రి రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ మూవీని చూస్తే కచ్చితంగా ప్రతీ ఒక్క ప్రాణిని ప్రేమిస్తారని.. గౌరవిస్తారని అన్నారు. ఎన్ని రోజులు భూమ్మీద బతుకుతామో తెలీదు.. బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలని ఈ మూవీ చెబుతుందని అన్నారు.
ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, బంగ్లాదేశ్‌కు గుణపాఠం చెప్పాలి..
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల హత్యలు, దాడులపై పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, భారత్ కూడా బంగ్లాదేశ్‌కు గుణపాఠం నేర్పాలి’’ అని అన్నారు. శుక్రవారం రోజు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. మన 100 కోట్ల హిందువులు, హిందువుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పినట్లే, బంగ్లాదేశ్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు.
వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో భారీ బందోబస్తు..!
వైకుంఠ ఏకాదశి–ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి (30-12-2025), వైకుంఠ ద్వాదశి (08-01-2026) సందర్భంగా మొత్తం 10 రోజుల పాటు (డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు) వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనమని మరోమారు గుర్తు చేశారు. ఆన్లైన్ ద్వారా సుమారు 25 లక్షల మంది భక్తులు దరఖాస్తు చేయగా, ప్రతిరోజు 60,000 టోకెన్లు చొప్పున దర్శనాలు కేటాయింపు జరిగింది. భక్తుల రద్దీ నియంత్రణ కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్యూలైన్ నిర్వహణ, నిఘా చర్యలు ముందస్తుగా అమలు చేయనున్నారు.
రేపు అసెంబ్లీకి కేసీఆర్.. హరీష్ రావు క్లారిటీ..!
రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్‌కు మాజీ మంత్రి హరీష్ రావు తెరదించారు. ఆదివారం జరిగిన ఒక చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని అధికారికంగా స్పష్టం చేశారు. కేసీఆర్ రాకతో సభలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌కు అసెంబ్లీ అంటే వణుకు: అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీని నిర్వహించాలంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో సగటున ఏడాదికి 32 రోజుల పాటు సభను నడిపేవారమని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సగటును 20 రోజులకు తగ్గించిందని విమర్శించారు. ప్రజా సమస్యలు చర్చకు వస్తాయనే భయంతోనే సమావేశాల కాలాన్ని ప్రభుత్వం కుదిస్తోందని ఆయన ఆరోపించారు.
ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు..
తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (TFCC) ఎన్నికల పర్వం ముగిసింది. హోరాహోరీగా సాగుతాయని భావించిన ఈ ఎన్నికల్లో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. మొత్తం 44 కార్యవర్గ (EC) సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 స్థానాలను కైవసం చేసుకోగా, మన ప్యానెల్ 15 స్థానాలకు పరిమితమైంది. TFCC నూతన అధ్యక్షుడిగా అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఛాంబర్ పగ్గాలను సమర్థంగా నిర్వహించగల అనుభవం, పరిశ్రమ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సురేష్ బాబు అధ్యక్షుడిగా రావడంతో టాలీవుడ్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది.
హైదరాబాద్ సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం
నగరంలోని అత్యంత రద్దీగా ఉండే సోమాజిగూడ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఆల్ పైన్ హైట్స్ (Alpine Heights) అపార్ట్మెంట్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఆదివారం కావడంతో అపార్ట్మెంట్లోని నివాసితులంతా ఇళ్లలోనే ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో ఐదో అంతస్తులో ఉన్న వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. పొగ దట్టంగా వ్యాపించడంతో అపార్ట్మెంట్లోని ఇతర అంతస్తుల నివాసితులు కూడా వెంటనే భవనం వెలుపలికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. అదృష్టవశాత్తూ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో అవి ఇతర ఇళ్లకు వ్యాపించకుండా ఆగిపోయాయి.
బంగ్లాదేశ్ అబద్ధాలు చెబుతోంది.. హాది హంతకులపై భారత్..
రాడికల్ విద్యార్థి నేత, ఇంక్విలాబ్ మోంచో నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హంతకులు మేఘాలయ సరిహద్దు గుండా భారతదేశానికి పారిపోయారని బంగ్లాదేశ్ పోలీసులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ వాదనల్ని భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఆదివారం తోసిపుచ్చింది. బంగ్లా చెబుతున్నదాని ప్రకారం, సరిహద్దుల్లో ఎలాంటి కదలికలు లేవని అదికారులు చెప్పారు. బంగ్లా పోలీసులు చేసిన ఆరోపణల్ని నిరాధారమైనవని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. “ఈ వాదనలు నిరాధారమైనవి మరియు తప్పుదారి పట్టించేవి” అని మేఘాలయలోని BSF ఇన్స్పెక్టర్ జనరల్ ఓపీ ఓపాధ్యాయ్ అన్నారు.