Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

కాకాణిని పట్టిస్తే బహుమతి..! సోమిరెడ్డి ఆఫర్‌..

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. గత నెలరోజులుగా పరారీలో ఉన్నారు. ఆయన కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఏపీ ఇలా తదితర ప్రాంతాల్లో పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. బంధువులు, స్నేహితుల నివాసాలపై కూడా నిఘా పెట్టారు పోలీసులు.. అయితే, కాకాణి ఆచూకీ చెబితే బహుమతి ఇస్తాను అంటూ బంపరాఫర్‌ ఇచ్చారు మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియడం లేదు.. నేను ఆఫర్ ఇస్తున్నాను.. వైసీపీ వాళ్లు కానీ ఎవరైనా కావచ్చు ఆయన ఆచూకీ తెలిపితే కాకాణి ఇంటి పక్కన ఉన్న కరోనా హౌస్ ను బహుమతిగా ఇద్దామని ఆలోచిస్తున్నా అని ప్రకటించారు.. అందరూ ముందుకు రండి.. కాకాణి ఆచూకీ తెలపాలని కోరారు..

దళితుల విద్యార్థుల కోసం “రోహిత్ వేముల” చట్టం తీసుకురావాలి..

రోహిత్ వేముల పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో పలు కారణాలతో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్ వేముల. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ పేరును ప్రస్తావించారు. విద్యావ్యవస్థలో నేటికి బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కొంటున్నాయని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే ‘రోహిత్ వేముల’ చట్టాన్ని రూపొందించాలని.. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సూచించారు. ఈ రోజు కర్ణాటక సీఎంకు రాహుల్ గాంధీ లేఖ రాశారు.

ముగిసిన సాయిరెడ్డి సిట్‌ విచారణ.. కీలక విషయాలు వెల్లడి..

ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు సిట్‌ అధికారులు.. దాదాపు 3 గంటల పాటు విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించింది సిట్‌.. లిక్కర్‌ స్కాంలో సాక్షిగా హాజరుకావాలని విజయసాయిరెడ్డి గతంలో నోటీసులు జారీ చేసింది సిట్‌.. దీంతో, విజయవాడ సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.. అయితే, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజ్‌ కసిరెడ్డి.. ఈ స్కామ్‌లో కీలక సూత్రధారి అని విజయసాయిరెడ్డి సిట్‌ బృందానికి తెలిపారట.. మొత్తం ఆరుగురు సభ్యుల బృందం విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది.. రూ.40 కోట్లు గానీ, 60 కోట్ల రూపాయాలు గానీ.. ఎలా వాడుకున్నారు..? అని ప్రశ్నించగా.. నేను లోన్‌ మాత్రం ఇప్పించాను.. కానీ, ఆ ఫండ్స్‌ ఎలా వాడుకున్నారు.. ఎలా రీఫండ్‌ చేశారు అనేది మాత్రం రాజ్‌ కసిరెడ్డి మాత్రమే చెప్పగలరని చెప్పారు సాయిరెడ్డి..

నేను చెప్పింది నిజమే.. అత్యాచారయత్నం కేసులో మరో ట్విస్ట్‌..

ఎంఎంటీఎస్ ట్రైన్‌లో జరిగిన అత్యాచారయత్న ఘటనలో మరో కీలక ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు అందించిన వాదనలను బాధిత యువతి ఖండించింది. తాను పోలీసులను ఎటువంటి తప్పుదారి పట్టించలేదని స్పష్టం చేస్తూ, కేసును పునఃసమీక్షించాలని ఆమె కోరింది. సికింద్రాబాద్ నుండి మేడ్చల్‌కు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని బాధితురాలు తెలిపింది. ట్రైన్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆమె వెల్లడించింది. అంతేకాకుండా, ఆ దుండగుడి నుండి తప్పించుకోవడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాల్సి వచ్చిందని మరోసారి ఆమె వివరించింది.

నంబర్‌ 2 అనేది మిథ్య.. 6 నెలల్లో 2 నుంచి 2 వేలకు పడిపోయా..! సాయిరెడ్డి సంచలనం..

వైసీపీలో నేను నంబర్‌ 2 అనేది మిథ్య.. దయచేసి పార్టీలో నంబర్‌ 2గా ఉన్న వ్యక్తి వైఎస్‌ జగన్‌ను మోసం చేసి వెళ్లిపోయారని రాయకండి అని విజ్ఞప్తి చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. లిక్కర్‌ స్కాం కేసులో సిట్‌ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. సిట్‌ అడిగిన ప్రశ్నలు.. తాను చెప్పిన సమాధానాలు వెల్లడించారు.. ఇక, ప్రాంతీయ పార్టీలో ఎవ్వరూ నంబర్‌ 2 వుండరు.. ఒక్కటి నుండి 100 తరువాత మాత్రమే 101 వుంటుంది అని వ్యాఖ్యానించారు.. పార్టీ కోసం ఏం చేసినా.. జగన్‌, నేను, ప్రశాంత్‌ కిషోర్‌ కలిసి చేశాం.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే నంబర్‌ 2 అనేది మిథ్య అని గమనించాను.. ఆ ఆరు నెలల్లోనే నా స్థానం నంబర్‌ 2 నుంచి 2 వేలకు పడిపోయిందన్నారు..

రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ.. రూ.562 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం

తోషిబా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కు రూ. 562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.

బిగ్‌ అలర్ట్‌.. వచ్చే 3 గంటల్లో హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

హైదరాబాద్ నగర వాసులకు వాతావరణ శాఖ ఆందోళనకరమైన హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే కుండపోత వానలు మొదలయ్యాయి. పశ్చిమ, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఈ వర్షం కుంభవృష్టిలా కనిపిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, మరో 3 గంటల పాటు ఈ కుండపోత వర్షం కొనసాగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు లేకుంటే ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, ముఖ్యంగా మ్యాన్‌హోల్స్ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

తణుకులో టీడీపీ వర్సెస్‌ వైసీపీ..

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ – వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జరిగిన తణుకు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై తణుకు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఘాటుగా స్పందించారు. తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యవహారాలు చేసిన కారుమూరి నాగేశ్వరరావును నియోజకవర్గంలో ఇకపై తిరగనివ్వమంటూ ఎమ్మెల్యే అరమిల్లి వార్నింగ్‌ ఇచ్చారు.. నోటి దురద కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడుతున్నారని.. అన్ని రకాల రాజకీయాలు చేస్తూ కారుమురికి నూకలు లేకుండా చేస్తామన్నారు. అయితే, ఎమ్మెల్యే రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కారుమూరి కౌంటర్ ఇచ్చారు. నాకు నూకలు చెల్లుతాయని ఎమ్మెల్యే అరిమిల్లి చెప్పడం చూస్తుంటే.. తనని హత్య చేయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. ఎంపీటీసీ ఎన్నికల్లో తన ఇంటిని ముట్టడి చేయడం అందులో భాగమన్నారు. రోజుకి నాలుగు గంటలు తన గురించే ఆలోచిస్తూ ఎమ్మెల్యే అరమిల్లి బీపీ పెంచుకుంటున్నారు.. బీపీ పెరిగే చదువుకున్న అజ్ఞానిలా బూతులు తిడుతుంటే.. సంస్కారం అడ్డు వచ్చి ఎమ్మెల్యేని తిట్టలేకపోతున్నాను అన్నారు మాజీమంత్రి కారుమూరు నాగేశ్వరరావు.

లిక్కర్‌ స్కాంపై సిట్‌ ఫోకస్‌.. మరికొన్ని పేర్లు బయటపెట్టిన సాయిరెడ్డి..!

ఏపీలో లిక్కర్ స్కాంపై సిట్ లోతైన విచారణ చేపడుతోంది. ప్రధానంగా లిక్కర్ స్కాం వెనుక ఎవరెవరు ఉన్నారు, లిక్కర్ డిస్టలరీస్ దగ్గర ముడుపులు ఎవరి నుంచి ఎవరికి చేరాయి, లిక్కర్ సేల్స్ లో ఎలా స్కామ్‌కు పాల్పడ్డారనే అనే అంశాలపై ప్రధానంగా సిట్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే సిట్ కీలక విషయాలను సేకరించింది. ఆ తర్వాతే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టింది.. లిక్కర్ స్కాం విచారణలో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన సిట్.. ప్రధానంగా స్కాం వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు విచారణ జరిపినట్టు తెలుస్తోంది. ఇంత పెద్ద స్కాంకు సంబంధించి ఎవరు ఉన్నారనే విషయాన్ని స్టేట్‌మెంట్ రూపంలో తీసుకునేందుకు సిట్ లోతైన విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. స్కాంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి వెనుక ఎవరున్నారు, ఎవరు అండతో రాజ్ కసిరెడ్డి ఈ వ్యవహారాలు నడిపారనే విషయాలను తెలుసుకోవటంపై సిట్ ఫోకస్ పెట్టింది. లిక్కర్ స్కాంలో ముడుపులు ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయనే విషయాలను కూడా తెలుసుకోవటంపై ప్రధానంగా సిట్ విచారణ జరుగుతోంది. లిక్కర్ మీటింగ్ లో ఏ విషయాలు చర్చించారనేది తెలుసుకోవటం ద్వారా ఇంకా ఎవరెవరి పాత్ర అందులో ఉన్నారనే విషయాలను తెలుసుకోవటంపై సిట్ విచారణ జరుపుతోంది.

గ్రేటర్‌ విశాఖ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ.. ఆ ఒక్కదానిపైనే వైసీపీ ఆశలు..!

కొద్దిగంటలు మాత్రమే సమయం…! నెలరోజుల ఉత్కంఠకు తెరపడుతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపై అధిపత్యం ఎవరిదో తేలిపోతుంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి. శిబిరాల్లో ఉన్న వాళ్ళను కట్టడి చేసేందుకు సీనియర్లను కాపాలాపెట్టిన పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ 74దాటేశామని కూటమి ప్రకటించుకుంటోంది. ఇటీవల నలుగురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేయగా ముగ్గురు జనసేనాలో చేరిపోయారు. మాజీమంత్రి అవంతి కుమార్తె ప్రియాంక సైతం కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ చేరికలు అన్నీ తమకు ప్లస్ అనుభవిస్తున్న టీడీపీ.. ఆఖరి నిముషంలో ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే అవిశ్వాసం నెగ్గడం ఎలా…? అనే తర్జనభర్జనల్లో వుంది.

 

Exit mobile version