భారతదేశ విభజనపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..
స్వాతంత్య్రానికి ముందు దేశ విభజన గురించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన జరగాల్సింది కాదని, చారిత్రక తప్పిదమని సోమవారం అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. చారిత్రత్మకంగా ఇది ఒకే దేశమని, దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చిందని అన్నారు. కావాలంటే చర్చ ఏర్పాటు చేయాలని, దేశ విభజనకు కారకులెవరో నేను మీకు చెబుతాను, ఈ సమయంలో జరిగిన విభజనను ఒక్క లైన్ లో చెప్పలేనని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’ పుస్తకాన్ని చదవాలని, విభజన ప్రతిపాదనను అంగీకరించవద్దని ఆయన కాంగ్రెస్ నేతల వద్దకు వెళ్లి వేడుకున్నారని ఆయన తెలిపారు. ఆ సమయంలో విభజనకు అక్కడ ఉన్న అందరు నాయకులు బాధ్యులే అని చెప్పారు. అప్పటి ఇస్లామిక్ పండితులు కూడా రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించారని ఓవైసీ పేర్కొన్నారు.
మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేయడంపై వివాదం.. ఐసీసీలో ఫిర్యాదు
పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ వివాదంలో చిక్కుకున్నారు. వాస్తవానికి పాకిస్థాన్-నెదర్లాండ్స్ మ్యాచ్ సందర్భంగా మహ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేసాడు. ఇప్పుడు ఈ అంశంపై ఐసీసీలో ఫిర్యాదు దాఖలైంది. మహ్మద్ రిజ్వాన్‌పై సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. మహ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేయడం ఆట స్ఫూర్తికి విరుద్ధమని వినీత్ జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజానికి సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఇటీవల కూడా వార్తల్లోకెక్కారు. పాకిస్థాన్ యాంకర్ జైన్ అబ్బాస్‌పై వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. జైన్ అబ్బాస్ తన ట్వీట్‌తో భారతీయులను, హిందూ మతాన్ని గాయపరిచారని వినీత్ జిందాల్ ఆ సమయంలో అన్నారు. దాంతో జైన్ అబ్బాస్ ఇండియా విడిచి వెళ్ళాడు. ఇదిలా ఉంటే.. మహ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకుముందు.. టీ20 ప్రపంచకప్ 2021లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డ సమయంలో కూడా మహమ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేశాడు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలి..
బీజేపీకి తెలంగాణ అండగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు కేసీఆర్ వారికి క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కారు బేకారు అయిపోయిందని.. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. “బీజేపీ ఏర్పడిన తొలినాళ్లలో 2 ఎంపీ సీట్లు గెలిస్తే అందులో ఒకటి హన్మకొండ. బీజేపీ అధికారంలోకి వచ్చాక గుజరాత్‌లో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. తెలంగాణలో ఎందుకు జరగడం లేదు. హైదరాబాద్ మినహా తెలంగాణలో అభివృద్ధి లేదు. రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఏపీ, తెలంగాణ సమస్యలను.పరిష్కరించడంలో వైఫల్యం చెందింది. పదేళ్ళలో అభివృద్ధి కొందరికే పరిమితం అయింది. ఒక ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు, బీజేపీ అంగీకరించదు. హుజూరాబాద్ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేసినా ఈటెల గెలిచారు. కేసీఆర్ రంగంలోకి దిగినా ఈటెల గెలుపును అడ్డుకోలేక పోయారు. కేసీఆర్ మీరిచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి. ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేని స్థితి కేసీఆర్‌ది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు ఏమైంది.. దళిత బంధు అన్నారు ఎంతమందికి ఇచ్చారు.” అంటూ ప్రశ్నించారు.
అంతా దొంగ ఏడుపే.. కన్నీళ్లు కూడా రావట్లే..
చంద్రబాబు ఆరోగ్యంపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 25 సంవత్సరాల నుంచి చంద్రబాబుకి చర్మ వ్యాధులు ఉన్నాయని.. ఇది అందరికీ తెలుసన్నారు. రోజుకి 7 షర్ట్స్, 7 ప్యాంట్స్ మారుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. జైల్లో చాలా బాగా ఉన్నాడని, అత్తగారింట్లో అల్లుడ్ని ఎలా చూసుకుంటారో అలా రాజమండ్రి జైల్లో చాలా బాగా చూసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. భువనేశ్వరమ్మ.. మీ తండ్రి పైన చెప్పులు వేయిస్తే రాని కన్నీళ్లు చంద్రబాబు జైలుకు వెళితే వస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. అంతా దొంగ ఏడుపు ఏడుస్తున్నారు చంద్రబాబు కోసం అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కన్నీళ్లు కూడా రావటం లేదన్నారు. ప్రజలు చూడాలని, మీడియా ముందు ఏదో ఏడవాలని ఏడుస్తోందని ఆయన ఆరోపించారు. ఇవి నాటకాలు తప్ప ఇంకొకటి కాదన్నారు.
మత రాజకీయాలు మాకొద్దు.. బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు
తెలంగాణలో రాజకీయలు వేడెక్కుతున్నాయి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కృషి చేస్తున్నారు. దీంతో కొన్ని పార్టీల్లోని కార్యకర్తలు, ముఖ్య నేతలు ఇతర పార్టీలకు జంప్ చేస్తున్నారు. అయితే.. మత రాజకీయాలు మాకొద్దంటూ జడ్చర్ల మున్సిపాలిటీలోని 1వ వార్డు బీజేపీ ప్రెసిడెంట్ సహా 40 మంది నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. అయితే.. వారిని కండువా కప్పి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆహ్వానించారు.
బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్.. కీలక నేత రాజీనామా
ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మహిళా అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్ ఆకుల లలిత రాజీనామా చేశారు. నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తున్న ఆకుల లలిత.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల లలిత.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆకుల లలిత 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీలో చేరరు. ఆకుల లలిత 17 డిసెంబర్ 2021న తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితురాలై, 24 డిసెంబర్ 2021న ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది.
“అలా ఐతేనే”.. ఇజ్రాయిల్ బందీల విడుదలపై ఇరాన్ కీలక ప్రకటన..
అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ వైమానికదళం గాజా స్ట్రిప్‌పై నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్ ఉగ్ర స్థావరాలతో పాటు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఉన్న అన్ని ప్రాంతాలు, బిల్డింగులపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్, పాలస్తీనాలోని గాజాపై భూతల దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా ఉత్తర ప్రాంతంలోని పాలస్తీయన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించింది ఇజ్రాయిల్ ఆర్మీ.
ఇదిలా ఉంటే హమాస్ ఇజ్రాయిల్ ప్రజలతో పాటు పలువురు విదేశీయులను మొత్తంగా 199 మందిని బందీలుగా పట్టుకుంది. ప్రస్తుతం వీరిని విడిపించేందుకు ఇజ్రాయిల్ రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ సిద్ధంగా ఉందని, అయితే ముందుగా ఇజ్రాయల్ గాజాపై మైమానిక దాడుల్ని ఆపాలని ఇరాన్ పేర్కొంది. గాజాపై ఇజ్రాయిల్ దాడుల్ని ఆపేస్తే బందీలందరిని విడిచిపెట్టేందుకు హమాస్ సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనానీ టెహ్రాన్ లో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముగిసిన నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ సీఐడీ విచారణ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ సీఐడీ విచారణ ముగిసింది. స్కిల్ కేసులో రాజేష్‌ను సీఐడీ విచారించింది. ఉదయం పదిన్నర నుంచి సీఐడీ విచారణ కొనసాగింది. నేను ఇక్కడే ఉన్నా నా గురించి అందరూ తప్పుడు వార్తలు, తప్పుడు స్టేట్ మెంట్లు ఇచ్చారని కిలారు రాజేష్ పేర్కొన్నారు. దీనిపై చట్టపరంగా ముందుకు వెళతామన్నారు. స్కిల్ అంశంలో తనను పిలిచారని కిలారు రాజేష్ తెలిపారు. కొంత మంది కావాలని సృష్టించారని.. దీనిలో తన పాత్ర ఏమీ లేదని క్లియర్‌గా చెప్పానని ఆయన స్పష్టం చేశారు. రేపు కూడా రమ్మని చెప్పారని.. 20 నుంచి 25 ప్రశ్నలు అడిగారని ఆయన చెప్పారు. సగం ప్రశ్నలు స్కిల్‌కు సంబంధం లేని కేసులేనని ఆయన తెలిపారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిగిందని కిలారు వెల్లడించారు. చంద్రబాబును ఎదుర్కోలేక కేసు సృష్టించారని అన్నారు కిలారు రాజేష్.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలను కొనసాగిస్తుంది..
వచ్చే నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా మారాయి. దీంతో పార్టీల అగ్రనేతలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బుజ్జగింపులు మొదలుపెడుతుందని ఆరోపించారు.
రాజ్‌నంద్‌గావ్ లో జరిగిన ఈ ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్ అవినీతి ఫుడ్ ఛైన్ రెస్టారెంట్ లాగా ఢిల్లీ వరకు విస్తరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిపరుల నుంచి ప్రతీ పైసా రికవరీ చస్తామని, తలకిందులుగా వేలాదీస్తామని హెచ్చరించారు. గతంలో మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాలుగా ఉండేవని, రమణ్ సింగ్ అధికారంలో వచ్చిన 15 ఏళ్లలో ఛత్తీస్గఢ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించిందని ఆయన అన్నారు.
అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం
అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫామ్ -6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. 2022లో 2 లక్షల 75 వేల డూప్లికేట్ ఓట్లను తొలగించామని, గడిచిన వారం రోజుల్లో 50 వేల నకిలీ ఓట్లు తొలగించామని ఆయన పేర్కొన్నారు. 3 లక్షల 61 వేల ఓట్లకు షిఫ్ట్ అయిన వారు అప్లై చేసుకున్నారని, ఓటర్ ఐడెంటిఫికేషన్ స్లిప్స్ ను ప్రతి ఓటర్ కు పంచుతామని ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా ఎక్కడ ఓటు వెయ్యాలి అని క్లారిటీ వస్తుందన్నారు.
అంతేకాకుండా.. పకడ్బందీ గా ఎలెక్టోరల్ చేశామని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్.. 90 ఫ్లయింగ్ స్క్వాడ్ లతో పాటు జిల్లా పరిధిలో 18 చెక్ పాయింట్ లు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. చెకింగ్ చేస్తున్న క్రమం లో ప్రతిదీ వీడియో రికార్డింగ్ చేస్తామని, క్యాష్ తీసుకువెళ్తున్న, బంగారం తమతో తీసుకెళ్తున్న ప్రతిదానికీ ప్రూఫ్ క్యారీ చేయాలని ఆయన సూచించారు. 10 లక్షలకు పైగా క్యారీ చేస్తే వాటిని ఐటీకు పంపుతామన్నారు. మద్యం, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిపై ఎలక్షన్ చాలా సీరియస్ గా ఉందన్నారు. నామినేషన్ నవంబర్ 3 నుండి స్వీకరిస్తాము..10 నామినేషన్ స్వీకరణ చివరి తేదీ.. అని, 13 న స్క్రూటినీ,15 నామినేషన్లు విత్ డ్రా కు చివరి తేదీ అని తెలిపారు.
పాకిస్తాన్‌లో పాలస్తీనా విద్యార్థులపై దాడి..
ప్రస్తుతం ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధంపైనే ప్రపంచ దృష్టి నెలకొంది. పలు దేశాలు ఇజ్రాయిల్‌కి సపోర్టు చేస్తుండగా, ఇస్లామిక్ దేశాలు హమాస్‌కి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల్లో రాడికల్ ఇస్లామిక్ శక్తులు దాడులకు పాల్పడుతున్నాయి. ఇదే విధంగా అమెరికాలో ఓ వ్యక్తి ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ముస్లిం బాలుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ దేశంలో చదువుకునేందుకు వచ్చిన పాలస్తీనా యువకులపై స్థానిక గుండాలు దాడి చేశారు. ఇద్దరిని కత్తితో గాయపరిచారు. అయితే ఈ ఘటనకు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధానికి సంబంధం లేదు. పంజాబ్ ప్రావిన్సులోని గుజ్రాల్ వాలా మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను స్థానిక గుండాలు వేధించారు. అయితే తమ తోటి మహిళా విద్యార్థులకు సాయంగా ఇదేమిటని ప్రశ్నించినందుకు గుండాలు కత్తితో దాడి చేశారు.
ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని దుర్మార్గుడు కేసీఆర్
తెలంగాణ రావడంలో కీలకంగా రాజ్ నాథ్ సింగ్ వ్యవహరించారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ బీజేపీ మహేశ్వరంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమానికి సమాయత్తం చేశారని అన్నారు. తెలంగాణను పాలించింది కేసీఆర్ కుటుంబం అని, తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీద రాస్తున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని దుర్మార్గుడు కేసీఆర్ అని నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి.
బీఆర్‌ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల గుండెలు జారిపోయాయి
బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ముందే ఉంది, బీ ఫామ్ ఇవ్వడంలో ముందే ఉంది, ప్రచారంలో ముందే ఉంది.. రేపు గెలిచే సీట్లోలోనూ బీఆర్‌ఎస్ పార్టీ ముందే ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల గుండెలు జారిపోయాయి, మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో BRS కాపీ కొట్టిందని రేవంత్ రెడ్డి మాట్లాడారని, కాపీ కొట్టింది మీరు..మేము కాదన్నారు మంత్రి హరీష్ రావు. రైతు బంధు పెట్టింది ఎవరు..సీఎం కేసీఆర్ కాదా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నమ్మకానికి మారు పేరు కేసీఆర్.. నయవంచన కి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని, ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే అని ఆయన వ్యాఖ్యానించారు.