NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

పవన్ అన్న అంటూ లోకేష్ ట్వీట్.. మంత్రి స్పెషల్ విషెస్

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ స్పెషల్ ట్వీట్ వేశారు. పవన్ అన్నకు అంటూ ఆప్యాయంగా స్పందించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ అన్నకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఏపీ అభివృద్ధిలో జనసేన పనితీరు ఎంతో కీలకం అన్నారు. ఆ పార్టీ కమిట్ మెంట్ ఏపీ అభివృద్ధికి చాలా కీలకం అన్నారు. భవిష్యత్ లో ఆ పార్టీ మరిన్ని అద్భుతాలు సాధించాలని కోరుకుంటున్నట్టు వివరించారు. కూటమి ప్రభుత్వ పనితీరులో జనసేన సహకారం అత్యంత కీలకం అంటూ చెప్పుకొచ్చారు. లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్‌ ను లోకేష్ ఇలా స్పెషల్ గా పిలవడంపై జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో ఆవిర్భావ సభ ప్రారంభం అయింది.

పదేళ్ల తర్వాత “జనసేన”కు100% స్ట్రయిక్ రేట్.. పార్టీ 11ఏళ్ల ప్రస్తానం ఇదే..

జనసేన పార్టీ 11ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏట అడుగు పెట్టింది. నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. జనసేన 12 ఏళ్ల పండుగ వైభవంగా సాగుతోంది.. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సభలో 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్‌ కళ్యాణ్‌.. కూటమితో జతకట్టి 100% స్ట్రయిక్ రేట్ సాధించిన  విషయం తెలిసిందే. జనసేన భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి పార్టీ సభ కావడంతో పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. అయితే మనం ఇప్పుడు జనసేన ప్రస్తానం గురించి పూర్తిగా తెలుసుకుందాం…

బతికినంత కాలం పవన్ ఫాలోవర్ గా ఉంటా..

తాను బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ ఫాలోవర్ గానే ఉంటానని మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు చెప్పారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడారు. మన హిందూ ప్రజలకు 12వ ఏడాది చాలా స్పెషల్ అని నాగబాబు చెప్పుకొచ్చారు. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయని.. ఈ 12వ ఆవిర్భావ సభ కూడా జనసేనకు పుష్కరాల్లాంటిదేనన్నారు. ఈ సభ గతంలో జరిగిన చాలా సభలకంటే చాలా గొప్పది అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వైసీపీపై సెటైర్లు వేశారు.

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యా రావుకు ఎదురుదెబ్బ.. బెయిల్ తిరస్కరణ..

బంగారం అక్రమ రవాణా కేసులో సినీ నటి రన్యా రావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ అన్నారు. జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచాలనే ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించారు. ఇప్పటికే ఆమె బెయిల్ పిటిషన్‌ని మొదట మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టుని ఆశ్రయించగా, అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆమె తరుపు న్యాయవాదులు సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నవారు.

మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్..

ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో దారుణం జరిగింది. ఒక మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌పై ఒక కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పటేల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ అస్లాంపై తీవ్రమైన అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇప్పటికే ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. నివేదిక ప్రకారం.. ఇటీవల మహిళా ఎస్ఐ ఒక కొండ ప్రాంతం నుంచి డెహ్రాడూన్‌కి బదిలీ అయ్యారు. సంఘటన జరిగిన రోజు తన డ్యూటీ లొకేషన్ దూరంగా ఉండటంతో, డెహ్రాడూన్‌లోని ఒక హోటల్‌లో బస చేయాలని నిర్ణయించుకున్నానని, కానిస్టేబుల్‌ని ఒక గది బుక్ చేయాలని అడిగానని ఆమె చెప్పింది. హోటల్ చేరుకున్న తర్వాత కానిస్టేబుల్ రూం తనిఖీ చేసే ఉద్దేశంతో లోపలికి వచ్చి, తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. నిందితుడైన కానిస్టేబుల్ తనపై అత్యాచారం చేయడంతో పాటు సంఘటనను వీడియో రికార్డ్ చేశాడని ఫిర్యాదులో వెల్లడించింది. ఎవరికైనా చెబితే, ఈ వీడియోని ఇంటర్నెట్‌లో పెడతా అని బ్లాక్‌మెయిట్ చేసినట్లు బాధితురాలు చెప్పింది.

జగన్ నాకు తీవ్ర అన్యాయం చేశాడుః మాజీ మంత్రి బాలినేని

పిఠాపురం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన మంత్రి పదవి తీసేశాడని.. అయినా సరే తాను బాధపడలేదన్నారు. తనను జనసేనలోకి తీసుకొచ్చింది నాగబాబు అని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌ వెంట తాను నడుస్తానని.. ఎలాంటి పదవులు ఆశించి జనసేనలోకి రాలేదన్నారు. జనసేన కోసం ఒక మంచి కార్యకర్తగా పనిచేస్తానని వివరించారు.

ఫాంహౌస్ కేసులో ముగిసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణ

ఫాంహౌస్ కేసులో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నేడు పోలీసులు విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ విచారణలో, ఫాంహౌస్ లీజుకు సంబంధించిన వివరాలను, ఘటనకు సంబంధించి ఆయన పాత్రపై ప్రశ్నలు వేసినట్టు సమాచారం. విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెంట న్యాయవాది , ఫాంహౌస్ లీజుకు తీసుకున్న వ్యక్తి ఉన్నప్పటికీ, వారిని లోపలికి అనుమతించలేదు. అనంతరం విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పోచంపల్లి, తనపై ఉన్న ఆరోపణలను ఖండించారు. “పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర,” అని ఆయన వ్యాఖ్యానించారు.

నేను పార్టీలోకి వచ్చినప్పుడు పవన్ చెప్పింది అదే

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ జాతీయ నేతగా ఎదగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పవన్ ఒకేలా ఉన్నారన్నారు. పవన్ కల్యాన్‌ ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా అందరికన్నా ముందుగా స్పందించారని.. ఇక ముందు కూడా అలాగే ఉంటారంటూ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌ ఎన్నో అవమానాలు పడి పార్టీని ఈ స్థాయికి తెచ్చారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని స్పష్టం చేశారు.

కాంగ్రెస్-బీజేపీ మధ్య చీకటి ఒప్పందం.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) తన పార్టీ నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రహస్య సమావేశం నిర్వహించారని గతంలో మండిపడ్డ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలపై అధికారికంగా సమీక్షలు నిర్వహించాలి కానీ, రహస్యంగా బీజేపీ నేతలతో సమావేశాలు పెట్టడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నన్ను ఎంతో అవమానించారు : పవన్ కల్యాణ్‌

పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అట్టహాసంగా సాగుతోంది. ఈ సభలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చాలా ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. తాను ఒక్కడిగా 2014లో జనసేన ప్రయాణం మొదలు పెట్టానని.. ఈ రోజు ఈ స్థాయి దాకా వచ్చామంటూ చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగం ముందు తమిళంలో ఒక పద్యం పాడారు. భయం లేదు కాబట్టే ఎవరికీ భయపడకుండా ఈ స్థాయి దాకా ఎదిగామంటూ దాని అర్థం చెప్పుకొచ్చారు. తాను ఏపీలో గత పదేండ్లుగా ఎన్నో అవమానాలు పడ్డానని గుర్తు చేసుకున్నారు.