మణిపూర్ అల్లర్లు.. మరో 9 కేసులు విచారించనున్న సీబీఐ
మణిపూర్ రాష్ట్రంలో రెండు జాతుల మధ్య చెలరేగిన వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోగా ఇదే విషయంపై పార్లమెంట్ కూడా దద్దరిలింది. ఈ ఘటనలకు సంబంధించి అనేక కేసులను సీబీఐ విచారిస్తోంది. అధికారులపై సైతం వర్గ ముద్ర పడుతూ ఉండటంతో విచారణలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఈ కేసుల విచారణను కేంద్రదర్యాప్తు సంస్థ సీబీఐకు అప్పగించడం జరిగింది.
ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుతో సహా ఎనిమిది కేసులు ప్రస్తుతానికి సీబీఐ చేతిలో ఉన్నాయి. అయితే వీటికి అదనంగా ఈ అల్లర్లకు సంబంధించి మరో 9 కేసులను సీబీఐ విచారించనుంది. చురాచంద్‌పుర్ జిల్లాలో చోటు చేసుకున్న మరో లైంగిక వేధింపుల కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
గ్రూప్-2 రీషెడ్యూల్.. కొత్త డేట్లను ప్రకటించిన TSPSC
ఈ నెలాఖరున నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షను నవంబర్ 2, నవంబర్ 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆదివారం వెల్లడించింది. టీఎస్పీ్ఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను TSPSC వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి, పరీక్ష తేదీలకు వారం ముందు, నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది.
కమీషన్‌తో సంప్రదింపులు జరిపి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేసి అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది. అయితే.. ఈనెల 29, 30వ తేదీల్లో జరుగాల్సిన గ్రూపు-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అంతకుముందు అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ సీఎస్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించారు. తాజాగా.. పరీక్ష తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో గ్రూప్-2 కింద 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఢిల్లీలో భారీ వాహనాలపై ఆంక్షలు
స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. నోయిడా, ఘజియాబాద్‌ల నుంచి ఢిల్లీ వైపు వచ్చే భారీ వాహనాల ప్రవేశంపై సోమవారం రాత్రి నుంచి ఆగస్టు 15 వరకు ఆంక్షలు ఉంటాయని, ఈ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తామని ఆదివారం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్ జామ్ కాకుండా చూడటానికి సుమారు 3,000 మంది ట్రాఫిక్ పోలీసులను నియమించారు. దేశ రాజధానిలోని ప్రధాన జంక్షన్లు, ఎర్రకోటకు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేయనున్నారు. ఆగస్టు 14 రాత్రి 10 గంటల నుండి భారీ వాహనాలను ఢిల్లీ సరిహద్దులో నిలిపివేయనున్నారు. అనంతరం ఆగస్టు 15న కార్యక్రమం ముగిసిన తర్వాత లోపలికి పంపించనున్నట్లు స్పెషల్ కమిషనర్ పోలీసు (ట్రాఫిక్) ఎస్ఎస్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా.. జేఎల్‌ఎన్ మార్గ్, బహదూర్ షా జఫర్ మార్గ్, రింగ్ రోడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎర్రకోట సమీపంలో వాహనాల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. మరోవైపు ఆంక్షల దృష్ట్యా.. నిత్యావసర సేవలపై ఎలాంటి ప్రభావం పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పాపం.. చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని చితక్కొట్టారు
చికెన్ కర్రీ అంటే లొట్టలేసుకుని తినే వారు చాలా మందే ఉన్నారు. ఇక ముఖ్యంగా ఏవైనా పండగలప్పుడు కంచంలో కోడి ముక్క లేనిది ముద్ద దిగదు. చికెన్ అంటే ఇష్టపడే వాళ్లు చాాలా మంది ఉన్నారు. అయితే తాజాగా చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిపై కొందరు యువకులు దాడి చేశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. చికెన్ ఉచితంగా ఇవ్వలేదని ఓ దళిత వ్యక్తిపై దాడికి పాల్పడ్డ.. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సుజన్ అహిర్‌వార్ అనే వ్యక్తి బైక్‌పై చికెన్‌ను అమ్ముతుంటాడు. అయితే ఒక ఊరి నుంచి మరో ఊరిలోకి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో కొందరు నిందితులు అతన్ని అడ్డుకొని.. చికెన్ ఇవ్వమని అడిగారు. దానికి అతను డబ్బులు ఇస్తేనే.. చికెన్ ఇస్తామనడంతో ఆ వ్యక్తిని కొందరు యువకులు చెప్పులతో చితకబాదారు.
నాడు తెలంగాణలో కూలీ పనులు దొరకలేదు, నేడు కూలీ వాళ్ళు దొరకడం లేదు
సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఆనాడు తెలంగాణ కోసం కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేయలేదన్నారు. ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి భుజం మీద గన్ను పెట్టుకొని తిరిగాడని, ఇంకో 15 రోజులైతే కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాల్లోకి బయలుదేరుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల పండుగ రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు మూడు నెలలు తిరుగుతారని, నాడు తెలంగాణలో కూలీ పనులు దొరకలేదు, నేడు కూలీ వాళ్ళు దొరకడం లేదని హరీష్ రావు అన్నారు.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతోందని, ఈసారి 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని అన్నారు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని, మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ ప్రమాణం చేయడం తధ్యమని జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే.. దేశంలో అనేక రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నా.. తెలంగాణలో మాత్రం 24 గంటల కరెంట్ అందిస్తున్నామని మంత్రి హరీష్ తెలిపారు. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని.. ఇక్కడి బియ్యాన్ని పక్క రాష్ట్రాలు అడుగుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు నెల రోజుల్లో రైతులందరికీ రూ. లక్ష రుణమాఫీ చేస్తామని హరీష్ రావు వెల్లడించారు.
22 రోజులుగా కనపడకుండా పోయిన చిరుత.. ఆచూకీ లభ్యం
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో జూలై 21నుంచి ఓ చిరుత కనపడకుండా పోయింది. రేడియో కాలర్ పనిచేయడం మానేసినప్పటి నుంచి చిరుత జాడ తెలియలేదు. అయితే 22 రోజుల సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఆదివారం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పార్క్ లోని ధోరెట్ రేంజ్ లో ఉధయం 10 గంటలకు నిర్వా అనే ఆడ చిరుతను పట్టుకున్నారు. అంతేకాకుండా ఆ చిరుతకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని, ఆరోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు.
గత 22 రోజులుగా ఆ చిరుత కోసం 100 మందికి పైగా ఫీల్డ్ సిబ్బంది, వైద్యులు, అధికారులు గాలించారు. అయితే ఆగష్టు 12న చిరుత ఎక్కడుందనేది డ్రోన్ ద్వారా చిరుతను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. ఆ చీతాను కనిపెట్టేందుకు అధికార బృందంతో పాటు, రెండు డ్రోన్లు, ఒక డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రోన్ కెమెరాల ఆధారంగా.. నిర్వా ఆరోగ్యంగా కనిపిస్తూ కదులుతుండటాన్ని గుర్తించారు. అప్పటికి చీకటి పడటంతో.. ఉదయం ఆపరేషన్‌ను పునఃప్రారంభించారు. డ్రోన్ బృందాలు రాత్రంతా చీతా ఉన్న ప్రదేశాన్ని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు ఆదివారం తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా.. చీతాను పట్టుకున్నారు. నిర్వాను పట్టుకోవడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.
తిరుమల నడకమార్గంలో 2450 మెట్టు వద్ద కనిపించిన చిరుత
శుక్రవారం తిరుమల అలిపిరి నడకదారిలో శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా.. మూడేళ్ల చిన్నారి లక్షితను చిరుత ఎత్తుకెళ్లి బలి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇవాళ తిరుమల నడకమార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరు భక్తులు చెప్పారు. 2450 మెట్టు వద్ద చిరుత కనిపించందంటూ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురై.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. చిరుతను అడవిలోకి పంపించేదుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
చిన్నారి చిరుత దాడిలో మృతిచెందిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులను నడకమార్గంలో భద్రత నడుమ గుంపులుగా పంపిస్తున్నారు. ప్రస్తుతానికి 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు గుంపులుగానే భక్తులను అనుమతిస్తున్నారు. అంతేకాకుండా.. మధ్యా్హ్నం నుంచి 15 సంవత్సరాల లోపు చిన్నారులను కూడా అనుమతించకపోవడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
బద్రీనాధుని క్షేత్రంను సందర్శించిన తలైవా..
సూపర్‌స్టార్ రజనీకాంత్ కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువనే సంగతి అందరికి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండటం కోసం ప్రతీ ఏదాడి హిమాలయాలను సందర్శిస్తారు.అక్కడ ధ్యానం చేసి..మానసిక ప్రశాంతత ను పొందుతారు. రజనీకాంత్.. ఆయన నటించిన సినిమాల విడుదల ఉంటే ఆ సినిమా హడావుడి నుండి కాస్త ఉపశమనం కోసం విడుదలకు ముందే హిమాలయాలకు వెళ్తారు. సినిమా విడుదల రోజు కచ్చితంగా ఆయన హిమాలయాల లో ఉండేట్లు చూసుకుంటారు.అయితే కరోనా మహమ్మారి వల్ల గత నాలుగు సంవత్సరాలు గా రజినీ హిమాలయాలకు దూరం గా ఉన్నారు. తాను నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 10 వ తేదీన గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డబుల్ ఇస్మార్ట్ సెట్ లో అడుగుపెట్టిన సంజయ్ దత్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ – పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ ఊర మాస్ లుక్.. పూరి హీరో మాస్ డైలాగ్స్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తున్న విషయం తెల్సిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి- ఛార్మి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూరి- ఛార్మి లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకొని పూర్తిగా నష్టాల పాలయ్యారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో అనౌన్స్ జనగణమణ కూడా అటకెక్కింది. దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఈ జంట మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి డబుల్ ఇస్మార్ట్ ను రెడీ చేస్తున్నారు.
పేదోళ్ల జీవితాల గురించి కేసీఆర్‌కి ఎప్పటికీ అర్థం కాదు
ఔట్‌సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగాలు తెలంగాణలో ఉండకూడదని చెప్పాడు కేసీఆర్ అని అన్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్. ఇవాళ హనుమకొండలోని ఏబీవీపీ హల్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ( బి.ఎం.ఎస్ అనుభందం) మొదటి రాష్ట్ర మహా సభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీ వల్ల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నష్టం జరుగుతుందన్నారు. పేదోళ్ల జీవితాల గురించి కేసీఆర్‌కి ఎప్పటికీ అర్థం కాదు, దృష్టి పెట్టడని ఆయన విమర్శించారు.
ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను ప్రభుత్వమే చేపట్టి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని, ఏజెన్సీలు మారినప్పుడల్లా ఉద్యోగాలను తొలగిస్తున్నారు.. వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ కొత్తవి కట్టినప్పుడు వందల ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయని, వాటిని భర్తీ చేసే దమ్ము లేక ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను వాడుకుంటున్నారన్నారు. అంతేకాకుండా.. ‘తెలంగాణలో ఉన్న SPDCL, NPDCL, TRANSCO GENCO లో ఉన్న కార్మికులను “భారతీయ మజ్బూర్ సంగ్” ద్వారా ఐక్యం చేసి ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటుంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో, డిస్కంలో ఎక్కడ కూడా లైన్మెన్ లేక రైతులు, ప్రజలు ఏక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు.
మరోసారి మైదానంలోకి ‘నాగరాజు’.. చూసి ఖంగుతున్న క్రికెటర్
ఈ మధ్యకాలంలో స్నేక్ రాజాలు అడవుల్లో కన్నా.. క్రికెట్ మైదానంలో ఎక్కువగా తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న లంక ప్రీమియర్ ఆరంభ రెండో మ్యాచ్ లోనే పాము కనపడగా.. ఇప్పుడు మరోసారి దర్శనమిచ్చింది. లంక ప్రీమియర్ లీగ్ లో స్టేడియంలోకి పాము ఎంట్రీ ఇవ్వడం ఇది మూడోసారి. మొదటిసారిగా పాము స్టేడియంలోకి వచ్చినప్పుడు.. కాసేపు మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత మరో మ్యాచ్ లోనూ మళ్లీ మైదానంలోకి వచ్చింది. అయితే బౌండరీ సమీపంలో కెమరామెన్ కూర్చునే చోట పాము కననపడింది. ఇప్పుడు వచ్చిన పాము ముచ్చటగా మూడోవది. లంక బౌలర్ ఇసురు ఉడానా బౌలింగ్ చేసే క్రమంలో.. అతనికి సమీపంలో నుంచి వెళ్లింది. వెంటనే ఆ పామును చూసిన అతను ఉలిక్కిపడి పక్కకు తప్పుకున్నాడు. అయితే పాము మైదానంలోకి వచ్చిన వీడియోను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అంతేకాకుండా దీనిపై పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది బంగ్లాదేశ్ కాదు రాజా.. పదే పదే రావడానికి అని ఒకరు రాయగా.. మరొకరు అది కూడా క్రికెట్ లవర్ కావొచ్చు అందుకే ఎప్పటికి వస్తుందని రాసుకొచ్చారు.
గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయం
విశాఖలోని గాజువాక జంక్షన్ లో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు మీద పోరాటం చేస్తుంటే సీఎం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వైజాగ్ ఎంపీ ఒక రౌడీషీటర్ అని పవన్ ఆరోపించారు. ఒక రౌడీషీటర్ ను వైజాగ్ ఎంపీగా గెలిపించారని.. అటువంటి ఎంపీ ప్రధాని దగ్గరకు వెళ్లి స్టీల్ ప్లాంట్ ను కాపాడగలరా అని దుయ్యబట్టారు.
విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన రైతులు పరిహారం రాక ఇప్పటికీ ఆలయాల్లో ప్రసాదాలు తిని బ్రతకలిసిన పరిస్థితి ఏర్పడిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. తనకు పోరాటం నేర్పింది ఉత్తరాంధ్ర అని తెలిపారు. మరోవైపు 2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన ఒక నాయకుడికి గాజువాకలో ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గాజువాకను తాను ఎప్పుడు వదల్లేదని.. తాను ఓడిపోవడం తప్ప తప్పు చేయలేదని పవన్ అన్నారు. జనసేన ఆశయానికి ప్రజలు అండగా ఉంటారనేది ఎప్పటికప్పుడు మీ ఆదరణ నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.