విశాఖ రాజధాని కాకుండా ఆ ఇద్దరు విషం కక్కుతున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రాజెక్ట్ లపై ఇష్టానుసారం మాట్లాడారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే పనులు చేస్తామంటున్నారు.. అసలు 14 ఏళ్ల చరిత్రలో ఒక్క ప్రాజెక్టు అయినా శంకుస్థాపన చేసింది.. పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఉందా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఒకే సారి నువ్వు, నీ దత్తపుత్రుడు రావాల్సిన అవసరం ఏముందని మంత్రి సీదిరి అన్నారు. విశాఖ పై బురద జల్లడమే మీ ప్రయత్నమని మంత్రి విమర్శించారు. ఉత్తరాంధ్ర పై వైసీపీ చిత్త శుద్ధితో ఉందని ఆయన తెలిపారు. అందుకే విశాఖని రాజధానిగా ప్రకటించామన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మరోవైపు పవన్ కళ్యాణ్.. పొట్టి శ్రీరాములుకి వైఎస్ కి లింక్ పెడుతున్నారు.. అసలు ఆ పోలికేంటని ప్రశ్నించారు. పార్టీ పెట్టాక ఎన్ని పొట్టి శ్రీరాములు విగ్రహాలు చూసారన్నారు. జగన్ సీఎం అయ్యాక.. పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఎక్కడ తగ్గాయి పవన్ అని ప్రశ్నించారు. వైఎస్ అభిమానులు విగ్రహాలు పెట్టుకుంటే మీకేంటి బాధ అని సీదిరి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు హయాంలో మంత్రులే గంజాయి అడ్డాగా విశాఖపట్నం అని మంత్రులు చెప్పారని.. అప్పుడు ప్రశ్నించలేదేం పవన్ అని అన్నారు.
కస్టమ్స్ పేరుతో బురడీ.. వందల కోట్లు స్వాహా
నకిలీ కాల్ సెంటర్ల గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. అమెరికన్ పౌరులను టార్గెట్ చేసి భారీ స్కాంకు పాల్పేడుతున్న ముఠాను పట్టుకున్నారు. కస్టమ్స్ క్లియరెన్స్ పేరుతో అమెరికన్ సిటిజన్లను మోసం చేస్తోంది మాదాపూర్ లోని ఏఆర్‌జే సొల్యూషన్స్. గుజరాత్‌లో నమోదైన సంస్థ ఇక్కడి కాల్ సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతోంది. దీంతో పాటు నకిలీ అమెజాన్ కాల్ సెంటర్ నడుపుతున్న ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు. 120 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్ ఫేక్ కాల్ సెంటర్ ను నడుపుతున్నారని, యూఎస్ , కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ,అమెజాన్ ఫేక్ కాల్ సెంటర్‌ను రన్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. రెండు ముఠా లను అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే
ట్విట్టర్ టిల్లు.., కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను ఎలా దోచుకుంటున్నారో మొత్తం దేశమంతా చూస్తోందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్రజలను దోచుకోవడం ద్వారా మీ కుటుంబ ఆదాయం ఎలా పెరిగిందనేది కూడా వారు చూస్తున్నారని, అందుకే మీరు వణికిపోతున్నట్లున్నారంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. పైకి శత్రువుల్లాగా నటిస్తూ ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్, ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని ఆయన మరోసారి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులను ఇన్నిరోజులు విస్మరించిన సర్కార్.. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వంలో విలీనం చేసిందని ఆయన అన్నారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదు.
భూములు రికార్డుల ప్రక్షాళన పేరుతో అక్రమాలు జరిగాయి..
ఇందిరా గాంధీ భూ సంస్కరణాల ద్వారా ఇచ్చిన భూములు కేసీఆర్ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగారెడ్డి, మెదక్, నల్గొండ లో ఆ భూములను చట్ట విరుద్ధంగా బిల్డర్స్ కి అప్పగిస్తున్నారని, బుద్వెల్ లో 282 ఎకరాలు దళితులకు భూ సంస్కరణల చట్టం కింద పంచారన్నారు. 1995 లో టీడీపీ హయాంలో అసైన్ భూమి అని ఆర్డివో నోటీసులు ఇచ్చారని, హైకోర్టు దళితులకు ఇచ్చిన భూములు లక్కోవడానికి లేదని 2008 కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ భూములు ఇప్పటి వరకు దళితుల చేతిలోనే ఉన్నాయన్నారు కోదండరెడ్డి. హెచ్‌ఎండీఏ వంద ఎకరాల వరకు ఈవేళం వేసిందని, 24 లక్షల ఎకరాల అసైన్ భూములు ఉంటే 10 వేల ఎకరాల అసైన్ భూములను బిల్డర్స్ కి అప్పగించారన్నారు కోదండరెడ్డి. భూములు రికార్డుల ప్రక్షాళన పేరుతో అక్రమాలు జరిగాయని, భూములు అమ్మకంలో మొదటి నేరస్థుడు మున్సిపల్ మంత్రి కేటీఆర్ అని ఆయన విమర్శలు గుప్పించారు.
లోకేశ్ యువగళం యాత్ర అట్టర్ ప్లాఫ్.. పాదయాత్రతో ఒరిగిందేమీ లేదు
టీడీపీ నేత లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం యాత్ర అట్టర్ ప్లాఫ్ అని అన్నారు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి ఒరిగేదేమీ లేదని మంత్రి ఆరోపించారు. శుక్రవారం గుంటూరులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా రాష్ట్రంలో అధికారంలోకి రాదని తెలిపారు. మరోవైపు లోకేష్‌కు సరిగా తెలుగు మాట్లాడడం రాదని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. ఓ అధినేత కొడుకుగా మంగళగిరిలో పోటీ చేసి లోకేష్ ఓటమి పాలయ్యాడన్నారు. ముందు ఎమ్మెల్యేగా గెలుపొందాలని మంత్రి లోకేష్ కు సూచించారు. ఇక తన కుటుంబ సభ్యులు ఎప్పుడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు. ఎన్నికల సమయంలోనే తన సోదరుడు, బిడ్డలు, అల్లుళ్లు వస్తారని.. ఎన్నికలు అయిపోగానే వారు వెళ్లిపోతారని తెలిపారు. వచ్చే ఎన్నికలకు తన కుటుంబ సభ్యులు మళ్లీ వస్తారంటూ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.
మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి కేసీఆర్ రికార్డ్ సృష్టించారు
బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు పర్యాటక అనుమతులు రావడం సంతోషకరమని ఆమె అన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అని, మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి కేసీఆర్ రికార్డ్ సృష్టించారని ఆమె కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మాదిరిగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా త్వరలోనే సీఎం కేసీఆర్ పూర్తి చేస్తారన్నారు.
కోర్టు కేసులతో రాదేమో అనుకున్న పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ రావడం సీఎం కేసీఆర్ సంకల్పంతోనే సాధ్యమైందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు, అవరోధాలు సృష్టించిన, ఎన్ని కుట్రలు పన్నినా, చెక్కుచెదరని జన సంకల్పంతో సీఎం కేసీఆర్ అనుమతులు వచ్చేలా కృషి చేశారని ఆమె వ్యాఖ్యానించారు. కొత్త సెక్రటీరియేట్ లో మొదటి సమావేశం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైనే నిర్వహించి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత చాటారని, ఇది చారిత్రాత్మక విజయమన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల లోని 16 నియోజకవర్గాలు,70 మండలాల్లో కృష్ణమ్మ పరుగులు పెట్టనుందన్నారు. సాగు,తాగునీటి,పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడనుందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
మధ్యప్రదేశ్ ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన బీఎస్పీ
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తన మొదటి ఏడుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ప్రకటించిన ఏడు స్థానాల్లో ప్రస్తుతం నాలుగు అధికార బీజేపీ, మిగిలిన మూడు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి.
తొలి జాబితాలోని అభ్యర్థుల పేర్లు: మొరెనా జిల్లాలోని డిమాని నుంచి పార్టీ మాజీ ఎమ్మెల్యే బల్వీర్ సింగ్ దండోటిత. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 2 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. రేవా జిల్లాలోని సెమారియా స్థానం నుంచి పంకజ్ శర్మ అభ్యర్థిగా ఎంపికయ్యారు. అవదేశ్ ప్రతాప్ సింగ్ రాథోడ్, రామరాజా పాఠక్ వరుసగా నివారి, రాజ్‌నగర్-ఛతర్‌పూర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. మిగిలిన ముగ్గురు అభ్యర్థులు – దేవ్‌రాజ్ అహిర్వార్ రైగాన్ స్థానం నుంచి, మణిరాజ్ సింగ్ పటేల్ రామ్‌పూర్ బఘేలాన్ స్థానం నుంచి, విష్ణు దేవ్ పాండే సిర్మూర్ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. మణిరాజ్ సింగ్ పటేల్ రిటైర్డ్ నాయబ్ తహసీల్దార్ కాగా.. సిర్మూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి విష్ణు దేవ్ పాండే మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కావడం గమనార్హం.
ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వారి కళ్లు పడ్డాయి.. అడ్డగోలుగా దోచుకుంటున్నారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుషికొండను పరిశీలించారు. దూరం నుంచే కొండను పరిశీలించిన పవన్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, రుషికొండ నిర్మాణాలపై తీవ్ర విమర్శలు చేసారు. తట్టెడు మట్టి తీస్తేనే పర్యావరణ ఇబ్బందులు వచ్చే చోట విధ్వంసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసమే అయితే సర్క్యూట్ హౌస్, ఇతర చోట్ల కట్టవొచ్చు కదా అని జనసేనాని ప్రశ్నించారు. సీఎం జగన్ కు ఇంకా ఎన్ని ఇళ్లు కావాలని పవన్ అన్నారు. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టి ఇక్కడ నిర్మిస్తాడ అని పవన్ తెలిపారు.
అణిచివేత సందేశాన్ని పంపేందుకే లైంగిక హింస.. మణిపూర్ కేసులపై సుప్రీంకోర్టు
మణిపూర్‌లో మహిళలు ఘోరమైన అఘాయిత్యాలకు గురవుతున్న తీరుపై వేదన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఓ వర్గానికి అణిచివేత సందేశాన్ని పంపేందుకు ఆకతాయిలు లైంగిక హింసకు పాల్పడుతున్నారని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. మే 4 నుంచి మణిపూర్‌లో మహిళలపై జరిగిన హింసాకాండపై విచారణ జరపాలని రిటైర్డ్ జడ్జీలతో కూడిన త్రిసభ్య కమిటీని కూడా కోర్టు కోరింది. మహిళలను లైంగిక నేరాలు, హింసకు గురిచేయడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, రాజ్యాంగ విలువలైన గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తికి తీవ్ర విఘాతం కలిగించడమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. “మూకలు సాధారణంగా అనేక కారణాల వల్ల మహిళలపై హింసను ఆశ్రయిస్తారు. వారు పెద్ద సమూహంలో సభ్యులైతే వారి నేరాలకు శిక్ష నుండి తప్పించుకోవచ్చు.” అని కోర్టు పేర్కొంది.
ఏపీలో భారీగా తగ్గిన టమాటా ధరలు.. కిలో ఎంతంటే..!
గత 20 రోజులుగా ఆకాశాన్నంటిన టమాటా ధరలు దిగొస్తున్నాయి. దేశవ్యాప్తంగా టమాటా ధరలు కేజీ రూ. 200 నుండి 250 పలికాయి. తాజాగా టమాటా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే చాలా వరకు ధరలు తగ్గాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ టమాటాలకు ఫేమస్ అని అందరికి తెలిసిన విషయమే.. అక్కడ కేజీ టమాటా ధర రూ.33 పలుకుతోంది. మరోవైపు చిత్తూరు, అనంతపురం, కర్నూలు మార్కెట్‌లలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. భారీగా దిగుబడి వస్తుండటంతో టమాటా ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాతో పాటుగా పక్క జిల్లాల్లో, పొరుగు రాష్ట్రాల్లో టమోటా దిగుబడి పెరిగింది. దీంతో టమాటా భారీగా మార్కెట్‌కు వస్తోంది. టమాటా కోసం బయ్యర్ల పోటీ పడకపోతుండటంతో.. గిరాకీ తగ్గి టమాటా ధర పడిపోతోందని తెలుపుతున్నారు. మరోవైపు టమాటా ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతుండటంతో సామాన్యులకు ఊరటనిచ్చే అంశం కాగా.. రైతులకు మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
వచ్చే ఉగాది నాటికి టీడీపీ, జనసేన ఉండవు.. ఉంటే గుండు గీయించుకుంటా..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో గడపగడపకు విజయోత్సవ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే అమావాస్య( ఉగాది )నాటికి రెండు రాజకీయ పార్టీలు ఉండవని తెలిపారు. తెలుగుదేశం, జనసేన ఉండవని.. ఉంటే గుండు గీయించుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతసేపు రాజకీయాలే తప్ప.. చిత్తశుద్ది లేదని ఆరోపించారు. రాజకీయ అనుభవంతో చెబుతున్నానని.. ప్రజలకు మంచి చేయాలనే తపన వారికి లేదని మంత్రి బొత్స పేర్కొన్నారు.
తోటపల్లిని తానే శంకుస్థాపన చేశానని మంత్రి బొత్స చెప్పారు. ఎన్నికలకు మూడు రోజులు ముందు శంకుస్థాపన చేసినట్లు చెప్పడం.. సిగ్గులేదా అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికలు వచ్చిన్నప్పుడే స్కీములు గుర్తొస్తున్నాయి అని మంత్రి ఫైర్ అయ్యారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే మట్టి కొట్టుకుపోతారని ఆయన ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఎందుకు అని అంటుంటే ఆశ్చర్యం వేస్తుందని.. జగన్ పెట్టామన్నారా, విజయమ్మ పెట్టమన్నారా.. ప్రజలు అభిమానంతో వైఎస్ విగ్రహాలు పెట్టుకున్నారని మంత్రి బొత్స తెలిపారు.
సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ కుల వృత్తులకు, చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ చేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ పత్రాల పంపిణీ చేశారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. బీసీ కులవృత్తుల ఆర్థిక సహాయం నిరంతర ప్రక్రియ, చివరి లబ్దిదారుడి వరకు సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. 29 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ పత్రాలు అందజేసినట్లు ఆయన తెలిపారు. గృహలక్ష్మి కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల కేటాయించినట్లు ఆయన తెలిపారు.
15 ఏండ్లు అవుతుంది దుకాణం తెరిచి.. అందులో ఏ వస్తువు లేదు
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలలో దూకుడు పెరుగుతుంది. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఝులిపిస్తున్నారు. తాజాగా.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన గడపగడపకు విజయోత్సవ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అవగాహానలేని చేతలు, మాటలు మాట్లాడే సెలబ్రెటీ అని పవన్ ను దుయ్యబట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి, ప్రధాని మీద మాట్లాడి పెద్ద వాడైపోయానుకుంటున్నాడని ఆరోపించారు. అసలు నీ విధానం ఏంటి? పార్టీ ఏంటంటే సమాధానం లేదన్నారు మంత్రి. 15 ఏండ్లు అవుతుంది పవన్ కళ్యాణ్ రాజకీయ దుకాణం తెరిచి.. ఆ దుకాణంలో ఏ వస్తువు లేదు, క్వాలిటీలేదని ఆరోపించారు. మరోవైపు వాలంట్స్ మీద కూడా మాట మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తికి లోకల్ స్టాండ్ లేదా అని అన్నారు. రాత్రి ఒక మాట, పగలు ఒకమాట.. సెట్ అయితే ఒక మాట, సెట్ కాకపొతే మరోమాట మాట్లాడుతాడని తెలిపారు. ఇలాంటి వారితో ప్రజాస్వామ్యం అంటే రాజకీయాలంటే అసహ్యం వేస్తుందని మంత్రి బొత్స పేర్కొన్నారు.