నేతన్న బీమా అర్హత వయస్సు పెంపు.. ఎంతంటే..?
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్ చేనేత కార్మికులకు తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు 59 ఏళ్లలోపు వారికి మాత్రమే నేతన్న బీమా పథకం అమలు చేస్తున్నామని, ఇక నుంచి 75 ఏళ్ల వరకు వర్తింపజేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ శివారు మన్నెగూడలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నేతన్న బీమా పథకానికి రూ.50 కోట్లు కేటాయించారు. కొత్తగా ‘తెలంగాణ చేనేత మగ్గం’ పథకం కింద ప్రస్తుతం ఉన్న గుంటల మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలను అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఒక్కో ప్రేమ మగ్గానికి రూ.38 వేల చొప్పున 10,652 ఫ్రేమ్ మగ్గాలకు రూ.40.5 కోట్లు కేటాయించామన్నారు. చేనేత కార్మికులకు ప్రత్యేక హెల్త్ కార్డులు ఇస్తామని, ఒక్కో కుటుంబానికి ఏటా రూ.25 వేల వరకు వైద్య సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ఆర్థిక భరోసా కల్పించే నేతన్నకు చేయూత పథకం 2024 వరకు కొనసాగుతుందని.. ఈ పథకం ద్వారా 36,098 మందికి లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు.
ఆగస్టు 9 ‘నాభూమి-నాదేశం’ కార్యక్రమం
నెల్లూరు జిల్లాలో ఆగస్టు 9 నుంచి 30 వరకు ‘నాభూమి-నాదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవస్ధన్‌రెడ్డి సోమవారం తెలిపారు. కలెక్టర్ ఎం. హరినారాయణన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 20 రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రతి గ్రామంలో ప్రధాని, ముఖ్యమంత్రి సందేశాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, పోలీసులు, సైనికుల పేర్లతో కూడిన శిలా ఫలకాలను ఏర్పాటు చేయనున్నారు. స్వాతంత్య్ర సమర సమయంలో స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను, దేశ సమగ్రతను కాపాడేందుకు సైనికుల త్యాగాలను స్మరించుకోవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఇతివృత్తమని అన్నారు. జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. 20 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మీడియా మద్దతు కూడా కోరారు.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు
కేంద్రంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఇందులో భాగంగానే ఎంపీలు అందరూ ఈనెల 11 వరకు సభ్యులు సభలకు తప్పనిసరిగా రావాలని విప్‌లు జారీ చేశాయి.మరోవైపు 10వ తేదీన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ సమాధానం ఇవ్వనున్నారు. విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో కేంద్రం తరఫున కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. దేశంలో జరిగిన అభివృద్ధి గురించి ఆయన ప్రస్తావించారు. 2014కి ముందు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో జాతి వివక్ష, దౌర్జన్యాలను ఎదుర్కొన్నారని, 2014 తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి గౌహతిలో డీజీపీ సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతను పోలీసులు తప్పనిసరిగా చూసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారని అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
ఢిల్లీ మంత్రివర్గంలో అనూహ్య మార్పు.. ఆ శాఖలు కూడా అతిషికే..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగర పాలక సంస్థ సేవలు మరియు విజిలెన్స్ విభాగాలను అతిషికి అప్పగించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ప్రతిపాదనను పంపినట్లు అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి. ఢిల్లీ సేవల బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన ఒక రోజు తర్వాత ఈ చర్య వచ్చింది. ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023 సోమవారం నాడు 131 మంది ఎంపీలు అనుకూలంగా, 102 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఢిల్లీ ఆరోగ్య, నీటి పారుదల శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రస్తుతం సేవలు, విజిలెన్స్ పోర్ట్‌ఫోలియోలను కలిగి ఉన్నారు. మంత్రి సౌరభ్ భరద్వాజ్ నుంచి సేవలు, విజిలెన్స్ శాఖలను తప్పించి.. ఆ శాఖలను మంత్రి అతిషికి ఆప్ ప్రభుత్వం అప్పగించింది. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఫైల్ అందినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఒడిశా హైకోర్టు సీజేగా జస్టిస్ సుభాసిస్ తలపత్రా ప్రమాణస్వీకారం
ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాసిస్ తలపాత్ర మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేశి లాల్ కొత్త ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ ఎస్ మురళీధర్ తర్వాత ఒడిశా హైకోర్టు 33వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తలపాత్ర నియమితులయ్యారు. జస్టిస్ ఎస్ మురళీధర్ సోమవారం పదవీ విరమణ చేశారు. అక్టోబరు 3న పదవీ విరమణ చేయడానికి ముందు జస్టిస్ తలపత్రా రెండు నెలల పాటే ఈ పదవిలో ఉండనున్నట్లు సమాచారం. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం ఈ పదవికి జస్టిస్ తలపత్రా పేరును సిఫారసు చేసింది. ఆయన రెండు హైకోర్టులలో న్యాయాన్ని అందించిన గణనీయమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. అక్టోబర్ 4, 1961న త్రిపురలోని ఉదయపూర్‌లో జన్మించిన జస్టిస్ తలపత్రా కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్, న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆయన సెప్టెంబర్ 12, 1990న అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ బార్ కౌన్సిల్‌లలో నమోదు చేయబడ్డారు.అయితే ఆయన ప్రధానంగా గౌహతి హైకోర్టు అగర్తల బెంచ్‌లో ప్రాక్టీస్ చేశారు. ఆయన డిసెంబర్ 21, 2004న సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు.జస్టిస్ తలపత్రా నవంబర్ 15, 2011న గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013లో త్రిపురకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసిన తర్వాత త్రిపుర హైకోర్టును తన మాతృ హైకోర్టుగా ఎంచుకున్నారు. అక్కడి నుంచి జస్టిస్ తలపత్రా బదిలీ అయిన తర్వాత జూన్ 10 నుంచి ఒడిశా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు.. పురంధేశ్వరి ట్విట్టస్త్రాలు
బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ట్విట్టర్ వేదిక వైసీపీ ప్రభుత్వంపై వరుసగా ట్విట్టస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ.. ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు. కేంద్రం పంచాయతీలకిచ్చిన నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లించింది. గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలు వదిలింది. నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 8600 కోట్లు ఏపీలోని గ్రామాలకు కేంద్రం ఇచ్చింది. సర్పంచులు అప్పులు చేసి పనులు చేస్తున్నా.. బిల్లులు రావడం లేదు. కొందరు సర్పంచులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్ర నిధుల వాటాతో జరిగే అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ.. ముడుపులిచ్చిన వారికి గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎన్జీటీ అభ్యంతరాలతో ఆపేసినా.. ఆ కాంట్రాక్టరుకు గ్రీన్ ఛానెల్ ద్వారా రూ. 800 కోట్లు ఇచ్చేశారు. ఈ నెల పదో తేదీన అన్ని జిల్లాల్లో సర్పంచులకు అండగా కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతాం.’ అని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
బిగ్ బ్రేకింగ్.. మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
రేపు మహేష్ బర్త్ డే ట్రీట్ కు రెడీ గా ఉండండి అంటూ హింట్ ఇచ్చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు అప్డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. ” రేపు.. సూపర్ స్టార్ సూపర్ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేయడానికి మాతో చేరండి” అంటూ చెప్పుకొచ్చారు. ఈ రాత్రికే అప్డేట్ వస్తుంది అని తెలియడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ముఖాలు వెలిగిపోతున్నాయి. అయితే ఆ అప్డేట్ ఏంటి.. ? పోస్టర్.. ? సాంగ్ ప్రోమో.. ? స్పెషల్ గ్లింప్స్.. ? ఏది వస్తుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది అయితే ఏముంది.. ఫ్యాన్స్ ను వెయిట్ చేయించినా ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు.. అది చాలు అంటున్నారు అభిమానులు.. మరి ఆ అప్డేట్ ఏంటి అని తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
ప్లీజ్ నా డెడ్ బాడీని ఎవరికీ చూపించకండి.. ఐఐటీ విద్యార్థిని సూసైడ్ నోట్..
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ అనే విద్యార్థి.. వైజాగ్‌లో మృతదేహం లభ్యమైన ఘటనను మరిచిపోకముందే.. మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఐఐటీ హైదరాబాద్‌లో పీజీ ఫస్టియర్ (ఎంటెక్) చదువుతున్న ఒడిశాకు చెందిన మమైతా నాయక్ ఆగస్టు 7వ తేదీ రాత్రి క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మమైత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మమైత గదిలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.
మమైతా నాయక్ సూసైడ్ నోట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. డిప్రెషన్‌తో చనిపోతున్నారని సూసైడ్ నోట్‌లో రాసింది. “ప్లీజ్… నా డెడ్ బాడీని ఎవ్వరికీ చూపించొద్దు.. నా డెడ్ బాడీని కనీసం మా పేరెంట్స్ కి మీడియాకు చూపించొద్దు.. ప్లీజ్ ఇది నా విన్నపం.. నా చావుకి గల కారణాలను విచారించాల్సిన అవసరం లేదు. నా చావుకి కారణం… నేను డిప్రెషన్‌లో ఉన్నాను కాబట్టి.” అని మమైత తన సూసైడ్ నోట్‌లో రాసింది. అయితే.. ఒడిశాకు చెందిన మమైతా నాయక్ అనే బాలిక ఎంటెక్ చదివేందుకు జూలై 26న హైదరాబాద్ ఐఐటీలో చేరింది. అయితే.. కాలేజీలో చేరిన 12 రోజులకే ఆత్మహత్యకు పాల్పడి.. డిప్రెషన్ తో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి చనిపోవడం అందరినీ కలిచివేసింది. మరోవైపు.. సూసైడ్ నోట్‌లో మమైత చేతిరాత ముత్యాల్లా అందంగా ఉందని.. ఇంత మంచి రాత రాసే అమ్మాయికి ఏం ఇబ్బంది అని అందరూ వాపోతున్నారు.
సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ మృతి
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్దిఖీ గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది. నిన్న గుండెపోటుకు గురైన ఆయనను కొచ్చిలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఎక్మో సపోర్ట్ అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇక నిన్నటి నుంచి నుంచి చావుతో పోరాడిన ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. వారం క్రితం 69 ఏళ్లు నిండిన సిద్ధిక్, ఆదివారం అంటే 6 ఆగస్టు 2023న కొచ్చిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటు కారణంగా చేరారు. అంతకు ముందే న్యుమోనియా సహా ఇతర శ్వాసకోశ సమస్యల చికిత్స కోసం సిద్దిక్ జూలై 10, 2023న కూడా ఆసుపత్రిలో చేరారు.
కోలుకున్నారు అనుకునేలోపే గుండెపోటు కూడా రావడంతో ఆయన కన్నుమూశారు. సిద్ధిక్‌కు భార్య సజిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫ్రెండ్స్ (2001), ఎంగల్ అన్నా (2004), సాధు మిరాండా (2008), కావలన్ (2011), భాస్కర్ ఒరు రాస్కల్ (2018) వంటి చిత్రాలను అందించి తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. గాడ్ ఫాదర్, హిట్లర్, బిగ్ బ్రదర్, ఫ్రెండ్స్, కాబూలీవాలా వంటి సినిమాలు తెరకెక్కించిన ఆయన సల్మాన్ ఖాన్ హిందీలో బాడీగార్డ్ సినిమా చేశారు. మోహన్ లాల్ తో తీసిన ‘బిగ్ బ్రదర్’ మూవీ తెలుగులో డబ్ అయింది, అదే విధంగా నితిన్ హీరోగా తెలుగులో మారో సినిమాను కూడా ఆయన డైరెక్ట్ చేశారు.
పెద్దిరెడ్డిపై ఉన్న రాజకీయ కక్షతో దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు..
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో.. ఇవాళ ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. నాడు నేడు అంటూ టీడీపీ హాయంలో పోలవరం పరిస్థితిని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పోలవరం అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. నిన్న చంద్రబాబు యుద్ధభేరి కార్యక్రమంలో పోలవరం పై మాట్లాడిన అన్ని విషయాలు అబద్ధాలేనన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఏం చేశారు వైసీపీ అధికారంలో వచ్చాక ఏం చేశాం అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రాజెక్ట్ ల పై చిత్త శుద్ధితో కాకుండా ఎన్నికల ప్రచరంగా పర్యటనలు చేస్తున్నారన్నారు. పెద్దిరెడ్డి పై ఉన్న రాజకీయ కక్షతో దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఏవడ్రా నువ్వు అంటూ సంబోధిస్తూ మాట్లాడుతున్నారని, మేము అడిగిన మూడు ప్రశ్నలకు ఇప్పటివరకు మాజీ ముఖ్య మంత్రి, అప్పటి ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పలేదన్నారు అంబటి రాంబాబు. డయాఫ్రమ్ వాల్ ముందుగా నిర్మించడంతో జరిగిన తప్పిదం ప్రాజెక్ట్ కు శని పట్టినట్టు పట్టిందని, తన కాంట్రాక్టర్ కు ప్రాజెక్ట్ అప్పగించడం ద్వారా వేలకోట్లు దోచుకునేందుకు సిద్ధ పడ్డారని ఆరోపించారు. 2013-14 రేట్ల పై 2016లో మేము పనులు పూర్తి చేస్తాం అంటూ కేంద్రం నుంచి ప్రాజెక్ట్ ను తీసుకున్నారని, 20,398కోట్లకు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని తీసుకోవడం చారిత్రాత్మక తప్పిదన్నారు. డబ్బు కాజెద్ధాం అని ప్రాజెక్ట్ తీసుకున్నారని, ప్రణాళిక లేకుండా టీడీపీ హయాంలో చేసిన పనుల కారణంగా 2019-20 లో వచ్చిన వరద వల్ల తీవ్ర నష్టం జరిగిందన్నారు.
చంద్రబాబు ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో అస్థిరత సృష్టించాలని కుట్రలు పన్నుతున్నాడు
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న పోలవరంలో పర్యటించి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. పోలవరం వచ్చి చంద్రబాబు నోటికి వచ్చినట్లు అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. అమరావతి ఒక కన్ను, పోలవరం ఒక కన్ను అని అన్నాడని, ఈ రెండు ప్రాజెక్టుల పై ఎంత కొట్టేద్దాం అనుకున్నాడో అందుకే అంత బాధపడుతున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నారాసుడు.. గూండాలు, రౌడీలను చంద్రబాబు ప్రోత్సాహిస్తున్నాడంటూ ఆయన ఆరోపించారు. ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో అస్థిరత సృష్టించాలని కుట్రలు పన్నుతున్నాడని కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తుంటే ప్రతిపక్ష పార్టీల వాళ్లే ఆశ్చర్యపోతున్నారని, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆలోచన చేసిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన అన్నారు. నారాసుడు రాజకీయాల్లో ఉన్నంత వరకు రాష్ట్రంలో ఇలా అంశాతి సృష్టిస్తూనే ఉంటాడని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు నారాసుడిని అంతం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ.. కాంగ్రెస్ ని గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలి..
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, కాంగ్రెస్‌ని గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలని టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీలో భట్టి విక్రమర్క అక్రమాల వివరాలు చెబుతుంటే అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఐదు పోగులు వేస్తే పాతవారు మూడు పోగులు తీసుకోండి.. నాకు.. నన్ను నమ్ముకున్న వారికి రెండు పోగులు చాలని అన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తల సమిష్టి బలంతో పార్టీని ముందుకు తీసుకెళ్దామన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కాంగ్రెస్ నీ గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలని పిలుపు నిచ్చారు. సోనియమ్మ రుణం తీర్చుకోవడం కోసం సమయం వచ్చిందని, అందుకు రాబోయే మూడునెలలే ఉన్నాయని పొంగులేటి అన్నారు. గ్రూపులు లేకుండా సమిష్టి కృషితో భట్టి,రేణుక, సంబాని,నేను కలిసి అందరి ఆలోచన ప్రకారం ముందుకు వెళ్దామన్నారు. తెలంగాణ వచ్చి తొమ్మిదిన్నర ఏళ్లైంది… మయాల పఖిర్ వేషాలు,మాటలు ఇక నమ్మొద్దని తెలిపారు. తెలంగాణ మేమే తెచ్చామనిని కల్వకుంట్ల చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.