కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనుకు ఊరట.. బెయిల్ మంజూరు
విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు అతనికి షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదేళ్ల తర్వాత శ్రీనుకు బెయిల్ లభించింది. కాగా.. ఈ కేసుపై మీడియాతో మాట్లాడద్దొని నిందితుడికి న్యాయస్థానం ఆదేశించింది. రూ.25 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మడివరం పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని తెలిపింది.
2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై దాడి కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై కొద్ది రోజుల క్రితం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుకాకపోవడంతో గత ఐదేళ్లుగా శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆప్ అధికారంలోకి వస్తే బీజేపీలాగానే చేస్తాం
కేంద్రం తీరుకు నిరసనగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ వేదికగా (Delhi) ఆందోళనకు దిగుతున్నాయి. జంతర్‌మంతర్ దగ్గర బుధవారం కాంగ్రెస్ ఆందోళన చేపట్టగా.. గురువారం కేరళ ప్రభుత్వం నిరసనకు దిగింది. నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందంటూ కేరళ ఆరోపించింది. కేంద్రం తీరును నిరసిస్తూ కేరళ సర్కార్ ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ (Arvind Kejriwal) మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఒక కొత్త ఆయుధంగా మార్చుకుందని ఆరోపించారు. కోట్లాది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్ష ప్రభుత్వాలపై కేంద్రం అస్త్రంగా ప్రయోగిస్తోందని మండిపడ్డారు. గతంలో నేరం రుజువైతే జైలుకు పంపేవారు. కానీ.. ప్రస్తుతం జైలుకు పంపాక వారిపై ఏ కేసు పెట్టాలా అని ఆలోచిస్తున్నారన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఆప్‌కి కేంద్రంలో అధికారంలోకి వస్తే మాత్రం ఇదే సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. ఇప్పుడు బీజేపీ చేసినట్లుగానే మేముచేస్తామని పేర్కొన్నారు.
కవితను పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? బీసీలను ఇన్నిరోజులు ఎందుకు పట్టించుకోలేదు
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌కు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవితను పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? బీసీలను ఇన్నిరోజులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. కవితను ఒక విషయంపై ప్రశ్నిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. మనకు ఒక ఎంపీ సీటు వస్తుంది అని ఫామ్ హౌజ్ కి వెళ్లి మీ నాన్నకు చెప్పు అని ఆయన అన్నారు. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వమని అడగండని ఆయన అన్నారు. సీట్లు ఎవరెవరికి అమ్ముకున్నారో అందరికీ తెలుసునని, మీ నాన్న ఆరోగ్యం ఎలాగూ బాగోలేదు కదా.. కాబట్టి ఫ్లోర్ లీడర్ గా సీనియర్ అయిన, దళితుడు అయిన కడియం కు ఇవ్వండని రఘునందన్ రావు అన్నారు. మీ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలాగూ రాజ్యాలు విస్తరించుకునే పనిలో ఉన్నాడని, ఆయనకు సినిమా వాళ్ళతో పనులుంటాయన్నారు.
కేంద్రం కీలక నిర్ణయం.. మయన్మార్‌కు రాకపోకలు బంద్
మయన్మార్ (Myanmar)లో గత కొద్దిరోజులుగా అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీంతో భారతీయులను అక్కడికి వెళ్లొద్దని ఇప్పటకే కేంద్రం హెచ్చరించింది. ఇదిలా ఉంటే మయన్మార్ నుంచి కొందరు సైనికులు సరిహద్దులను దాటి భారత్ (India)లోకి ప్రవేశిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య యథేచ్ఛగా జరుగుతున్న రాకపోకలను నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా ప్రకటన చేశారు.
ఇండో-మయన్మార్ సరిహద్దులను మరింత బలోపేతం చేయడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా అంశం తదితర కారణాల దృష్ట్యా భారత్, మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని రద్దు చేయాలని హోంశాఖ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టినట్లు స్పష్టం చేశారు.
ఆసక్తిరేపుతున్న ఏపీ రాజకీయాలు.. ఈ పార్టీల మధ్య పొత్తు ఖరారు
ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పొత్తుల విషయంలో జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు మధ్య చర్యలు సానుకూలంగా జరిగినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 5 నుంచి 6 లోక్ సభ స్థానాలు, 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్లు సమాచారం. విజయవాడ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి, రాజంపేట, విశాఖ లోక్ సభ స్థానాలు బీజేపీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో ఏపీ పొలిటికల్ హీట్..
ఏపీ రాజకీయం ఢిల్లీకి మారింది. బీజేపీ పెద్దలతో రాష్ట్ర అధినేతల వరుస భేటీలు ఆసక్తిరేపుతున్నాయి. నిన్న కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై చర్చించారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నమే ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. కాగా.. చంద్రబాబు వెళ్లిన మరుసటి రోజే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. కాగా.. నిన్న బీజేపీ పెద్దలతో జరిగిన చంద్రబాబు భేటీలో జనసేన, బీజేపీతో పొత్తు ఖరారైందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ నుంచి నేను తప్పుకోలేదు.. షాకింగ్ కామెంట్స్
అనర్హత నోటీసుపై స్పీకరు తమ్మినేని సీతారాంను వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిశారు. స్పీకర్ తో పర్సనల్ హియరింగ్ కు హాజరుకావడం రెండోసారి అని అన్నారు. మొదటి సారి హాజరైనప్పుడు చాలా వివరాలు అడిగారనీ.. అవన్నీ తాను చెప్పినట్లు ఆనం తెలిపారు. దానికి సంబంధించిన పేపర్స్ ను కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనర్హత నోటీసుపై స్పీకర్ కు 5వ తేదీన తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఇచ్చామని అన్నారు. మీడియాలో ప్రచురించిన వాటిని చీఫ్ విప్ ప్రసాదరాజు ఆధరైజ్ చేసి ఇచ్చారని ఆనం తెలిపారు. వేరే మేనేజ్మెంట్ కు సంబంధించినవి మీరెలా ఆధరైజ్ చేస్తారని అడిగానన్నారు. ఆరోపించిన ప్రసాదరాజు ఆథరైజ్ చేస్తే వాటికి విలువ ఉండదని అన్నారు. పెట్టిన సాక్ష్యాధారాలు ఏవీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం విలువైనవి కావని ఆరోపించారు. ఇవి తీసుకుని మీరెలా చేస్తారని స్పీకర్ ను అడిగినట్లు ఆనం చెప్పారు.
ఎన్నికలకు ముందు, తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోంది
రెండు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడిస్తారని అనుకున్నామన్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్నారు. గవర్నర్ స్థాయి తగ్గించేలా గవర్నర్ స్పీచ్ సిద్ధం చేశారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై, తెలంగాణ అప్పులపై ఎక్కడా స్పీచ్ లో లేదని ఆయన పేర్కొన్నారు. అదే గవర్నర్ ప్రసంగంలో సోనియాగాంధీ గురించి గొప్పలు చెప్పించారన్నారు. జాబ్ క్యాలెండర్ తేదీలతో సహా ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారని, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోయారని నిలదీశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మాత్రమే తిట్టుకుంటాయని, కొట్టుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి ఏర్పడటం ఖాయం..
రాష్ట్ర పరిస్థితులపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి వస్తే పవన్ కల్యాణ్ సిద్ధం అని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పరిపాలన ఎంత గొప్పగా ఉందో వాళ్ళు చెబుతారు.. ఎంత చెత్తగా ఉందో మేం చూపిస్తామని చెప్పారు. కాగా.. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడటం 98శాతం ఖాయమని అన్నారు. 2014లో వచ్చిన ఫలితాల కంటే 30శాతం అధికంగా సీట్లు సాధిస్తాం అని ధీమావ్యక్తం చేశారు.
మోడీ పరిపాలన దక్షత, ఆయన పట్ల తమకు ఉన్న ప్రత్యేక అభిమానం కలిసి పొత్తులు ఏర్పడుతున్నాయని నాగబాబు పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటులో ఇబ్బందులు సహజం అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. మరోవైపు.. 40 సీట్లు జనసేనకు ఇవ్వాలనేది హరిరామజోగయ్య వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు. పెద్దలుగా జోగయ్య సూచనలను గౌరవిస్తాం.. కానీ తమ ప్రాధాన్యత వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పారు.
మీ దగ్గర ఎమ్మెల్యేలు సీఎంని కలిసే వాళ్ళా..
బీఆర్‌ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీ దగ్గర ఎమ్మెల్యేలు.. సీఎం ని కలిసే వాళ్ళా అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్.. హరీష్ దగ్గరికి పోయే వాళ్ళు అని, మీ ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తే సీఎం ని కలుస్తారన్నారు. మల్లారెడ్డి కూడా మా దగ్గరకు రావచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన మాట్లాడటం లేదు కదా అని అన్నారు జగ్గారెడ్డి. 20 మంది ఎమ్మెల్యేలు వచ్చి తీరుతారని ఆయన అన్నారు. మా ప్రభుత్వం పడేస్తాం అంటున్నారు మీరు .. అందుకే 20 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని, మా ప్రభుత్వాన్ని కూల్చడం అంటే… కూలి పోయే కాళేశ్వరం కట్టినట్టు అనుకుంటున్నవా అని ఆయన అన్నారు. నాసిరకం సిమెంట్ తో కట్టినట్టు కాదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 130 ఏండ్ల పునాది కాంగ్రెస్ ది అని, మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండని ఆయన హెచ్చరించారు. జగ్గారెడ్డి కి పదవులు అవసరం లేదని, నేను కాంగ్రెస్ కి ఆయుధమన్నారు జగ్గారెడ్డి. ఆయుధం కి పదవులు అవసరం లేదని, మీకు పోస్టులు ఉంటేనే లీడర్స్ అని ఆయన మండిపడ్డారు. నాకు బ్యాక్ గ్రౌండ్ లేకుండా లీడర్ అయ్యా.. జగ్గారెడ్డి బ్రాండ్ అని ఆయన అన్నారు. . మీలెక్క ఎవరో పేరు చెప్పి నాయకుడిని కాలేదన్నారు జగ్గారెడ్డి. అంతర్యుద్ధం మా దగ్గర కాదు.. మీ పార్టీలో జరిగి తీరుతుందని, మీ పార్టీ లో కేసీఆర్ కి వెనక నుండి గడ్డపార గుచ్చాడానికి హరీష్ సిద్ధంగా ఉన్నాడన్నారు.
పొత్తుల కోసం చంద్రబాబు ఎక్కడికైనా వెళ్తారు..
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అమిత్ షాను కలిశారు.. సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రధానిని కలుస్తున్నారని అన్నారు. పొత్తుల గురించి వెంపర్లాడటం చూస్తే టీడీపీ ఎంత బలహీనంగా ఉందనేది బయటపడుతోందని విమర్శించారు. టీడీపీకి బలముంటే పొత్తుల కోసం ఎవరి వెంట పడాల్సిన అవసరం ఉండదని ఆరోపించారు.
ఇండియాటుడే సర్వేను సీ ఓటర్ సంస్థతో కలసి చేస్తోందని సజ్జల తెలిపారు. గతంలో చేసిన సర్వేల్లోనూ టీడీపీకి ఎక్కువ సీట్లు ఇచ్చారని.. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వారి సర్వే విశ్వసనీయత ఏమిటనేది తెలుస్తుందని అన్నారు. బీజేపీ నేతలను తిట్టిన చంద్రబాబు తిరిగి ఆ పార్టీ నేతలను కలవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబును బీజేపీ నేతలే పిలిచారని ప్రచారం చేసుకుంటున్నారని.. చంద్రబాబు తప్ప మరో అవకాశం లేదన్నట్లు బీజేపీ నేతలు అనుకుంటున్నారని సజ్జల తెలిపారు. బీజేపీ తన స్థాయిని దిగజార్చుకుంటోందని పేర్కొన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం
రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధివిధానాలుండే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్లైన్ విధించారు. రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని సీఎం హెచ్చరించారు. అన్ని రూట్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా మొత్తం బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న ఇసుక రీచ్లు, డంప్లన్నీ తనిఖీలు చేయాలని, తప్పులుంటే జరిమానాలు వేస్తే సరిపోదని, అంతకు మించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.