మోడీ, అమిత్ షాపై సంచలన ఆరోపణలు
మోడీ, అమిత్ షాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. స్టాక్ మార్కెట్ల స్కామ్‌పై జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జూన్3న స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని హోంమంత్రి చెప్పారని.. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇది స్టాక్ మార్కెట్లో అత్యంత పెద్ద స్కామ్ అని చెప్పుకొచ్చారు. స్టాక్ మార్కెట్ల విషయంపై మొదటిసారిగా ప్రధాని మోడీ మాట్లాడారన్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తమ విధులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. జూన్ 3 పెరిగిన స్టాక్ మార్కెట్లు.. జూన్ 4న పడిపోయాయన్నారు. ఎన్నికల అనంతరం మీడియా తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే విషయంలో మోడీ ప్రమేయం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
అందుకే కంగనా రనౌత్‌ని కొట్టా: మహిళా అధికారి..
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి దాడి చేయడం సంచలనంగా మారింది. కుల్విందర్ కౌర్‌గా చెప్పబడుతున్న అధికార కంగనా చెంపపై కొట్టారు. హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి ఢిల్లీ వెళ్తున్న సందర్భంలో కంగనాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. సెక్యూరిటీ చెక్ ముగించుకుని తాను బోర్డింగ్ పాయింట్‌కి వెళ్తున్న సమయంలో మహిళా అధికారి తన మొహంపై కొట్టిందని, ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తే తనను దూషించిందని కంగనా రనౌత్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. తాను క్షేమంగా ఉన్నానని కానీ పంజాబ్‌లో పెరుగుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం గురించి ఆందోళనతో ఉన్నానని ఆమె అన్నారు.
చంద్రబాబు విజయం..హెరిటేజ్ ఫుడ్స్ షేర్లలో భారీ పెరుగుదల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన తర్వాత ఎన్. చంద్రబాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు గత నాలుగు రోజులుగా రికార్డు పనితీరును కొనసాగిస్తున్నాయి. బలమైన పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. గురువారం దాని రోజువారీ గరిష్ట పరిమితి 10 శాతం దాటింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. 1992లో చంద్రబాబు నాయుడు స్థాపించిన ఈ డెయిరీ కంపెనీ దేశవ్యాప్తంగా 10కి పైగా రాష్ట్రాల్లో మార్కెట్ ఉనికిని కలిగి ఉంది. కంపెనీలో 24.37 శాతం వాటా ఎన్. చంద్రబాబు నాయుడు భార్యదే. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో రోజు ట్రేడింగ్ సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 10 శాతం పెరిగి ఒక్కో షేరుకు ₹601.15కి చేరుకున్నాయి. ఉదయం 10:10 గంటలకు ఈ స్టాక్ నిఫ్టీలో 0.62 శాతం అడ్వాన్స్‌తో పోలిస్తే 7.22 శాతం పెరిగి ₹ 585.95 వద్ద ట్రేడవుతోంది. గత నాలుగు రోజుల్లో కంపెనీ మొత్తం 37.25 శాతం లాభాన్ని ఆర్జించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు వీరే..
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశంలో మహిళా ఎంపీల తగ్గుదల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరిగినా, మహిళా ఎంపీలుగా ఎన్నికైనవారి సంఖ్య తగ్గడం గమనార్హం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 73 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్య 78గా ఉంది. దేశవ్యాప్తంగా దిగువ సభకు ఎన్నికైన మొత్తం మహిళా ఎంపీల్లో 11 మంది పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే కావడం విశేషం. ఈ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, బీజేపీ అత్యధికంగా 69 మంది మహిళా అభ్యర్థులను, కాంగ్రెస్ 41 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టింది.
చేవెళ్ల ప్రజలు అవగాహనతో ఓట్లు వేసి గెలిపించారు
చేవెళ్ల ప్రజలు అవగాహనతో ఓట్లు వేసి మోది నీ గెలిపించారని ఎంపీ చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ వేవ్ తోనే చేవెళ్లలో భారీ మెజారిటీ సాధించామన్నారు. షేర్ లింగంపల్లిలో అనుకొని రీతిలో మాకు ఓట్ల మెజారిటీ పెరిగిందని, ఈ సారి పోలీసులు కూడా భాగా పని చేశారు కాబట్టే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మెదక్ లో విజయం రఘునందన్ రావు ను అభినందిస్తున్నానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు సాధిస్తుందన్నారు కొండా. అందుకు అవసరమైన నాయకత్వాన్ని సిద్ధం చేశామని, తెలంగాణ ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
జూన్ 10వరకు ప్రజ్వల్ కస్టడీ పొడిగింపు
లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ పోలీస్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. జూన్ 10 వరకు పొడిగిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో లైంగిక వేధింపుల వీడియోలు బయటకు రాగానే ప్రజ్వల్ జర్మనీకి పారిపోయారు. అనంతరం మే 31న తిరిగి ప్రజ్వల్ ఇండియాకు వచ్చాడు. ఎయిర్‌పోర్టులో దిగగానే సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. గురువారం కస్డడీ ముగియడంతో కోర్టులో హాజరుపరచగా.. జూన్ 10 వరకు పొడిగించింది.
ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని… కానీ మీరు మారిన చంద్రబాబును చూస్తారని.. ఇక అలా ఉండదని.. మీరే ప్రత్యక్షంగా చూస్తారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలతో జరిగిన భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రమూ ఉండదన్నారు. రాజకీయ పరిపాలన సాగుతుందని వెల్లడించారు. ఎంపీలు అందరూ తరుచూ తనను వచ్చి కలవాలని సూచించారు. బిజీగా ఉన్నప్పటికీ మీతో మాట్లాడుతానని స్పష్టం చేశారు.
చిరు కాళ్ళపై పడ్డ పవన్.. ఏడ్చేసిన నాగబాబు
ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో మరోసారి ప్రజల ముందుకు వచ్చారు. 2014లోనే పార్టీ స్థాపించినా, అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం బిజెపి కూటమికి మద్దతుగా నిలిచారు. 2019లో వారిద్దరిని కాదని ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒకే సీటుకి పరిమితమయ్యారు ఇక 2024లో కూటమి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా నిలిచిన పవన్ కళ్యాణ్ తనతో పాటు జనసేనకు 20 మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను గెలిపించుకున్నారు. దీంతో ఎన్డీఏలో ఆయనకు కూడా మంచి ప్రాధాన్యత లభిస్తుంది. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ ఢిల్లీ షటిల్ సర్వీస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఆయన ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.
బీఆర్‌ఎస్, బీజేపీ అధర్మ యుద్ధానికి తెర లేపినా మా బలం పెరిగింది
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ వచ్చాయని, బీఆర్‌ఎస్.. బీజేపీ అధర్మ యుద్ధానికి తెర లేపినా మా బలం పెరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ సీటు కూడా గెలిచామని, ప్రజల కోసం పని చేస్తోంది ప్రభుత్వమన్నారు. బీజేపీ నేతలు నోరుంది కదా అని నోరు పారేసుకోవద్దని, బీజేపీ ది బలుపు కాదు వాపు అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైనా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుందని, 2019 లో కూడా ఇట్లనే మాట్లాడారు కన్ను మిన్ను కానకుండా మాట్లాడారన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ పునరుద్ధరణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పేశాడు!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం -బిజెపి – జనసేన కూటమి భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే క్యాబినెట్లో జనసేన మంత్రులు ఎంతమంది ఉంటారు? బీజేపీ మంత్రులు ఎంతమంది ఉంటారు? అనే విషయం మీద ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవి లభించబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. నిజానికి నాగబాబు గతంలో ఒక వీడియోలో తాను నాస్తికుడు అని చెప్పారు. అయితే ఇప్పుడు నాస్తికుడికి టిటిడి చైర్మన్ పదవి ఎలా ఇస్తారని చర్చ మొదలైంది. నిజానికి అసలు టిటిడి చైర్మన్ గురించి నాగబాబుతో ఎలాంటి చర్చలు జరగలేదని చెబుతూ ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.