అగ్నిప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి బూడిదైన 6 గుడిసెలు
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. మంటలు వ్యాపించకముందే కుటుంబసభ్యులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంటలు వ్యాపించి 6 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. గుడిసెల్లోని తిండి గింజలు , దుస్తులు, సామగ్రి దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో రూ.2 లక్షల నగదు, 2 తులాల బంగారు ఆభరణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో 10 పొట్టేళ్లు సజీవదహనమయ్యాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులు, నిర్మాణ పనులు చేస్తు్న్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి మళ్లీ పూర్తి స్థాయిలో పోలవరం పనులు ముందుకు తీసుకువెళ్లే అంశంపై చర్చించారు. కొత్త డయాఫ్రం వాల్ డిజైన్లు, నిర్మాణ ప్రణాళికపై చర్చలు జరిపారు.
హోంమంత్రి కాకపోతే సీఎం అవ్వు.. పవన్‌పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, ఏపీలో పోలీస్ వ్యవస్థ తీరును అద్దం పట్టేలా ఉన్నాయన్నారు. పోలీసు వ్యవస్థ , హోం శాఖపై డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారని.. ఈరోజు స్వయంగా డిప్యూటీ సీఎం హోంశాఖ విఫలమైందని చెప్పారన్నారు. బయటికి వెళ్తే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారని, డీజీపీకి డిప్యూటీ సీఎం చెప్పుకుంటున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా లేదని డిప్యూటీ సీఎం చెబుతున్నారని.. ఈ విషయం మేము రెండు నెలల క్రితమే చెప్పామన్నారు.
హైడ్రా దెబ్బకు రియల్‌ఎస్టేట్ పడిపోయింది.. కొత్తవి కొనాలన్నా.. పాతవి అమ్మాలన్నా భయమే
హైడ్రా అనే పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు కేవలం బ్లాక్ మెయిల్ దందా చేసే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విధానాల వల్ల భూములు అమ్మడంలో జాప్యం అవుతూ రియల్టర్లు, బిల్డర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీలో తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ పాలన వల్ల భవన నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం బిల్డర్లకు కనీసం పర్మిషన్లు కూడా పొందడం చాలా కష్టమైంది. బిల్డర్లు ఎక్కువ పెట్టుబడులు పెట్టి, కానీ భూములు అమ్మలేకనే పోతున్నారు’’ అని ఆయన తెలిపారు.
రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదుకు ఇబ్బందులు వస్తున్నట్టు ఇప్పటికే గుర్తించారు. వైసీపీ హయాంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం భూ ఆక్రమణల పైనే ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుత చట్టంతో అక్రమార్కులపై చర్యలకు ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీని స్థానంలో కొత్త చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన మందకృష్ణ పలు అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు వివిధ అంశాలపై సీఎంతో చర్చించారు. మందకృష్ణ తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ మొదలుపెట్టి వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గంట పాటు మాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
వరంగల్ వాసులకు శుభవార్త.. ఇది మామూలు ముచ్చట కాదు..!
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధి కోసం కీలక ప్రకటన చేశారు. “విజన్-2025” పేరుతో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా, వరంగల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇటీవల వరంగల్ పర్యటనలో ఉన్న మంత్రి, నగర అభివృద్ధిపై చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. “వరంగల్‌ను తెలంగాణ రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలని మా లక్ష్యం. మన నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం,” అని మంత్రి చెప్పారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నారా బ్రాహ్మణి
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే కూటమి గెలుపు కోసం చంద్రబాబు కుటుంబంలోని ప్రతి ఒక్కరు ప్రచారంలో పాల్గొని విజయం కోసం కృషి చేశారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ప్రచారం చేశారనే విషయం తెలిసిందే. ఈ ప్రచారం సమయంలో మంగళగిరిలో ఇచ్చిన హామీని నారా బ్రాహ్మణి తాజాగా నెరవేర్చారు.
కులగణనకు తెలంగాణనే దేశానికి రోల్‌మోడల్ కానుంది
కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. టైటానిక్ పడవ ను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారన్నారు. కానీ సముద్రంలో ఒక మంచు కొండను డీ కొని 20 నిమిషాలలలో మునిగిపోయిందని, ఎందుకు అంటే సముద్రంలో ఆ మంచు కొండ 10 శాతం మాత్రమే బయటకు కనిపించిందన్నారు రాహుల్ గాంధీ. మిగతా అంత లోతుగా ఉండి బయటకు కనిపించింది అది తెలియక ఆ పడవ కుప్ప కూలిందని, అలాగే నేడు సమాజంలో కుల వివక్ష కూడా లోతుగా బలంగా ఉందన్నారు. దేశంలో కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుందని, మేము దేశంలో కుల వివక్ష అనే వ్యాధి గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంతున్నామన్నారు రాహుల్ గాంధీ. అందుకే కుల ఘనన అనేది అత్యంత కీలకమని, కులగణన చేస్తే ఏ కులం వాళ్ళు ఎంత మంది ఉన్నారు.. ఎవరు పేదలు, ఎవరికి ఏముంది అని తెలుసుకోవాలన్నారు. ఏదైనా వ్యాధి తెలియాలంటే ఏక్షరే చేయాలి కదా అని ఆయన వ్యాఖ్యానించారు. మేము కుల ఘనన చేస్తం ఎవరికి ఏముందో తెలుసుకుందాం అంటే ప్రధాని.మోడీ ఎందుకు అడ్డుగా మాట్లాడుతున్నారని, మేము దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారని ఆయన అన్నారు.
ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలి..
కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కులగణన సంప్రదింపుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పౌరసమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ గారు ఇక్కడకు రావడం గొప్ప విషయమని, ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చారని, మాటలు కాదు… చేతలతో చూపాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే మన కర్తవ్యమన్నారు సీఎం రేవంత్.