నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు
భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 27) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
దేశం ఆర్థిక వేత్తను కోల్పోయింది.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రుల సంతాపం!
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఇక, మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శనివారం అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అస్తమయం చెందారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ మృతికి పలువురు ప్రముఖుల సంతాపం తెలియజేస్తున్నారు. మన్మోహన్ సింగ్ నివాసానికి పలువురు ప్రముఖులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూమార్గ్‌లోని తన నివాసంలో మన్మోహన్ పార్ధీవ దేహం ఉంచారు. రేపు (శనివారం) మన్మోహన్ సింగ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి వర్గం సమావేశం జరగనుంది. మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాపదినాలు ప్రకటించనున్నారు. కాంగ్రెస్ కూడా పార్టీ కార్యక్రమాలను అన్నింటిని రద్దు చేసింది.
మన్మోహన్ సింగ్ మరణం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి
భారత మాజీ ప్రధానమంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి అపార లోటని పేర్కొన్నారు. జ్ఞానం, వినయం, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన మన్మోహన్ సింగ్ మహా మేధావి, ప్రగాఢ రాజకీయ దూరదృష్టిగల నేతగా కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ఆత్మీయులకు గురువారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మరణం పట్ల మంత్రి నారా లోకేశ్ కూడా ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
మన్మోహన్ సింగ్ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధానిని గొప్ప ఆర్థికవేత్తలు, నాయకులు, సంస్కర్త , అన్నింటికంటే మానవతావాది అని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని, అన్నింటికీ మించి నిర్ణయం తీసుకోవడంలో మానవీయ స్పర్శతో గుర్తించబడ్డారని రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవ భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పిలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరని, రాజకీయ , ప్రజా జీవితానికి మర్యాద , తరగతి ఎంత అవసరమో చూపించాడు. మాజీ ప్రధాని మృతితో భారతదేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని అన్నారు. “నిజంగా, అతని స్వంత మాటలలో, చరిత్ర అతనిని చాలా దయగా , గౌరవంగా చూస్తుంది, బహుశా అతని స్వంత కాలం కంటే,” అన్నారాయన.
విరాట్ కోహ్లీపై చేయి వేసిన అభిమాని.. మెల్‌బోర్న్ మైదానంలో కలకలం!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్టేడియంలోని ఓ అభిమాని బారికేడ్లు దాడి మరీ మైదానంలోకి దూసుకొచ్చి.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఆలింగనం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. హగ్ చేసుకొనేందుకు కుదరకపోవడంతో.. కోహ్లీపై చేయి వేసి పోజులు ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు..
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. మన్మోహన్ మృతి పట్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేశారు. నిరాడంబర జీవితం, దేశం పట్ల వారి అంకిత భావం, భావితరాలకు స్ఫూర్తి దాయకం అన్నారు.
నాచారంలో యువతి ఆత్మహత్య.. నా చావుకు కారణం వారే అంటూ సెల్ఫీ వీడియో..
నాచారంలో యువతి ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీప్తి అనే యువతి బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. నాచారం హెచ్ఎంటి నగర్ సరస్వతి కాలనీలో తన తల్లితో నివాసం ఉంటుంది. దీప్తి తార్నాక ఐఐసిటీలో పరిశోధక విద్యార్థినీ. దీప్తి తండ్రి సంగీతరావు. తండ్రితో వేరుగా దీప్తి రెండు సంవత్సరాల నుండి తన తల్లితో కలిసి వేరుగా ఉంటుంది. ఐజీ ఆఫీసులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బిల్ల అనిల్ అనే వ్యక్తి తన భార్య కోసం ఐఐసిటిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం, దీప్తి తండ్రి సంగీత రావుకు రూ.15 లక్షలు డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. దీప్తి తండ్రి సంగీతరావు ఉద్యోగం కోసం అనిల్ వద్ద డబ్బు తీసుకున్న విషయం దీప్తికి తెలియదు.
నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు రద్దు..
నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్యాబినెట్ సంతాపం తెలపనుంది. అలాగే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు (డిసెంబర్ 28) ఢిల్లీలో జరగనుండగా.. కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర సర్కార్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. మన్మోహన్ మృతి పట్ల మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇక, ఇవాళ జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ..
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఈ కేసును విచారించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం.. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని, అయితే విచారణ కొనసాగించవచ్చని ఆదేశించింది.