తజకిస్తాన్‌లో భారీ భూకంపం..
టర్కీ భూకంపం తరువాత ప్రపంచంలో వరసగా పలు దేశాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. నిన్న ఇండియా, నేపాల్ లో భూకంపం సంభవించింది. న్యూఢిల్లీ, చెన్నై నగరాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాజాగా తజకిస్తాన్ లో భారీ భూకంపం వచ్చింది. గురువారం తూర్పు తజకిస్తాన్ లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.37 గంటలకు, భూ ఉపరితం నుంచి 20.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్, చైనా సరిహద్దుల్లోని గోర్నో-బదక్షన్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. 6.8 తీవ్రతతో భూకంపం వచ్చిన 20 నిమిషాల తరువాత మరోసారి 5.0 తీవ్రతో మరో భూకంపం వచ్చింది. తక్కువ జనాభా కలిగి ఉన్న పామిర్ పర్వత ప్రాంతాల్లో భూకంపం రావడం వల్ల పెద్దగా నష్టం కలగలేదని తెలుస్తోంది.
నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్
కొన్నాళ్లుగా భారత మహిళల జట్టుకు అందని ద్రాక్షగా మారిన ప్రపంచకప్ కు అడుగుదూరంలో హర్మన్‌ప్రీత్ సేన ఉంది. ఆస్ట్రేలియా సొంతగడ్డపై గత మెగా ఈవెంట్ ఫైనల్లో మన ‘ప్రపంచకప్’ కలని కలగానే మిగిల్చింది. మళ్లీ బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ‘స్వర్ణ’వకాశాన్ని ఎగరేసుకు పోయింది. ఈ రెండు ఫైనల్స్‌లో ఓడిన భారత్ చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. హర్మన్‌ప్రీత్ సేనకు మళ్లీ ఆసీస్ ను దెబ్బతీసే అవకాశం వచ్చింది. ఇప్పుడు సమష్టిగా కృషి చేస్తే ఆసీస్‌ను దెబ్బకొట్టి ఫైనల్ పోరుకు అర్హత సాధిచొచ్చు.
భారత అమ్మాయిలు రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్రపంచకప్ చేతికి అందుతుంది. ఇందులో మొదటి అడుగు వేసేందుకు భారత మహిళల జట్టు నేడు ఆస్ట్రేలియాతో తొలి సెమీఫైనల్లో తలపడుతుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ ఫిబ్రవరి 23న గురువారం టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. మ్యాచ్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి టాస్ 6 గంటలకు ఉంటుంది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టాస్ పాత్ర కూడా కీలకం కానుంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమిండియా ఫైనల్స్‌కు చేరుకుని గతంలో ఆస్ట్రేలియాతో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవచ్చు.
నేడు భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటన.. 6 ప్రారంభోత్సవాలు, 2 శంకుస్థాపనలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి కేటీఆర్ చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు 6 ప్రారంభోత్సవాలు, 2 శంకుస్థాపనలు చేయనున్నారు మంత్రి కేటీఆర్. ఇటీవల నిర్మించిన సింగరేణి కార్మికుల కోసం జిల్లా కేంద్రంలో సింగరేణి సంస్థ రూ. 229 కోట్ల వ్యయంతో నిర్మించిన 994 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం, జిల్లా కేంద్రంలోని వేశాలపల్లిలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33.08 కోట్లతో నిర్మించిన 544 డబుల్ బెడ్ రూం ఇళ్లు, రూ.3 కోట్లతో నిర్మించిన ఆర్ అండ్ బీ అతిథి గృహం, గణపురం మండల కేంద్రంలో రూ. రూ.4 కోట్లతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం, రూ.4 కోట్లతో నిర్మించిన మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల భవనాన్ని, రూ.14.59 లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల సముదాయాన్ని, వికలాంగుల సౌకర్యార్థం రూ.23 లక్షలతో వికలాంగుల కోసం నూతన భవనాలు నిర్మానాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అంతే కాకుండా.. రూ.1.50 కోట్లతో నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రూ.4.50 కోట్లతో చేపట్టే సింగరేణి మినీ స్టేడియం పనులు, రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సాయం త్రం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సభికులనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు గోల్డ్ మెడల్
కైరోలో బుధవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2023 లో భారతదేశంకు స్వర్ణం దక్కింది. దీంతో భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణం చేరింది. పోటీలో నిలిచిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ పురుషుల 50 మీ రైఫిల్ 3 స్థానాల బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ రెండవ షూటింగ్ ప్రపంచ కప్ బంగారు పతకం. న్యూ ఢిల్లీలో జరిగిన 2021 ప్రపంచ కప్‌లో తొలిసారిగా బంగారు పతకం గెలుచుకున్నాడు. ఫైనల్లో 22 ఏళ్ల ప్రతాప్ సింగ్ 16–6తో అలెగ్జాండర్ షిమిర్ల్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్ రౌండ్‌లో షిమిర్ల్, ప్రతాప్ సింగ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్ చేరారు. భారత్‌కే చెందిన అఖిల్ షెరాన్ ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ రెండో ర్యాంకింగ్ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్, ఇషా సింగ్ క్వాలిఫయింగ్‌లో వరుసగా 32వ, 34వ స్థానాల్లో నిలిచారు.
మంత్రుల ఖర్చులు, ఐఎస్ఐ నిధుల్లో కోత.. ఆర్థిక సంక్షోభం నుంచి బయపడేందుకు పాక్ చర్యలు..
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న దాయాది దేశం పాకిస్తాన్ బయటపడేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అప్పుకోసం అనేక పన్నులు విధించిన ఆ దేశం ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. తాజాగా మంత్రుల, సలహాదారుల అలవెన్సులు, ప్రయాణ ఖర్చులను తగ్గించనున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అనని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాల ఖర్చులను 15 శాతం తగ్గించాలని ఆదేశించామని, జీతాలు, అలవెన్సులు, లగ్జరీ కార్లు, విదేశీ పర్యటనలు, బిజినెస్ క్లాస్ ప్రయాణాలు విరమించుకోవాలని కోరినట్లు ప్రధాని వెల్లడించారు. దీని వల్ల 766 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని ఆయన అన్నారు. దీంతో పాటు పాకిస్తాన్ లో అత్యంత కీలకంగా ఉండే నిఘా సంస్థ ఐఎస్ఐ తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి ఇచ్చే నిధులపై పరిమిత విధించింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇక ఉచిత విద్యుత్ ఉండబోదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంపై నిషేధం, మూడేళ్లుగా భర్తీ కాకుండా ఉన్న పోస్టులను తొలగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చరణ్ సినిమాని కోటి మంది చూస్తారు… నెపోటిజంపై నాని సెన్సేషనల్ కామెంట్స్
నెపోటిజం… ఏ ఇండస్ట్రీలో అయినా ఉండేదే కానీ చిత్ర పరిశ్రమ ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ ఫ్యామిలీ నుంచి హీరోలని లాంచ్ చెయ్యడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ నెపో కిడ్స్ కారణంగా యంగ్ టాలెంట్ కి అవకాశాలు రావట్లేదు అనే మాట ఉంది. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉండే బాలీవుడ్, ప్రస్తుతం ఉన్న కష్టాలకి కారణం హిందీ చిత్ర పరిశ్రమ మొత్తం స్టార్ కిడ్స్ తో నిండి ఉండడమే. కరణ్ జోహార్ లాంటి దర్శక నిర్మాతలు నెపోటిజంని సపోర్ట్ ని చేస్తూ కొత్త టాలెంట్ ని అన్యాయం చేస్తున్నారు, అవకాశాలు ఇవ్వట్లేదు అని కామన్ ఆడియన్స్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. నెపోటిజంకి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా చేశారు నార్త్ ఆడియన్స్. సుశాంత్ సింగ్ చనిపోవడం నెపోటిజంపై చర్చ మరింత పెరిగేలా చేసింది.
ఇష్యూని డైవర్ట్ చేయడానికే నిమ్స్ కి తీసుకొచ్చారు : మెడికో ప్రీతి తండ్రి
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా వైద్య విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. సీనియర్ల వేధింపుతో పీజీ చేస్తున్న మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసుకుందన్న విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా వైద్య విభాగంలో చర్చకు దారి తీసింది. పీజీ లోనూ ర్యాగింగ్ జరుగుతుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే.. సీనియర్ విద్యార్ధి వేధింపులు తట్టుకోలేక దరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యయత్నం చేసుకున్న ప్రీతిని ఇవాళ వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించిన అధికారులు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి ప్రీతి నీ తీసుకొని వచ్చిన అధికారులు. అయితే దీనిపై మెడికో ప్రీతి తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. వైద్య చికిత్సకు ఆమె శరీరం సహకరించట్లేదని కన్నీరుమున్నీరు అయ్యారు. ఇష్యుని డైవర్ట్ చేయడానికే నిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 20 వ తేది రాత్రి కాలేజీ దగ్గరికి వెళ్ళానని, ప్రీతి ఉన్నతాధికారులకు వేధింపులుపై చెప్పానని అన్నారు. కాని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. సీనియర్లు కదా మామూలుగా ర్యాగింగ్ ఉంటుంది అనుకున్నామని, గిరిజన యువతివంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురి చేశారని తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.