స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు మూడు రెట్లు పెరిగాయ్
2023తో పోలిస్తే 2024లో భారతీయులు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు మూడు రెట్లు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (సుమారు రూ. 37,600 కోట్లు) చేరుకుంది. స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా స్విస్ బ్యాంకుల్లో ఉంచిన డబ్బులో భారీ పెరుగుదల కారణంగా ఈ పెరుగుదల సంభవించింది. 2023లో, ఈ మొత్తం నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు పడిపోయింది. స్విస్ నేషనల్ బ్యాంక్ (SNB) అధికారిక డేటా స్విట్జర్లాండ్‌లో భారతీయులు దాచిపెట్టిన నల్లధనాన్ని వెల్లడించలేదు. స్విట్జర్లాండ్ భారతీయుల డబ్బును నల్లధనంగా పరిగణించదు. పన్ను ఎగవేతకు వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశానికి మద్దతు ఇస్తామని స్విట్జర్లాండ్ చెబుతోంది.
ఇరాన్‌పై దాడి.. రెండు వారాల్లో నిర్ణయం..
ఇరాన్ సైనిక, అణు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో చేరాలా వద్దా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ ప్రకటించింది. ఇజ్రాయెల్, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా డిమాండ్లకు సంబంధించి దౌత్యం కోసం ట్రంప్ ఇప్పటికీ ఒక అవకాశాన్ని చూస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది. “ఇరాన్‌తో సమీప భవిష్యత్తులో చర్చలు జరిగే అవకాశం ఉందా లేదా అనే దానిపై ఆధారపడి, రాబోయే రెండు వారాల్లో నేను నా నిర్ణయం తీసుకుంటాను” అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ట్రంప్ విలేకరులతో చెప్పినట్లు ఉటంకించారు. ట్రంప్ అమెరికాకు ఏది మంచిదో అది చేస్తారని తాను విశ్వసిస్తున్నానని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఆయన ఇప్పటికే చాలా సహాయం చేస్తున్నారు.
కుమారుడి పెళ్లి గురించి నెతన్యాహు భావోద్వేగం.. సోషల్ మీడియాలో విమర్శలు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడి పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. ఇరాన్‌తో యుద్ధం కారణంగా రెండోసారి తన కుమారుడి పెళ్లి వాయిదా వేయాల్సి వచ్చిందని.. ఇది వ్యక్తిగత నష్టంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అయితే గురువారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణి కారణంగా ఇజ్రాయెల్‌లోని బీర్ షెవాలోని సోరోకా ఆస్పత్రి ధ్వంసమైంది. ఈ ఆస్పత్రిని నెతన్యాహు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కుమారుడి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి.. యుద్ధం కారణంగా తన కుమారుడు అవర్న్ వివాహాన్ని వాయిదా వేయల్సి వస్తోందని.. అంతేకాకుండా అవర్న్‌కు కాబోయే భార్య కూడా తీవ్ర నిరాశకు గురవుతుందని.. ఇక తన భార్య సారా నెతన్యాహు అయితే ఇంకా తీవ్రంగా బాధపడుతుందని.. నిజంగా ఆమె హీరో అంటూ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. యుద్ధం కారణంగా తన కుటుంబమంతా వ్యక్తిగతంగా భారీ నష్టాన్ని ఎదుర్కొంటోందని… తన కుటుంబం చేస్తున్న త్యాగం చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు.
నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు విశాఖకు రానున్నారు. ప్రధాని శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్‌కు వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. రాత్రికి తూర్పు నౌకాదళం గెస్ట్ హౌస్‌లోనే బస చేస్తారు.
శనివారం ఉదయం 6.25కు రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం సాగరతీరంలోని ఆర్కే బీచ్‌కు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఉదయం 6.30 నుంచి 7.50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా విన్యాసాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. అలానే యోగా విన్యాసాల్లో 5 లక్షలు మంది ప్రజలు పాల్గొననున్నారు. యోగా కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ మాట్లాడతారు.
ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి.. పాల్గొన్న సెలబ్రెటీలు
జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం రంగురంగుల తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా జూన్ 20న 24 గంటల ముందు కౌంట్‌డౌన్ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసిన ఘనత భారత్‌దే అని పలువురు ప్రముఖులు ఈ వేడుకల సందర్భంగా తెలియజేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అందరూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర బొగ్గు, ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, శాసన సభ్యులు, ఎంపీలు, సినీ ప్రముఖులు, యోగా గురువులు హాజరయ్యారు. సినీ నటి ఖుష్బూ సుందర్, మీనాక్షి చౌదరి, సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జ లాంటి తారలు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖుష్బూ సుందర్ యోగా ప్రాముఖ్యతను వివరించారు.
ఎయిరిండియా కీలక నిర్ణయం.. అంతర్జాతీయ సేవలు కుదింపు
ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సేవలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. జూన్ 12 అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 16 అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇక 3 నగరాలకు కార్యకలాపాలను కూడా నిలిపేసింది. ఘోర విమాన ప్రమాదం తర్వాత నిత్యం అంతరాయాలతో సతమతమవుతున్న టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యమని పేర్కొంది.
నేడు కడప కార్పొరేషన్ సమావేశం.. భారీ బందోబస్తు ఏర్పాటు! కుర్చీ గోలకు పుల్‌స్టాప్
నేడు కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. శుక్రవారం ఉదయం జరిగే ఈ సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈరోజు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగకుంటే.. బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. గత ఆరు నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు. ఆరు నెలలు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే.. మున్సిపల్ ఆక్ట్ ప్రకారం కమిటీ రద్దయ్య అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఎలాగైనా నిర్వహించాలని వైసీపీ చూస్తోంది. కార్పొరేషన్ సమావేశం జరగకుండా అడ్డుకుంటారని, భద్రత కల్పించాలంటూ ఇప్పటికే కోర్టును మేయర్ సురేష్ బాబు ఆశ్రయించారు. కడప మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 53 మంది ఏఎస్ఐలు,110 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 4 స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరా, నేత్రా-వజ్ర వాహనం ద్వారా నిఘా పెట్టారు. ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ వద్దకు పోలీసులు స్పెషల్ పార్టీ బలగాలు చేరుకుంటున్నాయి.