సైన్యం భారీ ఆపరేషన్.. మణిపూర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతం..
మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్‌కు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మయన్మార్ సరిహద్దులోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో సమాచారాన్ని పంచుకుంటూ.. భారత సైన్యం తూర్పు కమాండ్ మే 14న, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని ఖెంగ్‌జోయ్ తహసీల్‌లోని న్యూ సమతాల్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ యూనిట్ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించిందని తెలిపింది. ఈ ప్రాంతం భారతదేశం-మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇది తరచుగా ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుంది.
పర్సనల్ కాదు, ప్రభుత్వానికి ప్రభుత్వమే..! జెట్ విమానం బహుమతిపై ఖతార్ ప్రధాని వివరణ
ఖతార్ నుండి అమెరికాకు ఇచ్చే లగ్జరీ జెట్ విమానం బహుమతి వివాదంపై ఆ దేశ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ స్పందించారు. ఇది వ్యక్తిగతంగా ట్రంప్‌కు ఇచ్చే బహుమతిగా కాకుండా, ప్రభుత్వ స్థాయిలో జరిగిన లావాదేవిగా ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మిడిల్ ఈస్ట్ పర్యటనలో భాగంగా ఖతార్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా ఖతార్ అమెరికాకు లగ్జరీ విమానం అందించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విమానాన్ని ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు లేదా పదవీ విరమణ అనంతరంగానైనా వాడే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో అమెరికాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి.
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. హిట్టర్ వచ్చేశాడు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2025 కోసం వెస్టిండీస్ హిట్టర్ రొమారియో షెపర్డ్ భారత్‌కు వచ్చేశాడు. ఈ విషయాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మెంటర్ డ్వేన్ బ్రావో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపాడు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో విండీస్ వెళ్లిన షెపర్డ్.. తిరిగి భారత్ చేరుకున్నాడు. వాయిదా పడిన ఐపీఎల్ 2025 ఈ నెల 17 నుంచి పునః ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రొమారియో షెపర్డ్ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. చెన్నైపై ఒకే ఓవర్లో 30 పరుగులు చేసి ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆర్సీబీ ఆటగాడిగా షెపర్డ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్‌తో మే 29న వన్డే సిరీస్ ప్రారంభం అవుతుండగా.. వెస్టిండీస్ వన్డే జట్టులో షెపర్డ్ పేరు ఉంది. మే 29 నుంచే ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌లు ప్రారంభమవుతాయి. ఐపీఎల్ కోసం విండీస్ ప్లేయర్స్ భారత్‌లో ఉండటానికి అనుమతిస్తారా లేదా అనేది క్రికెట్ వెస్టిండీస్ ఇంకా ధృవీకరించలేదు.
జమ్ము కాశ్మీర్లో మరో ఎన్‌కౌంటర్.. కొనసాగుతున్న ఉగ్ర వేట
జమ్ము కాశ్మీర్లో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. టెర్రర్ ఫ్రీ కాశ్మీర్ కోసం ఉగ్ర వేట కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని త్రాల్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. జైషే మహ్మద్ కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో దాక్కున్నట్లు సమాచారం.ఈ ఎన్‌కౌంటర్ త్రాల్‌లోని నాదిర్ గ్రామంలో జరుగుతోంది. పుల్వామాలో 48 గంటల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్. మంగళవారం ఉదయం షోపియన్‌లో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతమయ్యారు.
నేడు అమ్మనబ్రోలులో మంత్రి నారా లోకేష్ పర్యటన!
ఇవాళ ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇటీవల ఒంగోలులో హత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి ఏప్రిల్ 22న రాత్రి 7.30 గంటల సమయంలో ఒంగోలులోని ఆయన కార్యాలయంలో దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయన్ను 53 సార్లు విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరతారు. 8:45 గంటలకు చదలవాడలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి 9.20 గంటలకు రోడ్డు మార్గాన అమ్మనబ్రోలు వెళ్తారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10:30 గంటలకు చదలవాడలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుని.. తిరిగి బయలుదేరతారు. అక్కడ నుంచి మంత్రి నారా లోకేష్ అనంతపురం వెళ్తారు.
తెలంగాణలో తొలి సరస్వతి పుష్కరాలు ప్రారంభం
తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గురువారం తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వరాలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై, నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీ మాతకు చీర, సారె, ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. మంత్రి శ్రీధర్‌బాబు తన కుటుంబంతో కలిసి పుష్కర స్నానం చేసి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం తరఫున త్రివేణి సంగమం వద్ద విశేష ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలో తొలి సరస్వతి పుష్కరాలు ప్రారంభం
తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గురువారం తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వరాలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై, నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీ మాతకు చీర, సారె, ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. మంత్రి శ్రీధర్‌బాబు తన కుటుంబంతో కలిసి పుష్కర స్నానం చేసి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం తరఫున త్రివేణి సంగమం వద్ద విశేష ఏర్పాట్లు చేశారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా కుటుంబ సభ్యులపై కేసు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా కుటుంబ సభ్యులపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది. పుంగనూరు నియోజకవర్గం మంగపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు చేపట్టింది. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడు భార్య ఇందిరమ్మపై కేసు నమోదు చేశారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో 28.19 ఎకరాలు ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారుల నిర్ధారించారు. ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కెనడా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న భారతీయ మూలాలు ఉన్న ఎంపీలు..!
కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ తన 28 మంది సభ్యుల మంత్రివర్గంలో నలుగురు భారతీయ మూలాల ఎంపీలకు చోటు కల్పించారు. ఈ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్ నియమితులవడంతో భారతీయ సభ్యులలో ఆనందం కలిగించింది. మార్చిలో జస్టిన్ ట్రూడో నుండి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కార్నీ, ఏప్రిల్ 28న జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో లిబరల్ పార్టీకి విజయం సాధించారు. కార్నీ ప్రజల మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని తన మంత్రివర్గాన్ని ఎంపిక చేశారని తెలిపారు. ఇందులో భాగంగా హిందూ మతానికి చెందిన తొలి మహిళగా కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులైన అనితా ఆనంద్, భగవద్గీతపై చేతి ఉంచి ప్రమాణం చేశారు. గత మంత్రివర్గంలో ఆమె ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మెలనీ జోలీ స్థానంలో ఆమెకు ఈ కీలక బాధ్యత అప్పగించారు.
బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం..!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో గురువారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదం అందరినీ కలిచివేసింది. ఢిల్లీ నుండి బీహార్ వెళ్తున్న ఓ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన లక్నో నగరంలోని మొహన్‌లాల్‌గంజ్ సమీపంలోని కిసాన్‌పథ్ వద్ద చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో ప్రయాణికుల సంఖ్య దాదాపు 60మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులలో చాలా మంది నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా బస్సులో పొగ వ్యాపించడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అయితే, డ్రైవర్ కేబిన్ వద్ద అదనంగా సీటు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు బయటికి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ విషయానికి వస్తే, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, , హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా , అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న కొన్ని గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.