బంగారం ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
బంగారం ప్రియులకు అలర్ట్. ఇటీవల పెరిగిన పసిడి ధరలు దిగొస్తున్నాయి. వరుసగా 3-4 రోజులు తగ్గిన గోల్డ్ రేట్స్ నేడు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ కొనాలనుకునే వారు ఇప్పుడే కొంటే బెటర్. ఎందుకంటే పసిడి ధరలు మళ్లీ పెరగొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయన్న సంగతి తెలిసిందే.
బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఆగష్టు 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,620గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో తులం బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,760గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా కొనసాగుతోంది.
ప్రభుత్వాసుపత్రిలో ఒక్క రోజే 18 మంది మృతి.. మహారాష్ట్రలోని థానేలో ఘటన
సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలు వస్తుంటారు. అందులో పెద్ద వయస్సు వారు కూడా ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రులకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా వస్తుంటారు. కొన్నిసందర్భాల్లో సీరియస్ అయిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. మహారాష్ట్రలోని ప్రభుత్వాసుపత్రిలో ఒక్క రోజే 18 మంది మరణించారు. మరణించిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. మరణించిన వారిలో కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఒక్క రోజులోనే 18 మంది మరణించడంతో ఆసుపత్రి దగ్గర ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
తిరుమల కాలినడక భక్తులకు ఊరట.. బోనులో చిక్కిన చిరుత!
తిరుమల కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊరట లభించింది. తాజాగా తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన చిరుత బోనులో చిక్కింది. తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడవ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అది పెద్ద చిరుత అని, దాని వయసు 5 సంవత్సరాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత తన తల్లిదండ్రులతో కలిసి అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా.. చిరుత ఒక్కసారిగా దాడి చేసి చంపేసింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. కాలినడక మార్గంలో వెళ్లే భక్తులు బయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అటవీ అధికారులు నాలుగు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. పాద ముద్రల ఆధారంగా 5 చిరుతపులు ఉన్నట్లు గుర్తించారు.
పంద్రాగస్టు రోజున ట్రాఫిక్ ఆంక్షలు.. గోల్కొండకు వెళ్లే వారికి సూచనలు..
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ప్రధానంగా.. ఆగస్టు 15న గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆంక్షల సమయంలో రామ్‌దేవ్‌గూడ నుండి గోల్కొండ కోట వరకు రహదారిని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
అయితే స్వతంత్ర వేడుకల్లో పాల్గొనే వారికి అధికారులు ఇప్పటికే పాస్‌లు జారీ చేశారు. ఆ మార్గంలో ఎ-గోల్డ్, ఎ-పింక్, బి-బ్లూ పాస్‌లు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. సీ, డీ, ఈ పాస్‌లు ఉన్నవారిని ఇతర మార్గాల ద్వారా అనుమతిస్తామని తెలిపారు. బాటసారులు ఉన్నట్లయితే, సికింద్రాబాద్ నుండి వచ్చే వారు బంజారాహిల్స్, మెహిదీపట్నం, రేతిబౌలి, నాలానగర్, లంగర్ హౌస్ వంతెన, రాందేవ్‌గూడ మీదుగా గోల్కొండకు చేరుకోవాలి. ఇంకా.. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో వాహనదారులకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఈ బ్లాక్ పాస్ ఉన్న సామాన్య ప్రజలు తమ వాహనాలను హుడా పార్కులో పార్క్ చేసి వేడుకలకు హాజరుకావాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
స్నేహితులతో క్రికెట్ ఆడుతూ.. 22 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి!
దేశంలో గుండెపోటుతో ఆకస్మిక మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో అనధికారికంగా వందలాది మంది మృతి చెందారు. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. యువకులు కూడా గుండెపోటుతో చనిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని ఓ యువకుడు స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.
బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన 22 ఏళ్ల మహేంద్ర ఆదివారం మధ్యాహ్నం క్రికెట్ ఆడాడు. కాలనీ సమీపంలో తన స్నేహితులతో కలిసి ఆడుతూనే అతడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కంగారుపడిపోయిన స్నేహితులు చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. స్థానికులు వెంటనే మహేంద్రను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మహేంద్ర అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. చేతికందివచ్చిన కొడుకు హఠాత్తుగా దూరమవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. టీ-24 టికెట్లలో భారీ డిస్కౌంట్..!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ నగరంలోని సాధారణ ప్రయాణికులకు టిక్కెట్లపై భారీ తగ్గింపును ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వృద్ధులకు టికెట్‌పై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక.. హైదరాబాద్ నగరంలో 24 గంటలపాటు అపరిమిత ప్రయాణానికి టీ-24 టికెట్ రూ.లకే ఇవ్వాలని నిర్ణయించారు. 75.. అదే T-24 టిక్కెట్టు పిల్లలకు కేవలం రూ. 50. అయితే, ఈ తగ్గింపులు ఆగస్టు పదిహేనవ తేదీన మాత్రమే చెల్లుబాటు అవుతాయని TSRTC యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం టి-24 టిక్కెట్టు సాధారణ ప్రయాణికులకు రూ.120, మహిళలు మరియు సీనియర్ సిటిజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80గా ఉంది. అయితే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అందిస్తున్న రాయితీలకు సంబంధించి పూర్తి వివరాల కోసం టీఎస్‌ఆర్‌టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లో సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
మ్యూజికల్ కాన్సర్ట్ తేదీ ప్రకటించిన మేకర్స్..
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కింది.ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా..మైత్రి మూవీ సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. అలాగే ఈ సినిమాకు హసన్ అబ్దుల్ వాహీద్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలను విడుదల చేయగా ఆ మూడు పాటలు కూడా చాట్ బస్టర్ గా నిలిచాయి.. అలాగే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..
దళితులపై ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
రాజకీయ నాయకులు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తుంటారు.. తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై కూడా విమర్శలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని వర్గాలపై అనుకోకుండా మాట్లాడేస్తారు.. అలా మాట్లాడిన మాటలు వివాదస్పదంగా మారుతుంటాయి. ఇలా వివాదస్పదమైన మాటలపై రాజకీయ నాయకులు వెంటనే క్షమాపణలు చెబుతుంటారు. అలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. కన్నడ నటుడు ఉపేంద్ర దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ పార్టీ ‘ప్రజాకీయ’ గురించి మాట్లాడుతూ ‘కొంత మంది ఇష్టానుసారం, వారి మైండ్‌కు తోచినట్టుగా మాట్లాడుతారని.. ఒక పట్టణం ఉందనుకోండి, అనివార్యంగా దళితులు కూడా ఉంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఉపేంద్రపై బెంగళూరులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఓటమి కూడా మంచిదే.. చాలా సంతోషంగా ఉన్నా! హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు
వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడిన భారత్.. ఆ తర్వాత రెండు టీ20ల్లో పుంజుకొని 2-2తో సమం చేసింది. ఇక కీలకమైన ఐదో టీ20లో మాత్రం చేతులెత్తేసి.. 3-2తో సిరీస్ కోల్పోయింది. ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. తొలిసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత్ సిరీస్ ఓడిపోవడం గమనార్హం. మ్యాచ్ అనంతరం ఓటమిపై హార్దిక్ మాట్లాడాడు.
ఓటమి కూడా ఒక్కోసారి మంచిదే అని, చాలా నేర్చుకోవచ్చని ఐదో టీ20 మ్యాచ్ ప్రెసెంటేషన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ‘నేను బ్యాటింగ్‌కు వచ్చినపుడు జట్టు స్కోర్ బాగానే ఉంది. ఆ తర్వాత జోరును కొనసాగించడంలో మేం విఫలమయ్యాం. వేగంగా రన్స్ చేయలేకపోయాము. పరిస్థితులను సద్వినియోగం చేసుకుని పరుగులు సాధించడంలో వెనకపడిపోయాం. ఎప్పటికప్పుడు సవాళ్లు ఎదురవుతాయని తెలుసు. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు మేం ప్రయత్నించాం. ఈ ఓటమి గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మా ప్లేయర్స్ ఎలా ఆడతారో నాకు తెలుసు’ అని హార్దిక్ తెలిపాడు.
వింత ఆచారం..! నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందా?
గ్రామీణ ప్రజలు సాధారణంగా మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతారు. దేవతలకు యాగం చేసి రకరకాల పూజలు చేస్తారు. ముఖ్యంగా వర్షం కోసం ప్రత్యేక పూజలు చేసేవారు కొందరైతే. జంతువులతో తమకు తెలిసిన నమ్మకాల ప్రకారం వివాహం చేసుకోవడం వంటి ఆచారాల గురించి మనం వింటూనే ఉంటాము. వర్షం కోసం కప్పలకు పెళ్లిళ్లు చేసుకోవడం మనం తరచుగా వింటుంటాం. వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లి చేసే ఆచారం ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతోంది. అలాగే అమ్మవారి ఆలయాల్లో వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్లు, మేకలను బలివ్వడం చూశాం. వర్షం కోసం దేవాలయాల్లో పూజలు, హోమాలు చేయడం మనం చూస్తుంటాం. అయితే గ్రామాల్లో మాత్రం వర్షాల కోసం ప్రజలు వినూత్నంగా పూజలు చేస్తున్నారు. అయితే ఓ గ్రామంలో మాత్రం రైతులు వినూత్న రీతిలో వర్షాల కోసం పూజలు చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు వినూత్నంగా పూజలు చేస్తున్నారు. డప్పు వాయిద్యాలతో గ్రామ సమీపంలోని నాలుగు కిలోమీటర్ల దూరంలోని కొండపై ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్తున్నారు. అక్కడ గుడి ముందు కోడి లేదా మేకను బలి ఇస్తారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న పూజ సామాగ్రితో వరదపాయసం తయారు చేసుకుంటారు. ఆ తర్వాత నైవేద్యాన్ని చాపపై ఉంచుతారు. అనంతరం రైతులు నాలుకతో వదర పాయసాన్ని తీసుకుంటారు. అయితే తరతరాలుగా గ్రామస్తులు ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. పూజలు నిర్వహించి ఒకటి, రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని రైతులు నమ్ముతున్నారు. వర్షాల కోసం ప్రతి ఏటా ఇలా చేస్తున్నామని చెబుతున్నారు. గత 20 రోజుల నుంచి గ్రామంలోని ప్రజలు తమ పొలాల్లో వరి నాట్లు వేశారు. ప్రతి సంవత్సరం ఈ నెలలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ప్రతి సంవత్సరం ఈ మాసంలో విచిత్రమైన పూజలు జరుగుతాయి. ఈ వింత ఆచారం స్థానిక గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.