హిమాచల్ అడవిలో చెలరేగిన మంటలు.. భారీ ఆస్తి నష్టం
హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని డింగు అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ సీజన్‌లో బిలాస్‌పూర్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అడవులు కాలిపోతున్నాయి. ఒక్క బిలాస్‌పూర్ జిల్లాలోనే బండ్ల, పర్నాలి, సిహ్రా, లోయర్ భటేడ్, కుడ్డి, బర్మానా, నయనదేవి, భరడి, ఘండిర్‌తో సహా పలు ప్రాంతాల్లోని అడవులు దగ్ధమయ్యాయి. రాజధాని సిమ్లా అడవులు కూడా దగ్ధమవుతున్నాయి. భారీ అగ్నిప్రమాదం కారణంగా.. ప్రపంచ వారసత్వ కల్కా-సిమ్లా రైల్వే మార్గంలో రైలు రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి. చాలా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు హిమాచల్‌లో వేల హెక్టార్ల విలువైన అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. పెద్ద సంఖ్యలో వన్యప్రాణులు, పక్షులు, ఇతర జీవులు కూడా మంటల కారణంగా మరణించాయి. నయనదేవిలో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. అడవి మంటలను ఆర్పే ప్రయత్నంలో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.
79 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు..
భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా డజన్ల కొద్దీ మరణించారు. తాజాగా.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రాల్లో మోహరించిన దాదాపు 20 మంది ఎన్నికల సిబ్బంది హీట్‌స్ట్రోక్‌కు గురయ్యారు. మే నెలలో ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టిన ఢిల్లీ.. బుధవారం 79 సంవత్సరాల గరిష్ట స్థాయి 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భారత వాతావరణ శాఖ సూచన ప్రకారం… రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమాలలోని అనేక ప్రాంతాలలో శుక్రవారం తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ మరియు విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 45-48 డిగ్రీల సెల్సియస్‌లో నమోదయ్యాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రాబోయే మూడు రోజుల్లో వాయువ్య మరియు మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ క్రమంగా తగ్గే అవకాశం ఉంది. తూర్పు భారతదేశంలో ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని IMD తెలిపింది.
ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధర
లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ ప్రారంభానికి ముందు ఎల్‌పిజి సిలిండర్ వినియోగదారులకు గొప్ప బహుమతి లభించింది. ఆయిల్ మార్కెటింగ్ పెట్రోలియం కంపెనీలు ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.72 తగ్గించాయి. ఈరోజు జూన్ 1 నుంచి ఢిల్లీలో రూ.69.50, కోల్‌కతాలో రూ.72, ముంబైలో రూ.69.50, చెన్నైలో రూ.70.50 చొప్పున ఎల్‌పీజీ సిలిండర్ ధర తగ్గింది. ఈ మార్పు కేవలం వాణిజ్య సిలిండర్లలో మాత్రమే జరిగింది. డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ పాత ధరకే అందుబాటులో ఉంటుంది.
ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన
జగన్ రెడ్డి మోహన్ తన లండన్ పర్యటన నుండి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఏపీకి చేరుకున్నారు. లండన్ నుంచి రాష్ట్రానికి సీఎం కుటుంబం చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ ,మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున,కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనిల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టిజె, సుధాకర్ బాబు, కోన రఘుపతి, ముదునూరి ప్రసాదరాజు, శిల్పా చక్రపాణిరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహుల్లా,మొండితోక అరుణ్ కుమార్, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్ధి సర్నాల తిరుపతిరావు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్ధి షేక్ ఆసిఫ్,గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్ధి నూర్ ఫాతిమా, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధి కారుమూరి సునీల్ ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు.
నేడు కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు..
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు జనసంద్రంగా మారింది. దీక్షకు హనుమాన్ మాలధారులు భారీగా తరలివస్తున్నారు. దీక్షాపరుల రాకతో కొండంతా రామ నామస్మరణతో మారుమోగుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు బందోబస్తును పెంచారు. కొండగట్టులో నేటి వరకు హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. దీక్షకు వచ్చే భక్తుల కోసం 300 మంది అర్చకులను, తలనీలాలు సమర్పించేందుకు 1500 మంది నాయీబ్రాహ్మణులను అధికారులు నియమించారు. 4 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ నాలుగు ఉచిత బస్సులను నడుపుతోంది. భక్తులకు తాగునీరు, కూల్ షెల్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ తాగునీటి సమస్య, పారిశుధ్యం లోపించడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు.. బెలున్లతో చెత్త!
గత ఏడు దశాబ్దాలుగా ఉభయ కొరియా దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. అమెరికాతో దక్షిణ కొరియా దోస్తీ చేస్తుండటం.. ఉత్తర కొరియాకు మరింత కంటగింపుగా మారింది. అగ్రరాజ్యంతో జత కలిసి సౌత్ కొరియాపై కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తరచూ క్షిపణి, రాకెట్ ప్రయోగాలతో ఆ దేశంపై కవ్వింపులకు పాల్పడుతున్నారు. తాజాగా, పొరుగుదేశంపై మరోసారి ప్రతీకార చర్యలకు కిమ్ జోంగ్ దిగారు. కానీ, ఈసారి క్షిపణులు, బాంబులతో మాత్రం కాదు. బెలూన్లతో తమ దేశంలోని చెత్తను దక్షిణ కొరియాలో జారవిడిచి ప్రతీకారం తీర్చుకున్నారు.
దేశాన్ని వణికిస్తున్న బర్డ్ ఫ్లూ.. నాలుగు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం శుక్రవారం అన్ని రాష్ట్రాలను కోరింది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజాను బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు. పక్షులు, కోళ్లు ఏవైనా అసాధారణంగా చనిపోతే అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పశుసంవర్ధక శాఖకు సమాచారం అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా సంకేతాలు, లక్షణాల గురించి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు/ప్రైవేట్ ప్రాక్టీషనర్లందరికీ అవగాహన కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించబడింది. అన్ని పౌల్ట్రీ ఫామ్‌లలో సమగ్ర భద్రతా అంచనాలు సిఫార్సు చేయబడ్డాయి.
నేడు పెన్షన్ పంపిణీ.. వారికి ఇంటికి వద్దకే
ఏపీలో నేడు జూన్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. జూన్ 1వ తేదీ కావడంతో పింఛన్లు పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 65.30 లక్షల మందికి నేటి నుంచి పింఛన్లను అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 1,939 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. 80 సంవత్సరాలు పై బడిన పెన్షన్ దారులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించనున్నారు. మిగిన లబ్ధిదారులకు గత నెలలో లాగా బ్యాంకులో జమ చేయనున్నారు. పెన్షనర్లలో 47.74 లక్షల మందికి డీబీటీ ద్వారా వారి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు నేరుగా రానున్నాయి.
ఓట్ల లెక్కింపు.. జీహెచ్‌ఎంసీ పకడ్బందీ ఏర్పాట్లు..
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 4న జరగనున్న హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపునకు ఒక్కో హాలులో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అత్యధిక పోలింగ్ కేంద్రాలున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు 20 టేబుళ్లు, మిగిలిన నియోజకవర్గాలకు 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.