1వ తేదీ నుంచి వారాహి యాత్ర.. నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
అక్టోబర్ 1వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది.. ఆదివారం సాయంత్రం అవనిగడ్డలో బహిరంగ సభతో యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు నాదెండ్ల మనోహర్.. అయితే.. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర సాగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ యాత్ర తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారతాయన్న ఆయన.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పని చేస్తాం అన్నారు. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం త్వరలో జరుగుతుందని వెల్లడించారు. అయితే, సోషల్ మీడియా వేదికగా మా పొత్తులపై వైసీపీ విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అటువంటి పోస్టులు, వ్యాఖ్యలపై ఎవరూ స్పందించ వద్దని సూచించారు. పొత్తులు పదవుల కోసం కాదు.. రాష్ట్రం, ప్రజల క్షేమం కోసం కలిసి పనిచేస్తున్నాం.. త్వరలోనే మన ప్రజా ప్రభుత్వం వస్తుంది.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ధీమాను వ్యక్తం చేశారు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం.. ఇక ఫ్రీగా హెల్త్ టెస్ట్, మెడిసిన్
ప్రజల ఆరోగ్యంపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీని కోసం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. వచ్చే రెండు నెలల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కొనసాగనుంది.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ కింద ఇంటింటి ఆరోగ్య సర్వే, ఉచిత పరీక్షలు, మందులు, అవసరాన్ని బట్టి చికిత్స అందించనుంది ప్రభుత్వం.. ఈ క్యాంపైన్ లో ప్రజాప్రతినిధులు అందరూ కచ్చితంగా పాల్గొనాలని నేతలను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్. జగనన్న సురక్ష ద్వారా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్ చేయబోతున్నాం అన్నారు ఏపీ సీఎం.. ప్రతి ఇంటినీ, ప్రతి గ్రామానీ జల్లెడ పడుతున్నాం.. ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఉన్నా.. వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నాం.. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్టు డాక్టర్ల చేతవారికి చికిత్స అందిస్తున్నాం.. తర్వాత వారికి తుపరి పరీక్షలు కూడా చేయించి, వారికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నాం.. నయం అయ్యే దాకా ఆ పేషెంట్‌ను చేయిపట్టి నడిపిస్తాం.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ గురించి, వైయస్సార్ ఆరోగ్య ఆసరా గురించి కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం అన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు ఏరకంగా పొందుతారనే విషయాన్ని ఈకార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తాం.. ఎవ్వరికీ సందేహాలు లేకుండా ప్రతి కుటుంబానికీ అవగాహన కల్పిస్తాం.. ఆరోగ్య శ్రీ సేవలు పొందిన తర్వాత సంబంధిత పేషెంటుకు అవసరమైన మందులు అందేలా, ఆమేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్ చేస్తాం అన్నారు. వీరికి ఎలాంటి సమస్యలేకుండా చూస్తాం.. సమయానికి మందులు అందేలా, మళ్లీ అవసరమైన చెకప్‌లు చేయించేలా, అవసరమైన చికిత్స లేదా మందులు అందేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ ఆరోగ్య సురక్ష కింద అందిస్తాం.. కేన్సర్ లాంటి పేషెంట్లకు ఖరీదైన మందులు కూడా ఉచితంగా ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తాం.. ప్రజారోగ్య రంగంలో జగనన్న ఆరోగ్య సురక్ష కీలక పాత్ర పోషించబోతోందన్నారు.
రూటు మార్చిన వైఎస్ జగన్.. పార్టీ కార్యక్రమాలపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రూట్ మార్చారు.. సంక్షేమ పథకాలు, రివ్యూలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నర ఆయన.. ఇప్పుడు.. పార్టీ కార్యక్రమాల పై ఫోకస్‌పెట్టనున్నారు.. మండల స్థాయి నేతలతో ప్రత్యేకంగా సమావేశం కావాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం వైఎస్ జగన్.. స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు.. అక్టోబర్ 9వ తేదీన విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.. వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపైన్ ను క్షేత్ర స్థాయిలో తీసుకుని వెళ్లే విధంగా శ్రేణులను సమాయత్తం చేయటమే సమావేశ ఎజెండా ఉందంటున్నారు.. మూడు నుంచి నాలుగు వేల మంది మండల స్థాయి ముఖ్య నేతలు హాజరయ్యే విధంగా కసరత్తు చేస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ..
ఏపీలో అన్న ప్రేమ కోసం తమ్ముడి బలి..
చిత్తూరు జిల్లా ఐరాలకు చెందిన యువకుడు నిరంజన్‌కు రాజమండ్రికి చెందిన ఓ యువతికి ఏడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచియం ఏర్పడింది.. ఎఫ్‌బీ నుంచి వీరి ప్రేమ వాట్సాప్ వరకు వెళ్లింది.. ప్రేమ ఊసులు చెప్పుకున్నారు.. పెళ్లి చేసుకోవాలలనే నిర్ణయానికి వచ్చారు.. అయితే, కుటుంబ సభ్యులు తనకు వేరే యువకుడితో పెళ్లి నిర్ణయించారని ప్రియుడు నిరంజన్ కు తెలిపింది ప్రియురాలు.. ఈ సమయంలో తను రాజమండ్రికి వచ్చేందుకు వీలు కాదని చెప్పి.. తన తమ్ముడు దేవేంద్రను రాజమండ్రికి పంపించాడు నిరంజన్.. ఇక, దేవేంద్రతో రాజమండ్రి నుంచి స్కూటీపై ఐరాలకు బయల్దేరింది ఆ యువతి.. కానీ, దేవేంద్రను మృత్యువు వెంటాడింది.. నెల్లూరు జిల్లా కోవూరుపల్లి దగ్గరకు రాగానే అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టింది దేవేంద్ర నడుపుతోన్న వాహనం.. ఈ ప్రమాదంలో దేవేంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. లక్ష్మికి గాయాలయ్యాయి.. పోలీసులు ఇచ్చిన సమచారంతో కోవూరుపల్లి వచ్చారు దేవేంద్ర కుటుంబ సభ్యులు.. ఇక, నిరంజన్ కుటుంబ సభ్యులతో కలిసి ఐరాలకు వెళ్లిపోయింది లక్ష్మి.. ఈ ఘటనపై లక్ష్మి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు పోలీసులు.. ఇక్కడ ప్రేమ జంట కలిసినా.. అన్న ప్రేమ కోసం వెళ్లిన తమ్ముడు మాత్రం బలైపోయాడు.
ముగుస్తున్న మద్యం షాపుల గడువు.. మరో ఏడాది పొడిగింపు
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మద్యం షాపుల గడువు ముగియనుంది.. ఈ నెలాఖరు (అక్టోబర్)తో మద్యం దుకాణాల గడువు ముగుస్తుంది.. అయితే.. షాపులకు కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మద్యం షాపుల కాలపరిమితిని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు జీవో ఎంఎస్ నెంబర్ 466ను జారీ చేశారు అబ్కారీ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ.. ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ప్రతిపాదనల మేరకు ఈ ఏడాది కూడా గతేడాది లాగే 2,934 షాపులను కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
6 నెలల్లో కురుక్షేత్రం.. ఏపీని కాపాడుకోవాలంటే జగన్ వల్లే సాధ్యం
6 నెలల్లో కురుక్షేత్రం జరగబోతోంది.. ఆంధ్రప్రదేశ్‌ని కాపాడుకోవాలంటే వైఎస్ జగన్ వల్లే సాధ్యం అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా జగనన్న సురక్ష కార్యక్రమంపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరు నెలల్లో కురుక్షేత్రం మొదలవబోతోంది.. రెండు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు.. జగనన్న సురక్ష.. ఆంధ్రాకి జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమాలు చెపడుతున్నాం.. నూతన ఆంధ్రప్రదేశ్‌ని నిర్మిస్తున్నాం.. అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.. వైఎస్ జగన్ మేలుకోలేకపోతే రాష్ట్రాన్ని చంద్రబాబు ఏవిధంగా దోచుకునేవారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వల్లే పేదవారు తలెత్తుకు తిరుగుతున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే.. జగన్ వల్లే సాధ్యం అన్నారు. ప్రతిపక్షం వికృత రూపం అందరికీ అర్థం అవుతోంది.. అభివృద్ధి కార్యక్రమాలను కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు.
అభివృద్ధి పనుల కోసమే తెలంగాణకు మోడీ.. తన స్థాయికి తగ్గట్టు కేటీఆర్ మాట్లాడాలి..
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన, సభ ఏర్పాట్లను బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్, అర్వింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. నిజమాబాద్ పర్యటనలో ఎన్టీపీసీలో కొత్తగా ఏర్పాటు చేసిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని మోడీ జాతీకి అంకితం చేస్తారు అంటూ ఆయన తెలిపారు. మంత్రి కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు అని బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ అన్నారు. అభివృద్ధి పనుల కోసమే ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారు.. రాజకీయాల కోసం కాదు అని ఆయన తెలిపారు. 3 వేల కిలో మీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వకున్నా రామగుండం కర్మాగారాన్ని పునరుద్ధరించాం.. పంచాయతీ భవనం మొదలు అన్నింట్లో కేంద్ర సర్కార్ నిధులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ, మొత్తం నేనే ఇస్తున్నా అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ ఆయన విమర్శించారు. మరోసారి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను వచించే ప్రయత్నం చేస్తున్నాడని ఈటెల రాజేందర్ అన్నారు. కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రధాని పెద్ద మొత్తంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు అని తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నించే కేసీఆర్, కేటీఆర్.. ఒకసారి వచ్చి చూడండి ఏం ఇస్తుంది అనేది అని ఈటెల చెప్పాడు.
వ్యక్తిని “అక్రమం”గా నిర్బంధించిన పోలీసులు.. రూ.2 పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశం..
ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తూ, అక్రమంగా నిర్భంధించిన కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వ్యక్తిపై బెయిలబుల్ అభియోగాలు మోపినప్పటికీ పోలీసులు సదరు వ్యక్తి విడుదల చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్భంధంలో ఉంచినందుకు వ్యక్తికి రూ. 2 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక సంగీత ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్భంధించిన కేసులో పోలీసుల వైఖరిని ప్రశ్నించింది. తన భర్త నితిన్ సంపత్ ని పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, బెయిల్ ఇచ్చే ఆరోపణలు అయినప్పటికీ అరెస్ట్ చేశారని ఆయన భార్య నీలం సంపత్ దాఖలు చేసిన పిటిషన్‌ని న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, గౌరీ గాడ్సేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఈ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (గౌరవంగా జీవించే హక్కు) ప్రకారం నితిన్‌కి హామీ ఇవ్వబడిని హక్కుల్ని పోలీసులు ధిక్కరించారని, అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను స్పష్టంగా ఉల్లంఘించినట్లు పేర్కొంది. పోలీసులు చర్య వల్ల ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందని, శారీరక, మానసిక వేదనకు గురయ్యాడని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రధాని బాటలోనే అశోక్ గెహ్లాట్!
గతేడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నది తాను కాదని గుజరాత్ ప్రజలేనని సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ తీవ్ర ప్రచారం తర్వాత, ప్రధాని మోడీ ప్రసంగం ఎన్నికల వాతావరణాన్ని మార్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా అదే నినాదం ఇచ్చారు. జైపూర్‌లోని బిర్లా ఆడిటోరియంలో జరిగిన నర్సింగ్ కౌన్సిల్ జాతీయ సదస్సుకు హాజరైన సీఎం అశోక్ గెహ్లాట్.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలే పోటీ చేసి ప్రభుత్వాన్ని నిలబెడతారని అన్నారు. ప్రజలు సుపరిపాలన కోరుకుంటున్నారని, ప్రతి రంగంలోనూ సుపరిపాలన ఇచ్చామన్నారు. ఒక్కో వర్గానికి ఒకటి కంటే ఎక్కువ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఉద్యోగులకు ఓపీఎస్, రైతులకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు రాబోయే తరం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మిషన్ 2030 రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. సీఎం గెహ్లాట్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ దాడులను కొనసాగించారు. యూపీఏ ప్రభుత్వం దేశానికి నాలుగు చట్టాలు చేసిందన్నారు. విద్యా హక్కు, సమాచార హక్కు, MNREGA, ఆహార భద్రత చట్టాలు చేసిందన్నారు. ఐదవ చట్టమైన సామాజిక భద్రతా హక్కు చట్టాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని తాను ప్రధానిని కోరతానని సీఎం గెహ్లాట్ అన్నారు. సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కేవలం ప్రసంగాలు చేయడం వల్ల భారతదేశం ప్రపంచ అగ్రగామిగా మారదని అన్నారు. ఆకలి తీరినప్పుడే మనం ప్రపంచ గురువు అవుతాము. అందరికీ విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాలి. అందరికీ సామాజిక భద్రత కల్పించాలి. సామాజిక భద్రతా హక్కు చట్టం చేయాలని ఆయన మోడీ సర్కారును కోరారు.
బే ఆకుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!
మనం వండుకునే కూరగాయల వంటకాల్లో బే లీఫ్ తడ్కా జోడించడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. బే ఆకులలో ఉండే మసాలా, తీపి కూరగాయలను రుచిగా చేస్తుంది. అంతేకాకుండా.. బే ఆకుల సువాసనతో కూరగాయలు కూడా సువాసనగా మారిపోతాయి. ఇక ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ వీటిని ఆకుకూరల్లో చేర్చడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి అనేక వ్యాధులను నివారిస్తుంది. అయితే ఈ బే ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంలో బే ఆకు చాలా మేలు చేస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు బే ఆకులలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతే కాకుండా.. వీటిలో ఉండే రాగి, ఇనుము, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. బే ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీబాడీ ఉత్పత్తి పెరుగుతుంది.
నటి హరితేజ విడాకులు.. ?
తెలుగు ప్రేక్షకులకు నటి హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన హరితేజ, సీరియల్ నటిగా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలే చేసి మెప్పించింది. ఇక బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ గా బయటకు వచ్చి మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఒక పక్క మంచి సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. ఇక 2015 లో హరితేజ, దీపక్ అనే వ్యక్తిని వివాహమాడింది. వీరికి భూమి అనే కూతురు కూడా ఉంది. ఇక బిడ్డ పుట్టాకా హరితేజ కొద్దిగా బరువు పెరిగి కనిపించింది. దీంతో ఆమె కష్టపడి బరువు తగ్గి.. నాజూగ్గా తయారయ్యింది. ఇక అప్పటినుంచి చిట్టిపొట్టి బట్టలు వేసుకొని హాట్ ఫోటోషూట్స్ తో అలరిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ భామ.. ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తుంది. కూతురును తన తల్లి దగ్గర వదిలి.. సింగిల్ గా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తరువాత అభిమానులతో ముచ్చటించింది. చిట్ చాట్ సెషన్ ప్రారంభించింది. అందులో ఒక నెటిజన్.. భర్త దీపక్ తో విడాకులు తీసుకున్నారా.. ? అన్న ప్రశ్నకు హరితేజ.. ” నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే..” అంటూ తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ విడాకుల న్యూస్ నిజం కాదని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. నిర్మాత భార్య సంచలన ఆరోపణలు
కోలీవుడ్ నటి మహాలక్ష్మీ.. ఒకప్పుడు ఫేమస్ కాలేదు కానీ, ఎప్పుడైతే నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ వివాహమాడిందో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. అంత బరువు ఉన్న నిర్మాతను ప్రేమించి .. ఏరికోరి రెండో పెళ్లి చేసుకోవడంతో అందరు.. ఆమె ప్రేమను శంకించారు. డబ్బుకోసమే నిర్మాతను వివాహమాడిందని చెప్పుకొచ్చారు. లేకపోతే ప్రేమతో కాదని, ఆస్తి, నగలు కోసం ప్రేమ పేరుతో రవీందర్ను వలలో వేసుకుంది విమర్శించారు. ఇక ఎవరేం అన్నా పట్టించుకోని ఈ జంట.. ఏడాది పాటు తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపారు. ఏడాదిలో రవీందర్.. మహాలక్ష్మీ కి కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చి సర్ ప్రైజ్ కూడా చేశాడు. ఇక అన్నిరోజులు ఒకేలా ఉండవు కదా.. ఈ ఏడాది ఒక చీటింగ్ కేసులో రవీందర్ జైలుకు వెళ్ళాడు. భర్త జైల్లో ఉన్నాడు అన్న బాధలేకుండా మహాలక్ష్మీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా మహాలక్ష్మీ భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. రవీందర్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని సన్నహితుల ముందు చెప్పుకొచ్చిందని తెలుస్తోంది. ” పెళ్ళికి ముందు రవీందర్ ఇలాంటి విషయాలు నాకేం చెప్పలేదు. చీటింగ్ కేసులు, డబ్బు విషయాలు మా మధ్య రాలేదు. నాకు అబద్దాలు చెప్పి , మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు” అంటూ తెలిపింది. దీంతో అభిమానులు ఆమె వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. డబ్బు ఉన్నంత కాలం సైలెంట్ గా ఉండి, ఇప్పుడు అతడు జైల్లో ఉంటే మోసం చేశాడు అని చెప్పడం భావ్యం కాదని, ఇలా చేస్తే కచ్చితంగా తాను డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అనుకుంటారని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మహాలక్ష్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
బేబీ డైరెక్టర్ కి బెంజ్ సహా రెండు కార్లు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. రెటెంతో తెలుసా?
ఈ ఇయర్ కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది బేబీ మూవీ. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల నుంచి కూడా అనేక ప్రశంశలు అందుకుంది బేబీ సినిమా. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాయి రాజేష్ ఆ వర్గం వారిని విపరీతంగా ఆకట్టుకున్నారు. సుమారు ఐదుకోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 90 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేష్ కు బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు నిర్మాత ఎస్కేఎన్. నిజానికి బేబీ సినిమా రిలీజ్ ముందే రషెస్ చూసిన కాన్ఫిడెన్స్ తో డైరెక్టర్ సాయి రాజేష్ కు ఒక ఎంజీ కంపెనీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత ఎస్కేఎన్…బేబి సక్సెస్ సంతోషంలో బెంజ్ కారు బహుమతిగా అందించారు. ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచీ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. బేబీ మూవీ సక్సెస్ వాళ్ల స్నేహానికి, ఒకరి మీద మరొకరికి ఉన్న నమ్మకానికి, సినిమా మేకింగ్ పట్ల ఉన్న ప్యాషన్ కు తగిన సక్సెస్ అందించిందని చెప్పొచ్చు. థియేటర్ లో సూపర్ హిట్ అయిన బేబీ మూవీ ఓటీటీలోనూ రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుందని మేకర్స్ అంటున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంట. సాయి రాజేష్ తన నెక్స్ట్ సినిమా కూడా ఎస్ .కే.ఎన్ తోనే చేస్తున్నారు, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఎంజీ హెక్టారు కారు ధర 22 లక్షలు కాగా ఇప్పుడు ప్రెజెంట్ చేసిన బెంజ్ కారు ధర 45 లక్షల పైమాటే.