చంద్రబాబుపై కేసు నూటికి లక్ష శాతం కక్ష సాధింపే.. ప్రాథమిక ఆధారాలు కూడా లేవు..!
చంద్రబాబుపై కేసు నూటికి లక్ష శాతం కక్ష సాధింపే అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణితో కలిసి చంద్రబాబును ములాకత్ అయిన అచ్చెన్నాయుడు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. సంబంధం లేని కేసులో చంద్రబాబును ఇరికించారు. కేసుకు సంబంధించి కనీస ఆధారాలు కూడా లేకుండా తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. ఇటువంటి కేసుకు భారతదేశ ప్రజాస్వామ్యక వ్యవస్థలో ఎప్పుడు చూసి ఉండరన్న ఆయన.. కేసు కట్టాలంటే ఆధారంగా కనీసం చిన్న క్లూ ఉండాలి.. కానీ, ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్నారు. ఇవాళ్టికి 16 రోజులైంది ఎక్కడ చిన్న ఆధారం కూడా చూపించలేని పరిస్థితిలో ఉన్నారని.. ప్రభుత్వం వాస్తవాలు ప్రజానీకానికి చెప్పటం లేదు.. బయటకు చెప్పాలనుకున్న విషయాలు సెలెక్ట్ చేసి వాటిని మాత్రమే బయటికి చెపుతున్నారని మండిపడ్డారు. రెండు రోజులు సీఐడీ కస్టడీకి తీసుకున్నారు మొన్న 11 ప్రశ్నలు, నిన్న 22 ప్రశ్నలు.. మొత్తం 33 ప్రశ్నలు రెండు రోజుల్లో చంద్రబాబును అడిగారు. ఈ కేసుకు సంబంధించి డబ్బుల మళ్లింపు, ఎవరి అకౌంట్ కి అయినా చేరుకుందా.. కనీసం పార్టీకి అయినా అన్న విషయాల్లో ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు విమర్శించారు అచ్చెన్నాయుడు. సీఐడీ విచారణలో అధికారులు సంబంధం లేని ప్రశ్నలు చంద్రబాబు ను అడిగరన్న ఆయన.. వారు అడిగిన 33 ప్రశ్నలకు ప్రతి ఒక్కదానికి రేపు మేం సమాధానం ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజా శ్రేయస్సుకోసం లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు ఖర్చు పెట్టారు.. కేవలం 331 కోట్లు ఖర్చు పెట్టారంటూ ఆరోపణలు చేసి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల నిధులు పక్కదారి పట్టించారని ఆరోపణలు.. విచారణకు కేంద్ర బృందం
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల నిధుల పక్కదారి పట్టించారనే ఆరోపణలు వచ్చాయి.. దీంతో.. కేంద్రం రంగంలోకి దిగింది.. స్థానిక సంస్థల నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టనుంది కేంద్ర బృందం.. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ్ కుమార్ నేతృత్వంలో బృందం రేపు విచారణ చేపట్టనుంది.. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర విచారణ బృందం మంగళవారం రోజు ఏపీ పంచాయతీ రాజ్ కమిషనర్‌ను కలవనుంది.. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని గ్రామ పంచాయతీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది.. గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండంలోని వరగాని గ్రామంలో పర్యటించనున్న కేంద్ర బృందం. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, బందరు మండలంలోని పెద యాదర గ్రామాల్లో పర్యటించనుంది.. కాగా, కేంద్రం నుంచి వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నారని.. దుర్వినియోగం జరుగుతోందంటూ గతం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే.
చంద్రబాబు అందుకే పవన్‌ను తెచ్చుకున్నాడు.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబును బీసీలు నమ్మరు కాబట్టే పవన్ కల్యాణ్‌ను తెచ్చుకున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల చట్టం ద్వారా పేదలకు భూమి పై హక్కు కల్గించింది.. బలహీన వర్గాలను అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. టీడీపీ పార్టీ బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. అచ్చెన్నాయుడికి కనీస గౌరవం లేదు.. అధ్యక్ష పదవి ఇచ్చాడే కానీ ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.. అచ్చెన్నాయుడు పనికి రాడనే పవన్ కల్యాణ్‌ను తెచ్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వానికి చీకటి రోజులు వచ్చాయంటూ జోస్యం చెప్పారు. బీసీల మీద ప్రేమ ఉందని చెప్పే టీడీపీ.. బీసీలకు సంబంధించిన అంశం చర్చకు వచ్చినప్పుడు సభలో లేరని విమర్శంచారు.. ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు టీడీపీ పార్టీలో బీసీలు ఉన్నారు.. చంద్రబాబు బీసీల కోసం ఒక పథకం పెడితే దాన్ని అమలు చేయించుకోవడానికి గతంలో అడుక్కోవాల్సిన పరిస్థితి అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలను మోసం చేశారు.. జగన్ మోహన్ రెడ్డి బీసీలు సమాజానికి వెన్నుముక అని భావించారని తెలిపారు.
టీడీపీ ఒక కుటుంబం.. కార్యకర్తలు మా బిడ్డలు.. వీడియో రిలీజ్ చేసిన భువనేశ్వరి
నారా భువనేశ్వరి ఓ వీడియో విడుదల చేశారు.. ఆ వీడియోలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు భువనేశ్వరి.. టీడీపీ అంటే ఒక కుటుంబం.. కార్యకర్తలు మా బిడ్డలుగా అభివర్ణించారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు.. నిరసనల్లో మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు స్ట్రాంగ్ పర్సన్.. ఆయన్ను మానసిక క్షోభకు గురి చేయలేరు అని కౌంటర్ ఇచ్చారు భువనేశ్వరి.. పార్టీ జెండా రెపరెపలాడాలని వారి జీవితాలనే ఫణంగా పెట్టారు.. మహిళలన్న సంగతి కూడా మర్చిపోయి పోలీసులు ఇష్టానుసారంగా లాగిపడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేటి పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఘటనలే నిదర్శనమన్న ఆమె.. టీడీపీ కార్యకర్తలైన మా బిడ్డలు.. పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లని, వాళ్లే లేకుంటే పార్టీ లేదన్నారు. పోలీసులు ఏం చేసినా మా బిడ్డలు బెదరరు.. టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరం అన్నారు. అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. చిల్లర పనులతో చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరని స్పష్టం చేశారు.
బాలయ్యకు రోజా కౌంటర్.. తొడగొట్టాడు.. తోక ముడిచాడు..!
అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. చంద్రబాబు ప్రతీ విషయంలో ఆడవాళ్లను మోసం చేశారు.. కానీ, నాలుగున్నరేళ్లగా ప్రతీ ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచిన వ్యక్తం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు.. జగనన్న ఆలోచనలను కాపీ కొట్టి.. మినీ మేనిఫెస్టోను చంద్రబాబు రిలీజ్ చేశారని మండిపడ్డారు.. కసాయి వాడిని గొర్రెలు నమ్మొతాయేమో.. గానీ, చంద్రబాబును మాత్రం రాష్ట్ర ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు రోజా.. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు తల్లులకు పంగనామాలు అనే పథకాన్ని అమలు చేసి.. నేడు తల్లులకు వందనం పథకం అమలు చేస్తామని చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇవన్నీ మాయమాటలు తెలుసన్నారు మంత్రి రోజా.. ఇక, అసెంబ్లీ నుంచి పారిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలకు, అరెస్ట్ చేస్తారేమో అనుకొని ఢిల్లీలో దాక్కున్న నారా లోకేష్‌కు, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుకు.. మొన్న ఇదే అసెంబ్లీలో తొడగొట్టి.. ఇవాళ తొకముడిచిన బాలకృష్ణకు చెబుతున్నా.. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్లలో తీసుకొచ్చిన పథకాలు.. మీ నాయకుడు 14 ఏళ్లలో అమలు చేశారా? సవాల్ స్వీకరిస్తారా? దీనిపై చర్చకు సిద్ధమా? పసుపు జెండా పట్టుకునేవారైనా? ఎర్ర జెండా పట్టుకునేవారైనా ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తారా ? అంటూ అసెంబ్లీ వేదికగా సవాల్ చేశారు మంత్రి ఆర్కే రోజా..
40 ఏళ్లుగా రాజకీయాల్లో నిబద్ధతతో ఉన్నా..
రాజకీయల్లో గత 40 ఏళ్లుగా అభివృద్ధి ద్యేయంగా పని చేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భవిష్యత్ లో కూడా అదే పని విధానము ఉంటుంది అని ఆయన తెలిపారు. ఒక నాయకుడు పార్టీలోకి వస్తుంటే కొందరు ఇబ్బంది పడతారు.. కానీ నన్ను క్రింది స్థాయి నుంచి అందరూ స్వాగతించారు.. పార్టీ అభివృద్ధి కోసం పెద్ద నాయకులతో కలిసి పని చేస్తాను అని తుమ్మల అన్నారు. భట్టి విక్రమార్క ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తాం అని ఆయన అన్నారు. మూణ్ణేళ్ల గ్యారెంటీ కార్డు భద్ర పర్చుకోండి అని సూచించారు. మీలాగా మేము దోచుకోమ్.. ఎలా పరిపాలించాలో ఆ అనుభవాలు, మేధో సంపత్తి మా పార్టీ సొంతం అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మీ లాగా దొంగ హామీలు ఇవ్వం.. మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం లాంటి అబద్ధపు హామీలివ్వం.. మేము ఆగం అవుతున్నామని అంటున్నారు.. మీరు ఆగమవుతున్నారు మా పని విధానం చూసి.. మీరు అక్రమంగా అమ్మిన భూములు, ఎవరికి పడితే వారికి ధారాదత్తం చేసినవన్ని వెనక్కు తెస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మా జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీర్మానం చేశారు.. ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలి.. చీమ చిటుక్కుమన్నా మేం వస్తాం అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మేం అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు భారత్ కట్టుబడి ఉంది..
భారత్‌లో జరిగిన జీ-20 సదస్సులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చర్చల్లో కేంద్రంగా ఉంచామని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. దీని అమలు విషయంలో కూడా నిబద్ధత ప్రదర్శించామన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా భారతదేశ ప్రయాణం సంకల్పం స్ఫూర్తిదాయక ఉదాహరణ అని రుచిరా అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సెషన్‌లో భాగంగా శుక్రవారం ‘ఇండియా రౌండ్ టేబుల్: డెలివరింగ్ డెవలప్‌మెంట్: జర్నీస్, డైరెక్షన్స్ అండ్ లైట్‌హౌసెస్’ అనే అంశంపై ఆమె ప్రసంగిస్తూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) అమలుకు భారతదేశం కట్టుబడి ఉందని రుచిరా కాంబోజ్ అన్నారు. ఇది చాలా స్పష్టంగా ఉందని, భారత్ ఈ సవాల్‌ను సాధించే దిశగా ముందుకు సాగుతోందన్నారు. సెప్టెంబర్ 2023లో న్యూఢిల్లీలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో మా సమిష్టి సంకల్పం పునరుద్ఘాటించబడిందన్నారు. ఐక్యరాజ్యసమితిలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త
దేశ రాజధాని ఢిల్లీలో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. మెట్రో మాదిరిగానే బస్సులో ప్రయాణించే వారు కూడా ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’ (NCMC) సౌకర్యాన్ని పొందనున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని బస్సుల్లో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ పనులు ముమ్మరం చేసింది. ఈ సదుపాయాన్ని ఈ ఏడాది చివరి నాటికి అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తొలిదశలో బస్సుల్లో దీన్ని అమలు చేసిన తర్వాత ఆటోలు, ట్యాక్సీలు వంటి ఇతర ప్రజా రవాణా మార్గాల్లో కూడా దీన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు ఢిల్లీ రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బస్సు కండక్టర్‌కు ఇచ్చిన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ (ఈటీఎం) నుంచి కార్డును స్వైప్ చేయడం ద్వారా ఛార్జీలు చెల్లించవచ్చు. ఈ కార్డ్ అన్ని మెట్రో స్టేషన్లు, ISBT, ఢిల్లీ టూరిజం కార్పొరేషన్ సమాచార కేంద్రాలలో అందుబాటులో ఉంటుంది. NCMC నుండి ఛార్జీల చెల్లింపు కోసం DTC, క్లస్టర్ బస్సులలో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషీన్లు(ఈటీఎం)లను అమర్చాలని రవాణా శాఖ ఆదేశాలు ఇచ్చింది.
రాత్రి పడుకొనే ముందు ఈ నీటిని తాగితే ఎన్ని లాభాలో..
వామును మనం నిత్యం ఏదొక రూపంలో తీసుకుంటు ఉంటాం.. వామును రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. పగలు తీసుకోవడం కంటే రాత్రి పడుకునే ముందు వాముని తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయట.. రాత్రి పూట వామును ఎలా తీసుకుంటే మంచి లాభాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రాత్రి పడుకునే ముందు వాము నీటిని తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇందుకోసం పొడినైనా వాడొచ్చు. లేదా వాముని డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. వాముని కప్పున్నర నీటిలో వేసి మరిగించి కప్పు అయ్యే వరకూ ఉంచండి. దీనిని ఫిల్టర్ చేసి తాగాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే బరువు కూడా తగ్గుతారు.. ఈ వాముని పడుకునే ముందు తీసుకోవాలి. ఇందులో ముందుగా వాముని పొడిలా చేయాలి. తర్వాత ఆ వాముని టీ స్పూన్ కంటే కాస్తా తక్కువ పరిమాణంలో గోరువెచ్చని నీటిలో కలపాలి. బాగా కలపి ఈ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. అవసరం అనుకుంటే కొద్దిగా బెల్లం కలిపి తీసుకోవచ్చు.. మంచి ఫలితాలు ఉంటాయి.
కారులో ఎయిర్‌బ్యాగ్‌లు లేవని.. ఆనంద మహీంద్రాతో పాటు మరో 12 మందిపై కేసు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కారు భద్రతపై తప్పుడు హామీల కోసం ఆనంద్ మహీంద్రాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌కు చెందిన 12 మంది ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైంది. ఎయిర్‌బ్యాగ్‌లు లేని స్కార్పియో కారును కంపెనీ తనకు విక్రయించిందని, తన కొడుకు కారు ప్రమాదంలో మరణించాడని ఫిర్యాదుదారు రాజేష్ మిశ్రా ఆరోపించారు. రాజేష్ మిశ్రా తన కుమారుడు అపూర్వ్‌కు బహుమతిగా 2020లో బ్లాక్ స్కార్పియోను రూ. 17.39 లక్షలకు కొనుగోలు చేశారు. జనవరి 14, 2022న, స్నేహితులతో కలిసి లక్నో నుండి కాన్పూర్‌కు తిరిగి వస్తుండగా, పొగమంచు కారణంగా అపూర్వ్ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఫలితంగా అతను అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన తర్వాత, జనవరి 29న రాజేష్ తాను కారు కొన్న ఆటో స్టోర్ వద్దకు చేరుకుని, కారులోని లోపాలను ఎత్తిచూపారు. ఎఫ్‌ఐఆర్‌లో ప్రమాదం సమయంలో సీటుబెల్ట్ బిగించినప్పటికీ, ఎయిర్‌బ్యాగ్ అమర్చడంలో విఫలమైందని ఫిర్యాదుదారు తెలిపారు. కంపెనీ తప్పుడు హామీలిచ్చి మోసం చేసిందని రాజేష్ మిశ్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉంటే తన కొడుకు చనిపోయేవాడు కాదని రాజేష్ సంస్థ మోసపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. కంపెనీ ఉద్యోగులు రాజేష్‌తో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. డైరెక్టర్ల సూచనల మేరకు నిర్వాహకులు తనను, తన కుటుంబాన్ని దుర్భాషలాడారని, చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. ప్రమాదం తర్వాత, స్కార్పియోను రుమాలోని మహీంద్రా కంపెనీ షోరూమ్‌కు తరలించారు. కంపెనీ వాహనంలో ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయలేదని రాజేష్ అభిప్రాయపడ్డారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 (మోసం), 287 (యంత్రాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం), 304-A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.
బ్రేకింగ్.. కెప్టెన్ కపిల్ దేవ్ కిడ్నాప్.. వీడియో వైరల్
కపిల్ దేవ్.. క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. భారతీయులందరికీ ఈ పేరు సుపరిచితమే. భారత దిగ్గజ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ గా కలిపి దేవ్ కు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆయన జీవితంపై బయోపిక్ కూడా వచ్చింది. ఇక తాజాగా కపిల్ దేవ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. కపిల్ దేవ్ కిడ్నాప్ కు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు కపిల్ చేతులు కట్టేసి.. నోరు కట్టేసి..ఆయనను తీసుకెళ్తున్నట్లు కనిపించారు.కొంతదూరం వెళ్లాక కపిల్ వెనక్కి తిరిగి ఏదో సైగలు చేయడం కనిపించింది. ఇక దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన పెరిగిపోయింది. కపిల్ కు ఏమైంది.. ? ఎవరు ఆయనను కిడ్నాప్ చేశారు.. ? అంటూ ఒకటే కామెంట్స్ పెడుతున్నారు. అదికాక ఈ వీడియోను మరో క్రికెటర్ గౌతమ్ గంభీర్ షేర్ చేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. అసలు ఏం జరిగింది.. ? అనేది తెలియదు కానీ, అందులో ఉన్నది మాత్రం కపిల్ కాదని గంభీర్ చెప్పుకురావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ” ఈ వీడియో నాకే వచ్చిందా..? ఇంకెవరికైనా వచ్చిందా..? అందులో ఉన్నది నిజమైన కపిల్ దేవ్ కాదని అనుకుంటున్నా. నిజమైన కపిల్‌దేవ్ బాగానే ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వీడియోలో ఉన్న అతను ఎవరు..? ఎవరైనా రీల్ చేశారా.. ? లేక ఫ్రాంక్ చేశారా.. ? అనేది తెలియాల్సి ఉంది.
కలర్స్ స్వాతితో పెళ్లి.. అసలు నిజం చెప్పిన ఎన్టీఆర్ విలన్
అందాల రాక్షసి చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. మొదటి సినిమాతోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర .. ఆ తరువాత పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇక హీరోగా అవకాశాలు వచ్చినా.. విజయాలు దక్కకపోయేసరికి విలన్ గా మారాడు. అరవింద సమేత.. నవీన్ చంద్ర కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఎన్టీఆర్ కు విలన్ గా జగపతి బాబు ఎంత అయితే విలనిజాన్ని పండించాడో.. నవీన్ సైతం .. అంత విలనిజాన్ని చూపించి అలరించాడు. ఈ సినిమా తరువాత నవీన్ కు విలన్ రోల్స్ ఎక్కువగా రావడమే కాకుండా మంచి విజయాలు కూడా వచ్చాయి. ఇక తాజాగా నవీన్ చంద్ర నటిస్తున్న చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ నాగోటు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర సరసన కలర్స్ స్వాతి నటించింది. పెళ్లి తరువాత స్వాతి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక రీ ఎంట్రీలో చిన్న చిన్న సినిమాలు చేస్తూ.. ఒక మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం.. సినిమా విషయాలతో పాటు.. వ్యక్తిగత విషయాలను కూడా బయటపెడుతున్నారు. నవీన్ చంద్ర, స్వాతి ఇప్పటికే త్రిపుర అనే సినిమాలోనటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా సమయంలోనే స్వాతి, నవీన్ చంద్ర పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇన్నాళ్లకు ఆ వార్తలపై నవీన్ స్పందించాడు. ” మేము ఆ సినిమాచేస్తున్న సమయంలో సెట్ నుంచి మేమిద్దరం పెళ్లి బట్టలో ఉన్న ఒక ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. అది చూసి అందరూ మేము నిజంగా పెళ్లి చేసుకున్నాం అనుకున్నారు. ఆ తరువాత అదే పోస్టర్ ను త్రిపుర ఫస్ట్ లుక్ పోస్టర్ గా రిలీజ్ చేశారు. దీంతో చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. మరికొంతమంది కాల్ చేసి.. నిజంగా మీరు పెళ్లి చేసుకున్నారని అనుకున్నాం అని చెప్పుకొచ్చారు. ఆ వార్తలు చూసి నేను, స్వాతి నవ్వుకున్నాం” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో స్వాతి గట్టి కమ్ బ్యాక్ ఇస్తుందా.. ? నవీన్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంటాడా.. ? అనేది చూడాలి.