ఈవీఎం గణపతి.. ఓటర్ ఐడీలు పట్టుకుని క్యూ కట్టిన మూషికాలు..
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాల్లో మునిగిపోయారు భక్తులు.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాది గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.. ఇంట్లో.. గల్లీలో.. వీధిలో.. ఊరులో.. వాడలో ఇలా పల్లె, పట్టణం, నగరం తేడా లేకుండా ఘనంగా వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న రీతుల్లో దర్శనం ఇస్తున్నారు వినాయకులు.. విశాఖలో ఈసారి విభిన్న వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ విశాఖలోని తాటి చెట్ల పాలెం లో ఈవీఎం వినాయకుడు కాన్సెప్ట్ భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంది.. ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యత తెలిజేసేలా.. ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించేలా.. పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎలక్షన్ ను నిర్వహించారు యువసేన ఫౌండేషన్.. మూసికాలను ఓటర్లుగా నిలబెట్టి స్వతంత్ర అభ్యర్థి వినాయకుడే లోకనాయకుడు అనే నినాదంతో వినాయక చవితి నిర్వహిస్తున్నారు.. ఈ కాన్సెప్ట్ వినాయకుడిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈవీఎం వినాయకుడు కాన్సెప్ట్ తో ఓటు హక్కు ప్రాముఖ్యత, పోలింగ్ స్టేషన్ ఎలక్షన్ జరుగు విధానాన్ని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బొజ్జ గణపయ్యని భక్తుల ముందుకు తీసుకు వచ్చిన భక్తుడు యువసేవ ఫౌండేషన్ పీలా హరిప్రసాద్‌గా చెబుతున్నారు.. మొత్తంగా ఎన్నికలకు ముందు వచ్చిన వినాయక చవితిని పురస్కరించుకుని ఓటర్లను చైతన్యం కలిగించేలా తీసుకొచ్చిన ఈ కాన్సెఫ్ట్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అమెరికా గడ్డపై ఏపీ విద్యార్థులు.. కొలంబో వర్సిటీ సెమినార్‌లో ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పర్యటన అమెరికా గడ్డపై కొనసాగుతోంది.. ఐక్యరాజ్యసమితి, కొలంబో యూనివర్సిటీ తదితర చోట్ల ప్రసంగించారు మన పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు.. అమెరికాలో రెండో రోజు పర్యటనలో భాగంగా.. సెప్టెంబర్ 17న న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ‘ఎడ్యుకేట్ ఎ చైల్డ్’ సెమినార్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 10 మంది విద్యార్థులతో కూడిన బృందం కెనడా, ఉగాండా, కెన్యా వంటి వివిధ దేశాల విద్యార్థులతో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, పర్యావరణ అంబాసిడర్‌గా ఎలా ఉండాలి మరియు ప్రపంచవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను ఎలా పెంచాలి వంటి విభిన్న అంశాలపై చర్చలు జరిపారు.. ఈ చర్చల్లో మన విద్యార్థులు పాల్గొన్నారు.
ఏపీ గవర్నర్‌కి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో గవర్నర్‌ని తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.. గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు.. రోబోటిక్ విధానంలో గవర్నర్ కు సర్జరీ చేస్తున్నట్టు సమాచారం.. అయితే, నిన్న రాత్రి నుంచి గవర్నర్‌కు కడుపులో నొప్పి ఉండటంతో స్వల్ప అస్వస్థత గురయ్యారని చెబుతున్నారు.. ఉదయం రాజ్ భవన్ వెళ్లి వైద్యులు పరీక్షలు నిర్వహించారు.. అయినా తగ్గకపోవడంతో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో చేరారు గవర్నర్.. శస్త్ర చికిత్స అనంతరం రేపు గవర్నర్ డిశ్చార్జి అవుతారని మణిపాల్ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.. అయితే, ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? ఎలాంటి వైద్యం అందిస్తున్నారు లాంటి విషయాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం.. త్వరలో మరికొంతమందికి..
తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు.. వాటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఇక, టీటీడీ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఈరోజు తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.. 2019లో అప్పట్లో కేవలం ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి.. ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నుంచి.. ఈ నాలుగేళ్లలో ఆ ప్రాజెక్టును చెయ్యి పట్టుకుని నడిపించాం అన్నారు.. ఇవాళ ఆ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి.. తిరుపతి ప్రజలకు అంకితమిస్తున్నాం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.. మరోవైపు.. ఇళ్ల పట్టాల పంపిణీపై సంతోషాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్.. అన్నింటికంటే ఆనందాన్ని కలిగించే అంశం ఏంటంటే.. టీటీడీలో పని చేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఉండాలని.. మంచి జరగాలనే తాపత్రయంతో త్వరగా అడుగులు వేశాం. రూ. 313 కోట్లు ఖర్చు చేసి.. 3,518 మందికి ఈ రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని.. మరో 280 కోట్లు ఖర్చు చేసి నెల నుంచి 45 రోజుల్లో మరో 3 వేల మందికి ఇస్తాం అని హామీ ఇచ్చారు. ఏడు వేల మంది టీటీడీ ఉద్యోగుల ముఖాల్లో సంతోషం చూస్తున్నాం.. ఇది అన్నింటికి కంటే ఎక్కువ సంతోషం ఇచ్చే రోజుగా అభివర్ణించారు సీఎం వైఎస్ జగన్..
తీరిన ట్రాఫిక్ కష్టాలు.. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం జగన్
తిరుపతిలో ఎప్పుడూ ట్రాఫిక్‌తో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. అయితే, ఆ పరిస్థితికి ఓ ఫ్లైఓవర్‌తో చెక్ పెట్టారు ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తిరుపతికి మణిహారంగా భావిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ఈ రోజు ప్రారంభించారు సీఎం.. తన తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా.. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం జగన్.. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతికి మణిహారంగా శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిలుస్తుందని తెలిపారు. ఇక, శ్రీనివాససేతు ఫ్లైఓవర్ ప్రాజెక్టును తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్, టీటీడీ సంయుక్తంగా చేపట్టిందని వెల్లడించారు సీఎం జగన్.. శ్రీనివాస సేతు తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడంతో.. యాత్రికులతో పాటు.. స్థానిక ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.684 కోట్లు వెచ్చించి.. దాదాపు 7.34 కిలోమీటర్లు విస్తీర్ణంలో నిర్మించారు.. 2019 మార్చిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ ఏడాది జూన్ లేదా జులై నెలలోనే పనులు పూర్తి అవుతాయని భావించినా.. నిర్మాణం చివరి దశకు చేరుకున్న తర్వాత చోటు చేసుకున్న ప్రమాదంతో పనులు పూర్తి చేయడానికి మరింత సమయం పట్టింది.. మొత్తంగా.. ఈ రోజు శ్రీనివాససేతు ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేశారు సీఎం వైఎస్ జగన్.. ఇక, తిరుపతి పర్యటనలో ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ భవనాలను కూడా ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.
చంద్రబాబుపై తీవ్ర విమర్శలు.. రాజ్యసభలో విరుచుకుపడ్డ సాయిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజ్యసభ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి.. అంతులేని అవినీతి, కుంభకోణాలు, వెన్నుపోట్లకు కేరాఫ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడని విమర్శించారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ చంద్రబాబు పాలన కారణంగానే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. అడ్డూఅదుపూ లేకుండా అవినీతి, స్కామ్‌లకు పాల్పడి చంద్రబాబు ఈరోజున 6 లక్షల కోట్లకు అధిపతి అయ్యారు. తనపై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా చంద్రబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిడ్‌లో పేర్కొనడాన్నిబట్టి ఆయన క్రిమినల్ నేపధ్యాన్ని అర్ధం చేసుకోవచ్చని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. రాజకీయాలలో వెన్నుపోట్లు అనేవి చంద్రబాబుతోనే మొదలయ్యాయి. టీడీపితో పొత్తు పెట్టుకున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ మన ప్రజాస్వామ్యం దుస్థితి అని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పాల్పడిన కోట్లాది రూపాయల స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆయను అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లుగా నిర్ధారించకున్న తర్వాతే కోర్టు చంద్రబాబుకు జుడిషియల్ కస్టడీ విధించింది. దీనిపై ఒకవైపు న్యాయప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు చంద్రబాబు అరెస్టుపై అఖిలపక్ష సమావేశంలో టిడిపి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలతో యాగీ చేయడానికి ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ఏపీ విభజనపై మోడీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. మోడీ ఎవరినీ విమర్శించలేదు.. విభజన టైంలో పార్లమెంట్‌లో చోటు చేసుకున్న అంశాల గురించే ప్రస్తావించారని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో పెప్పర్ స్ప్రేను వాడలేదా.. పార్లమెంట్ తలుపులు మూయలేదా అని కిషన్ రెడ్డి అడిగారు. పాత పార్లమెంట్‌లో చోటు చేసుకున్న చారిత్రక ఘట్టాల గురించి చెబుతూ మోడీ ఏపీ విభజన గురించి గుర్తు చేశారని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కుటుంబం ప్రస్తుతం ఏది అర్ధం చేసుకునే పరిస్థితిలో లేదని ఆయన దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌తో అధికారం పంచుకుందని.. ఆ సమయంలోనే తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ ఆలస్యం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణను ఇచ్చింది తామేనని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.. కానీ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
గణేశుడికి 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో అలంకరణ
ముంబైలో 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో అలంకరించబడిన గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ గణనాథుడిని గౌర్ సరస్వత్ బ్రాహ్మణ (జీఎస్‌బి) సేవా మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది గణేష్ చతుర్థికి 36 కిలోల వెండి, 250 గ్రాముల బంగారు లాకెట్టు విరాళంగా ఇచ్చినట్లు GSB సేవా మండల్ ప్రతినిధి ఓ వార్త సంస్థకు తెలిపారు. ఈ విరాళంతో విగ్రహంలోని మొత్తం బంగారం 69 కిలోలు, వెండి మొత్తం 336 కిలోలకు పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ ఏడాది 69వ ‘గణపతి ఉత్సవ్’ జరుపుకోబోతున్నామని చెప్పారు. మరోవైపు చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైనందుకు గణేశుడికి ధన్యవాదాలు తెలిపేందుకు సెప్టెంబర్ 19 (మంగళవారం) రోజున ప్రత్యేక ‘హవనం’ నిర్వహించబడుతుందని తెలిపారు. అంతేకాకుండా.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు సెప్టెంబర్ 20న మరో హవనాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. అక్కడ నిర్వహించే పందాల వద్దకు వచ్చే ప్రజలకు రూ.290 కోట్లు, ఆభరణాలకు రూ.39 కోట్లు, ప్రజాబాధ్యత కింద రూ.20 కోట్లు కలిపి మొత్తం రూ.360.45 కోట్లు బీమా చేయించామని మండల ప్రజాప్రతినిధి తెలిపారు. ఇక భద్రత విషయానికొస్తే.. ఈ ఏడాది ఫేషియల్ రికగ్నిషన్ చేస్తామని.., ఈసారి అధిక సాంద్రత కలిగిన కెమెరాలను అమర్చామన్నారు.
ప్రమాదకర స్థాయిలో నర్మదా.. 12 వేల మంది తరలింపు
గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదర, భరూచ్, నర్మదా, దాహోద్, పంచమహల్, ఆనంద్, గాంధీనగర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న 11,900 మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించారు. మరో 270 మంది ఒంటరిగా ఉన్న పౌరులను రక్షించారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నుంచి నీటి విడుదల కారణంగా గత రెండు రోజులుగా నీటిమట్టం 40 అడుగులకు పెరగడంతో భరూచ్ జిల్లాలోని నర్మదా నది ఒడ్డున నివసిస్తున్న 6 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నుండి నీటి మట్టం నెమ్మదిగా తగ్గుతున్నప్పటికీ.. భరూచ్, తహసీల్, అంక్లేశ్వర్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ మోకాళ్ల లోతు నీటిలోనే ఉన్నాయి.
జాబ్ ఆఫర్‌తో ఐఐటీ స్టూడెంట్ కొత్త రికార్డు.. జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఐఐటీ-బాంబే గ్రాడ్యుయేట్ ఒకరు చరిత్ర సృష్టించారు. ఇటీవల ముగిసిన వార్షిక ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ ఒకరు 3.7 కోట్ల వార్షిక వేతనంతో అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్‌కు ఎంపికయ్యారు. ఇదే ఐఐటీ బాంబే హైయెస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఆఫర్ కావడం గమనార్హం. ఇక టాప్ డొమెస్టిక్ శాలరీ (దేశీయంగా ఉద్యోగం) విషయానికి వస్తే అత్యధికంగా ఒకరు ఏడాదికి రూ.1.7 కోట్ల జీతంతో సెలక్ట్ అయ్యారు. ఒక విద్యార్థిని రూ.1.7 కోట్ల ప్యాకేజీతో ఎంపిక అయ్యారు. ఈ ఆఫర్లు పొందిన విద్యార్థుల పేర్లను ఇన్‌స్టిట్యూట్ విడుదల చేయలేదు. గతేడాదితో పోలిస్తే వేతన ప్యాకేజీలు భారీగా పెరగాయి. ఇంటర్నేషనల్ ఆఫర్‌కు సంబంధించి కిందటేడాది అత్యధికంగా వార్షిక వేతనం రూ.2.1 కోట్లు మాత్రమే కాగా.. ఈసారి 70 శాతం వరకు పెరిగింది. దేశీయంగా అత్యధిక వేతనాలకు సంబంధించి మాత్రం కాస్త తగ్గింది. కిందటేడాది ఐఐటీ గ్రాడ్యుయేట్ దేశీయంగా జాబ్ ఆఫర్లకు సంబంధించి వార్షిక వేతనం అత్యధికంగా రూ.1.8 కోట్లు అందుకోగా.. ఈసారి అది రూ.1.7 కోట్లకు తగ్గింది. ఈ సారి రూ.కోటి కంటే ఎక్కువ వార్షిక వేతనాలతో పదహారు మంది ఐఐటీ-బాంబే విద్యార్థులు ఉద్యోగ ఆఫర్‌లను అంగీకరించారు. మొత్తం 300 ఉద్యోగాలకు గానూ 194 మంది ఆఫర్లను అందుకున్నారు. ఐఐటీ-బాంబేలోని విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, హాంకాంగ్, తైవాన్‌లలో కార్యాలయాలు ఉన్న సంస్థల నుంచి ఈ సంవత్సరం 65 విదేశీ ఉద్యోగ ఆఫర్‌లను అందుకున్నారు. కిందటేడాదితో పోలిస్తే ఇది కాస్త తక్కువేనని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ ఆఫర్లు ఎక్కువగా అమెరికా, జపాన్, యూకే, నెదర్లాండ్స్, హాంగ్ కాంగ్, తైవాన్ నుంచి ఉన్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్యం సంకేతాలు, ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల నడుమ కూడా ఈ స్థాయిలో ప్లేస్‌మెంట్ ఆఫర్స్ రావడం సానుకూల పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ టీనేజ్ బ్లాక్ బస్టర్.. తెలుగులో ఎక్కడ చూడాలంటే?
ఇటీవల మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.మలయాళ దర్శక నిర్మాతలు తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని తమ సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. అలాగే ఓటీటీలో కూడా మలయాళ సినిమాలకు బాగా క్రేజ్ ఏర్పడింది.గతంలో విడుదల అయి సూపర్‌హిట్‌గా నిలిచిన పలు సినిమాలను తెలుగులో డబ్ చేసి డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. అలా ఇటీవల మలయాళం నుంచి వచ్చిన 2018, నెయ్‌మార్, పద్మిని వంటి సినిమా లు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇప్పుడు మరో మలయాళ సూపర్‌హిట్ మూవీ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అదే ‘జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్’. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జులై 7వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టింది. అక్కడి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడీ టీనేజ్ లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్‌లో ‘జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్’ స్ట్రీమింగ్ అవుతోంది.
మూడు నెలల తర్వాత తండ్రి ఇంటికి క్లిన్ కార… వేద మంత్రాలతో ఆహ్వానం!
పెళ్లి ఆయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు అయ్యారన్న సంగతి తెలిసిందే. 2023 జూన్ 20వ తేదీన ఉపాసన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనివ్వగా ఆమెకు క్లిన్ కార అని నామకరణం చేశారు. లలితా సహస్ర నామం నుండి ఈ పేరు ఎంచుకున్నట్లు చిరంజీవి అప్పట్లో అధికారికంగా వెల్లడించారు. అయిదు హిందూ సాంప్రదాయం ప్రకారం బిడ్డకు జన్మనిచ్చాక జన్మనిచ్చిన తల్లి తన పుట్టింట్లో ఉండాలి. కనీసం మూడు నెలలు పుట్టింట్లో గడిపాకనే అత్తింటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆ సంప్రదాయం ప్రకారం ఉపాసన తన తల్లితండ్రులు శోభన కామినేని, అనిల్ ఇంట్లోనే ఈ మూడు నెలలు ఉన్నారు. ఆ మూడు నెలలు పూర్తి కావడంతో కొణిదెల నివాసం అయిన చిరంజీవి ఇంటికి క్లిన్ కార తన తల్లిదండ్రులతో కలిసి ఎంట్రీ ఇచ్చింది. ఇక వారసురాలు మొదటి సారిగా ఇంట్లో అడుగు పెడుతున్న క్రమంలో ఈ కార్యక్రమాన్ని మెగా ఫ్యామిలీ ప్రత్యేకంగా నిర్వహించారు. చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి చెందిన వేదపాఠశాల విద్యార్థులు క్లిన్ కార ఇంట్లో అడుగుపెడుతుండగా వేద మంత్రాలు ఉచ్ఛరించారు. క్లిన్ కారను వేదమంత్రాల నడుమ ఇంట్లోకి అహ్వానించారు. ఇక ఇదే సమయంలో వినాయక విగ్రహాన్ని కూడా కొణిదెల నివాసంలోకి తీసుకువచ్చారు. చిరంజీవి, సురేఖ ముద్దుల మనవరాలిని చూసి సంబరపడిపోగా రామ్ చరణ్ తన హ్యాపీనెస్ ని సోషల్ మెయిల్లో షేర్ చేసుకున్నారు. “అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను!🙏 ఈ సారి ప్రత్యేకత … చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం” అంటూ కోట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోస్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.