చంద్రబాబుకు ఆ శాపం తగిలింది..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉంటూ దోపిడీ చేసి సంపాదించి కోటీశ్వరుడు అయిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. సీబీ సీఐడీ చేతిలో చిక్కి రాజమండ్రి జైలులో కూర్చున్నాడు.. నేను తప్పు చేసినా.. మా నాయకుడు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుని పోతుందని స్పష్టం చేశారు. అయితే, మనం ఏ పార్టీ అయినా ఎన్టీ రామారావుని గౌరవించాల్సిందే.. కానీ, వైస్రాయ్ హోటల్ వద్ద భగవంతుడికి సమానమైన ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించి మానసికంగా ఎన్టీ రామారావు చనిపోయే దానికి కారకుడు అయ్యాడు చంద్రబాబు.. నమ్మి ఆడబిడ్డని ఇచ్చి అల్లుడ్ని చేసుకుంటే పదవి వ్యామోహంతో ఆయనకే మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించి.. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి చంద్రబాబుకు కష్టకాలం మొదలైందన్నారు నల్లపరెడ్డి.. మనం కోరుకోకూడదు గాని భయంకరమైన చావు చావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించినందుకు… ఈరోజు చంద్రబాబు కోసం ఎన్టీఆర్ కొడుకులు.. కోడళ్లు, కూతుర్లు అందరూ రోడ్లు మీదకు వచ్చారు.. ఎన్టీ రామారావు కుటుంబానికి సంబంధించిన కొడుకులు.. కూతుర్లు, కోడళ్లని అడుగుతున్నా.. ఆ రోజు వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీ రామారావు మీద చెప్పులు వేశారు కదా మీరందరూ ఎందుకు చంద్రబాబుకి కొమ్ముకాచారు అంటూ నిలదీశారు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే మీ కుటుంబం అంతా రోడ్లమీదకు వచ్చి నానా రభస చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అప్పట్లో అన్ని జిల్లాల్లో చంద్రబాబు నాయుడుకి పలువురు ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు.. చివరి వరకూ ఎన్టీరామారావు దగ్గరే నేనున్నాను.. నాతో పాటు దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. చెప్పు లేసిన తర్వాత ఎన్టీ రామారావు ఇంటికి వచ్చాడు. సోపా మీద తల వాల్చేసి ఈరోజుతో ఎన్టీ రామారావు చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అందరం ఏడ్చామని గుర్తుచేసుకున్నారు. అంతటి మహానుభావుడిని. ఏడిపించినందుకు చంద్రబాబుకు శాపం తగిలిందన్నారు. ఇక, ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడులు కలిసి రంగంలో దిగాలని నిర్ణయం తీసుకున్నారు.. వారు ఇద్రదూ తోడుదొంగలు అంటూ ఆరోపించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
9న లేదా 10న మా నేత బయటకు వస్తున్నాడు.. దమ్ముంటే టీడీపీ ప్రభంజనాన్ని అడ్డుకొండి..!
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. ఆయన బెయిల్ కోసం ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు ఆయన తరఫు న్యాయవాదులు.. అయితే, చంద్రబాబు విడుదలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నెల్లూరు జిల్లాలో టీడీపీ ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆటోలో వీఆర్‌సీ సెంటర్‌కు వచ్చారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.. బైక్ పై వచ్చారు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. ఇక, ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 9వ తేదీన లేదా 10వ తేదీన మా నాయకుడు బయటకు వస్తున్నాడు అని తెలిపారు. దమ్ముంటే టీడీపీ ప్రభంజనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవాలి అంటూ సవాల్ చేశారు.
ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్.. ఇది రూపాయి పావలా ప్రభుత్వం..!
మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభించిన ఆయన.. ఈ రోజు పెడనలో మాట్లాడుతూ.. ఏడాదిగా మన రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నాం. మనం ఇక్కడకు రావాలంటే పాస్ పోర్టు, వీసా తీసుకుని రావాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు.. బలమైన పోరాటాలు చేస్తున్నారు జనసైనికులు.. కొట్టిన వారిని మేం మర్చిపోం.. పెడనలో అంబేడ్కర్ విగ్రహానికి కట్టేసి, జనసైనికులను కొట్టారు. దానిని మర్చిపోం. అంబేద్కర్ విగ్రహానికి కట్టేసి కొట్టారట.. ప్రజా ప్రతినిధులు ప్రజలు వస్తే లేచి నిలబడే సంస్కృతి, వినాశ కాలే విపరీత బుద్ధి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరకి రప్పించుకోవడానికే ఓట్లు వేయించుకోడానికి రూపాయి పావలా.. ఇది రూపాయి పావలా ప్రభుత్వం అని సెటైర్లు వేశారు. మనందరం ఆంధ్రులం.. మనది ఒకటే గుండె చప్పుడు.. విబేధాలు పాలసీల వరకే ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. నేను గతంలో టీడీపీకి మద్దతిచ్చాం.. అనుకున్నది జరగలేదు.. జరిగిందేదో జరిగింది.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. ప్రజా ప్రతినిధి ఉండే ఏరియాలో జనసైనికులు వెళ్ళకూడదంట.. ఇదేంటో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు పవన్.. రాబోయే ఎన్నికల తరువాత తీసేద్ధాం. వైసీపీ నవరత్నాలు చెప్పిందొకటి, చేసేదొకటి. జగన్‌రెడ్డిది రూపాయి పావలా ప్రభుత్వం. జనాన్ని తమ దగ్గరకు రప్పించుకోవడానికే వైసీపీ నేతలు రూపాయి పావలా సిద్ధాంతం వాడుతున్నారు. ఓట్లు వేయించుకోవడానికే వైసీపీ పథకాలు. అమల్లోకి వచ్చేసరికి పథకాల్లో అంతా డొల్లతనమే. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తేనే అక్రమ కేసులు పెడతున్నారని ఆరోపణలు గుప్పించారు.. క్లాస్ వార్ అని పలికే వాడు కూలీల పొట్ట కొట్టాడు.. జాతీయ ఉపాధి హామీ పధకం కింద 337 కోట్లు దారి మళ్ళించారు.. టీడీపీ నాయకుల మీద అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టారు.. దేశద్రోహం కేసులు అత్యధికంగా ఏపీలో నమోదయ్యాయని దుయ్యబట్టారు. ఏమైనా అంటే కేసులు పెడతారేమో.. కేసులకు భయపడే వాడు రాజకీయాల్లోకి ఎందుకొస్తాడు? అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఓటర్ల లిస్ట్ విడుదల
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) వికాస్ రాజ్ బుధవారం ఓటర్ల జాబితాల రెండవ ప్రత్యేక సారాంశ సవరణ పూర్తయిన తర్వాత తుది ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన మొదటి ప్రత్యేక సారాంశ సవరణ జాబితా కంటే 5.8 శాతం పెరుగుదలతో దాదాపు 17 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారు. తుది జాబితాలో 119 నియోజకవర్గాల్లో 3,17,17,389 మంది ఓటర్లు ఉండగా అందులో 1.58 కోట్ల మంది మహిళలు, 1.58 కోట్ల మంది పురుషులు, 2,557 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. 8,11,640 మంది ఓటర్లు 18-19 ఏళ్లలోపు ఉండగా, 6,10,694 మంది చనిపోయిన, డూప్లికేట్, షిఫ్ట్ అయిన ఓటర్లు తొలగించబడ్డారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4,43,943 మంది, దివ్యాంగులు 5,06,493 మంది ఉన్నారు. ఇంటింటికి అనేక రౌండ్లు సర్వేలు, ధృవీకరణలు చేపట్టబడ్డాయి. ఈ సంవత్సరం ఓటర్ల జాబితాలో 14,24,694 నమోదుల సవరణలు జరిగాయి. 4,15,824 మంది ఓటర్ల చిరునామాలు (ఎక్కువగా ఒకే భవనంలోని అపార్ట్‌మెంట్‌లు/పోర్షన్‌లు ఒకే డోర్ నంబర్‌లు) సరిచేయబడ్డాయి. 3,94,968 మంది ఓటర్లు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ స్టేషన్ నుండి మరొక పోలింగ్ స్టేషన్‌కు, 64,661 మంది ఓటర్లు ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరొక అసెంబ్లీకి మారారు, సరైన పోలింగ్ స్టేషన్‌ను సక్రమంగా కేటాయించారు.
అమ్మాయిల వేధింపులు.. 9వ తరగతి బాలుడు ఆత్మహత్య..
ప్రస్తుత కాలంలో ప్రతీ చిన్న సమస్యకు ఆత్మహత్యనే పరిష్కారం అనుకుంటున్నారు. నేటి తరం చిన్న కష్టాన్ని కూడా తట్టుకోవడం లేదు. యువత కష్టాలతో ధైర్యంగా పోరాడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. హర్యానాలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. 14 ఏళ్ల వయసున్న 9వ తరగతి బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారణం ఏంటంటే.. తన క్లాసులోని ఇద్దరు అమ్మాయిలు వేధించడమే. హర్యానా హిస్సార్ లోని ఓ ప్రైవేట్ స్కూలులో చదువుతున్న విద్యార్థిని ఇద్దరు విద్యార్థినులు వేధింపులకు గురిచేశారు. వేధింపులకు తాళలేకే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ఈ రోజు తెలిపారు. శనివారం బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు విద్యార్థినులు పదేపదే వేధింపులకు గురిచేయడంతో బాలుడు కలత చెందాడని, ఈ విషయాన్ని టీచర్ దృష్టికి తీసుకెళ్లాడని పోలీసులు వెల్లడించారు. టీచర్ చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఘోరం జరిగింది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు ఇద్దరు అమ్మాయిలతో పాటు పాఠశాల ఉపాధ్యాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు.
చంద్రయాన్‌ని ఓడించాలనుకుంది.. జాబిల్లిపై క్రాష్ అయింది.. ఇదే కారణమన్న రష్యా..
చంద్రయాన్-3, అంతరిక్ష రంగంలో భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించింది. ఎవరికి సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్‌ని విజయవంతంగా దించింది. చంద్రుడిపై ఇలా ల్యాండర్, రోవర్లని దించిన నాలుగో దేశంగా, దక్షిణ ధృవంపై దిగిన మొదటి దేశంగా కీర్తిగడించింది. అంతకుముందు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై ల్యాండర్లను దించాయి. అయితే చంద్రయాన్-3 సమయంలో రష్యా తన లూనా-25 స్పెస్‌క్రాఫ్టుని, చంద్రయాన్ కన్నా ముందు దక్షిణ ధృవంపై దించాలని విఫలమైంది. దీని తర్వాత నాలుగు రోజులకు చంద్రయాన్-3 జాబిల్లిని చేరింది. లూనా-25 చంద్రుడిపై కుప్పకూలింది. అన్ని అనుకున్నట్లు జరిగితే చంద్రయాన్ కన్నా ముందే లూనా-25 జాబిల్లిని చేరేది. అయితే ఇలా కుప్పకూలడానికి కారణాలను రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ వెల్లడించింది. ఆగస్టు 19న లూనా-25 అదుపుతప్పి చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. అంతరిక్ష నౌకలో ఏర్పడిన సాంకేతిక లోపమే ఇందుకు కారణమని వెల్లడించింది.
కప్ గెలవడం ఎంత ముఖ్యమో.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంతే ముఖ్యం
వన్డే ప్రపంచకప్ గెలవడం ఎంత ముఖ్యమో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా అంతే ముఖ్యమని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. సామాన్యుడు పోటీని చాలా మక్కువతో పట్టించుకుంటాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సామాన్యులు ఈ మ్యాచ్‌ను గొప్పగా చూస్తారని, అందుకే ఇది టోర్నమెంట్‌లోనే అత్యంత ముఖ్యమైన మ్యాచ్ లలో ఒకటిగా ఉంటుందని చెప్పాడు. మరోవైపు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ తమ ఫామ్‌ను బట్టి టైటిల్ పోటీదారుగా చూడడం లేదని అన్నారు. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ముందుకు వెళ్లేలా కనిపించడం లేదని తెలిపారు. పాకిస్తాన్ T20 జట్టు బలంగా ఉన్నప్పటికీ.. ఆసియా కప్, వార్మప్ మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చూపించిందన్నారు.
చంద్రబాబు అరెస్ట్.. ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్..
ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. అగ్గి రాజేస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. ఆయన అరెస్ట్ అయ్యి 20 రోజులు దాటినా కూడా ఇప్పటివరకు బెయిల్ రాలేదు. ఆ తరువాత చంద్రబాబుపై మరో కేసు కూడా పెట్టారు. తండ్రి అరెస్ట్ ను ఖండిస్తూ నారా లోకేష్.. భర్త కోసం భువనేశ్వరి, టీడీపీ నేతలు.. అందరు పోరాడుతూనే ఉన్నారు. ఇంకోపక్క టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ సైతం తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇక చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం ఎంతోమందిని కలిచివేస్తున్న విషయం. ఒకానొకసమయంలో చిత్ర పరిశ్రమకు చంద్రబాబు ఎంతో చేసాడని, కానీ, ఇప్పుడు ఆయన అరెస్ట్ ను ఖండించడానికి సినీ ప్రముఖులు కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇక నిర్మాత అశ్వినీదత్, సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వారు మాత్రం చంద్రబాబుకు సపోర్ట్ గా నిలిచారు. ఇక చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని చాలామంది విమరిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు ఈ విషయమై తారక్ ఒక ట్వీట్ పెట్టింది కూడా లేదు. అయితే.. ఇప్పుడప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలని అనుకోవడం లేదని, అందుకే వీటికి దూరంగా ఉన్నాడని ఆయన అభిమానులు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ఎన్టీఆర్ స్పందించకపోవడంపై బాలకృష్ణ రియాక్ట్ అయ్యాడు. “చంద్రబాబు అరెస్ట్‌పై సినిమా రంగం నుంచి ఎవరు ఖండించకపోయిన నేను పట్టించుకోను.. అని చెప్పుకొచ్చాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదు ఈ విషయం లో ఎలా చూస్తారు అన్న ప్రశ్నకు.. ఐ డోంట్ కేర్ బ్రో ” అని భగవంత్ కేసరి స్టైల్లో సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సీక్వెల్స్ అమ్మా.. సీక్వెల్స్.. సినిమా ఏదైనా.. పార్ట్ 2 పక్కా
టాలీవుడ్ లో ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆ సినిమాకు సీక్వెల్ ప్రకటించి.. మొదటి కథకు.. ఈ కథకు సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్ కథ మొదలుపెట్టింది రాజమౌళి. బాహుబలి సినిమా మొత్తం ఒక సినిమాలో పట్టదని, కథను, క్యారెక్టర్స్ ను జస్టిఫై చేయలేమని ఆ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. చెప్పినట్లే బాహుబలి లో కొడుకు కథను.. బాహుబలి 2 లో తండ్రి కథను చూపించి అభిమానుల మనసులను గెలిచాడు. ఇక అప్పుడు మొదలైన సీక్వెల్.. ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. కథను.. ప్రేక్షకులు అర్ధం చేసుకొనేలా సినిమాగా తీయడం వరకు ఓకే. అయితే ఆ కథను ఇంకా పొడిగించి, సాగదీసి, కొత్త కొత్త క్యారెక్టర్స్ ను తీసుకొచ్చి.. రెండు భాగాలు అని చెప్పేస్తున్నారు. సినిమా చివరిలో దానికి కొనసాగింపు ఉంటుందని హింట్ ఇచ్చి.. సీక్వెల్ పై అంచనాలను పెంచేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో సీక్వెల్స్ అంతగా అచ్చిరాలేదని చెప్పాలి. హిట్ అయిన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన చాలా సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. బాహుబలి, కార్తికేయ, హిట్, కెజిఎఫ్ లాంటి సినిమాలకు కొనసాగింపుగా వచ్చిన సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ అంతా సీక్వెల్స్ మయంగా మారిపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు దాదాపు ఓ పది సినిమాల వరకు సీక్వెల్స్ ప్రకటించాయి. అందులో చూసుకుంటే.. పుష్ప, సలార్, దేవర, కల్కి, హిట్, గూఢచారి, స్కంద, పెదకాపు, అఖండ, ఇస్మార్ట్ శంకర్, మా ఊరి పొలిమేర,.. ఇలా సీక్వెల్స్ క్యూ కట్టాయి. ఇందులో దాదాపు అన్ని సినిమాలు పార్ట్ 1 సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయే. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక పెద్ద సినిమాలే సీక్వెల్స్ ప్రకటిస్తే.. మేము ఏమైనా తక్కువా అని చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియా అని, పార్ట్ 2 అని చెప్పుకొస్తున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏ సీక్వెల్ హిట్స్ ను అందుకుంటాయో చూడాలంటే.. ఇంకొంతకాలం వేచి ఉండక తప్పదు.