NDAలో చేరుతానని కేసీఆర్ నన్ను అడిగారు.. సీక్రెట్స్ బయటపెట్టిన ప్రధాని!
ఇందూరు ప్రజాగర్జన సభలో ప్రధాని మోడీ కేసీఆర్ సీక్రెట్స్ అన్ని బయటపెట్టారు. తాను తెలంగాణ పర్యటనకు వస్తున్న సమయంలో తనకు స్వాగతం పలకపోవడంపై కీలక విషయాలు చెప్పారు. GHMC ఎన్నికలకు ముందు కేసీఆర్ తనకు స్వాగతం పలికేవారన్నారు. కానీ GHMC ఎన్నికల తర్వాత సీన్ మారిపోయిందని తెలిపారు. GHMC ఎన్నికల్లో బీర్ఎస్ కు మద్దతు ఇవ్వమని కేసీఆర్ తనను అడిగారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదని తాము చెప్పామని ప్రధాని పేర్కొన్నారు. GHMC మేయర్ పదవి బీజేపీకి ఇస్తానని కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను అడిగారని ప్రధాని మోడీ అన్నారు. తాను కూడా NDAలో చేరతానని కేసీఆర్ అడిగారన్నారు. తాను కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తానని మరోసారి ఢిల్లీ వచ్చి కేసీఆర్ తనతో చెప్పారని ప్రధాని తెలిపారు. నేను చాలా చేశాను.. ఇక బాధ్యతలు కేటీఆర్ కు ఇస్తాను ఆశ్వీర్వదించండి అని అన్నారు. అందుకు తాను.. మీరు ఏమైనా రాజులా, యువరాజును సీఎం చేయడానికి అని అడిగానన్నారు. ఎంతో మర్యాద చేశారు.. కేసీఆర్ తీరు చూసి ఆశ్చర్యపోయానని ప్రధాని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మద్దతివ్వమన్నారు.. కానీ తాను మద్దతు ఇవ్వనని చెప్పానని తెలిపారు. విపక్షంలో కూర్చుంటాం కానీ మద్దతు ఇవ్వబోమని చెప్పామన్నారు. కేసీఆర్ అవినీతి బాగోతాన్ని తాను చెప్పాను కాబట్టే.. ఆ తర్వాత నుంచి కేసీఆర్ తనను కలవడం లేదన్నారు. అదే ఆఖరు రోజు.. మళ్లీ వాళ్లు నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేదని ప్రధాని తెలిపారు.
జనసేన – బీజేపీ పొత్తు.. పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ తర్వాత టీడీపీ-జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు.. ఇదే సమయంలో.. ఇప్పటికే బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంది.. ఇప్పుడు టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనేది వారే తేల్చేకోవాలని పేర్కొన్నారు.. అయితే, ఇప్పటికే బీజేపీ అధిష్టానమే పొత్తుల విషయం చూసుకుంటుందని స్పష్టం చేసిన బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి.. ఇప్పుడు మరోసారి స్పందించారు. పవన్ కల్యాణ్ చేసే ప్రతి కామెంట్‌పై నేను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. పొత్తులపై పవన్ కల్యాణ్ ప్రకటన.. ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం.. పొత్తులు.. పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఇక, ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో పొత్తు కొనసాగుతుందా..? లేదా..? అనే అంశం పైనా జాతీయ నాయకత్వమే చెప్పాలని వ్యాఖ్యానించారు పురంధేశ్వరి.. పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు.. మా అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందన్నారు. మాది ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ.. అన్ని నిర్ణయాలు అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా సేవా పక్షోత్సవాల ఎలా జరిగాయనే అంశంపై కోర్ కమిటీలో విశ్లేషించుకున్నాం. ఆయుష్మాన్ భారత్ కార్డులు 10596 కార్డులను పేదలకు పంపిణీ చేశాం.. మండల ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేశాం అన్నారు. త్వరలో రాష్ట్ర కార్యవర్గం జరుగుతుంది.. జేపీ నడ్డా హాజరు అవుతారని వెల్లడించారు. మరోవైపు.. మద్యం మీద, గ్రామ పంచాయతీ రాజ్ సంస్థల నిధుల మళ్లింపుపై ఆందోళనలు చేపట్టాం.. కేంద్ర బృందం వచ్చి.. నిధుల మళ్లింపుపై విచారణ చేపట్టిందని తెలిపారు. ఏపీలో స్థానిక సంస్థల నిధుల మళ్లింపు జరిగిందని కేంద్ర బృందం నిర్దారణకు వచ్చిందన్నారు. నాణ్యత లేని మద్యం వల్ల లివర్ సిరోసిస్ వ్యాధి పెరిగిందని.. కేజీహెచ్ వైద్యులు స్పష్టం చేశారని వెల్లడించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
కన్నీటి పర్యంతమైన మంత్రి రోజా.. రేపు లోకేష్ భార్యకు ఇదే పరిస్థితి..!
ఏపీ మంత్రి ఆర్కే రోజా కన్నీటి పర్యంతమయ్యారు.. దేశం మొత్తం 33 శాతం రిజర్వేషన్ పై సంతోషించాలా.. లేక బండారు సత్యనారాయణ లాంటి వాళ్లు మాట్లాడినా మాటలకు రాజకీయాల్లో భయపడి రారేమో అని అనుమానం వ్యక్తం చేశారు.. మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసినా నాపై అత్యంత దారుణంగా మాట్లాడారు.. ఆ మాటలు ఎవరు విన్న బండారును చెప్పుతో కోట్టకుండా ఉండరు.. లోకేష్ సహా ఇతరుల ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉన్నారు.. వాళ్లు తిడితే మీకు ఓకేనా? అంటూ కన్నీటి పర్యంత అయ్యారు మంత్రి రోజా.. మీ ఇంట్లో ఉండేవాళ్లు మాత్రమే ఆడవాళ్లు.. మేం మహిళలు కాదు.. మాకు మనసు లేదా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు మాట్లాడిన మాటలకు ఆయన భార్య, కూతురు చెప్పుతో కొట్టిఉంటే అప్పుడు బాగుండేది.. మరో మహిళను అలా తిట్టరు అని వ్యాఖ్యానించారు మంత్రి రోజా.. సిగ్గు లేకుండా లోకేష్ ట్వీట్ చేశాడు.. పదేళ్లు టీడీపీ కోసం పనిచేశాను.. మీ పార్టీలో ఉంటే మంచిదాన్ని.. మీ పార్టీ నుండి బయటకు వస్తే చెడ్డది అని ముద్రవేస్తారా.? అని ఆవేదన వ్యక్తం చేశారు. నాపై ఐరన్ లెగ్ అని ముద్రవేశారు.. ప్రశ్నిస్తే మా క్యారక్టర్ మీదా దాడి చేస్తారా? అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ.. తెలుగు దండుపాళ్యాం.. తెలుగు దుశ్శాసన పార్టీగా మారిందని దుయ్యబట్టారు. అందరినీ ఇలానే మాట్లాడుతారా..? టీడీపీని వీడినప్పటి నుంచి ఇలానే నన్ను వేధిస్తున్నారు? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను ఆట వస్తువుగా, ప్రచారానికి వాడుకున్నారు.. ఇప్పుడు ఇలాంటి వారని లోకేష్ ఎంకరేజ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి రేపు లోకేష్ భార్యకు కూడా వస్తుందన్న ఆమె.. బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా.. డీజీపీ ప్రకటన
విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ గంధం నరేంద్ర కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. 2 రోజుల క్రితం వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే ఆపాలని చెప్పటంతో కానిస్టేబుల్ నరేంద్ర తలపై దాడికి పాల్పడ్డాడు రామకృష్ణ అనే వ్యక్తి.. అయితే, ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన నరేంద్ర.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. దీంతో.. ఈ కుటుంబానికి అండగా ఉండాలని ఏపీ పోలీసులు నిర్ణయించారు.. దాంతో.. రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు డీజీపీ. కాగా, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలో శనివారం రాత్రి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో విధులు నిర్వహిస్తూ ఒక తాగుబోతు చేసిన దాడిలో కానిస్టేబుల్ నరేంద్ర తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే ఆయన్ని విజయవాడ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్సలు చేయించి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కూడా తరలించాలని ప్రయత్నించారు.. కానీ, విధి నిర్వహణలో ఒక ముష్కరుడు చేసిన దాడిలో కానిస్టేబుల్ నరేంద్ర మృతి చెందారు.. కానిస్టేబుల్ నరేంద్ర మృతి తో వారి కుటుంబంలో అలాగే పోలీస్ శాఖలో విషాదఛాయలు నెలకొన్నాయి.. కానిస్టేబుల్ నరేంద్రకు ఒక బాబు, 8 నెలల పాప ఉన్నారు.. అతి చిన్న వయసులో విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలిచింది పోలీసు శాఖ.
పవన్ కల్యాణ్ ఆరోపణలకు మంత్రి కౌంటర్.. నేనే వస్తా.. నీతో పాటే నడుస్తా..!
పెడనలో తనపై దాళ్ల దాడి జరిగే అవకాశం ఉందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై సీరియస్‌గా కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పెడనలో తన మీద రాళ్ల దాడి జరుగనుందని పవన్ కల్యాణ్ అభూత కల్పనలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఆడ లేక మద్దెల ఓడు అన్నట్లు ఉంది పవన్ వైఖరిని దుయ్యబట్టారు. అవనిగడ్డలో పవన్ మీటింగ్ కు ముచ్చటగా 300 మంది వచ్చారు.. టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత జరిగిన మొదటి మీటింగ్ అది.. టీడీపీని మళ్లీ మోస్తాను అంటే ప్రజలు అంగీకరించ లేదన్నారు. 2014 ఎన్నికల్లో నువ్వు చెప్పినట్లు టీడీపీకి ఓటు వేస్తే.. అదే లోకేష్ నిన్ను, నీ కుటుంబాన్ని నోటికి వచ్చినట్లు తిట్టారు.. ముఖ్యమంత్రి కావాలంటే మా బ్లడ్ ఎక్కించుకోవాలి అన్నారు.. ప్యాకేజీ రాగానే ఈ మాటలు పవన్ మర్చి పోయి ఉంటాడు.. కానీ, ప్రజలు మర్చిపోలేదు అని వ్యాఖ్యానించారు. పెడనలో గొడవలు సృష్టించాలనే కుట్రతోనే పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు జోగి రమేష్.. నేనే వస్తా.. నీతో పాటే నడుస్తా.. నేనే స్వయంగా దగ్గర ఉండి పెడన నియోజకవర్గంలో నీ పర్యటన చేయిస్తా.. నీ సభ సక్సెస్ అయ్యేంత వరకు పక్కనే నిలబడతా.. దమ్ము ఉంటే ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. ఫలానా చోట నా మీద దాడికి కుట్ర జరుగుతోందని చూపించు.. పవన్ వ్యాఖ్యలు, ఆరోపణలు నిజం అయితే పోలీసులకు, డీజీపీకి వెంటనే చర్యలు తీసుకోవాలని చెబుతా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే ఈ కుతంత్రాలు జరుగుతున్నాయన్న ఆయన.. జనసేన అభిమానులు ఇటువంటి మోసగాడిని నమ్మకండి అని సూచించారు. సింగిల్ గా పోటీకి రాలేని పిరికిపందలు.. గుంపులుగా, పందుల్లా వస్తాం అంటారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి జోగి రమేష్.
సిద్దిపేట రైల్వే లైన్ కోసం కష్టపడ్డది మేము.. కేసీఆర్ లేకపోతే రైల్వే లైన్ లేదు
సిద్దిపేట జిల్లాకి రైలు రావడం గొప్ప వరమని మంత్రి హరీష్ రావు అన్నారు. నీళ్లు, నిధులు, జిల్లా ఈ కలల్ని నిజం చేసింది సీఎం కేసీఆర్ అని హరీష్ రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదని.. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగిన సిద్దిపేటకి రైలు తెస్తాం అని అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. 2006న రైల్వే లైన్ మంజూరు కాగా.. 33 శాతం రాష్ట్ర వాటా చెల్లించాలని కేంద్రం చెప్పిందన్నారు. సీఎం కేసీఆర్ రైల్వే లైన్ ని స్వయంగా రూపకల్పన చేశారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారారు కానీ.. రైల్వే లైన్ రాలేదని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ప్రజల అదృష్టం తెలంగాణ రావడం, కేసీఆర్ కావడమన్నారు. ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్నారని.. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించింది కేసీఆర్ అని అన్నారు. సిద్దిపేట, మెదక్, కరీంనగర్ పై ఆనాటి ప్రభుత్వాలు కక్ష కట్టాయని తెలిపారు. బీజేపీ వాళ్ళు రైలు తమ వల్లే వచ్చిందని చెబుతున్నారు ఇది సిగ్గుచేటని ఆరోపించారు. 33 శాతం వాటా కడితే కనీసం సీఎం ఫోటో కూడా పెట్టలేదని మండిపడ్డారు.
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థను మంగళవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నమోదు చేసిన కేసుకు సంబంధించి చైనా అనుకూల ప్రచారం కోసం డబ్బు అందుకున్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. న్యూస్‌క్లిక్‌లో హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ అమిత్ చక్రవర్తి కూడా అరెస్టయ్యారు. అంతకుముందు రోజు విచారణ నిమిత్తం ప్రబీర్ పుర్కాయస్థను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. దీంతో పాటు న్యూక్లిక్ కార్యాలయానికి పోలీసులు సీల్ వేశారు. ఉపా కేసుకు సంబంధించి న్యూస్‌క్లిక్ ఆన్‌లైన్ పోర్టల్‌కు సంబంధించిన పలువురు జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై ఢిల్లీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పోలీసులు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్‌ల డేటా డంప్‌లను తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షేర్ చేసిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ సోదాలు జరిగాయి. వారి విదేశీ ప్రయాణాలు, షాహీన్‌బాగ్‌లో పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు, రైతుల ఆందోళనతో సహా వివిధ సమస్యలపై పోలీసులు 25 ప్రశ్నల జాబితాను సంధించినట్లు పలు వర్గాలు తెలిపాయి.
గూఢచారి నౌకలతో భారత్ సముద్ర ప్రాంతాన్ని చైనా ఎందుకు స్కాన్ చేస్తోంది?
హిందూ మహాసముద్రంలో శాస్త్రీయ ప్రయోగాలు చేస్తున్న నెపంతో చైనా గూఢచారి నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలోని విస్తారమైన ప్రాంతాల్లో సర్వే చేస్తున్నాయి. ఈ నౌకల నుంచి సేకరించిన డేటా మలక్కా జలసంధి, తూర్పు హిందూ మహాసముద్రం నిస్సార జలాల ద్వారా నావిగేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న చైనీస్ జలాంతర్గాములకు అమూల్యమైనది. దీని వల్ల భారత్‌కు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కొద్ది రోజుల క్రితమే చైనాకు చెందిన ఓషన్ సైన్స్ సర్వే షిప్ షి యాన్ 6 శ్రీలంకలోని హంబన్‌తోటాకు చేరుకుంది. హిందూ మహాసముద్రం నీటి అడుగున మ్యాప్‌ను రూపొందించడానికి ఈ నౌక రాబోయే మూడు నెలల పాటు డేటాను సేకరించనుందని తెలుస్తోంది. హంబన్‌తోట ఓడరేవు 2017 నుంచి 99 ఏళ్లుగా చైనా ఆధీనంలో ఉంది. చైనా ప్రతిరోజూ తన సర్వే నౌకలను ఈ నౌకాశ్రయంలో మోహరిస్తూనే ఉంటుంది. దీనిపై భారత్ పలుమార్లు శ్రీలంకకు తన అధికారిక నిరసనను కూడా తెలియజేసింది. చైనా ప్రభుత్వ మీడియా షి యాన్ నౌకను శాస్త్రీయ పరిశోధన నౌకగా పిలుస్తుంది. 60 మంది సిబ్బందితో కూడిన ఈ నౌక ఓషనోగ్రఫీ, మెరైన్ జియాలజీ, మెరైన్ ఎకాలజీ ప్రయోగాలను నిర్వహించగలదు. భారత నౌకాదళానికి చెందిన రిటైర్డ్ కమోడోర్ అనిల్ జై సింగ్ యురేసియన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. చైనా సర్వే నౌక సీఫ్లూర్ మ్యాపింగ్‌లో పాల్గొంటుందని, సముద్రగర్భ వాతావరణం ఆకృతులను అర్థం చేసుకోవడానికి హైడ్రోలాజికల్ డేటాను రికార్డ్ చేయడం, సముద్రగర్భ కేబుల్స్, క్షిపణి వీక్షణలు మొదలైన వాటి నుంచి ఇంటెలిజెన్స్ వివరాలను సేకరిస్తుందని తెలిపారు. హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రయత్నాలను శాస్త్రీయ ప్రయోగంగా అభివర్ణించిందని, అయినప్పటికీ భారతదేశం ఈ వాదనను ఎప్పుడూ అంగీకరించలేమన్నారు. హిందూ మహాసముద్రంలో చైనా నావికాదళం ఉపయోగిస్తున్న సామర్థ్యాలు ఈ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలను ప్రారంభించడంలో సహాయపడతాయని తెలిపారు.
పుష్ప గాడిని మరువని డేవిడ్ వార్నర్.. మ్యాచ్ మధ్యలో తగ్గేదేలే అంటున్నాడు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పుష్ప సినిమా మొదటి భాగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బన్నీ మాస్ గెటప్‌కు ఆయన యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యి ఆయన మేనరిజమ్స్ కూడా చేసేస్తూ ఉంటారు. సినిమా మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఆ అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఈ సినిమా నుంచి అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. లీకైన ఫోటోలు, వీడియోలు ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా వేరే లెవల్లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే గతంలో అల్లు అర్జున్ చేసిన సినిమాల పాటలు డాన్స్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చిన డేవిడ్ వార్నర్ బన్నీ అలవైకుంఠపురంలో సినిమా సమయంలో వార్నర్ ఆ మూవీ పాటలకు స్టెప్పులేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇక ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో ఆస్ట్రేలియా పాకిస్థాన్ మ్యాచ్ కు అంతా సిద్దమవుతున్న క్రమంలో పుష్ప మేనరిజంలో తగ్గేది లేదు అని అర్థం వచ్చేలా సైగలు చేయడం హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ప్రాక్టీస్ మ్యాచులో తలపడగా ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. వార్మప్ మ్యాచ్ లు కూడా సాధారణ మ్యాచ్ ల లానే జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ లోనే ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ బాల్ ను బౌండరీకి వెళ్లకుండా అడ్డుకుని ఆ తరువాత తగ్గేదేలే అని అంటూ మేనరిజం చేసి చూపించడం గమనార్హం.
సీఎం జగన్‌కు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ
ఏపీ మంత్రి ఆర్కే రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణను అనకాపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ రాశారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పై జగన్ సర్కారు తీసుకున్న చర్యలను ఆర్జీవీ అభినందిస్తూ ఇలాంటి నాయకులపై పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎక్స్ (ట్విట్టర్)లో కోరారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేశారు రామ్ గోపాల్ వర్మ. ‘’చంపుతా, బట్టలిప్పి నిలబెడతా, గొంతు కోస్తా లాంటి రెచ్చగొచ్చే మాటలు, నిరాధార ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించిన వర్మ ప్రజలు ప్రభావితమయ్యేలా తప్పుడు సమాచారం, హానికరమైన అబద్ధాలను ప్రచారం చేసే వారిని అస్సలు ఉపేక్షించొద్దు” అని వర్మ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇక మంత్రి ఆర్కే రోజా గురించి అసభ్యంగా మాట్లాడిన బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంతకుముందు జాతీయ మహిళా కమిషన్ ను రామ్ గోపాల్ వర్మ కోరారు. ఇక మహిళా మంత్రిపై మీ పార్టీ నాయకుడు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటూ నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బండారు సత్యనారాయణ మాట్లాడిన యూట్యూబ్ వీడియో లింక్ కూడా ఆయన షేర్ చేశారు. బండారు సత్యనారాయణకు మద్దతుగా నారా లోకేష్ చేసిన ట్వీట్ ను అంగీకరిస్తారా అని కూడా ఆర్జీవీ లోకేష్, బ్రాహ్మణిని ప్రశ్నించారు. అంతేకాక బండారు సత్యనారాయణ తర్వాత టీడీపీలో మరో ఆణిముత్యం అయ్యన్నపాత్రుడు అంటూ మరో యూట్యూబ్ లింక్ షేర్ చేసిన ఆయన బండారుపై చర్యలు తీసుకున్నట్టుగానే.. బ్రాహ్మణిని అగౌరవపరిచేలా వ్యాఖ్యానించిన అయ్యన్నపాత్రుడిపైనా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
స్కంద 5 డేస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఎంత కావాలి అంటే…
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద..మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.స్కంద మూవీలో రామ్ కి జంటగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు. ఈ సినిమాకు ముందు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది.. అయితే వరుసగా వచ్చిన సెలవులు స్కంద సినిమా కు బాగా ఉపయోగపడ్డాయి తెలుగు రాష్ట్రాలలో స్కంద సినిమా మొదటి రోజు దాదాపు రూ. 8.52 కోట్లు, రెండవ రోజు రూ. 3.50 కోట్లు అలాగే మూడవ రోజు రూ.3.27 కోట్లు వసూలు చేసింది. అయితే ఆదివారం స్కంద వసూళ్లు కాస్త పెరిగాయి.. స్కంద నాలుగో రోజు రూ.4.46 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులకు స్కంద రూ.19.85 కోట్ల షేర్, 32.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ రూ. 23.40 కోట్ల షేర్, 39.60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఐదవ రోజు స్కందకు నైజాంలో కోటి కంటే తక్కువ షేర్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.1.5 కోట్ల వరకూ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ చూస్తే ఈ సినిమా రూ. 3 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్కంద ఐదు రోజుల కలెక్షన్స్ రూ. 22 కోట్ల వరకూ ఉండొచ్చని అయితే అంచనా. ఇక వరల్డ్ వైడ్ రూ. 25 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్కంద చిత్రం దాదాపు రూ. 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హీరో రామ్,బోయపాటి శ్రీనుపై నమ్మకంతోభారీగా బిజినెస్ జరిగింది. రూ. 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన స్కంద రాబట్టాల్సిన వసూళ్లు చాలా ఉన్నాయి. మరో రూ. 22 కోట్ల వసూళ్లు రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతుంది.. అయితే వర్కింగ్ డేస్ లో వసూళ్లను బట్టి ఈ చిత్ర ఫలితం తెలియనుంది.