పవన్, లోకేష్, భువనేశ్వరి, పురంధేశ్వరి.. ఎవ్వరినీ వదలని అంబటి..
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇలా ఎవ్వరినీ వదలకుండా అందరిపై విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు అరెస్టు అక్రమమని టీడీపీ నాయకులు, పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారని, భువనేశ్వరి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు.. చంద్రబాబు అరెస్ట్ చాలా సక్రమం.. చట్టబద్ధమైనదని అన్నారు. అరెస్టు చేసిన తర్వాత న్యాయస్థానం ముందు ప్రవేశపెడతారని, కక్ష సాధింపు చేస్తే రిమాండ్ రిజెక్ట్ చేసేవారని వివరించారు. చంద్రబాబు తరఫున ఢిల్లీ నుంచి వచ్చే పెద్ద పెద్ద అడ్వకేట్లు సుప్రీంకోర్టు హైకోర్టుల్లో వాదిస్తున్నారు.. ప్రాథమిక ఆధారాలు ఈ కేసులో ఉన్నాయని రిమాండ్ కు పంపారని తెలిపారు. అయినా రిమాండ్ సక్రమమే అన్నమాట వినిపించిందని వివరించారు. ఇది అక్రమ అరెస్టు ఎలా అవుతుంది పవన్ కళ్యాణ్ ను, టీడీపి నేతలను నిలదీశారు అంబటి. భువనేశ్వరికి చంద్రబాబు అరెస్ట్ అక్రమంగా కనిపించడం సహజం.. భర్త అవినీతిపరుడైనా మంచివాడిగానే భావిస్తుందని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. కానీ, ప్రజలందరూ అలా అనుకోవాలని కోరుకోవటం కరెక్ట్ కాదు అని హితవుపలికారు. చంద్రబాబు అరెస్టు విని గుండె పగిలి చనిపోయారని భువనేశ్వరి చెబుతున్నారని విమర్శించారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారన్న ఆయన.. అబద్దాలు, అవినీతి గెలవాలని యాత్రలు చేస్తే మీకు ఉపయోగం ఉంటుందని సూచించారు. చంద్రబాబు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డారని భువనేశ్వరి చెబుతున్నారు.. మరి ప్రజలు ఎందుకు చంద్రబాబును దారుణంగా తిరస్కరించారని ప్రశ్నించారు. లోకేష్ కు దొడ్డి దారిన మూడు పెదవులు కట్టబెట్టడం తప్పు కాదా? అన్న ఆయన.. మీరు సిద్ధపడితే సవాల్ చేస్తున్నాను.. మీకున్న ఆస్తులపై ఎంక్వయిరీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తే సిద్ధంగా ఉంటారా? అంటూ చాలెంజ్ చేశారు.
దేవాన్ష్ తన తాతను అడిగాడు.. విదేశాలకు వెళ్లాడని చెప్పాం..
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమం.. ఈ విషయంలో ‘నిజం గెలవాలి’ పేరుతో యాత్రకు పూనుకున్నారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. యాత్రలో భాగంగా పరామర్శలు, ముఖాముఖి కార్యక్రమాలు, సభలు నిర్వహిస్తున్నారు.. ఇక, మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన నారా భువనేశ్వరి.. కొంత భావద్వేగానికి గురయ్యారు.. మనవడు దేవాన్ష్ తన తాత (చంద్రబాబు)ను అడిగాడు.. మేం, విదేశాలకు వెళ్లాడని చెప్పాల్సి వచ్చిందన్నారు.. కుంభకోణం అని చెబుతున్న డబ్బు ఏ అకౌంట్ లోకి వెళ్లింది అని చెప్పడం లేదన్న ఆమె.. ప్రజల సొమ్ము మా కుటుంబానికి అవసరం లేదన్నారు. సీఐడీ ఎప్పుడైనా వచ్చి విచారించుకోవచ్చు అని సూచించారు. ఇక, ములాఖత్ లో మాకు ఇచ్చే సమయం 30 నిమిషాలు.. అందులో 25 నిమిషాలు ప్రజల గురించి, పార్టీ గురించి అడుగుతారు.. మిగిలిన ఐదు నిమిషాలు మాత్రమే మా గురించి మాట్లాడుతారని గుర్తుచేసుకున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఆయన్ను (చంద్రబాబు) ప్రజలకు దూరం చేయాలని, ఓర్వలేకే ఇలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు భువనేశ్వరి.. తండ్రి నుంచి నాకు కొంత పౌరుషం వచ్చింది.. చంద్రబాబు నుంచి క్రమశిక్షణ, ఓర్పు నేర్చుకున్నానని తెలిపారు. ఎప్పుడూ బయటకు రాని మహిళలు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అది చంద్రబాబు పై ఉన్న నమ్మకం అన్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల చేసిన లేఖపై కూడా విచారణ అంటే ఆశ్చర్యం వేస్తుందన్న ఆమె.. పనికిమాలిన అంశాలపై విచారణ ఏంటి? ప్రజల సమస్యలు గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని సలహా ఇచ్చారు. మేం చంద్రబాబు ఆహారంలో విషం కలుపుతున్నామని అంటున్నారు.. వారి ఆలోచన అంత హీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. మాకు ఆ కుసంస్కారం లేదన్న ఆమె.. దేవాన్ష్ తన తాతను అడిగాడు.. విదేశాలకు వెళ్లాడని చెప్పాం అన్నారు. పవన్ కల్యాణ్ కూడా మాలాగానే ఆలోచిస్తున్నారు.. అందుకే రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలన్నారు నారా భువనేశ్వరి..
చాలా మందికి మంచి పదవులు రాబోతున్నాయి.. రాబోయే ఎన్నికలు ఓ సవాల్..!
ఇంకా చాలా మందికి మంచి మంచి పదవులు రాబోతున్నాయని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్లు ఇస్తే చిన్న స్థలం ఇచ్చారని చంద్రబాబు అనడం హాస్యాస్పదం.. కానీ, మేం 12 వేల 8 వందల కోట్లతో భూమి కొన్నాం.. 32 లక్షల మందికి పంచాం అన్నారు. కార్యకర్తలు గమనించాలి.,. ప్రభుత్వం డబ్బులు పంచేస్తున్నారనడం తప్పు.. ప్రజలకు సంక్షేమ ఫలాలు డైరెక్టుగా ఇస్తున్నాం.. అవినీతి లేకుండా అన్నారు. విద్యుత్తు మన రాష్ట్రం కన్నా చవకగా ఉందా..? అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లకు మాట్లాడే అర్హత లేదు.. అవినీతి లేకుండా చేసిన ఘనత మనదే అన్నారు. ఏ ఒక్కరూ తలవంచ కుండా ఆత్మగౌరవంతో పేద ప్రజలు ఉన్నారు.. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే రాష్ట్రాన్నికి చంద్రబాబు ఏమీ చేశారని నిలదీశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని ఇక్కడకు పరిగెత్తుకు వచ్చావు.. 10 ఏళ్లు అక్కడే ఉండి మనం రాష్ట్రాన్ని నిర్మించుకొని వస్తే బాగుండేది కదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడుతున్నాడు అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుని క్షమించకూడదు.. మండిపడ్డ మంత్రి అప్పలరాజు
బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు అప్పట్లో సుప్రీంకోర్టుకు లేఖ రాశారు.. అటువంటి చంద్రబాబుని క్షమించకూడదు అన్నారు మంత్రి సీదరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చాపురం నియోజకవర్గలో మత్స్యకార సోదరులారా మనం సమస్య మీద చంద్రబాబునాయుడు వద్దకు వెళ్తే మీ డొక్కా తీస్తా, తోలుతీస్తా అని బెదిరించారు.. గడచిన ఎన్నికల్లో తొక్కతీసి.. ఇప్పుడు చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో చిప్పకూడు తినిపించాం అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఎస్సీ, ఎస్టీల్లో ఎవరైనా పుట్టడానికి మనం కోరుకుంటామా? అని చంద్రబాబునాయుడు అన్నారు.. కానీ, మన ప్రభుత్వంలో దళితులకే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు మన సీఎం జగన్.. దళితులను, మత్స్యకారులను అవమానించిన చంద్రబాబుకి తొక్కా తీయాలి కదా? తీయాలా వద్దా అంటూ ప్రజల్లో వేడిని పుట్టించారు మంత్రి.
జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు.. కో-ఆర్డినేటర్లను నియమించిన జనసేన
జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జీలు, ముఖ్య నేతలతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జరిగే జనసేన – టీడీపీ సమన్వయ సమావేశాలపై చర్చించారు.. ఉమ్మడి జిల్లాల వారీగా జరిగే ఈ సమన్వయ సమావేశాలను పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకోవాలవి సూచించారు. ఈ సమావేశాల నిర్వహణను ఆయా ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు చూసుకోవాలని సూచించారు. జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టని ఐదు జిల్లాలకి కో – ఆర్డినేటర్లుగా పార్టీ సీనియర్ నేతలను నియమించింది జనసేన పార్టీ.. ఆ ఐదు జిల్లాల్లో సమన్వయ సమావేశాలను పర్యవేక్షించనున్నారు కో-ఆర్డినేటర్లు.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా – పాలవలస యశస్వి.. ఉమ్మడి విజయనగరం జిల్లా – లోకం నాగమాధవి.. ఉమ్మడి కడప జిల్లా – సుంకర శ్రీనివాస్.. ఉమ్మడి కర్నూలు జిల్లా – చింతా సురేష్.. విశాఖ అర్బన్ జిల్లా – కోన తాతారావును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది జనసేన.
మనం మంచి స్థితిలో ఉండాలంటే.. జగన్ మళ్లీ సీఎం కావాలి..
మరోసారి వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మన కులాలు మంచి స్థితిలో ఉంటాయన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకు ఉన్నారంటే మన జగన్మోహనరెడ్డే వళ్లే అన్నారు. పేదవాడు, దళితులు, మైనార్టీలు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లేలాంటే చాలా ఇబ్బందులు పడేవారు.. వైఎస్ జగన్ వచ్చాక స్థితి గతులు పెరిగి కార్పోరేట్ వైద్యం పేదలకు అందించారని కొనియాడారు.. కానీ, విద్య ఇంగ్లీషులో పెడితే చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు నాగార్జున.. పేదవాడు ఇంగ్లీషులో మాట్లాడితే ఈ యనకు ఏమిటి ఇబ్బంది..? అని నిలదీశారు. ఈ రోజు ఎస్సీ, ఎస్టీ నా వాడే అని దైర్యంగా చెప్పగలిగే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. మరోసారి ఆయన సీఎం అయితేనే మన కులాలు మంచి స్థితిలో ఉంటాయన్నారు.. పెత్తందార్ల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని ఆరోపించిన ఆయన.. పేదల పక్షపాతి జగన్మోహన్‌రెడ్డి అని కొనియాడారు. దళితులు ముందుకు వెళ్లాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సీఎం కావాలని ఆకాక్షించారు మంత్రి మేరుగ నాగార్జున. ఇక, శ్రీకాకుళం ఇచ్చాపురంలో సామాజిక సాధికార యాత్ర ముగిసింది.
ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు కౌంటర్..
గజ్వేల్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై పై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలు అనగానే చాలా మంది వచ్చి ఏదేదో మాట్లాడతారు.. మనల్ని మభ్య పెడతారు.. నవంబర్ 30 తరువాత గజ్వేల్ లో ఎవరు ఉండరు అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ కేసీఆర్ పోటీ చేయకుంటే కట్టించిన బిల్డింగ్ లకు కూడా సున్నాలు కూడా వేయలేరు అని మంత్రి కామెంట్స్ చేశారు. ఒకప్పుడు గజ్వేల్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం ఆలోచించాలి.. సీఎం కేసీఆర్ ఇక్కడ ఉండటం గజ్వేల్ ప్రజల అదృష్టం.. సిద్దిపేట కంటే మంచి మెజార్టీ గజ్వేల్ ప్రజలు సీఎం కేసీఆర్ కి బహుమతిగా ఇవ్వాలి.. ఈ సారి గజ్వేల్ లో ప్రతిపక్ష పార్టీల డిపాజిట్ గల్లంతు అవ్వడం ఖాయం అంటూ హరీశ్ రావు వ్యాఖ్యనించారు. అయితే, అంతకు ముందుకు గజ్వేల్ లో పర్యటించిన ఈటెల రాజేందర్ బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు తన మీటింగులను అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచమైన పనే హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆచరించిందని ఈటెల తెలిపారు. గజ్వేల్లో అడ్డగోలుగా డబ్బుల పంపిణీ అధిగమించి హుజురాబాద్‌లో ఎలాగైతే విజయం సాధించామో అలాగే ఇక్కడా గెలిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన కడుపుకొట్టి, నోరు కొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించి, ఆ డబ్బుతో మన ఆత్మగౌరవాన్ని కొనే ప్రయత్నం చేస్తున్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు.
హిమంత బిశ్వ సర్మ, ప్రియాంకాగాంధీలకు ఈసీ నోటీసులు..
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వసర్మకు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాలకు ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలపై సోమవారం సాయంత్రంలోగా సమధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గడువు ముగిసేలోపు ఇరువురు నేతలు స్పందించకుంటే, మళ్లీ వారిని సంప్రదించకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. గత వారం ఛత్తీస్‌గఢ్‌లోని ఏకైక ముస్లిం మంత్రి మహ్మద్ అక్బర్‌ను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారం హిమంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 18న ఛత్తీస్‌గఢ్ కవర్ధాలో హిమంత, అక్బర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు ప్రియాంకాగాంధీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీపై తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. వచ్చే నెలలో ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
అమెరికాలో సాల్మొనెల్లా వ్యాప్తి.. ఉల్లిపాయలే కారణం..
అమెరికాను సాల్మొనెల్లా బ్యాక్టీరియా కలవరపెడుతోంది. సాల్మొనెల్లా వ్యాప్తి 22 అమెరికా రాష్ట్రాల్లో 73 మందిని ప్రభావితం చేసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీఎస్) ప్రకారం ఈ వ్యాప్తికి ముక్కలుగా చేసిన ఉల్లిపాయాలు కారణమవుతున్నాయని తేలింది. ఇప్పటి వరకు 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు. అయితే ఈ సంఖ్య ఎక్కువగా ఉంటే అవకాశం ఉందని, చాలా మంది ప్రజలు పెద్దగా వైద్య పరీక్షలు లేకుండా కోలుకోవడంతో ఖచ్చితమైన సంఖ్యను గుర్తించలేదు. కాలిఫోర్నియాకు చెందిన గిల్స్ ఆనియన్స్ అనే కంపెనీ డైస్ చేసిన ఎల్లో ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిపాయలు, ఉల్లిపాయలను, సెలెరీల ప్యాకెట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేసింది. ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉన్నందున గిల్స్ ఉల్లిపాయలను స్వచ్ఛందంగా రీకాల్ చేసింది. అరిజోనా, కాలిఫోర్నియా, ఇడాహో, మోంటానా, ఒరెగాన్, వాషింగ్టన్ ఆరు రాష్ట్రాలకు సరఫరా చేయబడిన ఉత్పత్తుల వినియోగించే తేదీ ఆగస్టు 2023కు మించి ఉన్నాయి, దీంతో స్టోర్లలో ఇకపై అందుబాటులో ఉండవని కంపెనీ తెలిపింది.
ఇజ్రాయిల్ దాడుల్లో 50 మంది బందీలు చనిపోయారు.. హమాస్ ప్రకటన..
20 రోజుల నుంచి ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరు తీవ్రంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలు చంపబడ్డారు. ఇజ్రాయిల్ నుంచి 200కు పైగా ప్రజలను బందీలుగా హమాస్ ఉగ్రవాదులు గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజస్ట్రిప్ పై వైమానిక దాడులు చేస్తోంది. ఈ యుద్ధం మధ్యప్రాచ్యంతో పాటు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఇదిలా ఉంటే పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయిల్ జరిపిన బాంబు దాడుల్లో ఇప్పటివరకు బందీలుగా ఉన్న వారిలో 50 మంది ఇజ్రాయిలీలు చంపబడినట్లు హమాస్ సాయుధ విభాగం గురువారం వెల్లడించింది. అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ ప్రకారం జియోనిస్ట్ దాడులు మరియు ఊచకోత ఫలితంగా గాజా స్ట్రిప్‌లో మరణించిన జియోనిస్ట్ ఖైదీల సంఖ్య దాదాపు 50కి చేరుకుందని అంచనా వేసినట్లు హమాస్ టెలిగ్రామ్ ఛానెల్ లో తెలిపింది.
శ్రీలంకపై ఇంగ్లాండ్ ఓటమి.. సెమీస్ నుంచి ఔట్!
ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్‌పై శ్రీలంక ఆటగాళ్లు విజృంభించారు. 25.4 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌పై భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపుతో శ్రీలంక జట్టు రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో కేవలం 156 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆంగ్ల జట్టును 156 పరుగులకే కట్టడి చేశారు. శ్రీలంక బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ కుప్పకూలిపోయింది. ప్రపంచకప్‌లో లంకేయులపై ఇంగ్లండ్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఇంగ్లీష్ ఓపెనర్లు నిలకడగా రాణించినప్పటికీ, వారిద్దరూ తమ ప్రారంభాలను పెద్ద స్కోర్లుగా మార్చడంలో విఫలమయ్యారు. జో రూట్ పెద్దగా ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. అలాగే జోస్ బట్లర్ పేలవమైన ఫామ్ కొనసాగుతుండగా.. జానీ బెయిర్‌స్టో రనౌట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ 43 పరుగులతో వారి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అయితే అవతలి వైపు నుంచి బ్యాటర్ల మద్దతు లేకపోవడంతో అతను కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. చివరికి డిఫెండింగ్ ఛాంపియన్‌లు 156 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
తిడితే పవన్ కళ్యాణ్ ను తిట్టండి.. మమ్మల్ని లాగకండి
నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కానీ, ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా .. ఇప్పుడు మాజీ భార్యగా ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక దాదాపు 23 ఏళ్ళ తరువాత టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రేణు రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. సినిమా విషయాలతో పాటు, తన పర్సనల్ విషయాలు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ” నేను ఎప్పుడు విడాకుల గురించి మాట్లాడినా.. నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ అభిమానులు.. నేను వేరే పార్టీలకు అమ్ముడుపోయాను అని చెప్పుకొచ్చేవారు. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా మాట్లాడితే .. ఈ పార్టీకి అమ్ముడుపోయాను అని చెప్పుకొస్తున్నారు అంటూ నవ్వేసింది. “పవన్ కళ్యాణ్.. రాజకీయ నాయకుడు కావాలనుకున్నారు. ప్రపంచంలో ఎవరైనా ఆయన గురించి కామెంట్ చేయొచ్చు. మేనిఫెస్టో బాగోలేదని, ఆయన మాట్లాడే మాటలు బాగోలేవని.. స్పీచ్ లు బాగోలేవని తిట్టండి.. కానీ అందులోకి కుటుంబాన్ని లాగకండి” అని చెప్పింది. ఇక రేణు క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడిన కామెంట్స్ గురించి ఆమె చెప్తూ.. ” ఒక కుటుంబం పరువు మొత్తం ఒక మహిళ రెండు కాళ్ల మధ్య ఉంటుంది అంటే.. అది చాలా దురదృష్టం. నా నటన గురించి కానీ, నా డ్రెస్సింగ్ గురించి కానీ కామెంట్ చేయకుండా.. ఎంతమందితో పడుకుంది.. ఇలా చేసింది.. అలా చేసింది అని క్యారెక్టర్ తో వెళ్ళిపోతారు.. అది పద్దతి కాదు” అని రేణు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఐరనే వంచాలా ఏంటీ .. నెక్స్ట్ టైటిల్ ఇదే..?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఏది చేసిన ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇక సోషల్ మీడియా లో దాన్ని అభిమానులు ట్రెండ్ చేయడం అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. తాజాగా విజయ్ సినిమాలోని ఒక డైలాగ్ ట్విట్టర్ ను షేక్ చేస్తోంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జన్తగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం సినిమా విజయ్- పరుశురామ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ స్టార్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. అందులో విజయ్ చెప్పిన డైలాగ్ .. ఉల్లిపాయలు కొంటే మనిషికాదా? పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి? అని చెప్తూ.. విలన్స్ ముందు ఐరన్ రాడ్ ను వంచుతూ కనిపిస్తాడు. ఇక ఇప్పుడు ఆ ఐరన్ డైలాగ్ వైరల్ గా మారింది. తాజాగా ఆ డైలాగ్ ను విజయ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు. ఇంటర్నెట్ లో ఏం నడుస్తోంది .. అని అంటే.. ఐరనే వంచాలా ఏంటీ అనే డైలాగ్ నడుస్తోంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇది ఎంత ఫేమస్ అయ్యింది అంటే.. ఐరనే వంచాలా ఏంటీ అనే పేరును చాలామంది నిర్మాతలు టైటిల్ గా రిజిస్టర్ చేయించే ఉద్దేశ్యంలో ఉన్నారట. ఇదే కదా నిజమైతే.. విజయ్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఇది అయినా ఆశ్చర్యం లేదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఒక డైలాగ్ ఈ రేంజ్ లో ఫేమస్ అవ్వడం అనేది చాలా రేర్ అని చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఇదే టైటిల్ తో విజయ్ ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో చూడాలి.