*కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు నిలిపివేయాలని TSLPRBకి హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టెస్టులు ఆపాలని ఎస్పీలు, కమిషనర్లకు TSLPRB ఆదేశాలు ఇచ్చింది. పలు ప్రశ్నలు తప్పుగా రావడంతో నాలుగు మార్కులు కలపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొన్ని రోజుల క్రితం ఆదేశించినా.. నియామక ప్రక్రియ కొనసాగుతోందని పిటిషనర్లు మరోసారి హైకోర్టుకు వెళ్లారు. దీంతో మెడికల్ టెస్టులు వెంటనే నిలిపివేయాలని కోర్టు నేడు (గురువారం) ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో బోర్డు మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని నియామక బోర్డు తెలిపింది.
*కనకదుర్గమ్మను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి జగన్
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. అక్టోబరు 15వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్శించుకోనున్నారు. రేపు(శుక్రవారం) మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను ముఖ్యమంత్రి సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానానికి సీఎం చేరుకోనున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు మహా చండీ దేవిగా దర్శనమిస్తూ.. భక్తులను అనుగ్రహిస్తోంది దుర్గమ్మ. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు అమ్మవారి దర్శనానికి బారులుతీరారు.. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహా చండీ అమ్మవారు ఉద్భవించినట్టు చెబుతారు.. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే అనే పురాణాలు చెబుతున్నాయి.
*కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాదు.. రాజులా వ్యవహరిస్తున్నారు
పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న బస్సుయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతాం అని వెల్లడించారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతీ మహిళకు రూ.2500 అందిస్తాం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.. భూమి లేని రైతు కూలీలకు 12వేలు, రైతులకు, కౌలు రైతులకు 15వేలు అందిస్తాం.. గృహలక్ష్మీ ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతుంది.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయి.. బీజేపీ, ఎంఐఎంకు ఓటు వేస్తే అవి బీఆర్ఎస్ కు వేసినట్టే.. బీజేపీపై పోరాడినందుకు నాపై కేసులు పెట్టారు.. నా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదు.. సీబీఐ, ఈడీ కేసులు లేవు అని రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించాలి.. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోంది.. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.. దేశంలో కులగణన చేపట్టాలి.. అది దేశానికి ఎక్స్ రే లాంటిది.. ఓబీసీ గురించి మాట్లాడే ప్రధాని ఎందుకు కులగణన చేపట్టడం లేదు? అని ఆయన రాహుల్ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే రాజకీయంగా నష్టపోతాం అని సోనియాగాంధీకి తెలుసు.. కానీ రైతులు.. పేదల కోసం తెలంగాణ ఏర్పాటు చేసింది అని ఆయన అన్నారు. పదేళ్ల తర్వాత కూడా సోనియాగాంధీ కళ నెరవేరలేదు.. అందుకే.. దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధమే ఈ ఎన్నికలు అని రాహుల్ గాంధీ అన్నారు. కేసీఆర్ కుటుంబం ప్రభుత్వంలోని కీలక శాఖలు తన అధీనంలో పెట్టుకున్నారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్.. ముఖ్యమంత్రిగా కాదు.. రాజులా వ్యవహరిస్తున్నారు.. మీ భూములు లాక్కున్నారు.. కాళేశ్వరం నుంచి మీకు లాభం జరిగింది.. ధరణితో ఎవరికి లాభం అని ఆయన ప్రశ్నించారు. ధరణిలో భూముల రికార్డు మార్చారు.. పేదల భూములు లాక్కున్నారు.. డబుల్ బెడ్ రూమ్ ఎంత మందికి వచ్చింది.. లక్ష మాఫీ ఎంత మందికి అయ్యింది అని రాహుల్ అడిగారు. సింగరేణి కార్మికులతో మాట్లాడినా.. సింగరేణి ప్రైవేటీకరణ కానివ్వాం.. ఆదానికి అమ్మే ప్రయత్నాలు జరుగాయి.. దాన్ని మేమే అడ్డుకున్నాం అని రాహుల్ గాంధీ ఆరోపించారు. సింగరేణికి రక్షణగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. దేశంలో మోడీ.. అదానికి సాయం చేస్తున్నారు.. ప్రభుత్వ కంపనీలకు ఒక ధర.. ప్రైవేట్ కంపనీలకు ఇంకో ధర నిర్ణయిస్తున్నారు.. మోడీ 15 లక్షలు మీ అకౌంట్ లో వేస్తా అన్నారు ఇవ్వలేదు.. కేసీఆర్ మూడెకరాల భూమి దళితులకు ఇస్తాం అన్నారు ఇవ్వలేదు.. నేను అబద్ధం చెప్పను.. ఏం హామీలు ఇచ్చామో.. కర్ణాటక.. రాజస్థాన్ లో అమలు చేశాం.. కర్ణాటకలో ఏ మహిళను అయినా అడగండి.. ఉచితంగా బస్సులో తిరుగుతున్నారు.. తెలంగాణలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని రాహుల్ గాంధీ అన్నారు.
*తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ లకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహ రచన
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల రూట్ మ్యాప్ పై ప్రధానంగా చర్చ జరిగింది. అభ్యర్థుల ఖరారు, అగ్రనేతల నేతల ప్రచారం, మేనిఫెస్టో అంశాలపై చర్చ కొనసాగింది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలను ఎదుర్కొనేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వాళ్ళను అసెంబ్లీకి పోటీ చేయించడం.. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. అయితే, ఇవాళ బీజేపీ అభ్యర్థులపై తుది కసరత్తు కొనసాగుతుంది. రేపు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఆమోదం పొందనుంది. తొలి జాబితాలో 50 నుంచి 70 సీట్లను ప్రకటించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. అయితే, అంతకు ముందు జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసింది. ఇక, సమావేశం తర్వాత ఎంపీ బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ బయటకు వెళ్లిపోయారు. ఇక, తెలంగాణలో ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలదళం పట్టుదలతో ఉంది. దీంతో రాష్ట్రంలో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా నజర్ పెట్టింది. గతంలో జరిగిన హుజూరాబాద్, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 కార్పొరేట్ సీట్లను కమలం పార్టీ గెలుచుకుంది. దీంతో బీజేపీ అధిష్టానం గత కొంత కాలంగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గతంలో యూపీలో పనిచేసిన సునీల్ బన్సల్ నేతృత్వంలోని బృందం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమాలపై దృష్టి సారించింది. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ వ్యూహ రచన చేస్తుంది.
*”అమ్మాయిలూ.. మీరు మీ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి”.. కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు తేలింది. ఈ కేసులో హైకోర్టు న్యాయమూర్తులు చిత్త రంజన్ దాస్, పార్థసారధి సేన్‌లతో కూడిన డివిజన్ బెంజ్ విచారణ జరిపింది. ప్రేమ సంబంధం కారణంగా బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా ఉన్న యువకుడిని నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. ఈ కేసులో తీర్పు ఇస్తున్నప్పుడు కీలక వ్యాఖ్యలు చేసింది. పరస్పర సమ్మతితో సెక్స్ లో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టంపై ఆందోళన వ్యక్తం చేసింది. అబ్బాయిలు, అమ్మాయిలకు పలు సూచనలు చేసింది. యుక్త వయసు బాలికను తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. రెండు నిమిషాల ఆనందం కోసం లొంగిపోతే సమాజంలో ఆమె విలువను కోల్పోతోందని, ఆమె శరీరం యొక్క సమగ్రతను ఆమె హక్కును రక్షించాలని, ఆమె గౌరవాన్ని స్వీయ విలువను రక్షించాలని, ఆమె గోప్యతను రక్షించుకోవాలని సూచించింది. అదే విధంగా యుక్త వయసులో ఉన్న అబ్బాయిలకు కూడా కొన్ని సూచనలు చేసింది. ఒక యువతి, స్త్రీ యొక్క విధును గౌరవించాలని, స్త్రీ యొక్క విలువలు, గౌరవాన్ని రక్షించేలా తీర్చిదిద్దాలని కోర్టు సూచించింది. ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులుగా ఉండాలి, మంచి-చెడుల గురించి చెప్పాలని, సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను గురించి నొక్కి చెప్పింది. మగపిల్లలకు తల్లిదండ్రులు మహిళలను ఎలా గౌరవించాలో చెప్పాలని, లైంగిక కోరికతో ప్రేరేపించబడకుండా మహిళలతో ఎలా స్నేహం చేయాలో చెప్పాలని సూచించింది.
*సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు.. టార్గెట్ సచిన్ పైలెటేనా..?
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గాలుగా చీలిపోయింది. మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. వచ్చే నెలలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొంది. ఇదిలా ఉంటే సీఎం అశోక్ గెహ్లాట్ సీఎం కుర్చీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం పదవిని విడిచిపెట్టనని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘‘ఇటీవల ఓ మహిళ నువ్వు నాలుగోసారి సీఎం కావాలని నాతో చెప్పింది. నేను సీఎం పదవిని వదిలిపెట్టాలని అనుకుంటున్నాను, కానీ సీఎం పదవి నన్ను వదలడం లేదు. భవిష్యత్తులో కూడా సీఎం పదవి నన్ను వదలదు’’ అని ఆమెకు చెప్పానని వ్యాఖ్యానించారు. హైకమాండ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసిందంటే నాలో ఏదో విశేషం ఉండాలి కదా అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వర్గపోరు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి పార్టీ సీనియర్ నేత సచిన్ పైలెట్ ని ఆహ్వానించకపోవడంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో టికెట్ల మంజూరుపై కూడా అసంతృప్తి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్నదాన్ని ప్రకటించలేదు. బీజేపీ కుతంత్రాల వల్లే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. సచిన్ పైలెట్ గురించి మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. సచిన్ పైలెట్ మద్దతుదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. మేమంతా ఐక్యంగానే ఉన్నామని, టికెట్ పంపిణీలో విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పైలెట్ వర్గంలోని ఓ ఒక్కరిని కూడా తాను వ్యతిరేకించలేదని తెలిపారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల పేర్లపై చర్చించేందుకు పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ బుధవారం సమావేశమైంది. ఖర్గే, గెహ్లాట్‌లతో పాటు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి సుఖ్‌జీందర్ రంధవా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ దోతస్రా, ప్రధాన కార్యదర్శి (సంస్థ) కేసీ వేణుగోపాల్, పార్టీ రాజస్థాన్ స్క్రీనింగ్ కమిటీ చీఫ్ గౌరవ్ గొగోయ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ, రాజస్థాన్‌లో గత ఐదేళ్లలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ సుపరిపాలనపై కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు.
*ప్రస్తుత పరిస్థితుల్లో గాజా నుంచి భారతీయుల తరలింపు సాధ్యం కాదు.. కేంద్రం ప్రకటన..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో సాధారణ ప్రజలు మరణిస్తున్నారు. హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై క్రూరమైన దాడులు చేశారు. ఈ దాడుల్లో 1400 మంది చనిపోయారు. మరోవైపు ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై హమాస్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. ఇప్పటికే మొత్తం 4000 మంది ప్రజలు చనిపోయారు. ఇజ్రాయిల్ లో చిక్కుకుపోయిన భారతీయులను ‘ఆపరేషన్ అజయ్’ ద్వారా కేంద్రం స్వదేశానికి చేర్చింది. అయిగే గాజాలోని భారతీయులను ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకురావడం కష్టమని, అవకాశం వస్తే వెంటనే వారిని స్వదేశానికి రప్పిస్తామని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజాలో పరిస్థితి కష్టంగా ఉందని, కానీ అవకాశం దొరికితే, మేము వారిని బయటకు తీసుకువస్తానమని అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. ప్రస్తుతం గాజాలో నలుగురు భారతీయులు ఉన్నారని చెప్పారు. వారిలో వెస్ట్ బ్యాంకులో ఉన్నారని తెలిపారు. ఇజ్రాయిల్, గాజాపై జరిపిన దాడిలో ఇప్పటి వరకు భారతీయుడు మరణించినట్లు నివేదికలు లేవని, హమాస్ దాడిలో దక్షిణ ఇజ్రాయిల్ లోని అష్కెలోన్ లో సంరక్షకుడిగా ఉన్న ఒక భారతీయుడు గాయపడ్డాడని తెలిపారు. గాజాలోని ఆస్పత్రిలో బాంబు పేలుడులో 500 మంది మరణించిన విషయం గురించి మాట్లాడుతూ.. పౌర మరణాలు, మానవతా పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు అరిందమ్ బాగ్చీ అన్నారు. ఇజ్రాయిల్ నుంచి ఆపరేషన్ అజయ్ కింద ఐదు విమానాల్లో 18 మంది నేపాలీ పౌరులతో పాటు 1200 మంది భారతీయులను స్వదేశానికి రప్పించారు. ఇక పాలస్తీనాకు భారతదేవం 2000 నుంచి 2023 వరకు దాదాపుగా 30 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించింది.
*పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ.. మానవతా సాయంపై హామీ..
పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలను పెంచుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడితో యుద్ధం మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్రమోడీ, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడారు. సోమవారం గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై బాంబుదాడిలో వందలాది మంది చనిపోవడంపై ప్రధాని నరేంద్రమోడీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం అందిస్తూనే ఉంటామని హమీ ఇచ్చారు. తీవ్రవాదంపై, ఈ ప్రాంతంలో హింస, ఆందోళనను పంచుకున్నారు. ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై భారతదేశ దీర్ఘకాలిక సూత్రప్రాయ వైఖరిని పునరుద్ఘాటించారు. ఈ విషయాలను ప్రధాని తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు, 200 మంది వరకు ప్రజలను బందీలుగా చేసుకున్నారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ వైమానిక దళం గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్ జరిగిన దాడుల్లో 3000 మంది వరకు చనిపోయారు. అంతకుముందు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. తీవ్రవాదంపై పోరుకు ఇజ్రాయిల్ కి మోడీ మద్దతు ప్రకటించారు.
*క్రికెట్ స్టాండ్లో సారా టెండూల్కర్ హల్చల్.. గిల్ క్యాచ్ పట్టగానే ఏం చేసిందంటే..!
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రపంచకప్ 2023 మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాను ఎంకరేజ్ చేయడానికి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు క్రికెట్ స్టేడియానికి వచ్చారు. అందులో భాగంగానే భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా వచ్చి క్రికెట్ ను ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే.. తన ఫ్రెండ్స్ తో మంచి మూడ్ లో ఉన్న సారా.. శుభ్ మాన్ గిల్ క్యాచ్ పట్టగానే సారా టెండూల్కర్ ఎగిరి గంతులేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫొటో వైరల్ అవుతుంది. అందులో సారా చాలా సంతోషంగా కనిపించింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 38వ ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తౌహిద్ హృదయ్ క్యాచ్‌ను గిల్ అందుకున్నాడు. ఈ క్యాచ్ వీడియోను ఐసీసీ షేర్ చేసింది. శార్దూల్ వేసిన ఓవర్ షార్ట్ రెండో బంతిని బ్యాట్స్ మెన్ లెగ్ సైడ్ కొట్టేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్ పైభాగానికి తగిలి గాలిలోకి వెళ్లి నేరుగా శుభ్ మాన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. గిల్ ఈ క్యాచ్ పట్టిన తర్వాత.. సారా సంతోషకరమైన స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ రియాక్షన్‌లో సారా టెండూల్కర్ చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ కనిపించింది.