వెనుకబడిన వర్గాలకు స్వేచ్ఛ వచ్చింది.. ఎవ్వరి ప్రమేయం లేకుండా అందరికీ పథకాలు..!
తమ ప్రభుత్వంలోనే వెనుకబడిన వర్గాలకు స్వేచ్ఛ వచ్చింది.. ఎవ్వరి ప్రమేయం లేకుండానే లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. సుమారు అయిదున్నార సంవత్సరాలక్రితం జగన్ తోకలిసి వచ్చాం.. అప్పటి ప్రభుత్వం చేస్తున్నా అవినీతి పై అందరకీ వివరించాం.. ప్రజల ఆమోదంతో ప్రభుత్వాలు ఏర్పాడతాయి అన్నారు. 75 ఏళ్ల తర్వాత ఎలాంటి మార్పలు చోటు చేసుకున్నాయో మీకు చెప్పాలి.. అధికారం కోసం పోరాటం చెయ్యకుండానే వైసీపీకి అధికారం వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం ఉన్న వెనుకబడిన వారు మరే ప్రభుత్వంలో లేరు.. గతంలో అధికార పార్టీకి మడుగులొత్తే సంస్కృతి దేశం అంతటా ఉండేది.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని హింసించే సందర్భాలు ఉండేవి.. కానీ, ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది.. తన వాడు సర్పంచిగానో, ఎమ్మెల్యే గానో.. ఇంటి మీద జెండాను ఉండాల్సిన అవసరం లేకుండా పథకాలు ఇస్తోందన్నారు. ఇది రాజ్యాంగ చెప్పి విధానంగా అభివర్ణించారు.
పవన్‌కు ఇదే నా చాలెంజ్.. దమ్ముంటే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతోన్న విద్యార్థులతో ఇంగ్లీష్ మాట్లాడు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. పవన్ కల్యాణ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులతో ఇంగ్లీష్ లో మాట్లాడాలని మరోసారి చాలెంజ్ విసిరారు.. గతంలో ఇదే విషయంపై నేను చాలెంజ్ చేసినా పవన్ కల్యాణ్ పట్టించుకోలేదన్నారు. ఇక, కనిగిరిలో ఇప్పటి వరకూ అగ్రవర్ణాల నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు.. తొలిసారిగా సీఎం జగన్ ఓ బీసీకి సీటు ఇచ్చి గెలిపించారు.. ఎవరెన్ని చెప్పినా మరోసారి కనిగిరిలో వైసీపీనే గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు దళితులను కించపరుస్తూ వచ్చారు.. రాష్ట్రంలో ఆర్దిక సాధికారిత కోసం ప్రత్యేక పథకాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది.. మహిళా సాధికారిత కోసం ప్రతీ పదవిలో సగం వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. ఇక, విద్య, వైద్యం, వ్యవసాయంలో రాష్ట్రం ముందంజలో ఉంది.. దళితులకు విద్య శాఖ మంత్రి అవకాశం కూడా ఇచ్చిన సీఎం మరోకరు ఉన్నారా..? అని ప్రశ్నించారు ఆదిమూలపు.. దళితుల పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చిన సీఎం జగనేనన్న ఆయన.. పవన్ కల్యాణ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులతో ఇంగ్లీష్ లో మాట్లాడాలని చాలెంజ్ చేసినా పట్టించుకోలేదన్నారు.. పవన్ కల్యాణ్ లా ఒక్కో ఎన్నికలకు ఒక్కోక్కరి పల్లకి మోసే రకం కాదు మేం కాదు.. ప్రతీవర్గం మరోసారి సీఎంగా జగనన్నకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.
వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ నెల 30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.. అయితే, వచ్చే నెల 1వ తేదీ ఉదయం 10.30 గంటలకు చంచల్ గూడ జైలుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.. అంతే కాదు.. పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని.. తాను ఉంటున్న చిరునామా కోర్టుతో పాటు సీబీఐ అధికారులకు ఇవ్వాలని ఆదేశించింది.. ఆస్పత్రికి చికిత్సకు వెళ్లాల్సి వస్తే దానికి సంబంధించిన వివరాలను సీబీఐకు తెలపాలనే షరతు కూడా విధించింది.. ఇక, మధ్యంతర బెయిల్‌పై ఉన్న సమయంలో.. కుటుంబ సభ్యులను తప్ప మిగతా ఎవరినీ కలవొద్దని వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఆదేశించింది సీబీఐ కోర్టు.. అయితే, సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఎస్కార్ట్ బెయిల్ పై ఉన్నారు వైఎస్ భాస్కర్ రెడ్డి.. ఎస్కార్ట్ బెయిల్ ను మధ్యంతర బెయిల్ గా మార్చింది సీబీఐ కోర్టు.. వైఎస్ వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16వ తేదీన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.. కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం విదితమే.. విచారణలో జాప్యంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.. ఇక, ఏపీ నుంచి తెలంగాణకు కేసు మార్చిన విషయం తెలిసిందే.
మరోసారి సొంత జిల్లాకు సీఎం జగన్.. రెండు రోజుల పాటు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి సొంత జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు అన్నమయ్య, కడప జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది.. దీని కోసం రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఉదయం 12 గంటలకు రాయచోటి చేరుకుంటారు.. మండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానమ్ కుమారుడు వివాహ వేడుకకు హాజరవుతారు.. మాజీ ఎంపీపీ ఇంట్లో వివాహ వేడుకకు కూడా హాజరుకానున్న జగన్.. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందుల చేరుకుంటారు.. పులివెందులలో శ్రీ కృష్ణా టెంపుల్ ప్రారంభ వేడుకల్లో పాల్గొంటారు.. అనంతరం స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు శంఖుస్థాపన చేస్తారు.. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్.. రాత్రికి ఇడుపులపాయలో బస చేయనున్నారు.. మరోవైపు.. ఈ నెల 10న కడప జిల్లాలోనే సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆర్కే వ్యాలీ, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్నారు సీఎం జగన్.. అనంతరం రెండున్నర గంటల పాటు వేముల మండల స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు.. దీంతో రెండు రోజుల సీఎం జగన్ పర్యటన ముగియనుంది.. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు కడప విమానాశ్రయం నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
సీఎం జగన్‌కు టీడీపీ బహిరంగ లేఖ.. ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది.. ఇప్పుడు కేసుల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నడుస్తుండగా.. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు టీడీపీ నేతలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ నేతలు.. 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ సీఎం జగన్‌కు కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, షరీఫ్, సంధ్యారాణి లేఖ రాశారు.. తెలుగుదేశం ప్రభుత్వం సొంత కాళ్లపై నిలబడేలా సంక్షేమ పథకాలు అమలు చేసింది. కాళ్లు విరిచి కట్టు కట్టి మహానుభావుడంటూ వైఎస్ జగన్ గురించి ప్రచారం చేసుకున్నారు.. టీడీపీ రూ.3లక్షలు సబ్సిడీతో ఇన్నోవా కార్లు ఇచ్చింది. జగన్ రెడ్డి వాహన మిత్ర పేరుతో రూ.10వేలు ఇచ్చి డీజిల్, మద్యం, జరిమానాలతో లక్ష లాక్కుంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పారిశ్రామిక రాయితీలు నిర్వీర్యం నిజం కాదా..? రూ.1.14 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించడం వాస్తవం కాదా? అన్న క్యాంటీన్, నిరుద్యోగ భృతి లాంటి 120 సంక్షేమ పథకాలు రద్దు నిజం కాదా? 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని కబ్జాకు కుట్రలు చేస్తుండడం వాస్తవం కాదా? 1.42 లక్షల బ్యాక్ లాగ్ పోస్టుల్ని దూరం చేయడం వాస్తవం కాదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కోత పెట్టి 16,800 పదవులు దూరం నిజం కాదా? అంటూ ఇలా పది ప్రశ్నలు సంధించారు.
బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలి
బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణ అభివృద్ధి ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని, ఆంధ్ర ప్రదేశ్ పై దృష్టి సారిస్తూనే తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలన్న లక్ష్యంతోనే తొలిసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నామని తెలిపారు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న ఎనిమిది స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు బీఫారమ్ అందించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కష్టనష్టాల్లో చేదోడువాదోడుగా ఉంటామన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన 1200 మంది పైచిలుకు తెలంగాణ యువత, విద్యార్ధుల గౌరవార్ధం హోంరూల్ పాటించాలన్న ఆలోచనతోనే దశాబ్దంపాటు ఇక్కడ పోటీకి దూరంగా ఉన్నట్టు తెలిపారు. ఇక, 2104 మార్చి 14న తెలంగాణలోని హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది. అంతకు ముందు 2008 నుంచి తెలంగాణ జిల్లాల్లో విరివిగా తిరిగి తెలంగాణ బాధలను, వారి ఆకాంక్షలను సమగ్రంగా అర్ధం చేసుకున్నాను అని తెలిపారు పవన్ కల్యాణ్.. తెలంగాణ ప్రజల బాధలు, కష్టాలకు నేను ఎప్పుడూ అండగా ఉండేవాడిని. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తే జనసేన పార్టీని ముందుకు నడిపించేలా చేస్తోంది. తెలంగాణ ఆవిర్భవించిన దశాబ్దకాలం తర్వాత మొట్టమొదటిసారి 8 మంది అభ్యర్ధులతో జనసేన ఇక్కడ ఎన్నికల బరిలో దిగుతోంది. నాలుగు కోట్ల మంది సకల జనుల సమ్మె చేస్తే సాధించుకున్న తెలంగాణ ఇది. అందుకే దశాబ్దకాలం నేను ఇక్కడ పోటీ చేయలేదన్నారు.. సంపత్ నాయక్, మిరియాల రామకృష్ణ లాంటి యువత, విద్యార్ధులు రోడ్ల మీదకు వచ్చి భవిష్యత్తు నాశనం చేసుకుంటే, అలాంటి యువత బలిదానాల మీద తెలంగాణ సిద్ధించింది. వారి గౌరవార్ధమే పోటీ చేయలేదు. దశాబ్దకాలం తర్వాత అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణుల నుంచి వచ్చి అభ్యర్ధన మేరకు, వారి ఆలోచనా విధానాన్ని మన్నించి 8 మంది అభ్యర్ధులతో తెలంగాణ బరిలో దిగుతున్నాం అని వెల్లడించారు.
బీజేపీతో కేసీఆర్ ఎప్పటికీ కలవరు.. మాది సెక్యులర్ పార్టీ
సంక్రాంతి రాగానే గంగిరెద్దు వాళ్ళు వచ్చినట్టు సంగారెడ్డికి కొత్త వ్యక్తులు వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏవేవో హామీలు ఇస్తారని.. మాయమాటలు నమ్మొద్దన్నారు. సంగారెడ్డిలోని గంజి మైదాన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పీకిందని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కరెంట్ ఇవ్వకపోతే రైతులు సబ్ స్టేషన్ ముందు ధర్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మనకి కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ అంటే దొంగరాత్రి కరెంట్ అంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు ఒక్క చాన్స్ అంటూ బతిలాడుతున్నారని.. 11 సార్లు ఇస్తే ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చి బీజేపీకి కేసీఆర్ బీ టీం అంటారని.. బెంగాల్ పోయి దీదీ బీజేపీకి బీ టీం అంటారని.. ఢిల్లీకిపోయి కేజ్రీవాల్‌ని బీజేపీకి బీ టీం అంటారని కేటీఆర్ చెప్పారు. బీజేపీతో కేసీఆర్ ఎప్పటికీ కలవరని.. మాది సెక్యులర్ పార్టీ అని మంత్రి తెలిపారు. మేము బీజేపీకి బీ టీం అయితే మైనారిటీల కోసం ఎందుకు సంక్షేమ పథకాలు పెడుతామని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు అంటూ కొట్టిపారేశారు. ప్రధాని మోడీ వచ్చి కాంగ్రెస్‌తో కేసీఆర్ కలిశారు అని చెబుతారని.. రాహుల్ గాంధీ వచ్చి బీజేపీతో కేసీఆర్ తో కలిశారు అని చెబుతారని ఆయన పేర్కొన్నారు. కవితని అరెస్ట్ చేయలేదని బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటారని ఆయన ఎద్దేవా చేశారు. మరి సోనియా, రాహుల్ గాంధీలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావాలి..
తనను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రంలో మంచి పేరు తెచ్చి పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఒకట్రెండు సార్లు నన్ను ఒడించినా మీ హృదయాల్లో సుస్థిర స్థానం ఇచ్చారన్నారు. నందికొండ మున్సిపాలిటీ నుంచి పలువురు కౌన్సిలర్లు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సాగర్ ప్రజలు విద్యుత్ బిల్లులు మాఫీ చేసింది తానేనని జానారెడ్డి తెలిపారు. బుద్ధవనం గుంటూరు జిల్లాకు వెళ్లకుండా తానే సాగర్‌కు రప్పించానన్నారు. బీఆర్ఎస్ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదన్నారు. 10ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ 30లక్షల ఇళ్లు ఇస్తే.. ఇదే 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను తప్పక అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావాలని జానారెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. తన చిన్న కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్ధి జైవీర్‌ను కూడా ఆదరించాలని కోరారు.
ఢిల్లీలోకి యాప్- ఆధారిత ట్యాక్సీలపై నిషేధం..
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. నిన్న ఏయిర్ పొల్యూషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కాలుష్యంపై హర్యానా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల కాల్చివేతను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే అని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. దీంతో పాటే ఢిల్లీలో యాప్ బేస్డ్ క్యాబులపై నిషేధం విధించాలని ఆప్ ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ రోజు ఢిల్లీ రవాణా మంత్రి గోపాల్ రాయ్ అధికారులతో సమావేశమయ్యారు. ఇతర రాష్ట్రాల యాప్ ఆధారిత క్యాబ్‌లను ఢిల్లీలోకి నిషేధించారు. నిన్నటి విచారణలో సుప్రీంకోర్టు.. ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు రిజిస్ట్రేషన్లు కలిగిన యాప్ ఆధారిత ట్యాక్సీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని గుర్తించామని, ఒక్కొక్క ప్రయాణికుడు ఒక్కో క్యాబ్ లో వెల్లడాన్ని ప్రశ్నించింది. కాలుష్యాన్ని అదుపు చేయడానికి క్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఢిల్లీ ప్రభుత్వం నగరంలో సరి-బేసి విధానంలో వాహనాల రాకపోకలను నిర్వహిస్తున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది. గత సంవత్సరం ఈ విధానం ఎలా పనిచేసిందో విశ్లేషించారా.? అని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కోర్టు సమీక్ష తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
ముకేష్ అంబానీ అంటే మామూలుగా ఉండదు.. భార్యకు రూ. 10 కోట్ల కార్ గిఫ్ట్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఏం చేసినా రిచ్‌గానే ఉంటుంది. ముంబైలోని అంబానీ నివాసం ‘ ఆంటిలియా’ ప్రపంచంలోనే ఖరీదైన నివాసాల్లో ఒకటిగా ఉంది. ఇక కార్ల విషయానికి వస్తే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లు అంబానీ కలెక్షన్‌లో ఉన్నాయి. రోల్స్ రాయిస్, బెంజ్, BMW, ఫెరారీ, బెంట్లీ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తంగా 150 కన్నా ఎక్కువ కార్లే ముకేష్ అంబానీ గ్యారేజ్ లో ఉంటాయి. వీటితో పాటు రెండు బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు ఉన్నాయి. ఈ కార్ల గురించి పక్కన పెడితే.. తన భార్య నీతా అంబానీకి ముకేష్ అంబానీ అదిరిపోయే దీపావళి గిఫ్టు ఇచ్చారు. ఏకంగా రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ కారును అందించారు. దీని ధర రూ.8.2 కోట్లు (ఎక్స్-షోరూం)గా ఉంది. రిజిస్ట్రేషన్, ఆన్ రోడ్ కలుపుకుని దీని ధర రూ.10 కోట్లు ఉంటుంది. ఆరెంజ్ షేడ్‌లో నీతా అంబానీ కొత్త కుల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఉంది. ముకేష్ అంబానీకి కూడా పెట్రాగోల్డ్ షేడ్ కలిగిన కుల్లినాన్ ఉంది. తన భార్యకు గిఫ్టుగా ఇచ్చిన కుల్లినాన్ కారు 6.75 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. 600 పీఎస్ పవర్‌తో 900 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. గంటకు దీని గరిష్ట వేగం 250 కిలోమీటర్లు. ఇండియాలో రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారుని ముకేష్ అంబానీనే కాకుండా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా కలిగి ఉన్నాడు. కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ప్రస్తుతం రోల్స్ రాయిస్ ఫ్లాగ్ షిప్ కార్లలో ఒకటి.
బాలీవుడ్ కు ధమ్ మసాలా బిర్యానీ రుచి చూపించన్నా..
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ ట్రెండ్ ను మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో టాలీవుడ్ చరిత్ర మారిపోయింది. ఇక విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి తరువాత అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేశాడు సందీప్. షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమా అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ రెండు సినిమాల తరువాత సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తున్న చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా యానిమల్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రణబీర్ లుక్.. ఆ యాక్షన్.. రక్తపాతం మొత్తం అభిమానులను హై లెవెల్ కు తీసుకువెళ్ళింది. ఇప్పటివరకు బాలీవుడ్ లో తెలుగు సినిమాల సత్తా.. డబ్బింగ్ రూపంలోనే చూపించారు. ఇక ఇప్పుడు అసలు సిసలు కథతో తెలుగోడి సత్తా చూపించడానికి సందీప్ రెడ్డి దిగాడు. మొన్నటికి మొన్న కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ .. జవాన్ సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఒక తమిళ్ డైరెక్టరే ఆ రేంజ్ లో చూపిస్తే.. అసలు ఒక తెలుగు డైరెక్టర్ తలుచుకుంటే ఏం చేయగలడో యానిమల్ తో సందీప్ చూపించనున్నాడు. బాలీవుడ్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు తెలుగు హీరోలతో సినిమాలు చేశారు. కానీ, అవేమి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు ఒక తెలుగు డైరెక్టర్.. బాలీవుడ్ హీరోను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో బాలీవుడ్ ఫ్యాన్స్ చూడబోతున్నారు. మొదటి నుంచి కూడా అభిమానులు బాలీవుడ్ కు ధమ్ మసాలా బిర్యానీ రుచి చూపించన్నా అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
రష్మిక డీప్ ఫేక్ వీడియో.. తెలంగాణ డీజీపీకి టీఎఫ్జేఏ ఫిర్యాదు
డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశం మీద కేవలం సినీ రంగానికి చెందిన వారే కాదు సామాన్య ప్రజానీకం సైతం మండిపడుతున్నారు. ఇక ఈ అంశం మీద దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఆకతాయిలు, జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకి రష్మిక మందన్న ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. ఇలా మార్ఫింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండింస్తుండగా రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో వ్యవహారాన్ని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సైతం తమ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించింది. ఇక తాజాగా అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ వై.జే రాంబాబు సంబంధిత విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి అంజనీకుమార్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ వెంటనే ఈ కేసు ను సైబర్ క్రైమ్ టీమ్ కి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలు జరిగిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అంజనీ కుమార్ సూచించారు.