దివ్యాంగులకు శుభవార్త.. ఆసరా పెన్షన్ పెంచిన కేసీఆర్ సర్కార్
దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి పెన్షన్‌ను రూ.1000 పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. ఇప్పటివరకూ ప్రతి నెల రూ.3016 పెన్షన్ అందుకున్న దివ్యాంగులు.. ఈ పెంపుతో రూ.4016 పెన్షన్‌ను అందుకోబోతున్నారు. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పెన్షన్‌ని పెంచబోతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తానిచ్చిన మాటని నిలబెట్టుకుంటూ.. సంబంధిత ఫైల్‌ను కేసీఆర్ ఆమోదించారు. ఈ పెంపుతో.. దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగుల పెన్షన్‌ను పెంచుతూ ఉత్వర్వులు వెలువడిన సందర్భంగా.. సీఎం కేసీఆర్‌కి పుష్పగుచ్ఛం అందిస్తూ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ట్విటర్ మాధ్యమంగా హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016కు పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని.. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో 5 లక్షల మందికిపైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. పెన్షన్ల పెంపు బీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న ఆయన.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ట్వీట్‌కు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా ఎటాచ్ చేశారు.
ముద్దు పెట్టేందుకు భర్త యత్నం.. నాలుక కొరికేసిన భార్య..
పచ్చని సంసారాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి.. చిన్న చిన్న విషయాలకు ఆ కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి.. కొన్ని సార్లు ఆవేశం కట్టలు తెంచుకుని దాడికి పాల్పడుతున్నారు.. చివరకు హత్యలకు కూడా వెనుకాడడం లేదు.. తాజాగా, ఓ భార్య.. తనకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టాడని భర్త నాలుకను కొరికేసింది.. అంతకుముందు ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుండగా.. ఆ తర్వాత భార్యను మళ్లీ దగ్గరకు తీయాలని ప్రయత్నించాడట ఆ భర్త.. కూల్ చేయడానికి ముద్దు పెట్టేందుకు యత్నించాడట.. అప్పటికే కోపంతో ఉన్న భార్య ఒక్కసారిగా భర్త నాలుకను కొరికేసింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తారాచంద్ నాయక్ అనే వ్యక్తి పుష్పవతి అనే యువతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన తర్వాత కొన్ని ఏళ్లపాటు సంసారం బాగానే సాగింది.. అయితే, రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కూడా వారిద్దరూ గొడవపడ్డారట.. పరస్పరం దాడి కూడా చేసుకున్నట్టు చెబుతున్నారు.. ఇక, భార్యను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా తారాచంద్.. కొద్దిసేపటికి భార్యకు ముద్దుపెట్టే ప్రయత్నం చేశాడట.. అది కూడా లిప్‌కిస్ కోసం ట్రైచేశాడట.. అప్పటికే కోపంతో ఉన్న ఆమె.. వెంటనే భర్త నాలుకను కొరికేసింది. అయితే, ఈ ఘటనపై ఒక్కొక్కరి వాదన ఒక్కలా ఉంది.. తనపై తారాచంద్ దాడి చేశాడని.. ఆపై తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడని అందుకే నాలుక కొరికానని పుష్పవతి.. జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మరోవైపు.. తన భార్యకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని.. ఎన్నిసార్లు చెప్పినా మనిషి మారడం లేదని.. అయినా కూడా తాను సర్దుకుపోతున్నానని తెలిపాడు.. అంతేకాదు.. తన భార్య నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని.. పిల్లలు, నేను ఎలా బతకాలో కూడా తెలియడం లేదంటూ వాపోయాడు తారాచంద్.. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా.. ఓ పచ్చని సంసారంలో చిన్న విషయాలు చిచ్చుపెట్టాయి.
ఇది రాజ్యాంగ ఉల్లంఘనే.. సీఈసీ చర్యలు తీసుకోవాలి..
వాలంటీర్ వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏ అవకాశం దొరికినా.. ఆ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.. అయితే, వాలంటీర్లు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొనడాన్ని తప్పు పడుతూ జనసేనాని ట్వీట్ చేశారు.. ఓటరు జాబితా తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల ప్రక్రియ. నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా జరగాలని కోరిన ఆయన.. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్ఓలతో ఏపీ వాలంటీర్లు ఇంటింటికి సర్వే ప్రక్రియలో భాగమవుతున్నారని విమర్శించారు.. ఇది రాజ్యాంగ ఉల్లంఘన.. ఏపీలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సీఈసీని జనసేన డిమాండ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు పవన్.. ఇక, ఓటర్ వెరిఫికేషన్‌లో ఏపీలో వాలంటీర్లు పాల్గొంటున్నారంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను తన ట్వీట్‌లో జత చేశారు పవన్ కల్యాణ్.
చంద్రబాబు రాజధాని అనే ఒక భ్రమను సృష్టించారు.. సంపన్న వర్గాలు మాత్రమే ఉండాలనేది వారి కల
ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలకు కసరత్తు జరుగుతోంది.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ళ నిర్మాణాల పనుల పురోగతిని మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.. కృష్ణాయపాలెం లే అవుట్ పరిశీలించిన తర్వాత.. వెంకటాయ పాలెంలో సీఎం వైఎస్ జగన్ సభ ఏర్పాట్లపై కూడా ఆరా తీశారు.. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏర్పాటు అన్నీ శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ జీవం లేదు.. చంద్రబాబు ఇక్కడ రాజధాని అనే ఒక భ్రమను సృష్టించారు.. టీడీపీ, వాళ్ల శక్తులు సృష్టించిన అడ్డంకులు అన్నీ అధిగమించుకుని వచ్చాం.. సంపన్న వర్గాలు మాత్రమే ఉండాలనే ఒక కల వారిది.. కానీ, 50 వేల కుటుంబాలకు ఇక్కడ నివాసం ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఆరు నెలల్లో ఇళ్ళ పూర్తి చేయాలనే సంకల్పం.. ఇప్పుడు నిజమైన అర్ధంలో జీవం తొణికిసలాడుతోందన్నారు.. ఇక్కడ ఉన్న రైతులు, కూలీలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వలస వెళ్ళి పోయారు.. ఇప్పుడు ఉన్నది రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నేతలు మాత్రమేనంటూ మండిపడ్డారు. కేంద్రానికి, ఏజెన్సీలకు లేఖలు రాస్తున్నారు.. ఇక్కడ పేదలు ఉండటానికి వీలు లేదని. కేంద్రం కనుక ఇళ్ళ నిర్మాణాలకు నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది.. ఇది మా చిత్తశుద్ధి అని స్పష్టం చేశారు సజ్జల.. ఎవరు ఏమనుకున్నా ఆరు నెలల్లో ఇళ్ళ నిర్మాణాలు పూర్తి అవుతాయి.. అన్ని సౌకర్యాలతో ఏ ప్రభుత్వం ఇంత వరకు పేదలకు ఇలాంటి లే అవుట్లు వేయలేదు.. ఐదేళ్లలో ఇక్కడ ఉన్న వారందరూ కోటీశ్వరులు అవటం ఖాయం అని జోస్యం చెప్పారు.. ప్రజాధనం దుర్వినియోగం చేయటం లేదు.. పేదలకు ఇళ్ళు ఇవ్వటాన్ని ఎవరైనా ఎలా తప్పు పడతారా? మా ప్రశ్న ఒక్కటే.. ఇళ్ళ స్థలాలను ఎందుకు ఇస్తారు? మొక్కలు పెంచటానికా? చంద్రబాబు చెప్పినట్లు సమాధుల కోసమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది.. చట్టంలోనే 5 శాతం పేదలకు ఇవ్వాలని ఉందన్నారు. సింగపూర్ సంస్థకు 3 వేల ఎకరాలను చంద్రబాబు ఇచ్చాడు.. అది బాగుందా? అని నిలదీశారు సజ్జల.
ఏపీలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు మృతి
ఉమ్మడి కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. రైల్వే కోడూరు నియోజకవర్గ ఓబులవారిపల్లె మండలం చిన్న వరంపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.. మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలు పాలయ్యారు. తిరుపతి నుండి కడప వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును చిన్న వారంపాడు వద్ద చెన్నై వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఇక, ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యంలో మృతి చెందారు.. బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో విషయం తెలుసుకున్న ఓబులవారిపల్లె పోలీసులు.. హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు.. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక, ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
లంకకు మరో రామసేతు.. ఇరు దేశాల మధ్య చర్చలు
రామాయణంలో రావణుడిని చంపి.. లంకలో ఉన్న సీతను తీసుకురావడానికి వానర సేన సముద్రంలో రామసేతను నిర్మించింది. అయితే దీని మీద ఎన్నో వివాదాలు ఉన్న.. మెజారిటీ ప్రజలు మాత్రం సముద్రంలో ఇప్పటికీ నీటిమీద తేలియాడే రాళ్లు.. రామసేతుకు నిదర్శనమని నమ్ముతారు. అయితే ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాల మధ్య కేవలం వాయు, నీటి మార్గాలే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇరు దేశాల మధ్య రోడ్డు మార్గాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం, భారత సర్కార్ దగ్గర ప్రతిపాదనలను ఉంచింది. సముద్రంలో వంతెన నిర్మించాలని తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వెల్లడించారు. రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు.. ఈ పర్యటనలో వివిధ అంశాలు, ద్వైపాక్షిక చర్చలను శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే జరిపారు. అయితే, ఇందులో భాగంగానే భారత్ – శ్రీలంక మధ్య పెట్రోలియం పైప్‌లైన్, ఇరు దేశాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు భూమార్గంలో వంతెన నిర్మాణానికి సంబంధించి నరేంద్ర మోడీ దగ్గర ఓ ప్రతిపాదనలను శ్రీలంక అధ్యక్షుడు ఉంచినట్లు తెలుస్తోంది. వీటిని పరిశీలించిన మోడీ వాటిని నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య అంశాలపై ప్రధానంగా మాట్లాడుకున్నారు.
ట్రక్కు నడుపుతూ నెలకు రూ.63 లక్షలు సంపాదిస్తున్న మహిళ
ఒక వ్యక్తి తన జీవితాన్ని గడపడానికి ఉద్యోగం చాలా అవసరం. ఎందుకంటే ఉద్యోగం చేస్తేనే.. వచ్చిన డబ్బులతో లైఫ్ లో బ్రతకగలం. అయితే కొందరు తాము చదువుకున్న చదువులకు చేసే ఉద్యోగాలకు పొంతన ఉండదు. మరికొందరు తమ ట్యాలెంట్ తో ఉద్యోగాలు చేసి అధిక డబ్బు సంపాదిస్తారు. ఐతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకోని వ్యక్తి, చదువుకున్న వ్యక్తి కంటే ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఉద్యోగం ఏదైనా సరే.. డబ్బుల కోసం చేసేస్తున్నారు. అయితే అసలు విషయానికొస్తే.. కేవలం ట్రక్కు నడుపుతూ నెలకు రూ.63 లక్షలు సంపాదిస్తుంది ఓ మహిళ. ఇప్పుడు ఈమే గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు. ఓ మైనింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న ట్రక్ డ్రైవర్ యాష్లే.. నెలకు రూ.63 లక్షలు సంపాదిస్తుంది. ఆ పరిశ్రమలో పని చేయాల్సింది కేవలం ఆరు నెలలు మాత్రమే.. మిగతా ఆరు నెలలు విశ్రాంతి. అందులోనే తినడం, అందులోనే పడుకోవడం అన్నీ పూర్తిగా ఉచితం. ఐతే ఇలాంటి పరిశ్రమల్లో పనులు చేయాలంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అలాంటి వాటిల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేయాలి.. అయితే అలా చేయడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే అన్నింటికీ ఒప్పుకుని యాష్లే అందులో చేరింది. ఆ పరిశ్రమలో ట్రక్కు నడుపుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఇలా చేస్తే.. పీఎఫ్ అకౌంట్ నుంచి 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు..!
ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికీ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఇందులో మనం పనిచేసే కంపెనీ మన వేతనం నుంచి 12 శాతం వరకు కట్ చేసుకుంటుంది. సంస్థ కూడా అంతే మొత్తంలో జమ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్రం-ఈపీఎఫ్‌ఓ వడ్డీ యాడ్ చేస్తుంది. అయితే మన అవసరాల కోసం.. మనం డిపాజిట్ చేసిన పీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ ఈ అవకాశం కల్పిస్తోంది. పెళ్లి, ఆస్పత్రి ఖర్చుల కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం, చదువు కోసం.. ఇలా పలు కారణాలతో విత్‌డ్రా చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంది తమకు అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బులు తీసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ఏ కారణానికి ఎంత తీసుకోవచ్చనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. చాలా వరకు మనీ క్లెయిమ్ చేస్తుంటారు. ఎంత వస్తుందనేది ఆ తర్వాత డబ్బులు అకౌంట్లో క్రెడిట్ అయినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. అయితే మనకు ఏ కారణంపై ఎంత వరకు డబ్బులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.. ఈపీఎఫ్ ఖాతాదారులు.. పెళ్లి కోసం 50 శాతం వరకు పీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ విత్‌డ్రా కోసం మాత్రం ఏడేళ్ల సర్వీస్ పూర్తై ఉండాలి. ఈపీఎఫ్ సభ్యుడు లేదా వారి కొడుకు/కూతురు/సోదరుడు లేదా సోదరి పెళ్లి కోసం డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక ఉన్నత చదువుల కోసం కూడా 50 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు.
నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ ఇంట తీవ్ర విషాదం..
నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చార్లీ చాప్లిన్ కుమార్తె, నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఈ ఘటన జరిగి పది రోజులు అయ్యినట్లు తెలుస్తోంది. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం ఈ మధ్యనే మీడియాకు అధికారికంగా ప్రకటించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. జోసెఫిన్ చాప్లిన్ వయస్సు 74. గత కొన్ని రోజులుగా ఆమె వృద్ధాప్య సమస్యలతో పోరాడుతుందని ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. చార్లీ చాప్లిన్ – ఊనా ఓ నీల్ దంపతులకు మొత్తం 8 మంది సంతానం కాగా వారిలో జోసెఫిన్ చాప్లిన్ మూడో సంతానం. ఆమె మూడేళ్ళ వయస్సులోనే తండ్రి నటించిన లైమ్ లైట్ చిత్రంలో కనిపించింది. ఇక తండ్రి బాటలోనే నటిగా మారి మంచి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక 1969లో నికోలస్ ను పెళ్లి చేసుకున్న జోసెఫిన్.. అతనితో విబేధాల కారణంగా 1977లో అతని నుంచి విడాకులు తీసుకొని సింగిల్ గా ఉంది. అనంతరం కొన్నాళ్ళకు.. ఫ్రెంఛ్ నటుడు మారిస్ రోనెట్ తో సహజీవనం చేసింది. అతను మృతి చెందేవరకు కూడా అతడితోనే కలిసి జీవించింది. ఇక అతని మృతి తరువాత ఆర్కియాలజిస్ట్ జీన్ క్లూడ్ గార్డెన్ ను వివాహమాడింది.. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇక జోసెఫిన్ మృతి పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్త చేయడమే కాకుండా ఎన్నో అనుమానాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. జోసెఫిన్ మృతి చెంది పది రోజులు అయినా కుటుంబ సభ్యులు ఎందుకు మీడియా ముందుకు చెప్పలేదు. ఆమె మృతితో ఎవరికైనా ప్రాబ్లెమ్ ఉందా.. ? ఆస్తి తగాదాలు ఉన్నాయా.. ? లేక ఇంకేదైనా సమస్యా. ? అని డౌట్ పడుతున్నారు. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది.
అభిమానులకి ఏదైనా జరిగితే మేము తట్టుకోలేం!
పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాను తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మించింది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, టీజర్ సహా మై డియర్ మార్కండేయ, జానవులే పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ ను ఒకేసారి రెండు చోట్ల ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహిస్తూ విడుదల చేశారు. జాగ్ లోని జగదాంబ థియేటర్ లో, హైదరాబాద్‌లోని దేవి థియేటర్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమాలు నిర్వహింగా విశాఖలో సాయి ధరమ్ తేజ్, టీజీ విశ్వ ప్రసాద్, హైదరాబాదులో కేతిక శర్మ, సముద్రఖని, ఎస్ థమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వైజాగ్ జగదాంబ థియేటర్ లో జరిగిన వేడుకలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “మీ ప్రేమ పొందడం కోసమే ఇంత దూరం వచ్చాను, మీ అందరికీ ట్రైలర్ నచ్చడం సంతోషంగా ఉంది. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అభిమానులకి ఏదైనా జరిగితే మేము తట్టుకోలేము అని అన్నారు. అలాగే “నాకు కొంచెం తిక్కుంది” అంటూ తన మేనమామ పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్ చెప్పి అభిమానుల్లో ఉత్సాహం నింపారు సాయి ధరమ్ తేజ్. ఇక నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూట్రైలర్ మిమ్మల్ని ఎంతగా అలరించిందో, దానికి వంద రెట్లు సినిమా అలరిస్తుందని అన్నారు. హైదరాబాద్ దేవి థియేటర్ లో జరిగిన వేడుకలో ఈ సినిమా కోసం అందరిలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి ఆనందించదగ్గ సినిమా అని కేతిక శర్మ అన్నారు. ఇక ట్రైలర్ కేవలం శాంపిల్ మాత్రమే అని, సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయని, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని సంగీత దర్శకుడు థమన్ కామెంట్ చేశారు.