పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సర్కార్ సీరియస్.. ఫిర్యాదుకు రంగం సిద్ధం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. ఫిర్యాదుకు రంగం సిద్ధం చేస్తోంది.. సంబంధిత కోర్టులో ఫిర్యాదు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం.. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సూచించింది..
జనసేనలో చేరిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. తాజాగా, వైసీపీకి గుడ్‌బై చెప్పిన పంచకర్ల రమేష్.. ఈ రోజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంచకర్ల రమేష్‌కు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ మాట్లాడుతూ.. ప్రజల కోసం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని అభివర్ణించారు.. ఎన్ని తిట్లు తిడుతున్నా.. ప్రజల కోసం పవన్ అన్ని భరిస్తున్నారన్న ఆయన.. జీవితాంతం పవన్ ఆశయాల కోసం తోడుగా పనిచేస్తానని ప్రకటించారు.
నన్ను అరెస్ట్ చేసుకోండి.. చిత్రవధ చేసుకోండి.. రెడీ..
వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఫిర్యాదుకు రంగం సిద్ధం చేస్తోంది.. సంబంధిత కోర్టులో ఫిర్యాదు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం.. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సూచించింది.. ఈ పరిణామాలపై స్పందించిన పవన్ కల్యాణ్.. నన్ను ప్రాసిక్యూషన్ చేయాలనుకుంటే చేసుకోండి.. నేను రెడీ అని ప్రకటించారు.. వైసీపీ నేత పంచకర్ల రమేష్ బాబు.. జనసేన పార్టీలో చేరిన సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. నన్ను ప్రాసిక్యూట్ చేయమని ప్రభుత్వం జీవో జారీ చేసింది. నేనోసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకునే చెబుతాను. నన్ను అరెస్ట్ చేసుకోండి.. చిత్రవధ చేసుకోండి నేను సిద్ధమే అన్నారు. నేను ఏపీ అభివృద్ధికి కమిట్ మెంటుతో ఉన్నాను. నన్ను ప్రాసిక్యూషన్ చేయాలనుకుంటే చేయండి.. నేను సిద్దమే అని స్పష్టం చేశారు. ఇక, మర్డర్లు చేసిన వారికి ప్రాసిక్యూషన్ ఉండదా..? అని ప్రశ్నించారు పవన్.. పొరపాటున మానభంగాలు జరిగిపోతాయనే మంత్రులున్నారు.. వారిని ప్రాసిక్యూట్ చేయరా..? అని ప్రశ్నించారు. రెడ్ క్రాస్ వంటి సంస్థకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా సేవలు అందించే వారిని వలంటీర్లు అంటారు. రూ. 5 వేల వేతనం తీసుకునే వాళ్లని వలంటీర్లు అనకూడదన్న ఆయన.. వలంటీర్ల ద్వారా సేకరిస్తోన్న సమాచారం ఎక్కడకెళ్తోంది.. వలంటీర్ల ద్వారా జరుగుతోన్న డేటా చౌర్యంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చెప్పాను. ఏపీలో డేటా చోరీపై కేంద్రానికి ఫిర్యాదు చేశాను. జగన్ చెప్పినట్టు చేస్తే వలంటీర్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని వార్నింగ్ ఇచ్చారు.
ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌పై సీఎం జగన్ సమీక్ష.. కార్యాచరణకు ఆదేశాలు
ప్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ పై హైపవర్ వర్కింగ్ గ్రూపుతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. విద్యాశాఖ అధికారులు, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, డేటావివ్ వంటి ప్రఖ్యాత సంస్ధల ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది.. విద్యారంగంలో కీలక మార్పులపై సమాలోచనలు, కార్యాచరణకు ఆదేశాలు జారీ చేశారు.. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు ఫ్యూచర్ టెక్నాలజీపై నైపుణ్యాభివృద్ధి.. ఆ మేరకు పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక రూపకల్పన చేయాలన్నారు.. బోధనలో, శిక్షణలో ఫ్యూచర్ టెక్నాలజీ వినియోగంపై కార్యాచరణకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే సమావేశం నాటికి వీటిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.. మనం రెండు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాం.. ఒకటి పాఠశాల విద్య, రెండోది ఉన్నత విద్య.. పాఠశాల దశ నుంచి ఉన్నత విద్య వరకు ఈ రెండింటిని అనుసంధానం చేయాలి. పాఠ్యప్రణాళిక కూడా సమ్మిళితం చేయాలి.. ఇది ప్రధాన లక్ష్యం అని తెలిపారు సీఎం వైఎస్ జగన్.
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. రేపే వారి ఖాతాల్లో రూ.24 వేల చొప్పున జమ
వరుసగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు నేతన్నలకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. రేపు వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం సొమ్ములను జమ చేసేందుకు సిద్ధం అయ్యారు.. రేపు అనగా ఈ నెల 21వ తేదీ శుక్రవారం రోజు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్న ఆయన.. ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.. అనంతరం వైఎస్సార్ నేతన్ననేస్తం పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం సొమ్ము డిపాజిట్ చేస్తారు. అనంతరం వెంకటగిరి త్రిభువన్ సెంటర్‌లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం వైఎస్ జగన్.. రేపు వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు జమ కానుండగా.. ఏటా వైఎస్సార్ నేతన్న నేస్తం కింద సాయాన్ని అందిస్తూ వస్తోంది వైఎస్ జగన్ సర్కార్.. చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24,000 ఆర్థిక సాయం చేస్తున్నారు.. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేత కార్మికులకు లబ్ధి పొందనున్నారు.. రూ.193.64 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా చేనేతల కోసం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చింది జగన్ సర్కార్. అర్హత కలిగి సొంత మగ్గం ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ .1.2 లక్షలు సాయం అందుతోంది. ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.. తప్పనిసరిగా వృత్తిపరంగా చేనేతగా ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి కచ్చితంగా చేనేత సంఘంలో నమోదు చేసుకోని ఉండాలనే నిబంధన ఉన్న విషయం విదితమే.
తెలంగాణ ఐటీ పాలసీ భేష్.. అధ్యయనానికి వచ్చిన తమిళనాడు ఐటీ బృందం
తెలంగాణ ఐటీ శాఖ కార్యక్రమాలు, పాలసీలపైన అధ్యయనం చేసేందుకు తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్) ఆధ్వర్యంలో ఒక బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఈ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్న తమిళనాడు మంత్రి పీటీఆర్ బృందం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సచివాలయంలో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ ప్రగతిపైన, అందుకు దోహదం చేసిన అంశాలపైన అధ్యయనం చేసేందుకు తాము తెలంగాణలో పర్యటిస్తున్నామని మంత్రి పీటీఆర్ తెలిపారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, ఐటీ పాలసీ, ఐటీ అనుబంధ పాలసీలు, పరిశ్రమ బలోపేతం కోసం చేపట్టిన అనేక అంశాలను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తమిళనాడు మంత్రి బృందానికి కేటీఆర్ వివరాలు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను, అమలులోకి తీసుకువచ్చిన ఐటీ, ఐటీ అనుబంధ పాలసీలను కేటీఆర్ వివరించారు. ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణ, ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమ వంటి అంశాలను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇన్నోవేషన్ రంగానికి అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఐటీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలి వెళ్తుందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగిందని, అంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తెలంగాణ ఐటీ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఐటీ పరిశ్రమకు అనేక విధాలుగా మద్దతు అందించడం ద్వారా దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ నగరంగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటితోపాటు ఐటీ అనుబంధ రంగాలకు ప్రత్యేకంగా ఒక పాలసీని తయారు చేసిన విధానం గురించి విస్తృతంగా వివరాలు అందించారు. తాము పాలసీలను రూపొందించే క్రమంలో ప్రభుత్వ లక్ష్యాలతోపాటు పరిశ్రమలో ఉన్న భాగస్వాముల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకున్నామని, వారికి ఎలాంటి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందో తెలుసుకొని వాటన్నింటినీ తమ పాలసీల్లో పొందుపరిచామన్నారు. హైదరాబాద్ నగరం ఐటీ పరిశ్రమకు అత్యంత కీలకమన్న విషయాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టామని తెలిపారు.
మణిపూర్‌లో గొడవలకు కారణం బీజేపీ ప్రభుత్వమే..
మణిపూర్ అల్లర్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ డివిజన్ కేంద్రంలో నియోజకవర్గ స్థాయి పాస్టర్ల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు ముస్లింలు, క్రిస్టియన్‌లపై దాడులు జరుగుతున్నాయన్నారు. చర్చిలపై దాడులను కేంద్ర ప్రభుత్వం నివారించాలని, మతం అనేది విశ్వాసమని అందరూ గౌరవించాలన్నారు. బీజేపీ ప్రభుత్వంలోనే దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో చర్చిలపైన, క్రైస్తవుల పైన అనేక దాడులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో మతకల్లోలాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపణ చేశారు. ఏ దేశంలోనైనా మతం అనేది వారి విశ్వాసమని, ఆ విశ్వాసాన్ని ఎవరూ కాదనరాదన్నారు. మణిపూర్‌లో మైతీ, నాగాస్, కుకీ తెగల మధ్య గొడవలకు కారణం బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. మణిపూర్ హైకోర్టు తీర్పు సరైనది కాదని, ప్రభుత్వం చేయాల్సిన పనిలో హైకోర్టు జోక్యం చేసుకుందన్నారు. ఎక్కువ శాతం క్రైస్తవులపై దాడులు, చర్చిలను కూలగొట్టడం జరుగుతుందని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. మణిపూర్‌లో అల్లర్లకు కారకులైన వారిపై ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు చర్యలు తీసుకుంటామనడం చాలా దురదృష్టకరమన్నారు.
నాలుగుసార్లు మిస్టర్ ఇండియా బాడీబిల్డర్ ఆశిష్ సకార్కర్ కన్నుమూత
బాడీబిల్డింగ్ ప్రపంచంలో ఆశిష్ సఖార్కర్ గురించి తెలియని వారు ఉండరు. మిస్టర్ ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫోరమ్‌లలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న ఆశిష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ లెజెండరీ బాడీబిల్డర్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్నారు. ముంబైలో నివసిస్తున్న ఆశిష్ సఖార్కర్ బాడీబిల్డింగ్ ప్రపంచంలో గొప్ప స్థాయికి ఎదిగిన బాడీబిల్డర్‌లలో ఒకరు. దేశ విదేశాల్లో ఎన్నో పోటీల్లో గెలుపొంది భారతదేశంలో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నాడు. మిస్టర్ మహారాష్ట్ర నుంచి మిస్టర్ ఇండియా, మిస్టర్ యూనివర్స్ వరకు ఎన్నో టైటిల్స్, మెడల్స్ సాధించాడు. ఆశిష్ సఖార్కర్ బాడీబిల్డింగ్ రంగంలో మహారాష్ట్రలోనే కాకుండా భారతదేశం అంతటా ఒక ఐకాన్‌గా పరిగణించబడ్డాడు. ఆయన మిస్టర్ ఇండియాలో నాలుగుసార్లు, ఫెడరేషన్ కప్ నాలుగుసార్లు, మిస్టర్ యూనివర్స్, యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని కూడా సాధించాడు. ఆయనకు మహారాష్ట్ర అత్యున్నత క్రీడా పురస్కారం శివ్ ఛత్రపతి అవార్డు లభించింది. అయితే కొద్దిరోజుల క్రితం ఆశిష్ సకార్కర్ అస్వస్థతకు గురయ్యాడు. దీని తర్వాత చికిత్స పొందుతున్నాడు. ఎంత చేసినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు. ఆశిష్ కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆశిష్ సకార్కర్ అభిమానులు, స్నేహితులు, బంధువులు, ఆయన మృతిపట్ల సంతాపాన్ని తెలియజేశారు.
ఒక అమ్మాయి, నలుగురు స్నేహితులు.. మూడు హత్యలు.. మళ్లీ వెలుగులోకి..!
వారు నలుగురూ మంచి స్నేహితులు. వారి మధ్య స్నేహం ఎలా ఉంటుందంటే.. ఒకరినొకరు చూసుకోకుండా, మాట్లాడకుండా ఉండలేరు. అయితే ఆ స్నేహితుల్లో ఇద్దరి స్నేహితుల కళ్లు ఒక్క అమ్మాయిపైనే పడ్డాయి. ఇద్దరూ ఆమెను ప్రేమించారు. అంతలోనే ఆ అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తున్నారని తెలిసింది. దీంతో ఇద్దరూ ఒకరికొకరు శత్రువులుగా మారారు. అయితే కొన్ని రోజుల తర్వాత.. నలుగురు స్నేహితులు కలిసి మద్యం సేవిస్తున్నారు. మత్తులో ఉండగా.. ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఒకరికొకరు ఆ అమ్మాయి నాదంటే నాది అని గొడవ పెట్టుకున్నారు. అయితే ఆ గొడవ పెద్దదిగా కావడంతో అమ్మాయిని ప్రేమించే వారిలో ఒకరు.. తన తన స్నేహితులకు ఫోన్ చేసి రమ్మని ముగ్గురు స్నేహితులను హత్య చేయించాడు. నిందితుడు తన ముగ్గురు స్నేహితుల మృతదేహాలను బాగ్‌పత్‌లోని హిండన్ ఒడ్డున పాతిపెట్టేందుకు ప్రయత్నించగా.. అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ట్రిపుల్ మర్డర్ 2008లో జరగగా.. ఇంకా ఈ కేసు కోర్టులోనే పెండింగ్‌లో ఉంది. మరోవైపు ప్రధాన నిందితుడు హాజీ ఇజ్‌లాల్‌కు ఇటీవల పెరోల్ రావడంతో.. 15 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఘటన వార్తల్లో నిలిచింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాన నిందితుడు ఇజ్‌లాల్‌ను విచారించగా మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీరట్ కాలేజీలో చదువుతున్న షీబా సిరోహి అనే విద్యార్థినితో ఇజ్లాల్ ఏకపక్షంగా ప్రేమలో ఉన్నాడని పోలీసులకు తెలిపాడు. అదే సమయంలో అతని స్నేహితుడు సునీల్ ధాకా కూడా అతన్ని ఇష్టపడటం ప్రారంభించాడని తెలిపాడు.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి పండుగ లాంటి వార్త
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి వార్త తెరమీదకు వచ్చింది. అయితే ఈ వార్త అధికారికం కాదు కానీ జనసేన వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ అన్ని నిలిపివేసి మరి ఏపీలో వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు యాత్రకు బ్రేక్ ఇచ్చి ఈ మధ్యనే ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్లారు. అక్కడ అమిత్ షా సహా సహా పలువురు బీజేపీ పెద్దలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ కి అక్కడ నుంచి కొన్ని కీలక సంకేతాలు అందినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని అమిత్ షా నుంచి పవన్ కళ్యాణ్ కి సూచనలు అందడంతో ఆయన పొలిటికల్ యాక్టివిటీ తగ్గించి తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. పవన్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల దర్శక నిర్మాతలైతే పవన్ ఎప్పుడు ఖాళీ అవుతాడా? ఎప్పుడు షూటింగ్స్ కి వస్తాడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఓజి సినిమా షూటింగ్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఆ సినిమా పూర్తి చేసే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు ముందస్తు కాదు అని తెలియడంతో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ కూడా త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే వరుసగా పవన్ సినిమాలు ప్రేక్షకులను అలరించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో పవన్ అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది కాలమే నిర్ణయించాలి.
బాహుబలి నటుడు.. మొన్న హీరో.. నేడు నిర్మాత.. మాములుగా లేదుగా
బాహుబలి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి రాకేష్ వర్రే గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవసేన మీద చెయ్యి వేసి.. బాహుబలి చేతిలో చెయ్యి నరికించుకున్న సేతుపతినే రాకేష్ వర్రే. జోష్ సినిమాలో నెగెటివ్ రోల్ తో ఇండస్ట్రీకి పరిచయమైన అతను.. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. బాహుబలి ఇచ్చిన గుర్తింపుతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను నిర్మించి అందులో ఎవ్వరికీ చెప్పొద్దు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. 2019 దసరాకి థియేటర్స్ లో సందడి చెయ్యటమే కాకుండా గత నాలుగు సంవత్సరాల్లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూడబడ్డ తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత గ్యాప్ ఇచ్చిన రాకేష్.. ఈసారి నిర్మాతగా మారి కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు. నా పేరు శివ, అంధగారం వంటి హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్, నూతన నటి అయిన అనూష కృష్ణ లను తెలుగు తెర కి హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ పేకమేడలు అనే సినిమాను నిర్మిస్తున్నాడు. నీలగిరి మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ బస్తీ, సిటీని కలగలిపిన 360 డిగ్రీలో ఉన్న ఫోటోకి మధ్యలో ఆకాశానికి నిచ్చన వేసిన కథానాయకుడు వినోద్ కిషన్ లుంగీ కట్టుకుని, బనియన్ వేసుకుని సగం తొడుక్కున్న చొక్కాని, కళ్ళజోడు పెట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్నారు, బ్యాగ్రౌండ్ లో ఉన్న బస్తి, సిటీ కలగలిపినట్టు కథానాయకుడు ఆహార్యంలో ఫార్మల్ బట్టలు సగం, బనియన్ లుంగీ సగం కట్టుకుని ఉన్నారు.. ఆ పోస్టర్ కి సరిపడా పేకమేడలు టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఒక యూనీక్ స్టోరీలైన్ తో పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.. మరి ఈ సినిమాతో రాకేష్ నిర్మాతగా సక్సెస్ అవుతాడేమో చూడాలి.